బాబ్రీ మసీదు కూల్చివేత

(బాబ్రీ మసీదు విధ్వంసం నుండి దారిమార్పు చెందింది)

అయోధ్య వివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద యెత్తున చేరి 1992 డిసెంబరు 6 న బాబ్రీ మసీదును కూల్చివేసారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన రాజకీయ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో, ఉత్తర ప్రదేశ్‌, అయోధ్య నగరంలోని 16 వ శతాబ్దపు బాబ్రీ మసీదు వారి లక్ష్యంగా మారింది. అప్పటికే సంవత్సరాలుగా వివాదం జరుగుతున్న ప్రదేశం కావడం, కొద్ది నెలలుగా మత ఘర్షణలు జరుగుతూండడం వంటివి ఈ సంఘటనకు నేపథ్యం.

బాబ్రీ మసీదు కూల్చివేత
Ayodhya is located in India
Ayodhya
Ayodhya
Ayodhya (India)
ప్రదేశంఅయోధ్య, భారతదేశం
తేదీ1992 డిసెంబరు 6
లక్ష్యంబాబ్రీ మసీదు
దాడి రకం
అల్లర్లు
మరణాలు2,000 (including ensuing riots)[1]
నేరస్తులుభాజపా, విశ్వ హిందూ పరిషత్తులకు చెందిన కరసేవకులు

హిందూ విశ్వాసాల ప్రకారం, అయోధ్య నగరం శ్రీరాముడి జన్మస్థలం. 16 వ శతాబ్దంలో మొగలు జనరల్ మీర్ బాకి, కొంతమంది హిందువులు రాముడి జన్మస్థలం అని భావించే ప్రదేశంలో బాబ్రీ మసీదు అనే పేరుతో ఒక మసీదును నిర్మించాడు. ఈ మసీదును, గతంలో ఇస్లామేతర నిర్మాణం ఉన్న స్థలం లోనే నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది.[2][3] 1980 వ దశకంలో, విశ్వ హిందూ పరిషత్ (విహింప) ఈ ప్రదేశంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. భారతీయ జనతా పార్టీ (భాజపా) దానికి రాజకీయంగా గొంతు కలిపింది. ఈ ఉద్యమంలో భాగంగా ఎల్‌కె అద్వానీ చేసిన రామ ‌రథ‌యాత్రతో సహా పలు ప్రదర్శనలు, కవాతులూ జరిగాయి.

1992 డిసెంబరు 6 న భాజపాలు ఈ మసీదు వద్ద 1,50,000 మంది కరసేవకులతో ఒక ప్రదర్శన జరిపాయి. ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ప్రదర్శనకారులు పోలీసులను పక్కకు నెట్టేసి, మసీదును కూలదోసారు. ఈ సంఘటనపై జరిపిన దర్యాప్తులో 68 మందిని దీనికి బాధ్యులుగా గుర్తించారు.వీరిలో అనేకమంది విహింప, భాజపా నాయకులు ఉన్నారు. ఈ మసీదు కూల్చివేత తరువాత అనేక నెలల పాటు దేశంలో హిందూ, ముస్లిముల మధ్య మతకలహాలు జరిగాయి .వీటిలో సుమారుగా 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాను, బంగ్లాదేశ్‌లలో హిందువులపై ప్రతీకార దాడులు జరిగాయి.

నేపథ్యం

మార్చు

"రామ జన్మభూమి" అని పిలిచే రాముడి జన్మస్థలాన్ని పవిత్ర ప్రదేశంగా హిందువులు పరిగణిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లోని [4][5] 1528 లో, ఈ ప్రాంతాన్ని మొగలులు ఆక్రమించుకున్న తరువాత, మొగలు సేనాధిపతి మీర్ బాకి ఈ స్థలంలో ఒక మసీదును నిర్మించాడు. మొగలు చక్రవర్తి బాబర్ పేరు మీద దీనికి "బాబ్రీ మసీదు" అని పేరు పెట్టాడు.[6][7][a] మసీదు నిర్మించడం కోసం రాముడి ఆలయాన్ని కూల్చివేసారని ప్రజాబాహుళంలో నమ్మకం ఉంది; ఈ నమ్మకానికి చారిత్రక ఆధారం చర్చనీయం. మసీదుకు ముందు ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉండేదని చెప్పే పురావస్తు ఆధారాలు కనుగొన్నారు. ఈ నిర్మాణం హిందూ దేవాలయమనీ, బౌద్ధ నిర్మాణమనీ వివిధ రకాలుగా భావించారు.

కనీసం నాలుగు శతాబ్దాలుగా, ఈ స్థలాన్ని హిందువులు ముస్లింలు మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించారు. మసీదు నిర్మించిన స్థలంలో ఆలయం ఉండేదని తొలిసారి 1822 లో ఫైజాబాద్ కోర్టు అధికారి ఒకరు చెప్పాడు. నిర్మోహి అఖాడా విభాగం ఈ ప్రకటనను ఆధారంగా చూపిస్తూ 19 వ శతాబ్దపు తరువాతి కాలంలో ఒక దావా వేసింది. ఇది 1855 లో ఈ ప్రదేశంలో జరిగిన మొట్టమొదటి మత కలహాలకు దారితీసింది.[8] 1859 లో బ్రిటిషు పాలకులు వివాదాలను నివారించడానికి మసీదు బయటి ప్రాంగణాన్ని వేరు చేయడానికి ఒక కంచె‌ను ఏర్పాటు చేసింది. 1949 వరకు ఈ స్థితి ఇలాగే కొనసాగింది. 1949 లో రామ విగ్రహాలను ఎవరూ చూడకుండా మసీదు లోపల పెట్టారు. హిందూ మహాసభ స్వచ్ఛంద సేవకులు ఈ పని చేసారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై గందరగోళం చెలరేగింది. ఆ స్థలం మాదంటే మాదంటూ ఇరు పక్షాలూ కోర్టులో సివిల్ కేసులు దాఖలు చేసాయి. విగ్రహాలను లోపల ఉంచడాన్ని మసీదును అపవిత్రం చెయ్యడంగా ముస్లిములు భావించారు. ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పదంగా ప్రకటించి, మసీదు గేటుకు తాళం వేసింది.[9][10]

ఈ స్థలంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలంటూ 1980 వ దశకంలో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) ఒక ఉద్యమం చేపట్టింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) దానికి రాజకీయ స్వరమిచ్చింది.[11] తాళాలు వేసిన గేట్లు తెరిపించి, అక్కడ హిందువులను పూజలు చేసుకోనివ్వాలని 1986 లో జిల్లా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో ఉద్యమానికి బలం చేకూరింది. షా బానో వివాదంపై తాను కోల్పోయిన హిందువుల మద్దతును తిరిగి పొందాలని భావించిన భారత జాతీయ కాంగ్రెసు నాయకుడు, అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఈ నిర్ణయానికి మద్దతు పలికాడు. 1989 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు ఓడిపోయింది, పార్లమెంటులో బిజెపి బలం 2 నుండి 88 కి పెరిగింది, వి.పి.సింగ్ ప్రభుత్వానికి భాజపా మద్దతు కీలకమైన పరిస్థితి ఏర్పడింది.[7][12]

1990 సెప్టెంబరులో, బిజెపి నాయకుడు ఎల్.కె.అద్వానీ ఒక రథయాత్రను ప్రారంభించాడు. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో పర్యటించి ఈ రాజకీయ యాత్ర, అయోధ్యకు చేరింది. ప్రతిపాదిత రామాలయానికి మద్దతు సమీకరించడం, ముస్లిం వ్యతిరేక భావనలను రేకెత్తించి హిందూ ఓట్లను ఏకం చేయడం ఈ యాత్ర ఉద్దేశం.[13] అద్వానీ అయోధ్య చేరుకోక ముందే బీహార్ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది. అయినప్పటికీ, కర సేవకులు, సంఘ్ పరివార్ కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుని మసీదుపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దీని ఫలితంగా పారామిలిటరీ దళాలతో పోరాటం జరిగి, అనేకమంది కర సేవకుల మరణంతో ముగిసింది. 1990 అక్టోబరు 23 న భాజపా, వి.పి.సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. తాజాగా ఎన్నికలు జరపల్సిన పరిస్థితి ఏర్పడింది. 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని, అతి పెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. ప్రధాన ప్రతిపక్షంగా మారింది. కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వంగా పాలన కొసాగించింది. భాజపా ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సాధించింది.

కూల్చివేత

మార్చు

1992 డిసెంబరు 6 న, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు వివాదాస్పద నిర్మాణం జరిగిన ప్రదేశంలో 1,50,000 మంది విహెచ్‌పి, బిజెపి కర సేవకులతో ర్యాలీని నిర్వహించాయి. ఈ వేడుకలలో బిజెపి నాయకులైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలు ప్రసంగించారు.[14] ర్యాలీ మొదటి కొన్ని గంటలలో, జనంలో అసహనం క్రమంగా పెరుగుతూ పోయి, నినాదాలు చేయడం ప్రారంభించారు. దాడిని ఎదుర్కొనేందుకు సన్నాహకంగా నిర్మాణం చుట్టూ పోలీసు రక్షణ వలయం ఏర్పరచారు. అయినా, మధ్యాహ్నం సమయంలో, ఒక యువకుడు ఒక కాషాయ జెండాను మోసుకుంటూ, పోలీసు రక్షణ వలయాన్ని దాటి, నిర్మాణాన్ని అధిరోహించగలిగాడు. ఇది జనసమూహానికి ఒక సంకేతమైంది. వాళ్ళు నిర్మాణాన్ని చుట్టుముట్టారు. ఈ స్థాయి దాడికి సిద్ధంగా లేని పోలీసులు అక్కడినుండి పారిపోయారు. జనసందోహం గొడ్డళ్ళు, సుత్తులు, కొక్కేలతో సహా భవనం పైకి ఎక్కారు. కొన్ని గంటల్లోనే, మట్టి సుద్దతో తయారైన నిర్మాణాన్ని కూల్చేసారు.[15][16]

జస్టిస్ మన్మోహన్ సింగ్ లీబెర్హాన్ సమర్పించిన 2009 నాటి నివేదిక, మసీదు కూల్చివేతకు 68 మంది కారణమని తేల్చింది. వీరిలో ఎక్కువమంది బిజెపి నాయకులే. వారిలో పేరుపొందిన వారు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విజయ్ రాజే సింధియా ఉన్నారు. అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ కూడా ఈ నివేదికలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. గత పనితీరు ప్రకారం మసీదు కూల్చివేత సమయంలో మౌనంగా ఉంటారని అనుకున్న బ్యూరోక్రాట్లను పోలీసు అధికారులనే అతను అయోధ్యలో నియమించాడని లీబర్హాన్ తన నివేదికలో రాశాడు.[17] ఆ రోజు అద్వానీ భద్రతకు బాధ్యత వహించిన పోలీసు అధికారి అంజు గుప్తా, అద్వానీ, జోషిలు చేసిన ప్రసంగాలు జన సమూహ ప్రవర్తనను రెచ్చగొట్టడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.[18] ఈ సమయంలో పలువురు బిజెపి నాయకులు "కర సేవకులను దిగి రమ్మని పేలవమైన అభ్యర్ధనలు చేసారు ... అవి నిజమైనవి కావచ్చు, లేదా మీడియా వాళ్ళ ముందు చేసే నటన కావచ్చు" అని నివేదిక పేర్కొంది. గర్భగుడిలోకి ప్రవేశించవద్దని గాని, నిర్మాణాన్ని పడగొట్టవద్దని గానీ కర సేవకులకు ఎవరూ విజ్ఞప్తి చేయలేదు. కూల్చివేతకు పత్రిక వాళ్ళు, మీడియా వారు అనుకూలంగానే వ్యవహరించారు" అని నివేదిక పేర్కొంది.[19]

కుట్ర ఆరోపణలు

మార్చు

మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ మలోయ్ కృష్ణ ధర్ 2005 మార్చిలో రాసిన పుస్తకంలో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ("ఆర్ఎస్ఎస్"), బిజెపి, విహెచ్పి అగ్ర నాయకులు బాబ్రీ మసీదు కూల్చివేతకు 10 నెలల ముందుగానే ప్రణాళిక వేసినట్లు పేర్కొన్నాడు. అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఈ సమస్యతో వ్యవహరించిన పద్ధతినీ విమర్శించాడు. బిజెపికి చెందిన వ్యక్తులు సంఘ్ పరివార్ లోని వివిధ సంస్థలకూ మధ్య జరిగే సమావేశానికి భద్రత ఏర్పాట్లు చేయమని తనను ఆదేశించినట్లు అతడు పేర్కొన్నాడు. "వారు (ఆర్ఎస్ఎస్, బిజెపి, విహెచ్పి) రాబోయే నెలల్లో హిందుత్వ దాడికి బ్లూప్రింటును రూపొందించారని, 1992 డిసెంబరులో అయోధ్యలో చెయ్యబోయే ప్రళయ నాట్యానికి రూపకల్పన చేశారని ఆ సమావేశంతో నిర్ధారణైపోయింది. సమావేశంలో హాజరైన ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, విహెచ్‌పి బజరంగ్ దళ్ నాయకులు పరస్పరం చక్కటి సమన్వయంతో పనిచేయాలని అంగీకరించారు". ఆ సమావేశం టేపులను తాను వ్యక్తిగతంగా తన పై అధికారికి అప్పగించాననీ, అతడు వాటిని ప్రధానమంత్రి (రావు)కి, హోంమంత్రి (శంకరావు చవాన్) కీ ఇచ్చాడనడంలో సందేహం లేదనీ అతను నొక్కిచెప్పాడు. "రాజకీయ ప్రయోజనం పొందటానికీ హిందుత్వ తరంగాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లడానికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని" అయోధ్య అంశం ఇచ్చిందనే విషయంలో ఒక నిశ్శబ్ద ఒప్పందం ఉందని రచయిత పేర్కొన్నాడు.[20]

2014 ఏప్రిల్‌లో కోబ్రాపోస్ట్ చేసిన ఒక స్టింగ్ ఆపరేషను, కూల్చివేత ఉన్మాద ముఠా చర్య కాదనీ ఏ ప్రభుత్వ సంస్థకు కూడా దాని వాసన కూడా తగలనంత రహస్యంగా ప్రణాళిక చేసిన విధ్వంసక చర్య అని పేర్కొంది. ఈ విధ్వంసానికి విశ్వ హిందూ పరిషత్, శివసేన చాలా నెలల ముందుగానే ప్రణాళిక వేసాయి, అయితే అవి విడివిడిగా ప్లాను చేసుకున్నాయి.[21]

పర్యవసానాలు

మార్చు

మత హింస

మార్చు

బాబ్రీ మసీదు విధ్వంసం దేశవ్యాప్తంగా ముస్లిముల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అనేక నెలల పాటు జరిగిన మతకలహాల్లో హిందువులు ముస్లింలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇళ్ళు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలను తగలబెట్టారు, దోచుకున్నారు. పలువురు బిజెపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు, వీహెచ్‌పీని కొంతకాలం ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ, అల్లర్లు ముంబై, సూరత్, అహ్మదాబాద్, కాన్పూర్, ఢీల్లీ, భోపాల్ అనేక ఇతర నగరాలకు వ్యాపించాయి. సుమారుగా 2,000 మందికి పైగా - ప్రధానంగా ముస్లికులు - మరణించారు. ఒక్క ముంబై అల్లర్ల లోనే సుమారు 900 మంది మరణించారు. సుమారు, 9,000 కోట్ల ఆస్తి నష్టం కలిగిందని అంచనా వేసారు.[22][23][24] 1992 డిసెంబరు - 1993 జనవరిల్లో జరిగిన ఈ అల్లర్లలో శివసేన పెద్ద పాత్ర పోషించింది. 1993 ముంబై బాంబు దాడులకు, ఆ తరువాతి దశాబ్దంలో జరిగిన అనేక అల్లర్లకూ వెనుక ఉన్న ప్రధాన కారకాలు ఈ కూల్చివేత, ఆ తరువాత జరిగిన అల్లర్లే.[25] భారతీయ ముజాహిదీన్లతో సహా జిహాదీ గ్రూపులు తమ ఉగ్రవాద దాడులకు బాబ్రీ మసీదును కూల్చివేయడం ఒక కారణమని పేర్కొన్నాయి.[26][27]

దర్యాప్తు

మార్చు

మసీదు కూల్చివేత సంఘటనను దర్యాప్తు చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, 1992 డిసెంబరు 16 న విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఎం. ఎస్. లీబెర్హాన్ నేతృత్వంలో లీబర్హాన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పదహారు సంవత్సరాలలో 399 సిట్టింగ్ల తరువాత, కమిషన్ తన 1,029 పేజీల నివేదికను 2009 జూన్ 30 న భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు సమర్పించింది.[28] ఈ నివేదిక, 1992 డిసెంబరు 6 న అయోధ్యలో జరిగిన సంఘటనలు "ఆకస్మికంగా జరిగినవేమీ కావు, ఓ ప్రణాళిక లేకుండా జరిగినవీ కావు" అని పేర్కొంది.[29] బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, సిబిఐ ఎల్. కె. అద్వానీ రాజనాథ్ సింగ్ లతో సహా సీనియర్ బిజెపి నాయకులపై ఉన్న కుట్ర ఆరోపణలపై దర్యాప్తును కొనసాగించదని ఆరోపిస్తూ వేసిన పిటిషన్ను 2015 మార్చిలో, సుప్రీంకోర్టు స్వీకరించింది.[30] అప్పీల్ దాఖలు చేయడంలో ఆలస్యాన్ని వివరించాలని కోర్టు సిబిఐని కోరింది.[31][32] 2017 ఏప్రిల్‌లో ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు, అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కటియార్ లతో పాటు అనేకమందిపై నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసింది.[33] 2020 సెప్టెంబరు 30 న 32 మంది నిందితులను, సరైన సాక్ష్యాలు లేనందున నేరవిముక్తులను చేసింది. వారిలో ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కటియార్ మొదలైన వారు ఉన్నారు.[34] ప్రత్యేక్ కోర్టు జడ్జి, "ఈ కూల్చివేత ముందే అనుకుని చేసినది కదు" అని వ్యాఖ్యానించారు.[35]

అంతర్జాతీయ ప్రతిచర్యలు

మార్చు

పాకిస్తాన్

మార్చు
 
అయోధ్య నగరం

బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా పాకిస్తాన్ ప్రభుత్వం, డిసెంబరు 7న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలను మూసేసింది..[36] పాకిస్తాను విదేశాంగ శాఖ, పాకిస్తాన్ లోని భారత రాయబారిని పిలిపించుకుని లాంఛనంగా తన నిరసనను తెలియజేసింది. భారత్‌లో ముస్లిముల హక్కుల రక్షణ పట్ల వత్తిడి తెచ్చేందుకు గాను, ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్సుకూ తీసుకువెళ్తానని ప్రకటించింది.[36] దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగాయి, ముస్లిం గుంపులు ఒకే రోజు 30 దేవాలయాలను నిప్పు పెట్టీ, బుల్డోజర్ల ద్వారా దాడి చేసీ నాశనం చేశాయి. లాహోర్లోని భారతదేశ జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కార్యాలయంపై దాడిచేసారు.[37] భారతదేశాన్ని, హిందూ మతాన్నీ నాశనం చేయాలని దాడులు చేసే గుంపులు నినదించాయి. ఇస్లామాబాద్‌లోని కైద్-ఇ-ఆజమ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు అప్పటి భారత ప్రధాని పి.వి. నరసింహారావు, హిందువులకు వ్యతిరేకంగా "జిహాద్" కొరకు పిలుపు నిచ్చారు.[38] ఆ తరువాతి సంవత్సరాలలో భారతదేశాన్ని సందర్శించగోరిన వేలాది హిందువులు మరింత దీర్ఘ కాలిక వీసాలు కావాలని కోరారు. కొందరు భారత పౌరసత్వం కావాలని కోరారు. కూల్చివేత అనంతర కాలంలో వారిపై పెచ్చుమీరిన వేధింపులు, వివక్షలే ఇందుకు కారణం.[39]

బంగ్లాదేశ్

మార్చు

కూల్చివేత తరువాత, బంగ్లాదేశ్లోని ముస్లిం ముఠాలు దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలు, దుకాణాలు ఇళ్ళపై దాడి చేసి తగలబెట్టారు.[40] దేశ రాజధాని ఢాకాలోని బంగబందు నేషనల్ స్టేడియంపై 5,000 మంది గుంపు దాడి చేయడానికి ప్రయత్నించినపుడు భారత-బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ ఆగిపోయింది. ఎయిర్ ఇండియా ఢాకా కార్యాలయాన్ని నాశనం చేసారు. 10 మంది మరణించారు, 11 హిందూ దేవాలయాలు, అనేక గృహాలూ ధ్వంసమయ్యాయి.[40][41] హింస తరువాత బంగ్లాదేశ్ హిందూ సమాజం 1993 లో జరపతలపెట్టిన దుర్గా పూజ వేడుకలను తగ్గించుకోవలసి వచ్చింది. ధ్వంసమైన దేవాలయాలకు మరమ్మతులు చేయాలని దారుణాలపై దర్యాప్తు జరపాలని కోరారు.

మధ్యప్రాచ్యం

మార్చు

అబుధాబీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) బాబ్రీ మసీదు కూల్చివేతను తీవ్రంగా ఖండించింది. ఈ చర్య "ముస్లిం పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా చేసిన నేరం"గా అభివర్ణిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని సభ్య దేశాలలో సౌదీ అరేబియా, ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. భారతీయులు పాకిస్తానీయులూ కూడా పెద్ద సంఖ్యలో ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మరింత మితమైన ప్రతిచర్యను తెలియజేసింది. భారత ప్రభుత్వం తన ప్రతిస్పందనలో జిసిసిని తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని విమర్శించింది. అయతొల్లా అలీ ఖమేనీ కూల్చివేతను ఖండించాడు, ముస్లిం జనాభాను కాపాడటానికి భారతదేశం మరింత కృషి చేయాలని పిలుపునిచ్చాడు. ఈ సంఘటనలను యుఎఇ ప్రభుత్వం ఖండించినప్పటికీ, దేశంలో అనేక ఘర్షణలు జరిగాయి. వీధివీధినా నిరసనలు జరిగాయి.

మూలాలు

మార్చు
  1. "Timeline: Ayodhya holy site crisis". BBC News. 17 October 2003.
  2. "Babri Masjid not built on vacant land, artefacts reveal non-Islamic structure: Supreme Court".
  3. "Supreme Court judgment on Ayodhya ends several speculation: ASI team chief".
  4. Sharma, Ram Sharan (2003). "The Ayodhya Issue". In Layton, Robert; Thomas, Julian (eds.). Destruction and Conservation of Cultural Property. Routledge. pp. 127–137. ISBN 9781134604982.
  5. Gopal, Sarvepalli; Thapar, Romila; Chandra, Bipan; Bhattacharya, Sabyasachi; Jaiswal, Suvira; Mukhia, Harbans; Panikkar, K. N.; Champakalakshmi, R.; Saberwal, Satish; Chattopadhyaya, B. D.; Verma, R. N.; Meenakshi, K.; Alam, Muzaffar; Singh, Dilbagh; Mukherjee, Mridula; Palat, Madhavan; Mukherjee, Aditya; Ratnagar, S. F.; Bhattacharya, Neeladri; Trivedi, K. K.; Sharma, Yogesh; Chakravarti, Kunal; Josh, Bhagwan; Gurukkal, Rajan; Ray, Himanshu (January 1990). "The Political Abuse of History: Babri Masjid-Rama Janmabhumi Dispute". Social Scientist. 18 (1): 76–81. doi:10.2307/3517330. JSTOR 3517330.
  6. Avari, Burjor (2013). Islamic Civilization in South Asia: A History of Muslim Power and Presence in the Indian Subcontinent. Routledge. pp. 231, 247. ISBN 9780415580618.
  7. 7.0 7.1 Udayakumar, S.P. (August 1997). "Historicizing Myth and Mythologizing History: The 'Ram Temple' Drama". Social Scientist. 25 (7): 11–26. doi:10.2307/3517601. JSTOR 3517601.
  8. Veer, Peter van der. (1994). Religious nationalism : Hindus and Muslims in India. Berkeley, CA: University of California Press. p. 153. ISBN 052091368X. OCLC 44966053.
  9. Udayakumar, S.P. (August 1997). "Historicizing Myth and Mythologizing History: The 'Ram Temple' Drama". Social Scientist. 25 (7): 11–26. doi:10.2307/3517601. JSTOR 3517601.
  10. "Timeline: Ayodhya holy site crisis". BBC News. Retrieved 19 March 2014.
  11. "Babri mosque case: BJP MP declared absconder". The Times of India. 2014-07-22. Retrieved 2014-08-18.
  12. Guha, Ramachandra (2007). India After Gandhi. MacMillan. pp. 633–659.
  13. Jaffrelot, Christophe (2009). "The Hindu nationalist reinterpretation of pilgrimage in India: the limits of Yatra politics". Nations and Nationalism. 15 (1): 1–19. doi:10.1111/j.1469-8129.2009.00364.x.
  14. Tully, Mark (5 December 2002). "Tearing down the Babri Masjid". BBC News. Retrieved 29 September 2010.
  15. Guha, Ramachandra (2007). India After Gandhi. MacMillan. pp. 582–598.
  16. "Report: Sequence of events on December 6". Ndtv.com. Retrieved 20 June 2012.
  17. "Uproar over India mosque report: Inquiry into Babri mosque's demolition in 1992 indicts opposition BJP leaders". Al Jazeera. 24 November 2009. Retrieved 8 July 2014.
  18. Venkatesan, V. (16 July 2005). "In the dock, again". Frontline. 22 (15).
  19. "Report: Sequence of events on December 6". NDTV. 23 November 2009. Retrieved 2011-12-05.
  20. "Babri Masjid demolition was planned 10 months in advance: Book". Press Trust of India. 30 January 2005. Archived from the original on 14 June 2012. Retrieved 5 December 2011.
  21. "Babri Masjid demolition was well-planned in ahead: Cobrapost sting". IANS. news.biharprabha.com. Retrieved 4 April 2014.
  22. Gort, Jerald D.; Henry Jansen; H. M. Vroom (2002). Religion, conflict and reconciliation: multifaith ideals and realities. Rodopi. p. 248. ISBN 90-420-1460-1.
  23. ERCES Online Quarterly Review Archived 10 జూలై 2011 at the Wayback Machine Religious Identity of the Perpetrators and Victims of Communal Violence in Post-Independence India
  24. Steven I. Wilkinson (2006). Votes and Violence: Electoral Competition and Ethnic Riots in India. Cambridge University Press. p. 14. ISBN 0-521-53605-7.
  25. Gilly, Thomas Albert; Yakov Gilinskiy; Vladimir A. Sergevnin (2009). The Ethics of Terrorism: Innovative Approaches from an International Perspective. Charles C Thomas. p. 27. ISBN 978-0-398-07867-6.
  26. Raman, B. (9 December 2010). "The Latest 'Indian Mujahideen Mail'". Outlook India. Retrieved 2011-12-05.
  27. Sinha, Amitabh (2008-09-14). "Blast a revenge for Babri". Indian Express. Retrieved 2011-12-05.
  28. NDTV correspondent (23 November 2009). "What is the Liberhan Commission?". NDTV India. Retrieved 29 September 2010.
  29. "India Babri Masjid demolition neither spontaneous nor unplanned: Liberhan". Hindustan Times. 24 November 2009. Archived from the original on 3 January 2013.
  30. Ashraf, Ajaz. "In the times of Yakub Memon, remembering the Babri Masjid demolition cases". Scroll.in.
  31. Babri Masjid demolition: Supreme Court to hear plea claiming CBI may go soft on L K Advani, Indian Express, 31 March 2015.
  32. Babri Masjid case: SC issues notices to L K Advani, others over conspiracy charges, Indian Express, 31 March 2015.
  33. Rashid, Omar (30 May 2017). "Babri case: Advani, Joshi, Bharti charged with criminal conspiracy". The Hindu. Retrieved 26 January 2019.
  34. "Babri Masjid verdict: Court acquits LK Advani, Kalyan Singh, says no evidence that accused planned demolition". www.timesnownews.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-30.
  35. "Babri Masjid demolition case: CBI Special Court acquits all accused, judge says 'demolition was not pre-planned'". Business Insider. Retrieved 2020-09-30.
  36. 36.0 36.1 "PAKISTANIS ATTACK 30 HINDU TEMPLES". New York Times. 1992-12-07. Retrieved 2011-04-15.
  37. "PAKISTANIS ATTACK 30 HINDU TEMPLES". New York Times. 1992-12-07. Retrieved 2011-04-15.
  38. "Pakistani Hindus in India unwilling to return". Deccan Herald. Retrieved 2011-04-15.
  39. "Pakistani Hindus in India unwilling to return". Deccan Herald. Retrieved 2011-04-15.
  40. 40.0 40.1 "Chronology for Hindus in Bangladesh". UNHCR. Archived from the original on 2012-10-14. Retrieved 2011-04-15.
  41. Minorities at Risk Project (2004). "Chronology for Hindus in Bangladesh". United Nations High Commissioner for Refugees. Archived from the original on 2012-10-18. Retrieved 2020-08-04.

ఇతర పఠనాలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు