పూర్వ ప్రాచీన శిలాయుగం

ప్రాచీన శిలాయుగం (Paleolithic Age) లో తొలి దశను "పూర్వ ప్రాచీన శిలాయుగం" (Lower Paleolithic Age) గా పేర్కొంటారు. ఈ దశ సుమారు 33 లక్షల సంవత్సరాల కాలం నుండి 3 లక్షల సంవత్సరాలక్రితం వరకూ సుదీర్ఘ కాలం కొనసాగింది. ఆదిమ మానవుడు మొట్టమొదటిసారిగా శిలా పరికరాలు (Stone Tools) ను తయారు చేసుకొని ఉపయోగించిన కాలం నుంచి ఈ యుగం ప్రారంభమై సుమారిగా 3 లక్షల సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. అయితే ప్రపంచ మంతటా ఈ కాల విభజన ఏకరీతిగా లేదు. ఒక్కో ప్రాంతంలో లభ్యమైన పురావస్తు ఆధారాలను (ప్రాచీన శిలా పనిముట్లు) బట్టి ఆయా ప్రాంతాలలో ఈ కాల విభజన కాస్త అటూ ఇటుగా వుంటుంది.

ప్రాచీన శిలాయుగం - కాల నిర్ణయంసవరించు

ప్రాచీన శిలాయుగాన్ని పేలియోలిథిక్ యుగం (Paleolithic Age) లేదా పాత రాతి యుగం (Old Stone Age) లేదా తొలి రాతి యుగం (Early Stone Age) అని కూడా వ్యవహరిస్తారు. ఇది సుమారు 33 లక్షల సంవత్సరాల కాలం నుండి క్రీ.పూ. 10,000 సంవత్సరాల వరకూ కొనసాగింది.

మానవజాతి చరిత్రలో అతి సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రాచీన శిలాయుగాన్ని తిరిగి మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి.

  1. పూర్వ ప్రాచీన శిలాయుగం (Lower Paleolithic Age): ఇది సుమారుగా 33 లక్షల సంవత్సరాల కాలం నుండి 3 లక్షల సంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. పూర్వ ప్రాచీన శిలాయుగం మలి ప్లియోసీన్ (Late Pliocene) శకంలో ప్రారంభమై మధ్య ప్లీస్టోసిన్ (Middle Pleistocene) శకంలో ముగిసింది.
  2. మధ్య ప్రాచీన శిలాయుగం (Middle Paleolithic Age): ఇది సుమారుగా 3 లక్షల సంవత్సరాల కాలం నుండి క్రీ.పూ. 30,000 సంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది.
  3. ఉత్తర ప్రాచీన శిలాయుగం (Upper Paleolithic Age): ఇది సుమారుగా క్రీ.పూ. 30,000 నుండి క్రీ.పూ. 10,000 వరకూ కొనసాగింది.

అయితే పై దశలలో ఏ ఒక్క దానికి కూడా కాల విభజనలో ప్రత్యెక పరిధి అంటూ ఏదీ లేదు. పరిణామ క్రమంలో పాత సంప్రదాయాలు కొనసాగుతూ వుంటుంటే వాటితో పాటు కొత్త సంప్రదాయాలు కూడా ఆవిర్భవించి పాతవాటితో పాటూ కొనసాగాయి. అంటే మధ్య ప్రాచీన శిలాయుగం, పూర్వ ప్రాచీన శిలాయుగాన్ని పూర్తిగా కనుమరుగు చేయదు.

పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్కృతి - లక్షణాలుసవరించు

ఈ దశకు చెందిన ఆదిమజాతి మానవులు క్వార్జైట్ (Quartzite)తో తయారు చేసిన గులకరాతి (Pebbles) పనిముట్లను వాడుతూ, వేటాడుతూ ఆహార సముపార్జన చేసేవారు. వీరికి గులకరాళ్ళను ప్రత్యక్షంగా పనిముట్ల తయారీలో వాడటమే తెలుసుగాని దాని నుంచి తీసిన పెచ్చులను (Flakes) పనిముట్ల తయారీలో ఉపయోగించడం అంతగా తెలీదు. ఈ కాలంలో మానవుడు జంతువుల మాంసాన్ని చీల్చడానికి సుత్తి రాళ్ళను (Stone Hammers) వాడేవాడు. చేతి గొడ్డళ్ళు (Hand-Axes), ఛేదకాలు (Cleavers) వంటి పనిముట్లను తయారు చేసాడు. ఈ పరికరాలను ఆస్ట్రలోపితికన్లు (australopithecines), హోమో హబిల్లిస్ (Homo habilis) తరువాతి కాలంలో హోమో ఎరక్టస్ (Homo erectus) జాతులకు చెందిన ఆదిమ మానవులు ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవ నివాస స్థానాలన్నీ ప్రధానంగా నదీ తీరాలు, వాగు తీరాలు చెంతన ఉన్నాయి. వీరికి ఎముకతొ గాని, దంతంతో గాని పరికరాలు చేయడం ఇంకా తెలీదు.

పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన ప్రధాన సంస్కృతులుసవరించు

ఒల్డోవన్ సంస్కృతి (Oldowan Culture)సవరించు

 
ఇథియోపియా (మెల్కా కుంటురె) వద్ద లభ్యమైన 17 లక్షల సంవత్సరాల కాలం నాటి ఒల్డోవన్ సంస్కృతికి చెందిన chopper పనిముట్టు

ఆఫ్రికా ఖండం లోని తూర్పు, దక్షిణ భాగాలలో విస్తృత ప్రాంతాలలో లభించిన 'పూర్వ ప్రాచీన శిలాయుగ కాలం' నాటి పనిముట్లకు సంబంధించిన సంస్కృతిని ఒల్డోవన్ సంస్కృతిగా పేర్కొంటారు. పూర్వ ప్రాచీన శిలాయుగ దశకు చెందిన ఈ ఒల్డోవన్ సంస్కృతి సుమారుగా 26 లక్షల సంవత్సరాల కాలం నుండి 17 లక్షల సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. మానవ జాతి చరిత్రలో ఆదిమ మానవుడు ఉపయోగించిన తొట్టతొలి శిలా పరికరాలు (Stone Tools) ఒల్డోవన్ (Oldowan) సంప్రదాయానికి చెందినవి. ఈ సంప్రదాయానికి చెందిన పరికరాలను వాడిన ఆదిమ జాతి ప్రజలు ఆస్ట్రలోపితికన్లు (australopithecines), హోమో హబిల్లిస్ (Homo habilis) మానవులు.

ఒల్డోవన్ సంప్రదాయం తరువాత కాలక్రమంలో వచ్చిన తొలితరం హోమో ఎరక్టస్ (Homo erectus) మానవుల వలన ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో పూర్వ చెలియన్ (Pre-Chellean), అబివిల్లియన్ (Abbevillian), అషులియన్ (Acheulean), క్లాక్టన్ (Clactonian), లెవలోషియన్ (Levalloisian) తదితర పూర్వ ప్రాచీన శిలాయుగపు సంస్కృతులు ఏర్పడ్డాయి. వీటిలో చెలియన్ పూర్వ సంస్కృతి, అబివిల్లియన్ సంస్కృతి, అషులియన్ సంస్కృతులు ద్విముఖ పనిముట్లు (Bifacial-tool) లేదా చేతి గొడ్డళ్ళు (Hand-Axe) తయారీ సంప్రదాయానికి చెందినవి. ఇకపోతే క్లాక్టన్ సంస్కృతి, లెవలోషియన్ సంస్కృతులు రాతి పెచ్చులతో చేసిన పనిముట్ల (Flake-tool) తయారీ సంప్రదాయానికి చెందినవి.

అషులియన్ సంస్కృతి (Acheulean Culture)సవరించు

 
ఫ్రాన్సు (Haute-Garonne) వద్ద లభించిన అషులియన్ సంస్కృతికి చెందిన చేతి గొడ్డళ్ళు

పూర్వ ప్రాచీన శిలాయుగపు దశకు చెందిన ఈ సంస్కృతి యూరఫ్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ప్రాంతాలలో వ్యాపించి ఉంది. అషులియన్ సంస్కృతికి చెందిన ఆదిమ మానవులు ఉపయోగించిన చేతి గొడ్డళ్ళు (Hand-Axes) సుమారుగా 18 లక్షల సంవత్సరాల కాలం నాటివి. ఉత్తర ఫ్రాన్స్ లోని 'సెయింట్ అషూల్' (Saint-Acheul) ప్రధాన ఆవాసంగా వున్న ఈ పూర్వ ప్రాచీన శిలాయుగపు సంస్కృతి పశ్చిమ ఆసియా, యూరఫ్ ప్రాంతాలలో 18 లక్షల సంవత్సరాల కాలం నుండి 1 లక్ష సంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. సుదీర్ఘ మానవజాతి చరిత్రలో అషులియన్ సంస్కృతికి చెందిన ఆదిమ మానవుడు ఉపయోగించిన శిలా పరికరాలే అధికంగా ఉన్నాయి.

క్లాక్టన్ సంస్కృతి (Clactonian Culture)సవరించు

 
ఇంగ్లాండ్‌ (స్వాన్స్‌కొంబె) వద్ద లభించిన క్లాక్టన్ సంస్కృతికి చెందిన చేతి గొడ్డళ్ళు

పూర్వ ప్రాచీన శిలాయుగపు దశకు చెందిన ఈ సంస్కృతి ఇంగ్లాండ్ ప్రాంతంలో సుమారుగా 3 లక్షల సంవత్సరాల కాలం నుండి 2 లక్షల సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. ఇంగ్లాండ్ లోని క్లాక్టన్ - ఆన్ సీ (Clacton-on-Sea) ప్రాంతం ప్రధాన ఆవాసంగా కొనసాగిన ఈ సంస్కృతికి చెందిన శిలా పరికరాలు ఇంగ్లాండ్‌ లోని స్వాన్స్‌కొంబె (Swanscombe), బర్న్‌హామ్ (Barnham), బార్న్‌ఫీల్డ్ పిట్ (Barnfield Pit) ప్రాంతాలలో మాత్రమే కాకుండా ఈజిప్ట్ లోని నైలునది తీర ప్రాంతాలలో కూడా లభించాయి. ఈ ఆదిమ మానవులు ప్రధానంగా ఫ్లింట్ రాతి పరికరాలను ఉపయోగించారు. వీరు రాతి పెచ్చులు (Flakes)తో చేసిన పనిముట్లును కూడా ఉపయోగించారు.

పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన ఇతర స్థానిక సంస్కృతులుసవరించు

ఇవి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరి కొన్ని భౌగోళిక ప్రాంతాలలో లభ్యమైన ఆయా పురాతన శిలా పనిముట్లను ఆధారంగా చేసుకొని, ఆయా ప్రాంతాలలో మరి కొన్ని స్థానిక పూర్వ ప్రాచీన శిలాయుగపు సంస్కృతులను గుర్తించారు. ఉదాహరణకు సోవేన్ (Soanian) సంస్కృతి, మద్రాసి సంస్కృతి (Madrasian Culture), రేవత్ (Rewat) సంస్కృతి మొదలైనవి.

సోవేన్ సంస్కృతి (Soanian Culture)సవరించు

పాకిస్తాన్ లోని సోవేన్ (Soanian) నదీ పరీవాహక ప్రాంతంలో పూర్వ ప్రాచీన శిలాయుగపు సంస్కృతి సుమారుగా 5 లక్షల సంవత్సరాల కాలం నుండి 1.25 లక్షల సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. ఇక్కడ లభించిన శిలా పరికరాలు అషులియన్ పూర్వ ప్రాచీన శిలాయుగపు సంస్కృతి (Acheulean) కి సమకాలికమైనవి. హిమాచల్ ప్రదేశ్ లోని చౌంత్ర (Chauntra), ఉత్తరప్రదేశ్- నేపాల్ సరిహద్దులలోని శివాలిక్ పర్వత పాదాలలో కూడా ఈ సోవేన్ సంస్కృతికి చెందిన శిలాపరికరాలు లభించాయి.

మద్రాసి సంస్కృతి (Madrasian Culture)సవరించు

దక్షిణ భారత దేశంలో మద్రాస్ (నేటి చెన్నై నగరం) సమీపంలోని అత్తిరాంపక్కం (Attirampakkam) వద్ద ఆదిమ మానవులు రాతితో తయారుచేసి ఉపయోగించిన ద్విముఖ చేతి గొడ్డళ్ళు (bifacial Hand-Axes) లభ్యమైనాయి. ఇవి సుమారు 15 లక్షల సంవత్సరాల కాలం నాటివి. అషులియన్ (Acheulean) సంస్కృతితో కొంతవరకు సంబంధం వున్నదిగా భావించబడిన ఈ సంస్కృతి దక్షిణ భారత దేశంలో సుమారు 15 లక్షల సంవత్సరాల కాలం నుండి 1 లక్ష సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. మద్రాస్ ప్రధాన ఆవాసంగా కొనసాగిన ఈ పూర్వ ప్రాచీన శిలాయుగపు సంస్కృతిని మద్రాస్ చేతి గొడ్డళ్ళ పరిశ్రమ (MadrasHand- Axe Industry) లేదా మద్రాసి సంస్కృతి (Madrasian Culture) గా పరిగణించారు.

రేవత్ సంస్కృతి (Rewat Culture)సవరించు

ఉత్తర పాకిస్తాన్ లోని రేవత్ (Rewat) ప్రాంతంలో పూర్వ ప్రాచీన శిలాయుగపు సంస్కృతి సుమారుగా 19 లక్షల సంవత్సరాల నుండి 45 వేల సంవత్సరాల వరకూ కొనసాగింది. ఇక్కడ లభించిన శిలా పరికరాలు ఒల్డోవన్ సంస్కృతికి సమకాలికంగా ఉన్నాయి.

వీటిని కూడా చూడండిసవరించు

రిఫరెన్స్‌లుసవరించు

వెలుపలి లింకులుసవరించు