బసంతీ దేవి

భారతీయ స్వాతంత్ర ఉద్యమకర్త

బసంతీ దేవి (1880 మార్చి 23 - 1974 మే 7) భారతదేశంలో బ్రిటిషు పాలనలో భారతీయ స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. ఆమె చిత్తరంజన్ దాస్ భార్య. 1921 లో దాస్ అరెస్టు, 1925 లో ఆయన మరణం తరువాత, ఆమె వివిధ రాజకీయ, సామాజిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొంది. స్వాతంత్య్రానంతరం సామాజిక పనిలో కొనసాగింది. 1973 లో ఆమెకు పద్మ విభూషణ్ లభించింది.

బసంతీ దేవి
జననం(1880-03-23)1880 మార్చి 23
మరణం1974 మే 7(1974-05-07) (వయసు 94)
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమర యోధురాలు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం
జీవిత భాగస్వామిచిత్తరంజన్ దాస్
పురస్కారాలుపద్మ విభూషణ (1973)

జీవిత విశేషాలు, సామాజిక కార్యక్రమాలు

మార్చు

బసంతీ దేవి బ్రిటిషు వలస పాలన కాలంలో అస్సాం లోని పెద్ద జమీందారీ దివాన్ అయిన బరదనాథ్ హల్దార్‌కు 1880 మార్చి 23 న జన్మించింది. బసంతి కోల్‌కతాలోని లోరెటో హౌస్‌లో చదువుకుంది. పదిహేడేళ్ల వయసులో అక్కడే ఆమెకు చిత్తరంజన్ దాస్‌ పరిచయమై, అతన్ని పెళ్ళి చేసుకుంది. [1] 1898, 1901 మధ్య కాలంలో వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. [2]

భర్త అడుగుజాడల్లో, బసంతీ దేవి శాసనోల్లంఘన ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం వంటి వివిధ ఉద్యమాలలో పాల్గొంది. 1920 లో భారత జాతీయ కాంగ్రెసు నాగపూర్ సమావేశాల్లో పాల్గొంది. మరుసటి సంవత్సరం, ఆమె దాస్ సోదరీమణులు ఊర్మిళా దేవి, సునీతా దేవిలతో కలిసి "నారీ కర్మ మందిర్" అనే పేరుతో మహిళా కార్యకర్తల శిక్షణా కేంద్రాన్ని స్థాపించింది. [3] 1920-21లో, తిలక్ స్థాపించిన స్వరాజ్ ఫండ్ కోసం జల్పాయ్‌గురిలో బంగారు ఆభరణాలను, 2000 బంగారు నాణేలనూ సేకరించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. [4] 1921 లో సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో, భారత జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సమ్మెలకు ప్రజలకు పిలుపు నిచ్చింది. విదేశీ వస్తువులను బహిష్కరించాలని కాంగ్రెసు ఉద్బోధించింది. కోల్‌కతాలో, ఐదుగురు వాలంటీర్లతో కూడిన చిన్న చిన్న సమూహాలను నగర వీధుల్లో ఖద్దరు, చేనేత వస్త్రాలను విక్రయించడానికి నియమించబడ్డాయి. స్థానిక ఉద్యమంలో ప్రముఖుడైన దాస్, తన భార్య బసంతీ దేవిని అలాంటి ఒక జట్టుకు నాయకత్వం వహించాలని కోరుకున్నాడు. బ్రిటిషు వారు రెచ్చిపోయి, ఆమెను అరెస్టు చేస్తారని సుభాష్ చంద్రబోస్ ఆమెను హెచ్చరించినప్పటికీ దేవి వీధుల్లోకి వెళ్ళింది. అర్ధరాత్రి సమయానికి ఆమె విడుదలైనప్పటికీ, ఆమె అరెస్టుతో విస్తృతంగా ఆందోళనలు చెలరేగాయి. కోల్‌కతాలోని రెండు జైళ్లు విప్లవ కార్యకర్తలతో నిండిపోయాయి. మరింత మంది అనుమానితులను నిర్బంధించడం కోసం హడావిడిగా నిర్బంధ శిబిరాలను నిర్మించారు. 1921 డిసెంబరు 10 న పోలీసులు దాస్‌ను, బోస్‌నూ అరెస్టు చేశారు. [5]

దాస్ అరెస్టు తర్వాత, అతను ప్రచురించే వార పత్రిక అయిన బంగార్ కథ (బెంగాల్ కథ) బాధ్యతలను బసంతీ దేవి స్వీకరించింది. [6] 1921–22లో ఆమె బెంగాల్ ప్రొవిన్షియల్ కాంగ్రెసు అధ్యక్షురాలు. 1922 ఏప్రిల్‌లో చిట్టగాంగ్ సమావేశంలో తన ప్రసంగంలో ఆమె అట్టడుగు స్థాయిలో ఆందోళనలను ప్రోత్సహించింది. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, వలసవాదాన్ని వ్యతిరేకించడానికి ఆమె కళలను, సాంస్కృతిక కార్యక్రమాలనూ అభివృద్ధి చేసేందుకు మద్దతు ఇచ్చింది. [2]

దాస్, సుభాష్ చంద్రబోస్‌కు రాజకీయ గురువు కాబట్టి, బోసుకు బసంతీ దేవి పట్ల గొప్ప గౌరవం ఉండేది. 1925 లో దాస్ మరణం తరువాత, బోస్ తన వ్యక్తిగత, రాజకీయ సందేహాలను దేవితో చర్చించినట్లు సమాచారం. [7] బోస్ బసంతీ దేవిని తన "పెంపుడు తల్లి" గా భావించాడు. బోస్ జీవితంలో అతన్ని ప్రభావిఉతం చేసిన నలుగురు ప్రముఖ మహిళలలో ఒకరిగా ఆమెను పరిగణిస్తారు. మిగిలిన ముగ్గురు అతని తల్లి ప్రభాబతి, అతని కోడలు బిభాపతి (శరత్ చంద్రబోస్ భార్య), అతని భార్య ఎమిలీ షెంక్ల్. [8]

తన భర్తలాగే, బసంతీ దేవి కూడా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవ కార్యకర్తల పట్ల సానుభూతితో ఉండేది. 1928 లో, శాంతియుతంగా చేస్తున్న నిరసన కవాతుకు వ్యతిరేకంగా పోలీసులు చేసిన లాఠీ ఛార్జిలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ గాయపడి, కొన్ని రోజుల తర్వాత మరణించాడు. దీని తరువాత, లజపతిరాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బసంతీ దేవి భారతీయ యువతకు ఉద్బోధించింది. [9] [10]

1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, బసంతీ దేవి సామాజిక సేవలో కొనసాగారు. [11] 1959 లో కోల్‌కతాలో ప్రభుత్వ నిధులతో స్థాపించిన మొట్టమొదటి మహిళా కళాశాల ఆమె పేరిట బసంతీ దేవి కళాశాలను స్థాపించారు. [2] [12] 1973 లో, భారత ప్రభుత్వం, దేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో ఆమెను సత్కరించింది. [13] [14]

మూలాలు

మార్చు

 

  1. Ray, Bharati (2002). Early Feminists of Colonial India: Sarala Devi Chaudhurani and Rokeya Sakhawat Hossain. Oxford University Press. p. 142. ISBN 9780195656978.
  2. 2.0 2.1 2.2 Smith, Bonnie G. (2008). The Oxford Encyclopedia of Women in World History. Oxford University Press. pp. 42–43. ISBN 9780195148909.
  3. R. S. Tripathi, R. P. Tiwari (1999). Perspectives on Indian Women. APH Publishing. pp. 136, 140. ISBN 9788176480253.
  4. Chatterjee, Srilata (2003). Congress Politics in Bengal 1919–1939. Anthem Press. p. 34. ISBN 9780857287571.
  5. Bose, Sugata (2013). His Majesty's Opponent: Subhas Chandra Bose and India's Struggle against Empire. Penguin UK. ISBN 9788184759327.
  6. Bangla Academy Journal, Volume 21, Issue 2 – Volume 22, Issue 2. Bangla Academy. 1995. p. 23.
  7. Pasricha, Ashu (2008). Encyclopaedia Eminent Thinkers (vol. : 16 The Political Thought Of Subhas Chandra Bose). Concept Publishing Company. pp. 30, 33. ISBN 9788180694967.
  8. Basu, Krishna (2008). An Outsider in Politics. Penguin Books India. p. 55. ISBN 9780670999552.
  9. "Down Bhagat Singh lane". Frontline. Retrieved 2019-08-10.[permanent dead link]
  10. "Bhagat Singh's association with Kolkata's Arya Samaj temple continues". The Tribune. Sep 28, 2018. Archived from the original on 2019-08-10. Retrieved 2019-08-10.
  11. Ajita Kaura, Arpana Cour (1976). Directory of Indian Women Today, 1976. India International Publications. p. 361.
  12. "Basanti Devi College – History". Basanti Devi College. Archived from the original on 5 జూన్ 2017. Retrieved 12 January 2016.
  13. "Padma Awards: Year wise list of recipients (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. Archived from the original (PDF) on 15 November 2016. Retrieved 18 October 2015.
  14. Women on the March (in ఇంగ్లీష్). Smt. Mukul Banerjee for the Women's Front of All India Congress Committee. 1973.