బొర్రా గుహలు

(బొర్రాగుహలు నుండి దారిమార్పు చెందింది)

బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల ప్రముఖ పర్యాటక ఆకర్షణ. వీటిని 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. తెలుగులో 'బొర్ర ' అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి.

బొర్రా గుహలు
బొర్రాగుహలు

కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియమ్ బై కార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగిఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటివల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్‌మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలక్టైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్‌మైట్స్, స్టాలక్టైట్స్ వింతవింత ఆకృతులను సంతరించుకుంటాయి. వారివారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు, స్థానికులు వీటికి రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఆంత్రోపాలజిస్టులకు మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతిపనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానువులు నివసించినట్లు తెలుస్తోంది. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను " బోడో దేవుడి ' (పెద్ద దేవుడు) నివాసంగా నమ్ముతుంటారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలగ్‌మైట్స్, స్టాలక్టైట్స్ లను శివ -పార్వతి, తల్లి-బిడ్డ, ఋషి గడ్డం, మానవ మెదడు, మొసలి, పులి-ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీరు పూజిస్తూ oటారు.

ఈ గుహలకు గోస్తాని నది తొలిచిన నాలుగు ద్వారాలు ఉన్నాయి. బొర్రా-1 అని వ్యవరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడి నుంచి లోపలికి ఒక కిలోమీటరు వరకూ వెళ్లి గోస్తాని నదిని చేరవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తాని నది వరకు వెళ్లడాన్ని అనుమతించటం లేదు. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటటం వంటి వాటిని చేపట్టటంతో బొర్రాగుహల పరిసరాలు చాలా అందంగా మారాయి. గుహల్లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహల్లోపలి వింత వింత ఆకారాలపై, రాళ్ళపై రకరకాల రంగులు, నీడలు పడేవిధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చటం జరిగింది. ఇంతకుముందు కాగాడాలతో గైడుల సహాయంతో గుహలను చూపించేవారు. ప్రతీ సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా. అరకు లోయ అందించిన ప్రకృతి అద్భుతమైన బొర్రాగుహల ఒక వరం.

ప్రకృతి

మార్చు

ప్రకృతిలో మనిషికి అర్ధంకాని వింతలెన్నోఉన్నాయి, ఎన్నొ అద్భుతాలున్నాయి. ఇలాంటి అద్భుతాల్లో సహజసిద్ధమైన బొర్రాగుహలు కూడా ఒకటి. తూర్పుకనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. ప్రకృతి ప్రసాదించిన వింత ఇది. తూర్పుకనుమల్లోని అనంతగిరి మండల వరుసలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి అరకులోయకు వెళ్లే దారి అంతా కనుమ రహదార్లతో కూడినదే. ఈదారి వెంట ప్రయాణమే ఓగొప్ప అనుభూతి. గుండెలు గుభేలు మనిపించే కొండ దారిలో వెళ్తుంటే కింద పచ్చని తెవాచీ పర్చినట్లు ప్రకృతి, దట్టమయిన అడవులు, అందమైన వన్యప్రాణులు కనబడతాయి.

ప్రయాణం

మార్చు
 
బొర్రాగుహల వద్ద రైలు సముదాయము

బొర్రాగుహలను సందర్శించాలంటే, విశాఖపట్నం నుంచి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. ప్రత్యేక వాహనాల్లో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. విశాఖ నుంచి బొర్రాగుహల వరకు చేసే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతులతో కూడిన యాత్ర. రైలు దాదాపు 40 గుహల ద్వారా ప్రయాణిస్తుంది. వీటిలో కొన్ని ఒక కిలోమీటరు పొడవు కూడా ఉన్నాయి. ఈ గుహలు కాక అందమైన లోయల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, జలపాతాల ప్రక్కన రైలు ప్రయాణం సాగుతుంది. బస్సు, ఇతరవాహనాల ద్వారా చేసే ప్రయాణం కూడా అందమైన అనుభూతిగా మిగిలి పోతుంది.

చలన చిత్రాల షూటింగ్ లు

మార్చు

ఇఛ్ఛట చాలా సినిమాల చిత్రీకరణ జరిననవి. వాటిలో ముఖ్యమైనవి జగదేక వీరుడు అతిలోకసుందరి, శివ, జంబలకిడిపంబ.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు