బి.జయమ్మ

భారతీయ సినీ నటి

బి.జయమ్మ/ గుబ్బి జయమ్మ (1915 - 1988) ప్రముఖ కన్నడ సినిమా, రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన గుబ్బి వీరన్న నాలుగవ భార్య.[1] జయమ్మ, బి.ఎన్.రెడ్డి దర్శకత్వము వహించిన స్వర్గసీమతో తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో భర్తచే నిర్లక్ష్యం చేయబడిన భార్య, కళ్యాణి పాత్రను పోషించింది.

త్యాగయ్య చిత్రంలో బి.జయమ్మ
భర్త గుబ్బి వీరన్నతో జయమ్మ

జయమ్మ 1915లో కర్ణాటకలోని చిక్‌మగళూరులో జన్మించింది. చిన్నతనం నుండి నటనపై ఆసక్తి కనబరిచిన జయమ్మ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో జీవనోపాధికై తొమ్మిదవ యేటనే నటించడం ప్రారంభించింది.[2] జయమ్మ 1924లో రసిక జనానంద నాటక సభ నిర్వహించిన సీతాకళ్యాణంలో మూగ సీత పాత్రనుపోషించింది. ఆ తరువాత జయమ్మ బాలు బసవె గౌడ నాటక కంపెనీలో చేరింది. ఆ తరువాత 1928లో గుబ్బి వీరన్న కంపెనీలో చేరి తన జీవితాన్ని ఆ కంపెనీకి అంకితం చేసింది. గుబ్బి వీరన్న కంపెనీలో ప్రధాన కథానాయకిగా ఎదిగి 1931లో వీరన్నను వివాహమాడింది. భక్త ప్రహ్లాద, దేవదాసి, సదారమే నాటకాలలో ఈమె పోషించిన కథానాయకి పాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గుబ్బి కంపెనీ 1934లో నిర్మించిన మహానాటకము కురుక్షేత్రలో ద్రౌపది పాత్ర పోషించింది. జయమ్మ హిందుస్తానీ, కర్ణాటక సంగీతము శిక్షణ పొందింది. ఈమె మంచి కథక్ నృత్యకారిణి కూడా.

జయమ్మ మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది. 1931లో రాఫెల్ అల్గియాట్ అనే బెల్జియం దేశీయుడు దర్శకత్వం వహించిన మూకీ చిత్రం హిజ్ లవ్ అఫైర్, 1932లో గుబ్బివీరన్నతో కలిసి వై.వి.రావు దర్శకత్వం వహించిన హరి మాయ అనే మూకీ చిత్రంలో నటించింది. 1940లలో తెలుగు సినిమా రంగములో కూడా బాగా పేరుతెచ్చుకున్న జయమ్మకు కన్నడ సినిమా రంగములో అంతకంటే పెద్ద పేరు ఉంది. 1945లో ఈమె కథానాయకిగా నటించిన కన్నడ చిత్రం హేమారెడ్డి మల్లమ్మలో ఈమె నటన చిరస్థాయిగా నిలచిపోయింది. జయమ్మ తెలుగులో స్వర్గసీమ, త్యాగయ్య, గుళేబకావళి కథ, బ్రహ్మరధం మొదలైన నాలుగు సినిమాల్లో నటించింది. ఈమె మంచి గాయని కూడా. స్వర్గసీమలో కొన్ని పాటలు పాడింది.

1947లో మహాత్మా గాంధీని కలుసుకున్న తర్వాత జయమ్మ తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నది. 1970లో ముక్తి సినిమా వరకు అడపాదడపా కొన్ని సినిమాలలో నటించినా ప్రధాన లక్ష్యం సమాజసేవనే. ఈమె చివరి సినిమా ముక్తిలో తల్లిపాత్రలో నటించింది. జయమ్మ కన్నడ మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసింది. కర్ణాటక రాష్ట్ర విధానమండలికి నియమితురాలై వృద్ధ నాటక కళాకారుల సంక్షేమానికై కృషిచేసింది. ఈమె 1988, డిసెంబర్ 20న బెంగుళూరులో స్వర్గస్తురాలయ్యింది.[3]

చిత్ర సమాహారం

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-12-22. Retrieved 2007-04-15.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-28. Retrieved 2009-03-09.
  3. Vidura Vol.26 (1989) By Press Institute of India p.56

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బి.జయమ్మ&oldid=3879644" నుండి వెలికితీశారు