బెజవాడ రామచంద్రారెడ్డి

బెజవాడ రామచంద్రారెడ్డి (ఆంగ్లం: Bezawada Ramachandra Reddy) (1894 - 1973) బుచ్చిరెడ్డిపాలెం జమిందారీకి చెందిన రాజకీయ నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు.[1]

బెజవాడ రామచంద్రారెడ్డి
బెజవాడ రామచంద్రారెడ్డి


పదవీ కాలం
1952-57
తరువాత ఆర్.లక్ష్మీనరసారెడ్డి
నియోజకవర్గం నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1894-11-24)1894 నవంబరు 24
మరణం 1973 మార్చి 19(1973-03-19) (వయసు 78)
బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా
రాజకీయ పార్టీ స్వతంత్ర పార్టీ
జీవిత భాగస్వామి బుజ్జమ్మ
సంతానం 11; 6 కుమారులు, 5 కుమార్తెలు
మతం హిందూమతం

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1894, నవంబర్ 24వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి బెజవాడ సుబ్బారెడ్డి. ఇతడు నెల్లూరులోని సి.ఎ.ఎం.హైస్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తరువాత మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బి.ఎ., డిగ్రీ చదివాడు. వ్యవసాయము, మైకా గనుల త్రవ్వకము ఇతని వృత్తి. ఇతడు 1922లో బుజ్జమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి 6గురు కుమారులు, 5గురు కుమార్తెలు కలిగారు.

రాజకీయ జీవితం మార్చు

రామచంద్రారెడ్డి జస్టిస్ పార్టీ సభ్యులుగా, 1924లో మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా, 1930-37 మధ్య మద్రాసు రాష్ట్ర శాసనమండలి అధ్యక్షునిగా, 1952లో తొలి లోక్‌సభ సభ్యుడిగా, స్వతంత్ర పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా, ఆంధ్ర నాటక కళాపరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతడు లాండ్ రెవెన్యూ ఎంక్వైరీ కమిటీ, మద్రాస్ స్టేట్ ఫుడ్ అడ్వైజరీ కమిటీ, సెంట్రల్ రోడ్ ట్రాఫిక్ బోర్డ్, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోస్ట్ వార్ రీ కన్‌స్ట్రక్షన్ కమిటీ, లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ బోర్డ్,ఐ.సి.ఎ.ఆర్. ఎకనామిక్ సబ్‌కమిటి వంటి వివిధ కమిటీలలో సభ్యుడిగా ఉన్నాడు. తెలుగుదేశం నాయకుడు బెజవాడ పాపిరెడ్డి ఇతని కుమారుడు.

సాహిత్యం మార్చు

బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర వారపత్రిక నెల్లూరు నుండి (1930-40) సంపాదకులుగా నడిపాడు. ఈయన సాహిత్య పరిషత్తు అధ్యక్షోపన్యాసాలు, నాటక పరిషత్తు ప్రసంగాలు, రెడ్డి జనమహాసభలో సూచనలు ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇతడు గ్రాంధికవాది సాహిత్య పరిషత్తు అధ్యక్షులుగా ఆయన చురుకైన పాత్ర వహించాడు. కవులను, రచయితలను ప్రోత్సహించి, కొందరిని ఆర్థికంగా ఆదుకున్నాడు. అవధానాలలో పాల్గొని పృచ్ఛకుడుగా వ్యవహరించాడు. అనేక మంది రచయితలు ఇతని చేత పీఠికలు రాయించుకున్నారు. సాహిత్యంలో కొంత అభ్యుదయం, కొంత సనాతనత్వం మిళితం చేసిన రామచంద్రారెడ్డి, తనకు యిష్టమైన వారిని సత్కరించాడు. త్రిపురనేని రామస్వామికి గుడివాడలో గండపెండేరం తొడిగిన ఖ్యాతి ఇతనిదే. దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువాలతో ఇతనికి చాలా దగ్గర సంబంధాలుండేవి. కొప్పరపు కవులు మొదలు అనేక మందిని ఇతడు ఆదరించాడు. ప్రతాపరుద్రీయం వంటి నాటకాలు ఓపికగా తిలకించి, విశ్లేషించాడు. 1935లో 110 కందపద్యాలతో "మాతృశతకం" వ్రాశాడు. తరువాత రచనలన్నీ వివిధ సంచికలలో, పత్రికలలో, కవికృతులలో కనిపిస్తాయి. ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో పాలకమండలి సభ్యుడుగా ఉన్న విద్యాభిలాషి. తిరుపతిలో సంస్కృత పరిషత్తు అధ్యక్షులుగానూ ఉన్నాడు.[2]

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "First Lok Sabha Members Bioprofile". PARLIAMENT OF INDIA LOK SABHA HOUSE OF THE PEOPLE. National Informatics Centre (NIC). Retrieved 11 May 2020.
  2. నరిసెట్టి ఇన్నయ్య. "బెజవాడ రామచంద్రారెడ్డి--సాహితీపరులతో సరసాలు". మానవవాదం. నరిసెట్టి ఇన్నయ్య. Retrieved 11 May 2020.