పాపం పసివాడు

1972లో విడుదలైన తెలుగు చిత్రం

పాపం పసివాడు వి. రామచంద్రరావు దర్శకత్వంలో 1972 సెప్టెంబరు 29న విడుదలైన చిత్రం. ఇందులో ఎస్. వి. రంగారావు, దేవిక, మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అట్లూరి శేషగిరిరావు శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, చిత్రానువాదం, మాటలు గొల్లపూడి మారుతీరావు అందించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలోని అమ్మా చూడాలీ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.[2] ఎం. కన్నప్ప ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. బాలు ఎడిటర్ గా పనిచేశాడు.

పాపం పసివాడు
Papam pasivadu.jpg
దర్శకత్వంవి. రామచంద్రరావు
రచనగొల్లపూడి మారుతీరావు (కథ, స్క్రీన్ ప్లే, మాటలు)
నిర్మాతఅట్లూరి శేషగిరిరావు
తారాగణంఎస్.వి. రంగారావు,
దేవిక,
మాస్టర్ రాము
ఛాయాగ్రహణంఎం. కన్నప్ప
కూర్పుబాలు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1972 సెప్టెంబరు 29 (1972-09-29)
సినిమా నిడివి
139 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

1969లో దక్షిణాఫ్రికా చలన చిత్రమైన లాస్ట్ ఇన్ ది డెసర్ట్" (Lost in the Desert (en)) అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం. విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధివశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.

ఈ చిత్ర నిర్మాత అంతకుముందు మోసగాళ్ళకు మోసగాడు అనే చిత్రాన్ని ఎడారి నేపథ్యంలో తీశాడు. మరో చిత్రాన్ని అదే వాతావరణంలో తీయాలనుకుని గొల్లపూడి మారుతీరావు చేత లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ను అనుసరించి కథను తయారు చేయించుకున్నాడు. 1972 మార్చిలో ప్రారంభమైన ఈ చిత్ర నిర్మాణం సుమారు 27 రోజులపాటు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్ర ప్రచారం కోసం వినూత్నంగా హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు పంచి పెట్టారు. 1972 సెప్టెంబరు 29న విడుదలైన ఈ చిత్రం వ్యాపారాత్మకంగా విజయం సాధించింది.

కథసవరించు

ఆగర్భ శ్రీమంతుడైన వేణుగోపాలరావు, జానకి దంపతులకు సంతానం లేనిది ఒకటే లోటు. అదే కుటుంబంలో వేణుగోపాలరావు తమ్ముడు నరసింహం బాధ్యతలు తెలియకుండా తిరుగుతుంటాడు. మరో వైపు ఆయన అక్కయ్యలుగా చెప్పుకునే దుర్గమ్మ, సుబ్బమ్మ తమ పిల్లలతో సహా ఆ ఇంట్లోనే తిష్టవేసుకుని కూర్చుని ఉంటారు. వీళ్ళందరికీ వేణుగోపాలరావు ఆస్తి మీద కన్ను ఉంటుంది. జానకి తమ్ముడైన పతి వీరందరి ప్రవర్తన గురించి వేణుగోపాలరావుకు చెప్పి హెచ్చరిస్తూనే ఉంటాడు. కొంతకాలానికి జానకి గర్భవతి అవుతుంది. ఆ బిడ్డ కడుపులో ఉండగానే చంపాలని వీరందరూ కలిసి ప్రయత్నాలు చేస్తారు. అలా ఒక ప్రయత్నంలో జానకి మెట్ల మీద నుంచి పడిపోతుంది. కానీ వైద్యులు ఆమెను, బిడ్డనూ బతికిస్తారు. కానీ జానకిని మాత్రం జాగ్రత్తగా చూసుకోమనీ, ఆమెను చలి ప్రదేశాలకు తీసుకువెళ్ళకూడదని చెబుతాడు వైద్యుడు.

ఆ దంపతులు తమ కొడుక్కి గోపి అని పేరు పెట్టుకుని గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. ఇంతలో హఠాత్తుగా ఆ పిల్లవాడికి క్షయ వ్యాధి ఉందని తెలుస్తుంది. వైద్యులు అతన్ని మంచి వైద్య సదుపాయాలున్న స్విట్జర్లాండుకు తీసుకువెళ్ళమని చెబుతాడు. జానకి అక్కడికి వెళ్ళే వీలులేకపోవడంతో పతి తన మేనల్లుడిని తీసుకుని చార్టర్ విమానంలో ముందుగా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి స్విట్జర్లాండుకు వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఢిల్లీ వెళ్ళక మునుపే పతికి గుండె నొప్పితో విమానాన్ని ఒక ఎడారి ప్రాంతంలో అత్యవసరంగా దింపేసి మరణిస్తాడు. ఈ ప్రమాదాన్ని గురించి తెలుసుకున్న వేణుగోపాలరావు విమానం పడిపోయిన ప్రదేశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. విమానం ప్రమాదవశాత్తూ కాలిపోవడంతో గోపి తనతో ఉన్న కుక్కపిల్లను తీసుకుని తనకు తోచిన దారిన బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. దారిలో అతనికి అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఒక పాము విషం చిమ్మడంతో అతను కంటి చూపు కోల్పోతాడు. తర్వాత ఒక తేలు కాటేయడంతో స్పృహ తప్పి పడిపోతాడు. ఆ స్థితిలో కొంతమంది కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్ళి చికిత్స చేసి బతికిస్తారు.

బాబు దొరికాడన్న సంగతి నరసింహానికి తెలిసి ఎలాగైనా అతన్ని అంతమొందించాలని అన్నకు చెప్పకుండా బయలుదేరతాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న వేణుగోపాలరావు భార్యతో కలిసి వెళ్ళి తమ బిడ్డను కలుసుకుంటారు. అతన్ని చంపాలనుకున్న నరసింహం ప్రమాదవశాత్తూ కార్చిచ్చులో చిక్కుకుని మరణిస్తాడు.

తారాగణంసవరించు

నిర్మాణంసవరించు

అభివృద్ధిసవరించు

అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు (1971) సింహభాగం ఎడారిలో చిత్రించబడింది. ఆయన తాను తీయబోయే తర్వాతి చిత్రం ఎడారి నేపథ్యంలోనే తీయాలనుకున్నాడు.[3] అప్పుడే దక్షిణాఫ్రికాకు చెందిన దర్శకుడు జేమీ ఊయిస్ (Jamie Uys (en)) రూపొందించిన ఆంగ్ల చిత్రం లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ 1969లో ఆంధ్రప్రదేశ్ లో విడుదల అయింది. ఈ చిత్రం ఆయన్ను ఆకర్షించింది. ఆయన గొల్లపూడి మారుతీరావును సంప్రదించి ఆ చిత్రం ఆధారంగా కథను రాయమని కోరాడు. అదే పాపం పసివాడు చిత్రానికి మూలకథ.[4]

తారాగణం ఎంపికసవరించు

చుక్కల వీరవెంకటరాంబాబు అలియాస్ రాము ఈ చిత్రానికి నటీనటుల ఎంపికలో పాల్గొన్న మొదట్లో, ఈ చిత్ర బృందం అతను వయసులో చాలా చిన్నవాడని అతన్ని ఎంపిక చేయలేదు. కానీ కొన్ని చర్చల అనంతరం తిరిగి అతన్నే ఎంపిక చేశారు.[3] ఎస్. వి. రంగారావు గోపి తండ్రి వేణుగోపాలరావు పాత్రలో, గోపి మామ పతి పాత్రలో నగేష్, గోపి తల్లిగా దేవిక, విమానాశ్రయ అధికారిగా ఎం. ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ తమ్ముడిగా కైకాల సత్యనారాయణ, వైద్యునిగా చిత్తూరు నాగయ్య, వేణుగోపాలరావు ఆస్తి కోసం వెంపర్లాడే బంధువులు దుర్గమ్మ, సుబ్బమ్మలుగా సూర్యకాంతం, ఛాయాదేవి ఎంపికయ్యారు. టామీ అనే పొమేరేనియన్ (pomeranian dog (en)) కుక్క, గోపీకి తోడుగా కనిపిస్తుంది.[4]

చిత్రీకరణసవరించు

ఈ సినిమా చిత్రీకరణ 1972 మార్చిలో ప్రారంభమైంది. 27 రోజుల పాటు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరించబడింది. ఈ సన్నివేశాల్లో కేవలం రాము, టామీ మాత్రమే పాత్రధారులు. నగేష్, ఎస్. వి. రంగారావు, దేవిక, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ మీద చిత్రీకరించిన ఎడారి సన్నివేశాలు స్టూడియోలో వేసిన సెట్ లోనూ, మద్రాసు బీచ్ లోనూ చిత్రీకరించబడ్డాయి. నగేష్ డేట్లు అనుకున్నన్ని దొరక్కపోవడంతో ఆయనకు సంగీత దర్శకుడు కె. చక్రవర్తితో డబ్బింగ్ చెప్పించారు నిర్మాతలు. మూల చిత్రం లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ నిడివి 90 నిమిషాలు కాగా తెలుగు చిత్రం చివరికి 139 నిమిషాలు నిడివి వచ్చింది.[4]

ప్రచారంసవరించు

ఈ చిత్ర ప్రచారం కోసం కరపత్రాలను వివిధ తెలుగు పట్టణాల్లో హెలికాప్టర్ల ద్వారా వెదజల్లారు. ఒక తెలుగు సినిమా కోసం ఇలా ప్రచారం చేయడం అదే ప్రథమం.[4]

విడుదల, ఫలితంసవరించు

ఈ చిత్రం 1972, సెప్టెంబరు 29న విడుదలై వ్యాపారాత్మకంగా విజయం సాధించింది.

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం దర్శకత్వం వహించాడు.[5] అమ్మా చూడాలీ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఆత్రేయ, సి. నారాయణరెడ్డి, కొసరాజు పాటలు రాశారు. పి. సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి పాటలు పాడారు.[6]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మంచియన్నదే కానరాదు ఈ మనుషులలోనా"కొసరాజుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి 
2."లక్ష్మీ క్షీరసముద్రరాజ తనయా (శ్లో)" పి. సుశీల 
3."ఓ బాబు నీ కన్న మాకు పెన్నిధి ఎవరు"సి. నారాయణ రెడ్డిపి. సుశీల 
4."అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి"ఆత్రేయపి. సుశీల 
5."అయ్యో పసివాడా అయ్యో పాపం పసివాడా"ఆత్రేయఘంటసాల 

మూలాలుసవరించు

  1. "Papam Pasivadu (1972)". Indiancine.ma. Retrieved 2020-09-28.
  2. "పసివాడి సాహసంతో సక్సెస్ మంత్రం - Nostalgia". iDreamPost.com. Archived from the original on 2020-08-08. Retrieved 2020-07-12.
  3. 3.0 3.1 Pecheti, Prakash (31 March 2019). "A jewel in the golden era". Telangana Today. Archived from the original on 2 April 2020. Retrieved 2 April 2020.
  4. 4.0 4.1 4.2 4.3 Narasimham, M. L. (16 March 2020). "Papam Pasivadu (1972): A fascinating adaptation of South African movie 'Lost in The Desert'". The Hindu. Archived from the original on 2 April 2020. Retrieved 2 April 2020.
  5. "Papam Pasivadu (1972)-Song_Booklet". Indiancine.ma. Retrieved 2 April 2020.
  6. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.