బాంబే క్వాడ్రాంగులర్

బాంబే క్వాడ్రాంగులర్, 1892–93,1945–46 మధ్య బ్రిటిషు పాలనలో బొంబాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంటు.[1] వివిధ సమయాల్లో ఆడిన జట్ల సంఖ్యను బట్టి దీన్ని ప్రెసిడెన్సీ మ్యాచ్ (2 జట్లు) అని, బాంబే ట్రయాంగులర్ (3 జట్లు) అని, బాంబే క్వాడ్రాంగులర్ (4 జట్లు) అనీ, బాంబే పెంటాంగులర్ (5 జట్లు) అనీ అన్నారు.

ప్రెసిడెన్సీ మ్యాచ్

మార్చు

బాంబే జింఖానాలో సభ్యులైన యూరోపియన్లకు, జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్‌కు చెందిన పార్సీలకూ మధ్య జరిగిన వార్షిక మ్యాచ్‌ క్వాడ్రాంగులర్ టోర్నమెంటుకు మూలమైంది. 1877లో బాంబే జింఖానా, పార్సీల నుండి రెండు రోజుల మ్యాచ్ కోసం అభ్యర్థనను అంగీకరించినప్పుడు వారిమధ్య మొదటి గేమ్ జరిగింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం ద్వారా యూరోపియన్లను ఆశ్చర్యపరిచిన పార్సీలతో ఆట మంచి ఉత్సాహంతో జరిగింది. ఆ లోటు నుండి బాంబే జింఖానా కోలుకున్నప్పటికీ, ఇరు జట్లు సమంగా ఉండటంతో మ్యాచ్ డ్రా అయింది. 1878లో మళ్లీ ఆడారు. ఆ తరువాత అది వార్షిక పోటీగా మారింది. కానీ జాతిపరమైన అసంతృప్తి జోక్యం చేసుకుంది. 1879 నుండి 1883 వరకూ బొంబాయిలోని పార్సీలు, హిందువులు బాంబే మైదాన్ అనే పేరున్న మైదానాలను ఉపయోగించడంపై యూరోపియన్లకు వ్యతిరేకంగా పోరాడారు. జింఖానా సభ్యులు మైదానంలో పోలో ఆడతారు. అప్పుడు ఆ గుర్రాల గిట్టల వలన ఏర్పడిన గుంటల కారణంగా ఈ మైదానం చాలా వరకు క్రికెట్‌కు పనికిరాకుండా పోయింది. అయితే తాము మాత్రమే ఆడుకునే స్వంత క్రికెట్ మైదానంలో మాత్రం పోలో అడకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఈ వివాదం స్థానికులకు అనుకూలంగా పరిష్కారం కావడంతో, 1884లో యూరోపియన్లకు పార్సీలకూ మధ్య మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి.

1889 సంవత్సరపు ఆట పార్సీలకు చిరస్మరణీయమైనది. జింఖానాకు 53 పరుగుల విజయ లక్ష్యం విధించింది: పార్సీ కెప్టెన్ ME పావ్రీ బాగా బౌలింగ్ చేసి యూరోపియన్లను 50 పరుగులకే అవుట్ చేయడంలో దోహదపడ్డాడు. పార్సీలు రెండు పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నారు. 1892 – 93 నుండీ ఈ మ్యాచ్‌లకు ఫస్ట్ క్లాస్ హోదా ఇచ్చారు: 1892 ఆగస్టు 26 న బొంబాయి జింఖానాలో ప్రారంభమైన మ్యాచ్ భారతదేశంలోనే తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌.

1900 నాటికి, ప్రెసిడెన్సీ మ్యాచ్, బాంబే క్రికెట్ సీజన్‌లో హైలైట్‌గా మారింది. దాన్ని యూరోపియన్స్ వర్సెస్ పార్సీస్ గేమ్ అనేవారు. ఆ ఏడాది వరకు ఆడిన మొత్తం 19 మ్యాచ్‌లలో ఆడిన జట్లు చెరి ఎనిమిది ఆటలు గెలిచి మూడింటిని డ్రా చేసుకున్నాయి.

బాంబే ట్రయాంగులర్

మార్చు

యూరోపియన్లు, పార్సీలు క్రమం తప్పకుండా ఒకరితో ఒకరు ఆడుతుండగా, హిందూ జింఖానా స్వంతంగా నాణ్యమైన ఆటగాళ్లను సంపాదించుకుంది. 1906లో, హిందువులు పార్సీలను మ్యాచ్‌ ఆడదామని సవాలు చేశారు. అయితే క్లబ్‌ల మధ్య మతపరమైన విభేదాలు ఏర్పడడాన్ని దృష్టిలో ఉంచుకుని పార్సీలు ఆడేందుకు తిరస్కరించారు. బొంబాయి జింఖానా రంగంలోకి దిగి సవాలును స్వీకరించింది. ఆ ఫిబ్రవరిలో మొదటి యూరోపియన్స్ వర్సెస్ హిందువుల మ్యాచ్‌ జరిగింది. హిందూ జట్టు యూరోపియన్లపై 110 పరుగులతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. భారతదేశపు మొదటి గొప్ప స్పిన్ బౌలర్‌గా పరిగణించబడే పాల్వంకర్ బాలూ, బహుశా చమర్ కులానికి చెందిన తొలి వ్యక్తి[2] [3] [4] భారతీయ క్రీడా రంగంలో ప్రభావం చూపిన మొదటి వ్యక్తి అని హిందువులు గొప్పగా చెప్పుకున్నారు. అతని కులం కారణంగా అతన్ని జట్టు కెప్టెన్సీకి అనుమతించలేదు.[5] కానీ అతని తమ్ముడు పాల్వంకర్ విఠల్ 1923లో హిందువుల జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కుల వ్యతిరేకత నేపథ్యంలో పాల్వంకర్ సోదరులకు గుర్తింపు ఇవ్వాలనే ప్రచారం జరిగింది.

మరుసటి సంవత్సరం, 1907 లో, బాంబే, హిందూ జింఖానాలతో పాటు జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్‌కు చెందిన జట్టు కూడా చేరి ట్రయాంగులర్ టోర్నమెంటు మొదలైంది. 1907 నుండి 1911 వరకు ఈ టోర్నమెంటు సెప్టెంబరులో జరిగింది. పార్సీలు మూడుసార్లు, యూరపియన్లు రెండుసార్లు గెలిచారు.

బాంబే క్వాడ్రాంగులర్

మార్చు

1912లో, మహమ్మదీయ జింఖానాలోని ముస్లింలు అప్పటికి ప్రసిద్ధి పొందిన బాంబే టోర్నమెంటుకు ఆహ్వానించబడ్డారు. దీనిని క్వాడ్రాంగులర్‌గా మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం అంతటా ఈ టోర్నమెంటు జరిగింది. అయితే వర్షాకాలం చివరిలో వాతావరణం బాగోని కారణంగా 1916 వరకు ఆడిన ఆరు ఫైనల్‌లలో నాలుగింటిలో వర్షం కురిసింది. 1917లో, అటువంటి సమస్యలను నివారించడానికి క్వాడ్రాంగులర్‌ను నవంబరు/డిసెంబరుకు మార్చారు. 1917 టోర్నమెంటులో మరో మార్పు ఏమిటంటే మొదటిసారిగా న్యూట్రల్ అంపైర్‌లను ఉపయోగించడం. ఈ సీజన్ వరకు, బొంబాయి జింఖానా నియమించిన యూరోపియన్ అంపైరే ఎప్పుడూ పని చేసేవాడు. అయితే అప్పటి నుండి ఏ మ్యాచ్‌కైనా అంపైర్లు, పోటీ చేయని జట్లకు చెందినవారినే నియమిస్తారు. ప్రపంచ క్రికెట్‌లో న్యూట్రల్ అంపైర్ల మొదటి ఉపయోగాలలో ఇది ఒకటి.

క్వాడ్రాంగులర్, దాని ముందరి పోటీల కంటే బాగా ప్రాచుర్యం పొందింది. చాలా సంవత్సరాల పాటు బొంబాయి క్యాలెండరులో ఇది హైలైట్‌గా నిలిచింది. భారత స్వదేశీ పాలన కోసం మహాత్మా గాంధీ చేసిన ఉద్యమాల నేపథ్యంలో ఇది జరిగింది. గాంధీ, అతని అనుచరులు క్వాడ్రాంగులర్‌పై విమర్శలు చేశారు. ఈ టోర్నమెంటు బ్రిటిషు వలస పాలనపై భారతీయుల్లో ఉన్న వ్యతిరేకతను తొక్కిపెట్టేలా ఉందని భావించారు. భారత ఉపఖండంలో బ్రిటన్ ఉనికికి, అది చూపుతున్న సాంస్కృతిక ప్రభావాలకూ అది మద్దతు పలుకుతోందని భావించారు. పాఠశాల విద్యార్థిగా క్రికెట్ ఆడిన గాంధీ, క్రికెట్ టోర్నమెంటుకు వ్యతిరేకం కాదు. కానీ మతం ఆధారంగా జట్లను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించాడు. 1940 లో అతను, బొంబాయి క్రీడాకారులు తమ క్రీడా నియమావళిని సవరించుకోవాలని, దాని నుండి మతపరమైన మ్యాచ్‌లను తొలగించమనీ కోరినట్లు తెలిసింది. [6]

1921 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బొంబాయిని సందర్శించిన సందర్భంలో టోర్నమెంటు ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. అతని రాక బొంబాయిలో మూడు రోజుల రాజకీయ అల్లర్లకు దారితీసింది. కానీ టోర్నమెంటుకు అంతరాయం కలగలేదు. అల్లర్లు ముగిసిన తర్వాత, అతను ఫైనల్ మ్యాచ్ మొదటి రోజున హాజరయ్యాడు. యూరోపియన్ అనుకూల ప్రేక్షకుల నుండి స్వాగత కేరింతలను స్వీకరించాడు. చివరికి ఆ ఆటలో పార్సీలు బొంబాయి జింఖానాపై గెలవడాన్ని వీక్షించాడు.

1920 ల నాటికి జింఖానాలు, భారత ఉపఖండం నలుమూలల నుండి ఆటగాళ్లను నియమించుకున్నాయి. బాంబే క్వాడ్రాంగులర్‌ను భారతదేశంలో అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన క్రికెట్ టోర్నమెంటుగా మార్చారు. ఇది లాహోర్‌లోని ట్రయాంగులర్‌కు, నాగ్‌పూర్, కరాచీల్లోని క్వాడ్రాంగులర్‌లకు, ఇతర స్థానిక పోటీలకు కూడా ప్రేరకమైంది. ఈ ప్రాంతమంతటా క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందడానికి దారితీసింది. క్వాడ్రాంగులర్ జాతి కుల వివక్షల ఆరోపణలను పాక్షికంగా ఖండించినప్పటికీ, మతం గురించిన ప్రశ్న 1924 లో తలెత్తింది. హిందూ జింఖానా, తమ జట్టులో ఆడేందుకు మొదట్లో బెంగుళూరుకు చెందిన PA కణిక్కమ్‌కి ఆహ్వానం పంపింది. తర్వాత, ఆ ఆటగాడు హిందువు కాదని, క్రైస్తవుడనీ తెలుసుకుని తమ ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్నారు. యూరోపియన్లు భారతీయులను అంగీకరించకపోవడం, హిందువులు క్రైస్తవులను అంగీకరించకపోవడంతో, కణిక్కమ్‌కు టోర్నమెంటులో ఆడే మార్గం లేకుండా పోయింది.

1930లో, శాసనోల్లంఘన ఉద్యమంలో, 60,000 మంది భారతీయులు అరెస్టయ్యారు. ఉప్పు సత్యాగ్రహంతో గాంధీ చేస్తున్న ఉద్యమం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ రాజకీయ గందరగోళం మధ్య, క్వాడ్రాంగులర్ టోర్నమెంటును రద్దు చేసారు. మళ్లీ 1934 వరకు దీన్ని నిర్వహించలేదు. క్రికెట్ ఆకలితో ఉన్న ప్రజలు దాని పునరుద్ధరణకు ఉత్సాహంగా మద్దతు ఇచ్చారు. 1935 లో జాతీయవాద పత్రిక బాంబే క్రానికల్ లో స్పోర్ట్స్ ఎడిటర్, JC మైత్రా, జాతి మతపరమైన భావాలను తొలగించడం కోసం, క్వాడ్రాంగులర్‌ స్థానంలో భౌగోళిక-జోన్-ఆధారిత టోర్నమెంటు జరపాలని సూచించాడు. మరొక వార్తాపత్రిక ప్రతినిధి, భారతీయ క్రైస్తవుల కోసం కూడా ఒక జట్టు ఉండేలా ఈ టోర్నమెంటును పెంటాంగులర్‌గా విస్తరించాలని వాదించాడు. అయితే ప్రజలు సాంప్రదాయిక ఆకృతిని అలాగే ఉంచాలని గట్టిగా డిమాండ్ చేయడంతో ఆ సూచనలను పక్కనపెట్టారు.

బాంబే పెంటాంగులర్

మార్చు

చివరగా, 1937లో, ది రెస్ట్ అని పిలువబడే ఐదవ జట్టు టోర్నమెంటులో ప్రవేశించింది. ఇందులో బౌద్ధులు, యూదులు, భారతీయ క్రైస్తవులు ఉన్నారు. కొన్ని అరుదైన సందర్భాల్లో, సిలోన్ నుండి కూడా ఆటగాళ్ళు ఆ జట్టులో చేరి ఆడారు. వారిలో ఒక హిందువు కూడా ఉన్నారు. అయితే, మొదటి పెంటాంగులర్ పోటీలో నాలుగు జట్లే ఆడాయి. ఎందుకంటే కొత్తగా నిర్మించిన బ్రాబోర్న్ స్టేడియంలో తమకు న్యాయమైన సీట్లను కేటాయించనందుకు నిరసనగా హిందువులు పోటీ నుండి ఉపసంహరించుకున్నారు.

1938 నుండి, పెంటాంగులర్ జట్ల కూర్పులో అంతర్లీనంగా మతతత్వం ఉన్నందున, అది ప్రజల్లో విభజన తెస్తోంది అంటూ విమర్శలు వచ్చాయి. స్వాతంత్ర్యం కోసం రాజకీయ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో, ఐక్యత అవసరమైన ఆ సమయంలో అందుకు విరుద్ధంగా ఈ పోటీలు ఉన్నాయన్న విమర్శలు తీవ్రమయ్యాయి. చివరికి, దేశమంతటా జరిగిన అల్లర్లు, రాజకీయ అశాంతి నేపథ్యంలో, కొత్తగా ఏర్పడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 1946లో పెంటాంగులర్ టోర్నమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జోనల్ పోటీగా రంజీ ట్రోఫీని మొదలుపెట్టారు. దీనిలో భారతదేశం నలుమూలల నుండి ప్రాంతీయ జట్లు పోటీపడతాయి. ఇది భారతదేశపు ప్రముఖ క్రికెట్ పోటీగా పేరుపొందింది.

టోర్నమెంటు విజేతలు

మార్చు

బాంబే ప్రెసిడెన్సీ విజేతలు

మార్చు
  • 1892-93 – పార్సీలు
  • 1893-94 – యూరోపియన్లు
  • 1894-95 – యూరోపియన్లు పార్సీలతో పంచుకున్నారు
  • 1895-96 – యూరోపియన్లు పార్సీలతో పంచుకున్నారు
  • 1896-97 – యూరోపియన్లు
  • 1897-98 – పార్సీలు
  • 1898-99 – యూరోపియన్లు
  • 1899-1900 – యూరోపియన్లు పార్సీలతో పంచుకున్నారు
  • 1900-01 – పార్సీలు
  • 1901-02 – యూరోపియన్లు పార్సీలతో పంచుకున్నారు
  • 1902-03 – యూరోపియన్లు పార్సీలతో పంచుకున్నారు
  • 1903-04 – పార్సీలు
  • 1904-05 – పార్సీలు
  • 1905-06 – హిందువులు పార్సీలతో పంచుకున్నారు
  • 1906-07 – హిందువులు

బాంబే ట్రయాంగులర్ విజేతలు

మార్చు
  • 1907-08 – హిందువులు
  • 1908-09 – హిందువులు
  • 1909-10 – హిందువులు
  • 1910-11 – హిందువులు
  • 1911-12 – హిందువులు

బాంబే క్వాడ్రాంగులర్ విజేతలు

మార్చు
  • 1912-13 – పార్సీలు
  • 1913-14 – హిందువులు ముస్లింలతో పంచుకున్నారు
  • 1914-15 – హిందువులు పార్సీలతో పంచుకున్నారు
  • 1915-16 – యూరోపియన్లు
  • 1916-17 – యూరోపియన్లు పార్సీలతో పంచుకున్నారు
  • 1917-18 – హిందువులు పార్సీలతో పంచుకున్నారు
  • 1918-19 – యూరోపియన్లు
  • 1919-20 – హిందువులు
  • 1920-21 – హిందువులు, పార్సీలు పంచుకున్నారు
  • 1921-22 – యూరోపియన్లు
  • 1922-23 – పార్సీలు
  • 1923-24 – హిందువులు
  • 1924-25 – ముస్లింలు
  • 1925-26 – హిందువులు
  • 1926-27 – హిందువులు
  • 1927-28 – యూరోపియన్లు
  • 1928-29 – పార్సీలు
  • 1929-30 – హిందువులు
  • 1930-31 – పోటీ జరగలేదు
  • 1931-32 – పోటీ జరగలేదు
  • 1932-33 – పోటీ జరగలేదు
  • 1933-34 – పోటీ జరగలేదు
  • 1934-35 – ముస్లింలు
  • 1935-36 – ముస్లింలు
  • 1936-37 – హిందువులు

బాంబే పెంటాంగులర్ విజేతలు

మార్చు
  • 1937-38 – ముస్లింలు
  • 1938-39 – ముస్లింలు
  • 1939-40 – హిందువులు
  • 1940-41 – ముస్లింలు
  • 1941-42 – హిందువులు
  • 1942-43 – పోటీ చేయలేదు
  • 1943-44 – హిందువులు
  • 1944-45 – ముస్లింలు
  • 1945-46 – హిందువులు

మూలాలు

మార్చు
  1. Kazi, Abid Ali (24 December 2015). "History of First Class Cricket |".
  2. Kidambi, Prashant (2019). Cricket Country: An Indian Odyssey in the Age of Empire (in ఇంగ్లీష్). Oxford University Press. ISBN 978-0-19-884313-9.
  3. Rajan, Vithal (2011-12-12). Holmes of the Raj (in ఇంగ్లీష్). Random House India. ISBN 978-81-8400-250-8.
  4. Menon, Dilip M. (2006). Cultural History of Modern India (in ఇంగ్లీష్). Berghahn Books. ISBN 978-81-87358-25-1.
  5. Dhrubo Jyoti (16 September 2018). "India's first Dalit cricketer Palwankar Baloo fought against caste barriers on the field and off it". Hindustan Times. Retrieved 9 October 2021.
  6. Ramachandra Guha (30 September 2001). "Gandhi and cricket". The Hindu. Archived from the original on 11 October 2006. Retrieved 25 October 2006.{{cite news}}: CS1 maint: unfit URL (link)