బీరం మస్తాన్ రావు

బీరం మస్తాన్‌ రావు (అక్టోబర్ 30, 1944 - జనవరి 28, 2014) రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు.

బీరం మస్తాన్‌రావు
జననంబీరం మస్తాన్‌రావు
అక్టోబర్ 30, 1944
మరణంజనవరి 28, 2014
చెన్నై
మరణ కారణంగుండెపోటు
వృత్తిదర్శకత్వం
ప్రసిద్ధితెలుగు సినిమా దర్శకులు
పిల్లలుగీత

గుంటూరులో 1944 అక్టోబర్ 30న జన్మించిన మస్తాన్ రావు రంగస్థల కళాకారుడు. ప్రజా నాట్యమండలి, యువజన నాట్యమండలి, ఆంధ్ర ఆర్ట్ థియేటర్స్ వంటి సమాజాలలో చురుకైన పాత్ర పోషించారు. 1971లో నిర్మించిన "బాలమిత్రుల కథ" సినిమాలోని బాల నటులకు శిక్షణనిచ్చేందుకు బీరం చెన్నై వచ్చారు. తరువాత పలు చిత్రాలకు అసోసియేట్ దర్శకునిగా పనిచేశారు.

జీవిత విశేషాలు

మార్చు

గుంటూరు లోని సంగడిగుంట కు చెందిన బీరం మస్తాన్ రావు రంగస్థలం నుండి వెండితెరవైపు అడుగులు వేశారు. అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరావు, జమున, గరికపాటి రాజారావు తదితరులతో కలిసి నాటకాలు వేస్తూ వచ్చిన ఆయన 'రాజమనుషులు' అనే నాటకానికి గానూ నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. బాలమిత్రుల కథ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం జీవనచదరంగం, దేవుడుచేసిన మనుషులు, కన్నె వయస్సు, శభాష్ పాపన్న, ఎదురులేని మనిషి, ఇంద్రధనస్సు తదితర చిత్రాలకు పనిచేశారు.

దర్శకుడిగా ఆయనకు తొలిచిత్రం ఘట్టమనేని కృష్ణ - శ్రీదేవి జంటగా నటించిన బుర్రిపాలెం బుల్లోడు. అనంతరం సూర్యకాంతం ప్రధాన పాత్రలో గయ్యాలి గంగమ్మ, ఎన్టీఆర్ తో ప్రేమ సింహాసనం, కైకాల సత్యనారాయణ- కె.ఆర్. విజయ లతో తల్లీ గోదావరి, మాదాల రంగారావుతో విప్లవ శంఖం, చంద్రమోహన్-జయశ్రీ లతో సువర్ణసుందరి చిత్రాలను తెరకెక్కించారు. ఇందులో విప్లవశంఖం 365 రోజులు ప్రదర్శితం కాగా, దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన సువర్ణసుందరి చిత్రం మొత్తం ఎనిమిది నంది అవార్డులను దక్కించుకుంది. నారీయాగం అనే బుల్లితెర సీరియల్ కు కూడా దర్శకత్వం వహించారు. నటుడిగా కూడా ఆయన తెరపై సందడి చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన రైల్వేకూలీలో బీరం ప్రతి నాయకుడిగా కనిపించారు. తెలుగు దర్శకుల అసోషియేషన్ కు ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా, సలహాదారుడిగా వ్యవహరించిన ఆయన నంది అవార్డుల ఎంపిక జ్యూరీ బృందంలోనూ సుదీర్ఘకాలంపాటు సేవలందించారు.

జనవరి 28, 2014లో మరణించారు.