పాకాల తిరుమల్ రెడ్డి

(పాకాల తిరుమల రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

పాకాల తిరుమల్ రెడ్డి (జనవరి 4, 1915 - అక్టోబర్ 21, 1996) చిత్రకళారంగంలో పి.టి.రెడ్డి గా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన.[1]

పాకాల తిరుమల రెడ్డి
జననం(1915-01-04)1915 జనవరి 4
అన్నారం గ్రామం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
మరణం1996 అక్టోబరు 21(1996-10-21) (వయసు 81)
వృత్తిచిత్రకారుడు
జీవిత భాగస్వామిపి.యశోదారెడ్డి
తల్లిదండ్రులు
  • రాంరెడ్డి (తండ్రి)
  • రమణమ్మ (తల్లి)

కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామంలో 1915, జనవరి 4 న జన్మించాడు. 1942లో బొంబాయి సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి చిత్రకళల మొదటి ర్యాంకుతో డిప్లొమా పొందాడు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల లోనే కాక ఆస్ట్రేలియా, యు.కె, జపాన్, పశ్చిమ జర్మనీ తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించాడు. తనతో భావ సారూప్యత కలిగిన నాటి యువ చిత్రకారులు మాజిద్, ఎం. ఏ. భోస్లే, బాప్తిస్టా, ఎం.వి, కులకర్ణిలతో కలిసి "ది కాంటెంపరరీ గ్రూప్ ఆఫ్ పైంటర్స్" అనే సంస్థను కూడా స్థాపించి నిరంతరం చిత్రకళా కార్యక్రమాలను నిర్వహించేవాడు.

ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనేక హోదాల్లో పనిచేసాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో అందుకున్నాడు. హైదరాబాదు నారాయణ గూడ లోని తన నివాసాన్ని ఒక పెద్ద చిత్రకళా ప్రదర్శనా నిలయంగా తీర్చిదిద్దిన పి.టి.రెడ్డి చిరస్మరణీయుడు. తెలంగాణ జీవితం, ఘర్షణ, పల్లెటూరు రైతు, చిక్కిన స్త్రీ, ఆందోళనలు అన్నీ కలిసిపోయిన రంగుల నైపుణ్యం ఆయనది. హైదరాబాద్, బొంబాయి వీధులు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక ప్రభావాలు, మార్మిక, తాంత్రిక, శృంగార భావనల సమ్మిశ్రితం ఆయన కళ. కర్రతో, రాతితో ఆయన మలిచిన శిల్పాలు ప్రత్యేకం.

చిత్రాల సేకరణ

మార్చు

జాతీయంగానూ అంతర్జాతీయంగానూ చేసిన ప్రదర్శనలలో పి.టి.రెడ్డి చిత్రాలు ఎన్నో కళాసంస్థల, ఔత్సాహికుల సేకరణలో చేరాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి బకింగ్ హాం పేలస్, లండన్, న్యూడిల్లి లోని రాష్ట్రపతి భవన్, ఎంబసీ ఆఫ్ జి.డి.ఆర్., పార్లమెంట్ హౌస్ ఇంకా డిల్లి కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, నేషనల్ గేలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, కేంద్ర లలితకళా అకాడమీ న్యూడిల్లి, కర్నాటక, కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీలతో పాటు జే.జే. స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బొంబాయి, అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కలకత్తా, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్, సాలార్ జంగ్ మ్యూజియం, ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్అండ్ క్రాఫ్ట్స్. న్యూడిల్లి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పండమెంటల్ రీసర్చ్ బొంబాయి మరికొన్ని యునైటెడ్ కింగ్ డం, అమెరికా, యుగోస్లోవియా, పిలిపీన్స్, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, జర్మనీ ఆస్ట్రేలియా తదితర దేశాలనందు వివిధ ప్రైవేట్ వ్యక్తుల సేకరణలో కూడా వీరి చిత్రాలు ఉన్నాయి.

కళ ప్రజల కోసం అని భావించే రెడ్డి, తన ఎనబై ఏళ్ళ సుదీర్ఘ కళాయానంలో ప్రతిభంధకాలెన్ని ఎదురైనా తన అనితర సాధ్యమైన కృషి, పట్టుదలతో తెలుగు చిత్రకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఈ అసమాన ప్రతిభాశాలి 1996, అక్టోబర్ 21 న మరణించాడు. పి.టి.రెడ్డి భార్య ప్రముఖ రచయిత్రి పి.యశోదారెడ్డి.

మూలాలు

మార్చు
  1. Nipuna (2022-07-06). "తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు". Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.

ఇతర లంకెలు

మార్చు