ఫుట్బాల్
కాల్బంతి లేదా ఫుట్‌బాల్ (ఆంగ్లం: football) అనునుది ఒక జట్టుక్రీడ. దీని అసలు పేరు అసోషియేషన్ ఫుట్‌బాల్. ఇందులో జట్టుకు 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ప్రపంచంలో ఎక్కువగా ఆడే ఆట ఇది.[1] ఇది ఒక బంతి ఆట. దీర్ఘచతురస్రాకార మైదానాలలో ఆడుతారు. ఇది గడ్డి, మట్టి, లేదా కృత్రిమమైన మైదానం కావచ్చు. మైదానానికి రెండు చివర్ల గోల్‌పోస్టులుంటాయి. బంతిని గోల్‌పోస్టులోకి చేర్చి స్కోరు చెయ్యడం ఆట లక్ష్యం. బంతిని చేతితో తాకే హక్కు గోలుకీపరుకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఆటగాళ్ళందరూ, బంతిని కాలితో తన్నడం, తలతో కొట్టడం, లేక ఛాతీతో నియంత్రించడం చేస్తుంటారు. నియంత్రిత సమయంలో ఎక్కువ గోల్‌లు చేసిన జట్టు విజేత అవుతుంది. ఇఱు జట్లు సమాన సంఖ్యలో గోలులు చేస్తే పోటీ బట్టి ఆట డ్రాగా పరిగణించబడడం, లేక అధిక సమయంలోకి తీసుకు వెళ్ళడం జరుగుతుంది.
ఫుట్బాల్ ఆధునిక రూపం ఇంగ్లాండులో ఫుట్‌బాల్ ఆసోషియేషన్ 1863 వారిచే లిఖించబడింది. దీనిని అంతర్జాతీయ స్థాయిలో ఫీఫా (Fédération Internationale de Football Association - అంతర్జాతీయ అషోషియేషన్ ఫుట్‌బాల్ సంఘం), నియంత్రిస్తుంది.
ఆట తీరు
మార్చుఫుట్బాల్, లాస్ ఆఫ్ ది గేమ్ అనే నియమాలను అనుసరిస్తూ ఆడతారు. గుండ్రంగా ఉండే బంతితో ఆడతారు. పదకొండు మంది ఆటగాళ్లు ఉండే రెండు జట్లు ఆ బంతిని తమ ప్రత్యర్థుల గోలులోనికి పంపడానికి ప్రయత్నిస్తుంటారు. అలా బంతి గోలు లోనికి వెళ్ళిన ప్రతిసారి ఒక గోలు అయినట్టు పరిగణింపబడుతుంది. నియమిత సమయంలో ఎక్కువ గోల్‌లు చేసిన జట్టు విజేతలు. ఇఱువురూ సమానసంఖ్యలో గోలులు చేసినచో ఆట డ్రా అవుతుంది.
ఆట ముఖ్య నియమము, గోలీ (గోల్ కీపరు) తప్ప మిగిలిన ఆటగాళ్ళు బంతిని కావాలని చేతితో తాకరాదు. బంతి మైదానం బయటకు వెళ్లినప్పుడు దాన్ని లోపలికి విసరడానికి చేతులు ఉపయోగించవచ్చు. ఆటగాళ్ళు ప్రముఖంగా కాళ్లను వాడినా, నియమాల ప్రకారం చేతులు మినహాయించి మిగిలిన ఏ శరీర అవయవముతో నైనా బంతిని నియంత్రించవచ్చు.[2]
బంతిని తమ అధీనంలో ఉంచడానికి ఆటగాళ్ళు డ్రిబిలింగ్ (బంతిని కాలితూ తడుతూ వెళ్ళడం) చేస్తారు. అవకాశ మున్నప్పుడు బంతిని తమ కంటే ముందున్న తమ జట్టు ఆటగాడికి అందిస్తారు (పాస్). గోలుకు సరిపడ దూరాన వున్నప్పుడు బంతిని గోలు వైపు గట్టిగా తన్నడం జరుగుతుంది. అలా తన్నిన బంతిని గోలులోనికి వెళ్ల కుండా అవతలి జట్టు యొక్క గోలీ ప్రయత్నిస్తాడు. అవతలి జట్టు ఆటగాళ్ళు బంతిని దక్కించుకోవడానికి, అందిస్తున్నబంతిని దక్కించుకోవడం, బంతిని డ్రిబిల్ చేస్తున్న ఆటగాళ్ళ దగ్గర నుండి దక్కించుకోవడం వంటి యత్నాలు చేస్తుంటారు. కాని అవతలి జట్టువారిని భౌతికంగా తాకడం నిషిద్ధం. ఫుట్‌బాల్ నిరంతరాయంగా సాగే ఆట, బంతి మైదానం అవతలికి వెళ్లినప్పుడు, లేక రెఫరీ ఆపినప్పుడు మాత్రమే ఆగుతుంది. ఆట ఆగినప్పుడు రెఫరీ నిర్దేశించిన విధానంలో ఆట తిరిగి మొదలౌతుంది.
అత్యున్నత స్థాయిలో జరిగే ఆటల్లో సగటున రెండు మాడు గోలులు మాత్రమే అవుతాయి. ఉదా ఆంగ్ల ప్రీమియర్ లీగ్ యొక్క ఎఫ్‌ఎ ప్రీమియర్ లీగ్ 2005-2006 కాలంలో ఆటకు సగటున 2.48 గోలులు మాత్రమే చేయబడినవి.[3]
ఆట నియమాల ప్రకారం ఆటగాళ్ళందరి స్థానాలు నియంత్రించబడి లేవు; గోలీ తప్ప మిగిలిన ఆటగాళ్ళు మైదానంలో యథేచ్ఛగా తిరగవచ్చు.[4]. కాని కాలక్రమంలో ఫుట్‌బాలులో చాలా ప్రత్యేకించిన స్థానాలు రూపుదిద్దుకున్నాయి. ఇందులో ముఖ్యంగా మూడు రకాల స్థానాలున్నాయి: స్ట్రైకర్లు -ముందు వరుస వారు, (గోలులు చేయడం వీరి ప్రత్యేకత); డిఫెండర్లు లేదా రక్షకులు (వీరు ప్రత్యర్థులు గోలు చేయకుండా చూడాలి), మిడ్ ఫీల్డర్స్ (మైదాన మధ్యులు), బంతిని తమ జట్టు అధీనంలో వుంచడం, దానిని గోలు చేయవలసిన ముందువరుస వారికి అందించడం వీరి కర్తవ్యం. వీరిని గోలీ నుండి గుర్తించడానికి మైదాన ఆటగాళ్ళు (అవుట్ ఫీల్డర్స్) గా సంబోధిస్తారు. ఆటగాడు ఆడే చోటు ప్రకారం, ఈ స్థితులను ఇంకా విభజించి సంబోధించడం జరుగుతుంది. ఉదా- ఎడమ రక్షకులు, కుడి రక్షకులు వగైరా. పది మంది మైదాన ఆటవారిని ఏ విధానంగా నైనా అమర్చడం జరుగుతుంది. ప్రతి వరుసలో ఎంత మంది ఆటగాళ్ళు వున్నారనేది, జట్టు ఆడు తీరును చూపుతుంది. ఎక్కువ మంది ముందువరుస వారు, తక్కువ రక్షకులు వున్నప్పుడు, ప్రత్యర్థి గోలుపై దాడి చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టు ఆన్నమాట.
చరిత్ర, పురోగమనం
మార్చుకాలి బంతులాటలు అనాదిగా మానవులు ఆడుతున్నవే. ఫీఫా ప్రకారం అధునాతన ఫుట్‌బాలుకి ఎక్కువ పోలిక వున్న ఆట ఆతి పురాతనంగా క్రీ.పూ. రెండవ శతాబ్దంలో చైనాలో(కుజు అనే పేరుతో) ఆడారని ఆధారాలు ఉన్నాయి.[5] ఇక ఐరోపాలో పురాతన రోము నగర వాసులు ఆడిన హర్పస్తుమ్ ఆట నుండి నేటి ఫుట్‌బాలు అవతరించి ఉండవచ్చు. ఐరోపాలో వివిధ కాలాలలో వేర్వేరు నియమాలతో ఫుట్‌బాలు ఆడడం జరిగింది.
19వ శతాబ్ద మధ్యకాలంలో ఇంగ్లాండులోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆడే ఫుట్‌బాలు వివిధ రకాలని ఏకం చేయడానికి దాని నియమాలు రచించడం జరిగింది. 1848లో కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాలలో 'కేంబ్రిడ్జ్ నియమాలు' రచించడం జరిగింది. ఆ సమావేశానికి వివిధ పాఠశాలలనుండి ప్రతినిధులు వచ్చారు. ఆ నియమాలను అందరూ అనుసరించకపోయినా, తర్వాతి నియమాలకు ఇవి మార్గదర్శకాలయ్యాయి.
1863లో ఫుట్‌బాల్ సంఘం ఏర్పడినది. వారి మొదటి సమావేశం 1863 అక్టోబరు 26 ఉదయం లండన్‌లో జరిగింది.[6]
ఇదే ప్రదేశంలో జరిగిన తదుపరి సమావేశాలలో ఆట నియమాలు రచించబడ్డాయి. వీరు బంతిని చేతిరో పట్టుకునే సౌకర్యాన్ని రద్దు చేయడంతో, అప్పటి వరకూ ఫుట్‌బాలు సంఘంలో వున్న పలు రగ్బీ జట్టులు వైదొలగినవి. ఆపైన వివిధ నియమాలలో మార్పులు చేయడం జరిగింది.
ప్రస్తుతం ఆట నియమాలు పర్యవేక్షించేది అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం బోర్డు (IFAB). ఆ బోర్డు 1886 లో స్థాపించబడింది.[7]
ప్రపంచంలోని అతి ప్రాచీన ఫుట్‌బాలు పోటీ ఎఫ్‌ఎ కప్పు. ఇందులో ఇంగ్లీషు జట్లు 1872 నుండి ఆడుతున్నాయి. మొదటి అంతర్జాతీయ ఆట ఇంగ్లాండు, స్కాట్‌లాండుల మధ్య 1872లో గ్లాస్గోలో జరిగింది. ప్రపంచంలోని మొదటి ఫుట్‌బాలు లీగు ఇంగ్లాండులోని ఫుట్‌బాలు లీగు. ఇందులో 12 జట్లు ఆడేవి. అంతర్జాతీయ ఫుట్‌బాలు సంఘం (ఫీఫా) 1904లో పారిస్ నగరంలో ఏర్పడింది.
ఆదరణ
మార్చుప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఫుట్‌బాలను వృత్తిగా అడేవారు ఉన్నారు. కోట్ల మంది జనం, తమ కిష్టమైన జట్లు ఆడడం చూడడానికి స్టేడియాలకి తఱచూ వెళ్తుంటారు.[8]. వందలకోట్ల మంది ఆటను టీవీలో చూస్తుంటారు.[9] ప్రపంచంలో చాలా మంది ఫుట్‌బాలును మనోరంజనానికి ఆడతారు. 2001 లో ఫిఫా జరిపిన ఒక సర్వే ప్రకారం వీరి సంఖ్య 24కోట్ల దగ్గరలో ఉంది. దీన్ని 200 దేశాల్లో ఆడతారు.[10] దీని సరళమైన నియమాలు, మౌలికంగా వుత్త బంతి అవసరం మాత్రమే వుండడంతో దీన్ని ఆడడం ప్రారంభించడం చాలా తేలిక. అందువలన ఈ ఆట ఎక్కువగా వ్యాపించింది.
ప్రపంచంలో చాలా మందికి ఫుట్‌బాలంటే వీరాభిమానం. అభిమానుల జీవితంలో ఫుట్‌బాల్‌కి ఎనలేని ప్రాముఖ్యం వుంటుంది. కొన్ని దేశాలలో దీనికున్న ప్రాముఖ్యత బట్టి దీన్ని ప్రపంచంలోనే అతి ఎక్కువ ఆదరణ పొందిన ఆటగా పరిగణిస్తారు. దీని వల్ల యుధ్దాలు ఆగడం, యుద్ధాలు జరగడం కూడా జరిగాయి.[11]
ఆట నిబంధనలు
మార్చుఆధికారిక ఆట నియమాలు పదిహేడు ఉన్నాయి. ఇవే ఆట యొక్క అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తాయి. పిల్లలు, మహిళల కోసం వీటిని అప్పుడప్పుడూ స్వల్పంగా మార్చడం జరుగుతోంది. ఈ పదిహేడు నియమాలతో బాటు అనేక IFAB నిర్దేశాలు ఆటను నియంత్రిస్తాయి. ఆట నియమాలను ఫీఫా ప్రచురించినప్పటికీ అవి IFAB పర్యవేక్షణలోనే ఉన్నాయి.[12]
ఆటగాళ్ళు, సామగ్రి, రిఫరీలు
మార్చుజట్టుకు గరిష్ఠంగా పదకొండు మంది ఆటగాళ్ళు ఉండవచ్చు, అందులో ఒకరు గోలీగా ఉండవలెను. బంతిని చేతితో తాకగలిగేది, గోలీలు మాత్రమే, అది కూడా వారి పెనాల్టీ స్థలంలో మాత్రమే.
ఆటకి కావలసిన కనీస సామాగ్రి చొక్కా, లాగు, పాదరక్షలు, మోకాలి కవచాలు. ఇతరులకు, తమకూ హాని కలిగించగల చేతి గడియారాలు, ఆభరణాలు వంటి వస్తువులను ధరించరాదు. ఇఱు జట్ల దుస్తుల రంగుల మధ్య తగు వ్యత్యాసం ఉండాలి.[13]
ఆట జరిగే సమయంలో కొందరు ఆటగాళ్ళను ఇతరులతో మార్చవచ్చు. చాలా పోటీల్లో గరిష్ఠంగా ముగ్గురు ఆటగాళ్ళను మార్చవచ్చు. అప్పుడప్పుడూ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ వుండవచ్చు. గాయం, అలసట, ఆటతీరులో లోటు, వ్యూహంలో మార్పు, కాలయాపన వంటి సందర్భాల్లో ఈ మార్పులను వినియోగిస్తారు. ఒక సారి మార్చిన ఆటగాణ్ణి తిరిగి ఆటలోకి తీసుకునే వీలు లేదు.[14]
ఆటని పర్యవేక్షించడానికి రిఫరీకి సర్వ హక్కులూ వుంటాయి. అతని/ఆమె నిర్ణయాలకు తిరుగు వుండదు. రిఫరీకి అండగా ఇద్దరు సహాయక రిఫరీలు ఉంటారు. ఉత్తమ స్థాయి ఆటలో అధనంగా నాలుగవ రిఫరీ కూడా ఉంటారు.[15]
మైదానం
మార్చుఅంతర్జాతీయ పెద్దల ఆటలకు మైదానం పొడవు 100–110 మీటర్లు (110–120 గజాలు) వెడల్పు 64–75 మీటర్లు (70–80 గజాలు). మైదానం పొడవునా వుండే గీతలను "అడ్డగీతలు"గాను, వెడల్పు వెంబడి వుండే గీతలను, "గోలు గీతలు"గా సంబోధిస్తారు. ఇఱు గోలు గీతల మధ్యలో చెరో చతుర్భుజాకార గోలు వుండును.[16]. గోలు వెడల్పు 8 గజాలు (7.32 మీ.) వుండాలి. గోలు యొక్క ఎత్తు 8 అడుగులు (2.44 మీ) వుండాలి. గోలు వెనుక నెట్లు వుంటాయి. అయితే, నియమాల ప్రకారం అవి వుండనక్కర లేదు.[17]
ఇఱు గోలులకు ముందు పెనాల్టి స్థలం ఉంటుంది. దీనికి ఒక పక్క గోలు రేఖలు, గోలు రేఖ నుండి 18 గజాల పొడవైన (16.5 మీ) 18 గజాల (16 మీ) రేఖలు, వాటి అంతాలను కలుపడానికి ఒక రేఖ వుంటాయి. ఈ స్థలంతో చాలా అవసరాలు వున్నాయి. ఒకటి, దీనికి బయట గోలీ చేతితో బంతిని తాకడానికి వీల్లేదు. తమ పెనాల్టీ స్థలంలో జట్టు తప్పిదం చేస్తే, వారిని శిక్షించడానికి, అవతలి జట్టుకు పెనాల్టీ కిక్ ఇస్తారు.[18]
కాలము, టై ఛేదించు విధానాలు
మార్చుపెద్దల ఆటలో రెండు భాగాలుగా, ఒక్కో భాగం 45 నిమిషాల వ్యవధితో, ఉంటాయి. ఈ వ్యవధులలో ఆట నిరంతరాయంగా జరుగుతూనే వుంటుంది. రెండు సగాల మధ్య 15 నిమిషాల విరామం వుంటుంది.
ఈ మ్యాచ్‍లో రెఫరీ అధికారికంగా సమయాన్ని నమోదు చేస్తారు. అత్యవసర సమయాల్లో తగు విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆటగాళ్ల మార్పుచేర్పులు జరిపేటపుడు, ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పుడూ, ఇంకా ఇతర సంధర్బాలలో సమయాన్ని నియంత్రించి, అదనపు సమయాన్ని మ్యాచ్‍కు జోడించగల అధికారాలు రిఫరీకి ఉన్నాయి. ఆటలో సాధారణంగా కలిగే ఈ జోడింపులని "స్టాపేజ్ టైమ్" లేదా "ఇంజురీ టైమ్" అంటారు, వీటికి పూర్తి బాధ్యత రిఫరీ వహిస్తాడు. రిఫరీ మాత్రమే మ్యాచ్ ముగింపును ప్రకటిస్తారు. నాల్గవ అంపైర్ అందుబాటులో ఉండే కొన్ని మ్యాచీలో, మ్యాచి ప్రథమార్థం లేదా ద్వితియార్థం చివర్లో రిఫరీ, తాను అదనంగా చేర్చదలచిన సమయాన్ని సూచిస్తాడు. అప్పుడు నాల్గవ అంపైర్, ఆటగాళ్లకి, ప్రేక్షకులకు రిఫరీ సూచించిన అదనపు సమయాన్ని ఒక బోర్డుపైన రాసి చూపిస్తాడు. ఈ అదనపు సమయాన్ని కూడా పొడిగించగల అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంది.
ప్రవర్తక సంఘాలు
మార్చుప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ (సంబంధిత ఆటలగు, ఫుట్‍సాల్, బీచ్ సాకర్) ను శాసించగల, గుర్తింపుపొందిన సంస్థ FIFA (Fédération Internationale de Football Association - ఫెడరేషన్ ఇంటర్‍నేషనల్ డి ఫుట్‍బాల్ అసోసియేషన్) . ఈ FIFA ప్రధాన కార్యాలయాలు జ్యూరిచ్ లో ఉన్నాయి.
FIFA కు అనుబంధంగా మరొక ఆరు ప్రాంతీయ సంస్థలు (కాన్‍ఫెడరేషన్స్) ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. అవి:
- ఆసియా: Asian Football Confederation (AFC)
- అఫ్రికా: Confederation of African Football (CAF)
- మధ్య/ఉత్తర అమెరికా & కరేబియన్ : Confederation of North, Central American and Caribbean Association Football (CONCACAF; "ఫుట్బాల్ కాన్ఫెడరేషన్" అని కూడా పిలుస్తారు.)
- యూరోప్: Union of European Football Associations (UEFA)
- ఓషియానియా: Oceania Football Confederation (OFC)
- దక్షిణ అమెరికా: Confederación Sudamericana de Fútbol (South American Football Confederation; CONMEBOL)
జాతీయ అసోసియేషన్లు వాటివాటి దేశాల్లో మాత్రమే ఫుట్‍బాల్‍ను నియంత్రిస్తూంటాయి. ఇవి (జాతీయ అసోసియేషన్లు) FIFA తోనూ, వాటి వాటి ఖండపు కాన్‍ఫెడరేషన్స్‍తోనూ అనుబంధంగా ఉంటాయి.
వివిధ పేర్లు
మార్చుమొదట్లో, ఈ ఆట నియమ నిబంధనలు రచించే సమయంలో అసోషియేషన్ ఫుట్ బాల్గా పేర్కొనబడింది. అప్పటిలో ఫుట్‌బాల్ గా వ్యవహరింపబడే వేరే ఆటలనుండి తేడా తెలుసుకోవడానికి దీనికి ఈ పేరు ఇవ్వబడింది. ఈనాడు ప్రాచుర్యంలో వున్న ఇంకో పేరు "సాకర్". ఈ పేరును ప్రధానంగా అమెరికా సంయుక్త రాష్టాలలో వాడతారు, అక్కడ అమెరికన్ ఫుట్‌బాల్‌ను ఫుట్‌బాల్ గా వ్యవహరించడం చేత,
అధికారిక పేరు అసోషియేషన్ ఫుట్ బాల్ అయినప్పటికి, ప్రపంచమంతటా దీనిని ఎక్కువగా "ఫుట్‌బాల్" గానే పిలవడం జరుగుతుంది.
క్రీడాకారులు
మార్చుఇవీ చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Soccer Archived 2009-10-28 at the Wayback Machine Encarta. Retrieved on May 24 2007.
- ↑ "Laws of the game (Law 12)". FIFA. Archived from the original on 2007-10-11. Retrieved 2007-09-24.
- ↑ "England Premiership (2005/2006)". Sportpress. Archived from the original on 2007-09-27. Retrieved 2007-06-05.
- ↑ "Laws of the game (Law 3–Number of Players)". FIFA. Archived from the original on 2007-09-13. Retrieved 2007-09-24.
- ↑ "History of Football". FIFA. Archived from the original on 2013-02-08. Retrieved 2006-11-20.
- ↑ "History of the FA". Football Association website. Retrieved February 19, 2006.
- ↑ "The International FA Board". FIFA. Archived from the original on 2007-04-22. Retrieved 2007-09-02.
- ↑ "Baseball or Football: which sport gets the higher attendance?". Guardian Unlimited. Archived from the original on 2008-04-11. Retrieved 2006-06-05.
- ↑ "TV Data". FIFA website. Archived from the original on 2009-02-24. Retrieved 2007-09-02.
- ↑ "FIFA Survey: approximately 250 million footballers worldwide" (PDF). FIFA website. Archived from the original (PDF) on 2006-09-15. Retrieved 2007-09-02.
- ↑ "Has football ever started a war?". The Guardian. Retrieved 2007-09-24.
- ↑ "Laws Of The Game". FIFA. Archived from the original on 2007-09-01. Retrieved 2007-09-02.
- ↑ "Laws of the game (Law 4–Players' Equipment)". FIFA. Archived from the original on 2007-09-13. Retrieved 2007-09-24.
- ↑ "Laws of the game (Law 3–Substitution procedure)". FIFA. Archived from the original on 2007-10-11. Retrieved 2007-09-24.
- ↑ "Laws of the game (Law 5–The referee)". FIFA. Archived from the original on 2007-09-13. Retrieved 2007-09-24.
- ↑ "Laws of the game (Law 1.1–The field of play)". FIFA. Archived from the original on 2007-09-13. Retrieved 2007-09-24.
- ↑ "Laws of the game (Law 1.4–The Field of play)". FIFA. Archived from the original on 2008-03-22. Retrieved 2007-09-24.
- ↑ "Laws of the game (Law 1.3–The field of play)". FIFA. Archived from the original on 2007-10-11. Retrieved 2007-09-24.