భర్త పట్ల క్రౌర్యం

(భర్తపై క్రూరత్వం నుండి దారిమార్పు చెందింది)

భర్త పట్ల క్రౌర్యం అనగా స్త్రీల రక్షణ కొరకు ఉన్న చట్టాలను తనకనుకూలంగా ఉపయోగించుకొని భర్త, అయన కుటుంబీకులు ప్రమేయం లేనప్పటికిని దుర్వినియోగం చేస్తూ, డబ్బు కోసం వేధిస్తూ భయపెట్టడం. కొన్ని సందర్భాలలో శారీరకంగానూ, మాససికంగానూ, సామాజికం గానూ భర్తను వేధించటం.

ఒక వర్ణచిత్రంలో "Woman Striking Man With Broom" (1875)

చట్టం స్త్రీలకే అనుకూలంగా ఉన్నది అనే భ్రమ నెలకొని ఉండటం మూలాన భార్య/ఆమె కుటుంబీకులు/ఆమె బంధుమిత్రులు తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరించటం, వాటికి కట్టుకొన్న భర్త ఒప్పుకోని పక్షంలో స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలనే అమాయక భర్త పై అస్త్రాలుగా ప్రయోగించటం/లేదా ప్రయోగిస్తామని బెదిరించటమే "భర్త పట్ల క్రౌర్యం".

భర్త పట్ల క్రౌర్యం వలన భారతదేశంలో ప్రతి తొమ్మిది నిముషాలకు ఒక గృహస్థు ఆత్మాహుతికి పాల్పడుతోన్నాడని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ స్పష్టం చేసినా, అది అరణ్యరోదన గానే మిగిలిపోయింది.[1]ఇలాంటివి ఈ దేశంలో చాలా జరుగుతున్నాయి అలాంటివాటికి చెక్ పెట్టాలి అంటే ముందు న్యాయస్థానంలో మార్పు రావాలి యేల అంటే ఆడవారు మగవారు సమానమే అనే న్యాయస్థానము మగవారిని కూడా దృష్టిలో పెట్టుకొని సరైన తీర్పు ఇవ్వాలి ఆడవారు ఈ చట్టాలు దృష్టిలో పెట్టుకొని మగవారిని చాలా కృరంగా ఎంసిస్తున్నారు అందువల్ల మగవాళ్ళు బయటికి చెప్పుకోలేక తమలో తామే ఎంసకు గురు అవుతున్నారు దీనిని న్యాయస్థానము దృష్టిలో పెట్టుకొని ఆడవారికి కూడా శిక్ష పడేలా చేస్తే ఎటువంటి కేసులు తగ్గుతాయని నా మనవి

హైందవ వివాహ సంస్కారాల ప్రకారం

మార్చు

హైందవ వివాహ సంస్కారాల ప్రకారం వివాహంలో వరుడు మాంగళ్యధారణ చేసే సమయంలో, పురోహితుడు

మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా, కంఠేబద్నామి శుభగేత్వం జీవం శరదశ్శతం.
(నా జీవితానికి మూలమైన, హేతువైన ఈ సూత్రమును నీ కంఠమున నేను కట్టుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించాలి.)

-అని చదువుతాడు.

అదే విధంగా వధూవరులిరువురితో నాతిచరామి మంత్రమైన

ధర్మేచ అర్థేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి.
(ధర్మార్థ కామములందు ఒకరికొకరు తోడుగా ఉంటాము.)

- అని ప్రతిజ్ఞ చేయిస్తాడు.

ఆ విధంగా అగ్ని దేవుని సాక్షిగా, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, పెద్దల సమక్షంలో తల వంచి తాళి కట్టించుకొని, ఏడడుగులు నడిచి, పతియే ప్రత్యక్ష దైవం అని భావించి, జీవితాంతం సహధర్మచారిణిగా నడుచుకొనవలసిన భార్య తన భర్తను న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు నేరారోపణలతో తన కుటుంబాన్ని తానే వీధికి ఈడ్చుకొంటోంది.[2]

నేపథ్యం

మార్చు

చట్టం

మార్చు

వాస్తవానికి వరకట్న నిరోధక చట్టం (Dowry Prohibition Act) భారతదేశంలో 1961 లోనే రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం వరకట్నం తీసుకోవటం, ఇవ్వటం రెండూ కూడా నేరాలే.[3] కానీ విశాల దృక్పథంతోనో, ఆదర్శాల కోసమనో కట్నాన్ని తిరస్కరించినట్లయితే, వరుడిలో ఏదో లోపం ఉన్నది అనే భావన కూడా సర్వసాధారణమే. అయితే భారతదేశంలో తరతరాలుగా వేళ్ళూనుకొన్న పురుషాధిక్యత, ఉమ్మడి కుటుంబ వ్యవస్థల వలన -

  • భర్త/అతని కుటుంబీకులు వారి కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకొనటం కోసం పెళ్ళికి ముందే అధిక మొత్తంలో వరకట్నాన్ని/ఇతర కానుకలను వసూలు చేయటం
  • పెళ్ళికి తర్వాత మరింత కట్నం/ఇతర కానుకల కోసం కోడలిని వేధించటం [4]
  • కోడలిని వంటింటి కుందేలుగా/కేవలం పిల్లలు కనే యంత్రంగా చూడటం
  • పురుషుని విచ్చలవిడితనం/దుర్వ్యసనాలు/అక్రమ సంబంధాల వలన గృహహింస పెరిగిపోవటం

-గమనించిన భారతీయ శిక్షాస్మృతి, వీటిని అరికట్టటానికి 1983 లో 498A (గృహహింస నిరోధక) చట్టాన్ని రూపొందించినది.[5]

ఈ చట్టం ప్రకారం

Whoever, being the husband or the relative of the husband of a woman, subjects such woman to cruelty shall be punished with imprisonment for a term which may extend to three years and shall also be liable to fine. The offence is Cognizable, non-compoundable and non-bailable.
(ఒక స్త్రీ యొక్క భర్త గానీ, ఆ స్త్రీ యొక్క భర్త యొక్క బంధువు గానీ, ఆ స్త్రీని క్రౌర్యానికి గురిచేసినవారికి మూడేళ్ళ జైలు శిక్షతో బాటు జరిమానా కూడా విధించటం జరుగుతుంది. ఈ క్రౌర్యం నేరముగా గుర్తించబడినది, రాజీ కుదుర్చుకోకూడనిది, జామీను ఇవ్వకూడనిది.)

ఈ చట్టం నాన్-బెయిలబుల్ (Non-Bailable అనగా బెయిల్ ఇవ్వకూడనిది), కాగ్నిజబుల్ (Cognizable అనగా నేరముగా గుర్తించబడినది) కావటం మూలాన దీని దుర్వినియోగానికి దారులు పడ్డాయి. ఇప్పటి వరకూ ఈ చట్టం అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్), రాజస్థాన్ రాష్ట్రాలలో కాంపౌండబుల్ (Compoundable అనగా రాజీ కుదుర్చుకొనేది) గా ఉన్నది.[6]

ఒకప్పుడు అతి కఠినంగా ఉన్న ఈ చట్టం ప్రకారం ఏ సాక్ష్యం లేకుండానే ఏ వివాహిత అయినా తన భర్త, అతని తల్లిదండ్రులపై (అదనపు) కట్నం కోరుతున్నారని ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులో పేర్కొన్నవారందరినీ పోలీసులు వెంటనే అరెస్టు చేయవచ్చు.కేవలం న్యాయమూర్తి విచక్షణ పై ముద్దాయిలకు బెయిలు మంజూరు చేయబడేది. నిర్దోషులు అని నిరూపించబడేంతవరకూ ముద్దాయిలను నేరస్థులుగానే పరిగణించేవారు.[7] అయితే,

  • దశాబ్దాల నుండి అత్యధికంగా దుర్వినియోగపరచబడుతున్న చట్టాలలో ఇది కూడా ఒకటి కావటం[8]
  • అమాయకపు పురుషులే లక్ష్యంగా స్త్రీలు ఈ చట్టాన్ని ప్రయోగించటం మూలాన వారి జీవితాలు ఛిద్రం కావటం
  • వారు నిర్దోషులు అని న్యాయస్థానంలో నిరూపించబడే కాలానికి పూడ్చలేని నష్టాలు పురుషుల జీవితాలలో చోటుచేసుకోవటం
  • వారితోబాటే ఉన్న/లేని అత్తమామల పైనే కాకుండా, కాటికి కాలు చాచిన (అత్త/మామల) తల్లిదండ్రులపై, సుదూరప్రాంతాలలో/విదేశాలలో ఉన్న ఆడపడుచుల పై, చివరకు ముక్కుపచ్చలారని పసివారిపై కూడా భార్య స్థానంలో ఉన్న స్త్రీలు విచక్షణారహితంగా అభియోగాలు మోపటం, ఈ కారణంగా ముద్దాయిలకు కలిగే అసౌకర్యాలు
  • కోడలి స్థానంలో ఉన్న స్త్రీని కాపాడే చట్టమే, అత్త/ఆడపడుచు స్థానంలో ఉన్న స్త్రీకి గొడ్డలిపెట్టు కావటం

-గమనించిన సుప్రీం కోర్టు, ఈ చట్టంలో కచ్చితమైన సాక్ష్యాధారాలు దొరికితే తప్పితే, అవసరమైతే తప్పితే భర్తతో సహా ఇతర ముద్దాయిలను అదుపులోకి తీసుకొనరాదని పదే పదే లిఖితపూర్వకంగా తెలుపుతూ వచ్చింది.

కారణాలు

మార్చు

ఐతే,

  • భర్త పేరునున్న ఆస్తులను తమ (తల్లిదండ్రుల) కుటుంబం వైపు దారి మళ్ళించుకోవటానికి తాము వేసిన పెళ్ళి అనే పాచిక పారక నిరాశని ఎదుర్కొన్న భార్య, ఎలాగైనా ఆస్తులను అనుకొన్నట్లుగా మళ్ళించుకోవటానికి దారులు వెదికే భార్య
  • భరణం రూపంలోనో, రాజీ రూపంలోనో అధికమొత్తంలో ధనం సమకూర్చుకొనవచ్చుననే అపోహలో ఉండే స్త్రీలు
  • శిశురక్షణ తమకే చెందాలని కోరుకొనే స్త్రీలు
  • సంసారంలో భార్య వైపు కుటుంబీకుల మితిమీరిన జోక్యం
  • భర్తను తన/తన కుటుంబీకుల చెప్పుచేతలలో ఉంచుకోవాలనుకొనే, కాని పక్షంలో ఊచలు లెక్కపెట్టించగలిగే సామర్థ్యం తమకు ఉన్నదని పొరబడే స్త్రీలు
  • అటువంటి స్త్రీల పట్ల జాగరూకతతో వ్యవహరించే భర్త/అతని కుటుంబీకులు. దీని వలన భార్యా-భర్తల మధ్య చోటు చేసుకొనే ఘర్షణలు
  • తప్పుదోవ పట్టించే (కొందరు పోలీసు అధికారుల, న్యాయవాదుల, ఇతర) బంధుమిత్రుల చెప్పుడు మాటలు విని తమ సంసారంలో తామే నిప్పులు పోసుకొనే స్త్రీలు
  • ఏదేని కారణాల వలన భార్యకు వివాహ బంధం భారంగా మారటం, ఆ భారం నుండి ఎలాగైనా బయటపడాలనుకొనే స్త్రీలు
  • తను అనుకొన్న విధంగా జరగనందుకు, అలా జరగకపోవటానికి కారణం ఈ పెళ్ళే అనే ఆలోచనలతో భర్త/అతని కుటుంబసభ్యుల పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే భార్య
  • తమ కుమార్తెను ప్రేమవివాహం చేసుకొని ఆమె భర్త ఆమెను వారికి కాకుండా చేశాడనే పాతకక్షలతో రగిలిపోయే భార్య వైపు కుటుంబీకులు
  • ఆ వివాహం వారికి ఇష్టం లేదని తల్లిదండ్రులకు తెలుపలేని లేదా వారిని ఒప్పించలేని/వారి కోపాగ్నికి బలికాకుండా ఉండాలనుకొనే స్త్రీలు, ఇష్టం లేని వివాహాన్ని తల్లిదండ్రుల/ఇతరుల బలవంతం పై చేసుకొనటం, తర్వాత ఆ వివాహంలో ఇమడలేకపోయే స్త్రీలు
  • స్వతంత్రంగా ఆలోచించలేని, ఇతరుల సలహా/సూచనలపై ఆధారపడే, పర్యవసానంగా నష్టం ఎవరికి అని ఆలోచించలేని స్త్రీలు
  • అవగాహనారాహిత్యంతో చట్టం తమకే అనుకూలంగా ఉందని భ్రమించి, చిన్న చిన్న అభిప్రాయభేదాలను కూడా చిలువలు-పలువలు చేసుకొని న్యాయస్థానాలను ఆశ్రయించే స్త్రీలు (తను చేసే ప్రతి అభియోగానికి సాక్ష్యం ఉండాలని, సాక్ష్యం లేని అభియోగం నేరంగా పరిగణించబడదని తెలియని స్త్రీలు)
  • తమలోని లోపాలు బయటకు పొక్కకుండా విషయాన్ని తప్పుదోవ పట్టించి ఇతరులను బలి చేసైనా సరే తాము తప్పించుకోవాలనుకొనే స్త్రీలు (ఉదా:
    • జనాంగాల లోపాల వలన భర్తకు సాధారణ లైంగిక సౌఖ్యాన్ని అందించలేని స్త్రీలు
    • తమ వివాహేతర సంబంధాల గురించి తన భర్తకు/అత్తమామలకు తెలిసిపోయినదని గ్రహించి, ఆ అపరాధ భావాన్ని ఎదుర్కోకుండా తప్పించుకోవాలనే స్త్రీలు[9]
    • సంతానం కలిగితే తమకు ఇష్టం లేని వివాహం నుండి తప్పించుకోలేమని భర్తకు, అతని కుటుంబీకులకు తెలియకుండా గర్భనిరోధక సాధనాలు వాడే స్త్రీలు, భర్త/అతని కుటుంబం నుండి సంతాన ప్రాప్తి ఒత్తిడిని ఎదుర్కొంటున్న స్త్రీలు. ఇకపై ఈ ఒత్తిడిని ఎట్టి పరిస్థితులలో సహించలేమనే నిర్ధారణకు వచ్చిన స్త్రీలు, ఈ ఒత్తిడిని తప్పించుకోవటానికి దారులు వెదుక్కొనే స్త్రీలు)

- మునుపెన్నడూ లేని విధంగా అమాయకపు భర్తపై కేసులు వేసి, వారిని న్యాయస్థానంలో ముద్దాయిలుగా నిలబెడుతున్నారు.[10] పురుషుల హక్కుల కోసం పోరాడే మెన్స్ రైట్స్ ఇండియా అనే సంస్థ ప్రకారం భారతదేశంలో ఐటీ/బిపిఓ పరిశ్రమలు దినదినప్రవర్థమానంగా వర్థిల్లుతున్న సమయం (అనగా 2000 సంవత్సరం) నుండి విడాకుల చట్ట ప్రయోగం అధికమైనది.[11] ఇక ఎన్ ఆర్ ఐ ల విషయానికి వస్తే వారు భారతదేశపు స్త్రీలను వివాహమాడటానికి కూడా జంకుతున్నారు. వారి పాస్ పోర్టులను జప్తు చేయటం, సుదీర్ఘ కాలం భారతదేశంలోనే ఉద్యోగం లేకుండా ఉండవలసి రావటం, అరెస్టులు, కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు, ఇదే అవకాశంగా వీరి వద్ద నుండి ఎంతోకొంత రాబట్టాలనుకొనే న్యాయరక్షకులు, చట్టనిర్దేశితుల వ్యవహారాలతో వీరు విసిగి వేసారిపోయారు.[12]

అనువర్తనం

మార్చు

ఏ రకమైన వివాహమూ భర్త పట్ల క్రూరత్వానికి మినహాయింపు కాదు. కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా ఈ చట్టాల దుర్వినియోగం సాగుతోంది.

  • సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలోనూ
  • పెద్దల అంగీకారంతో/పెద్దలు వ్యతిరేకించినా జరిగిన ప్రేమ వివాహాలలోనూ
  • సహజీవన బంధాలలోనూ

వీటి దుర్వినియోగం వ్యాపించి ఉంది.

వరకట్నం తీసుకోవటం అటుంచి, దానిని వ్యతిరేకించి, పెళ్ళి ఖర్చులు కూడా వరుడే భరించిన సందర్భాలలోనూ ఈ చట్టాల దుర్వినియోగం జరగటం గమనార్హం, శోచనీయం. ప్రేమ పెళ్ళిళ్ళ అనంతర కాలంలో, వేరే ఏ ప్రమాదం వలన తమ కుమార్తె మృతి చెందినా, వేరే ఏ కారణం వలన ఆమె ఆత్మాహుతికి పాల్పడినా, తమ కుమార్తెను తమకకు కాకుండా చేశాడన్న అక్కసుతో ఆమె వైపు కుటుంబీకులు వేధింపు చట్టాలే కాక, హత్యానేరాలు మోపే అవకాశాలు కూడా ఉన్నాయి. సున్నితమనస్కులైన పురుషులు, ఇలాంటి అపవాదు ఎదుర్కొన్ననాడే సగం చచ్చినట్టు భావిస్తున్నారు. శిశు సంరక్షణ తల్లికే చెందటంతో, భార్య వలన కలిగిన తమ సంతానం పైన ప్రేమని చంపుకోలేక, చట్టాన్ని వ్యతిరేకించలేక, భార్యని ఒప్పించలేక, సంతానాన్ని చూడకుండా ఉండలేక సతమతమైపోయే పురుషులు మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు.[13] కొన్ని సందర్భాలలో దుర్వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం, ఆత్మహత్య చేసుకోవటం చేస్తున్నారు.[14]

దుర్వినియోగం

మార్చు

ఏ చట్టమైనా ఉన్నత భావాల నేపథ్యంతోనే రూపొందించబడుతుంది. అయితే ఈ చట్టం నేపథ్యంలో గల ఉన్నత భావాలను తుంగలో తొక్కి వాటిలో ఉన్న లొసుగులనే అవకాశంగా తీసుకొని వాటిని దుర్వినియోగ పరచటం మిగతా అన్ని చట్టాలతో పోలిస్తే ఈ చట్టంలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇతర చట్టాలక్రింద వేసిన వ్యాజ్యాలలో నేరాలు 40-50 శాతం ఋజువు అవుతుండగా, ఈ చట్టాలక్రింద వేసిన వ్యాజ్యాలలో నేరారోపణలు కేవలం 2-3 శాతం మాత్రమే ఋజువు అవుతున్నాయి. ఇటీవలె నమోదవుతున్న కేసులలో దాదాపుగా 85 శాతం కేసులు కేవలం భర్తను/అతని కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేయటం కొరకేనని తేలినవి. అత్తా ఒకింటి కోడలే అన్నట్టు స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలే, వృద్ధాప్య వయసులో అత్త స్థానంలో ఉన్న స్త్రీలకు, సప్తసముద్రాల అవతల సంసార సాగరాలను ఈదుతున్న ఆడపడుచుల స్థానంలో ఉన్న స్త్రీలకు గొడ్డలి పెట్టు అయినవి. ఈ బలి ఇంతటితో ఆగక భర్త యొక్క తండ్రి, అన్నదమ్ముల పై కూడా నిరాధార లైంగిక వేధింపు అభియోగాలు తోడౌతున్నాయి.[15]

వ్యాఖ్యలు

మార్చు

స్వయంగా ఒక సుప్రీం కోర్టు జడ్జి గారి వ్యాఖ్య -

The law, intended to be a '''shield''' to protect women, has been turned into a '''weapon''' to torment men.
(స్త్రీకి 'రక్షణ కవచం' గా ఉండవలసిన చట్టమే, పురుషులను హింసించే 'ఆయుధం'గా మారిపోయినది.)

మరొక న్యాయనిపుణుడు ఈ దుష్పరిణామాన్ని చట్టపరమైన తీవ్రవాదం (Legal Terrorism) గా వ్యవహరించారు.[16][17]

ఢిల్లీలో స్త్రీల తరపున వ్యాజ్యాలనే ఎక్కువగా స్వీకరించే సాధనా రామచంద్రన్ ఒక మహిళా న్యాయవాది యొక్క స్పందన -

I'm always seeing decent men put in jail by women because they want custody of the children or the house. Strong, successful men turn into mental wrecks fighting these cases because they go sometimes for two decades.[18]
(శిశుసంరక్షణ లేదా భర్త పేరున ఉన్న ఇల్లు తమకే చెందాలనుకొనే స్త్రీలు పరువుగా బ్రతుకుతున్న తమ భర్తలనే జైలులో వేయించటం నిత్యం నేను కళ్ళారా చూస్తున్నాను. చట్టంతో చేసే పోరాటంలో, ఈ వ్యాజ్యాలు ఒక్కోమారు రెండు దశాబ్దాల వరకూ కొనసాగటంతో జీవితంలో సఫలీకృతులైన, శక్తిమంతులైన పురుషులు కూడా మానసికంగా ఎంతో కృంగిపోతారు.)

మరొక న్యాయవాది -

Some women use it to keep the husband under their thumb. They've got their finger on the trigger all the time.
(కొంత మంది స్త్రీలు భర్తను వారి చెప్పుచేతలలో ఉంచుకోవటానికి ఈ చట్టాన్ని వాడుకొంటారు. చట్టం అనే ఈ తుపాకీ యొక్క ట్రిగ్గరు పై వారి వేలు ఎప్పుడూ ఉంటుంది.)

బెంగుళూరుకు చెందిన శంకరప్ప అనే న్యాయవాది -

The charges may be proved false later, but a criminal record is a criminal record, after all.
(ఈ ఆరోపణలు నిరాధారాలు అని తర్వాత ఎలాగూ తేలుతుంది, కానీ ముద్దాయిలు నేరస్థులనే ముద్ర మాత్రం చెరిగిపోదు.)

ఈ చట్టాల దుర్వినియోగానికి బలయ్యే పురుషులకు సలహాలు/సూచనలు ఇచ్చే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త -

The victims of 498A tend to be successful men. That's why their wives try to extort money out of them by framing them. Poor men, fortunately, don't suffer from abuse of the dowry law because there is no point framing a bus driver or a rickshaw wallah, is there?
(ఆర్థికంగా బలంగా ఉన్న పురుషులే ఎక్కువగా 498 ఏ బాధితులుగా కనబడుతున్నారు. అందుకే వారిని ఇరికించి వారి భార్యలు వారి నుండి ధనాన్ని వెలికి తీయాలనుకొంటున్నారు. అదృష్టవశాత్తూ, పేదరికంలో మగ్గే పురుషులు ఈ చట్టం దుర్వినియోగం బారిన పడటం లేదు. ఒక బస్సు డ్రైవరునో, రిక్షాలాగే వాడినో ఇరికించటంలో ఏ లాభమూ లేదు, ఉందంటారా?)
We tell them that if they are innocent, they should not pay their wife a single penny.
(మీరు నిర్దోషులైతే, మీ భార్యకు మీరు ఒక్క నయాపైస కూడా కట్టకూడదని మేము చెబుతూ ఉంటాం.)

ఈ చట్టాలకే బలి అయిన అటు పిమ్మట సేవ్ ద ఫ్యామిలీ ఫౌండేషన్ ను నెలకొల్పిన స్వరూప్ సర్కార్ -

When a woman falsely accuses not just her husband but also his mother and sisters and has them arrested, what about their rights? Aren't they women too? Is it fair to try women without first providing any evidence?
(ఒక స్త్రీ భర్తపైనే కాక అతని తల్లి, అక్కచెల్లెళ్ళ పై అభియోగాలు మోపి వారిని అరెస్టు అయ్యేలా చేసినపుడు మరి వారి హక్కులు ఏమైనట్లు? వారు కూడా స్త్రీలే కదా? సాక్ష్యాధారాలు లేకుండా స్త్రీలపై విచారణ జరపటం సమంజసమేనా?)
Women protection laws assume that women are always honest and truthful. Therefore proof and evidence is not required. So honest men are being jailed. Men are committing suicide. It has become an instrument not of equality but terror."
(స్త్రీ సంరక్షక చట్టాలు స్త్రీలు ఎల్లవేళలా నిజాయితీపరులుగానే ఉంటారని అనుకొంటున్నవి. అందుకే వీటికి సాక్ష్యాధారాలు అవసరం లేదు. ఫలితంగా నిజాయితీపరులైన పురుషులు చెరసాలపాలవుతున్నారు. పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమానత్వానికి పరికరంగా ఉండవలసిన చట్టం, బెదిరింపుకు పరికరంగా మారిపోయింది.)"[19]

సోదరుని పై మరదలు వేసిన వరకట్న వేధింపు వ్యాజ్యాలకు చలించిపోయి సంగ్యబాల్యను స్థాపించిన అరుణ్ మూర్తి -

Once the complainant sends her husband and his family to jail, chances of reconciliation are few. She thinks its a victory. But that's the only victory, things go downhill from there.
 (ఒక్కమారు ఫిర్యాదుదారు తన భర్తను, అతని కుటుంబ సభ్యులను జైలుకు పంపిస్తే, సామరస్యపూర్వక పరిష్కారం జరిగే అవకాశాలు చాలా తక్కువ. అది ఆమె విజయంగా పరిగణించవచ్చు. కానీ, అదొక్కటే ఆమె విజయంగా మిగిలిపోతుంది, ఇక అక్కడి నుండి ప్రారంభమయ్యేది ఆమె పతనమే.) 

ఈ బాధలని ప్రత్యక్షంగా అనుభవించిన రాజ్ చోప్రా -

No one in the world seems to be interested in tending to men's grievances, whereas people are all ears to women's problem. This leaves men helpless.
(పురుషులు పడే బాధలను తీర్చటానికి ఈ ప్రపంచంలో ఎవరూ ఆసక్తి కనబరిచేలా లేరు, కానీ స్త్రీ సమస్యను వినటంలో మాత్రం అందరూ ముందుంటారు. ఇది పురుషులను నిస్సహాయులుగా మిగిల్చి వేస్తుంది.)

ఆరోపణలు

మార్చు

ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా ఉన్ననూ, ప్రణాళికా బద్ధంగా భర్తను కేవలం చట్టపరంగా ఇరికించటానికే ఇటువంటి కేసులు బనాయించబడే కారణంగా, వీటిలో సాధారణంగా ఆరోపణలన్నీ ఒకే విధంగా ఉంటాయి. చివరకు పతిహత్యకు ఒడిగట్టిన స్త్రీలు కూడా తమ భర్త ఈ క్రూర చర్యలకు పదేపదే పాల్పడుతుండటం వల్లనే తాము అతణ్ణి హతమార్చామని చెప్పుకోవటం విశేషం.[20][21] కొన్ని ఉదాహరణలు.

  • భార్యగా తనకెటువంటి గౌరవం ఇవ్వటం లేదని. దుర్భాషలాడుతాడని. భార్యను, భార్య వైపు వారిని దూషిస్తాడని. లెక్కలేనితనం ఉందని
  • దురలవాట్లు కలిగి ఉన్నాడని, సిగరెట్లు కాలుస్తాడని, మద్యం సేవిస్తాడని, మాదక ద్రవ్యాలు వినియోగిస్తాడని, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని
  • లైంగికంగా వేధిస్తాడని, అసహజ శృంగార కోరికలను తీర్చమని కోరతాడని, తనకి ఇష్టం లేని లైంగిక చర్యలు బలవంతంగా చేస్తాడని/చేయిస్తాడని. (ఉదా: తన ఇష్టానికి వ్యతిరేకంగా నీలిచిత్రాలు చూపిస్తాడని)
  • నిత్యం కట్నకానుకల కోసం వేధిస్తాడని, సమకూర్చకపోతే శారీరకంగా, మానసికంగా హింసిస్తాడని. ఇంటి నుండి వెళ్ళిపొమ్మంటాడని/వెళ్ళగొట్టాడని. ఈ విషయంలో అతని తల్లిదండ్రులకే అతను వత్తాసు పలుకుతాడని.
  • విడాకులివ్వమని బలవంత పెడతాడని, రెండవ వివాహం చేసుకొంటానని బెదిరిస్తాడని
  • సంతానలేమిని దెప్పి పొడుస్తాడని
  • తాను సౌందర్వవతి కాదని ఎత్తి చూపుతాడని. అందుచేత తన వలన లైంగిక సుఖం లేదని ఆమెను మానసికంగా గాయపరుస్తాడని.
  • తన విద్యాభ్యాసానికి అడ్డు వస్తాడని [22]
  • తను ఉద్యోగం చేయటం పట్ల అయిష్టతను తెలుపుతాడని
  • ఇంటికే పరిమితం చేస్తాడని, బయటకు వెళ్ళటం నిషేధిస్తాడని
  • తన కనీస అవసరాలను పట్టించుకోడని (పోషణ, నివాసం, వసతులు కల్పించకపోవటం)
  • తన ఆస్తిపాస్తులను హరిస్తాడని (కట్నకానుకలను అమ్మివేయటం, తన సంపాదన కూడా తనకు కాకుండా చేయటం)

పరువుగా బ్రతుకుతున్న ఏ పురుషుడైనా ఇటువంటి ఆరోపణలు చూడగనే బెంబేలెత్తి పోవటం సహజమే. కానీ ఇటువంటి ఆరోపణలేవీ న్యాయస్థానంలో ఋజువు కాలేవు. ఇవే కాదు, వాగ్వాదం జరిగిన సమయంలో చేసే వాయిస్ రికార్డింగ్ లు, తీసిన వీడియోలు వంటి వాటిని కూడా న్యాయస్థానంలో ఋజువు చేయటం కష్టతరమే. (వాయిస్ రికార్డింగులో వినిపించే స్వరం ముద్దాయిదేనా/కాదా, వీడియోలో కనిపించేది ముద్దాయేనా/కాదా వంటి వాటిని నిరూపణ చేయటం కష్టతరం. ఈ నాటి సాంకేతిక విప్లవాలతో తప్పుడు వాయిస్ రికార్డింగులు, వీడియోలు సృష్టించటం పెద్ద కష్టమేమీ కాదు.)

సుప్రీం కోర్టు స్పందన

మార్చు

భారతదేశపు వివాహ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఆదరణకు నోచుకొనబడ్డదనీ, ఇటీవలి కాలంలో ఇటువంటి వ్యవస్థను అపహాస్యం పాలు జేసేలా చిన్న విషయాలకు కూడా మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారనీ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.[23] ఒక్కోమారు ఈ చట్టం యొక్క దుర్వినియోగం వలన మరణశయ్యల పైనున్న వయోవృద్ధులు కూడా బలిపశువులౌతున్నారని వాపోయింది.

కుటుంబాల లో రేగిన కలతలను మాపి కుటుంబ వ్యవస్థను రక్షించవలసిన బాధ్యత గల రక్షకభటులు, న్యాయవాదులు (కొందరు) ఇదే అదునుగా భర్తను అదుపులోకి తీసుకొనే/జైలలో వేసే కారణం చూపి తమ ధనదాహాన్ని తీర్చుకొంటున్నారని, పోలీసు స్టేషన్లలో/క్రింది-స్థాయి కోర్టులలో అంతర్గతంగా పైరవీలు చేసి అయినా సరే భర్తను అదుపులోకి తీసుకొనేలా చేస్తున్నారని సుప్రీం కోర్టు పదే పదే తీవ్రంగా దుయ్యబట్టినది.

కేవలం అధికారం ఉన్నంత మాత్రాన అడ్డగోలుగా అరెస్టు చేయటం కాదనీ, అరెస్టు ఎందుకు చేస్తున్నామన్న విచక్షణా జ్ఞానం కూడా పోలీసులకు ఉండాలని హెచ్చరించింది. చివరకు ఈ విషయమై భారత పార్లమెంటు జోక్యం కలుగజేసుకొనవలసిన దుర్దశ వచ్చినందుకు బాధను వ్యక్తం చేసినది. అయిననూ ఆశించిన ఫలితం లేకపోవటంతో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr.PC) తాజా సవరణలలో సరైన కారణం లేనిచో ఇటువంటి కేసులలో అభియోగాలు మోపబడిన ఏ వ్యక్తినీ (భర్తతో సహా) అదుపులోకి తీసుకొనరాదనీ, అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పేర్కొన్నది.

శ్వేతా కిరణ్/అర్నేష్ కుమార్ ల వ్యాజ్య/ప్రతివ్యాజ్యాలు

మార్చు

శ్వేతా కిరణ్ అనే వివాహిత తన భర్త అర్నేష్ కుమార్, అతని తల్లిపై వేసిన వ్యాజ్యంలో క్రింది కోర్టు, హై కోర్టులు వారికి బెయిల్ ను నిరాకరించినవి. దీనితో అర్నేష్ కుమార్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2 జూలై 2014న సుప్రీం కోర్టు ఇరువురికీ బెయిళ్ళు మంజూరు చేసినది. ఏడు సంవత్సారాలు, లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడేంత పెద్ద నేరం చేసిన వారినే అదుపులోకి తీసుకోవాలని, వరకట్న వేధింపు చట్టాలలో అత్యధికంగా పడేది మూడేళ్ళ జైలు శిక్ష మాత్రమే అని, కావున ఇప్పటి నుండి ఈ కేసులలో సాక్ష్యాధారాలు లేకుండా (భర్తతో సహా) ఎవరినీ అదుపులోకి తీసుకొనరాదని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా చేసిన సంచలన వ్యాఖ్యలు:[24]

The institution of marriage is greatly revered in this country.
(ఈ దేశ వివాహ వ్యవస్థ ఎంతో గౌరవాన్ని చూరగొన్నది.)
The simplest way to harass is to get the husband and his relatives arrested under this provision.
(హింసించటానికి అతి సులభమైన దారి, ఈ చట్టం ద్వారా భర్తను, అతని కుటుంబీకులను అరెస్టయ్యేలా చేయటం.)
...the power of arrest is one of the lucrative sources of police corruption.
(...అరెస్టు చేసే అధికారం పోలీసుల అవినీతికి ఒక లాభదాయకమైన మూలమైనది.)
The attitude to arrest first and then proceed with the rest is despicable.
(మొదట అరెస్టు చేసి ఆ తర్వాతే జరగవలసినవి చూసే ధోరణి తుచ్ఛమైనది.)
The existence of the power to arrest is one thing, the justification for the exercise of it is quite another. Apart from power to arrest, the police officers must be able to justify the reasons thereof.
(అరెస్టు చేసే అధికారం ఉండటం నాణేనికి ఒక వైపు అయితే, ఆ అధికారం యొక్క వినియోగాన్ని సమర్థించుకోవటం మరొక వైపు. అధికారం కలిగి ఉండటమే కాదు, అరెస్టు చేయటానికి కారణాలు కూడా పోలీసు ఆఫీసర్లకు తెలిసి ఉండాలి.)

It has not come out of its colonial image despite six decades of independence, it is largely considered as a tool of harassment, oppression and surely not considered a friend of public.
(స్వాతంత్రం సిద్ధించి అరవై ఏళ్ళు గడచినా పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు నోచుకోలేదు. బ్రిటీషు పాలన నాటి పాత చింతకాయపచ్చడి పద్ధతులనే ఇంకా అవలంబిస్తోంది. వేధింపులకు, అణచివేతకు గురి చేసే పరికరంగానే పరిగిణింపబడుతోందే తప్పితే, ప్రజలకు స్నేహితుని వలె పరిగణింపబడవలసిన పోలీసు వ్యవస్థలో ఆ ఊసే లేదు.)
Arrest brings humiliation, curtails freedom and cast scars forever. Law makers know it so also the police.
(అరెస్టు అవమానాన్ని తెచ్చిపెడుతుంది, స్వేచ్ఛను హరించివేసి, ఎన్నటికీ మానని గాయాలని చేస్తుంది. చట్టాలు చేసేవారికీ, పోలీసులకు కూడా ఈ విషయం తెలుసు.)

మనీషా పొద్దార్/ప్రీతి గుప్తాల వ్యాజ్య/ప్రతివ్యాజ్యాలు

మార్చు

కేవలం భర్త, అతని తోబుట్టువులకు అసౌకర్యం కలిగించాలనే దురుద్దేశ్యంతోనే ఆధారాలు లేని వ్యాజ్యం వేసిన మనీషా పొద్దార్ పై ఆమె ఆడపడుచు ప్రీతి గుప్తా వేసిన ప్రతివ్యాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం 13 ఆగష్టు 2010 న చేసిన వ్యాఖ్యలు.[25]

Unfortunately, at the time of filing of the complaint the implications and consequences are not properly visualized by the complainant that such complaint can lead to insurmountable harassment, agony and pain to the complainant, accused and his close relations.
(దురదృష్టవశాత్తూ, ఫిర్యాదు చేసే సమయంలో, ఈ ఫిర్యాదుల వలన ఎదురయ్యే చిక్కులను, పరిణామాలను; తనకే కాక, ఎవరిపై ఫిర్యాదు చేయబడినదో వారికి, వారి కుటుంబీకులకు భరింపశక్యం కానంత హింసను, వేదనను, బాధను తెచ్చిపెడతాయని ఫిర్యాదుదారులు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.)
The ultimate object of justice is to find out the truth and punish the guilty and protect the innocent. To find out the truth is a herculean task in majority of these complaints.
(న్యాయం యొక్క ప్రధాన లక్ష్యం సత్యాన్ని కనుగొని దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయటం. సత్యాన్ని కనుగొనటం ఇటువంటి ఫిర్యాదులలో కత్తిమీద సాము వంటిది.)


At times, even after the conclusion of criminal trial, it is difficult to ascertain the real truth.
(ఒక్కోమారు, నేర విచారణ అంతా పూర్తయిన తర్వాత కూడా, నిజానిజాలని తేల్చటం కష్టతరంగానే మిగిలిపోతోంది.)
Experience reveals that long and protracted criminal trials lead to rancour, acrimony and bitterness in the relationship amongst the parties.
(సుదీర్ఘ కాలం సాగే నేర విచారణలు తలక్రిందులై, ఇరుపక్షాల సంబంధబాంధవ్యాలలో అస్థిరత, హింసలను తెచ్చి, పరిస్థితులను తీవ్రతరం చేశాయని అనుభవపూర్వకంగా తెలుసుకొనబడింది.)"
...if the husband or the husband's relations had to remain in jail even for a few days, it would ruin the chances of amicable settlement altogether. The process of suffering is extremely long and painful.
(...భర్త/అతని కుటుంబీకులు ఏ కొద్ది రోజులపాటు జైలులో గడపవలసి వచ్చినా, సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకొనే ఆ చిరు అవకాశానికి కూడా దారులు మూసుకుపోతున్నాయి. సుదీర్ఘ కాలం కొనసాగే బాధాకరమైన ప్రక్రియలకు ఇది దారి తీస్తోంది.)
...exaggerated versions of the incident are reflected in a large number of complaints. 
(...జరిగిన సంఘటనలను పెంచి చెప్పటం చాలా ఫిర్యాదులలో సాధారణమైపోయింది.)
Unfortunately a large number of these complaints have not only flooded the courts but also have led to enormous social unrest affecting peace, harmony and happiness of the society. 
(దురదృష్టవశాత్తూ ఇటువంటి ఫిర్యాదులు న్యాయస్థానాలను ముంచెత్తటమే కాక అపారమైన అశాంతిని నెలకొల్పి శాంతిభద్రతలకు, సామరస్యానికి, సంఘం అనుభవించవలసిన సుఖసంతోషాలకు విఘాతం కలిగిస్తున్నాయి.)
It is high time that the legislature must take into consideration the pragmatic realities and make suitable changes in the existing law. 
(శాసనసభ కార్యసాధక వాస్తవాలని పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం అమలులో ఉన్న చట్టానికి తగు సవరణలు చేయవలసిన పతాక సమయం ఆసన్నమైనది.)"

క్రూరమైన చర్యలు

మార్చు

క్రౌర్యం అనేది భాగస్వాముల యొక్క జీవన విధానాలను బట్టి, సాంఘిక/ఆర్థిక స్థితిగతులను బట్టి, ఆయా కుటుంబాలు అవలంబించే సంస్కృతి-సాంప్రదాయలు/మానవీయ విలువలను బట్టి; ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా పరిగణించవలసి ఉంటుంది. ఒక కేసులో క్రూరమైనదిగా కనబడే చర్య మరొక కేసులో క్రూరంగా కనబడకపోవచ్చు. వీటికి ఇదమిత్థంగా నియమాలు లేకపోయినప్పటకీ న్యాయనిపుణులు సూత్రప్రాయంగా కొన్ని చర్యలను క్రూరమైన చర్యలుగా నిర్ధారించారు.

క్రింద పేర్కొన్న చర్యలేవీ శారీరక హింసగా పరిగణింపబడకపోయిననూ, భర్త యొక్క హృదయాన్ని గాయపరచే చర్యలు కావటం మూలాన, వీటి వలన భర్త యొక్క శారీరక/మానసిక ఆరోగ్యాల పై ప్రభావం ఉంటుంది కనుక ఈ చర్యలు క్రూరమైన చర్యలుగా నిర్ధారించబడినవి.[26][27]

  • భర్తను బంధుమిత్రుల ఎదుట కించపరచటం
  • భర్త బంధువుల ఎదుటే మంగళసూత్రాన్ని తెంచివేయటం
  • పెళ్ళి రోజునే పూలమాలను తెంచివేయటం
  • అతని శారీరక అసమర్థత గురించి సణుగుతూ ఉండటం
  • భర్తతో శారీరక సంబంధాన్ని నిరాకరించటం
  • విడాకుల కోసం నమోదు చేసుకొనకనే మరొక వివాహం చేసుకొనటం
  • ఉద్దేశ్యపూర్వకంగానే భర్తకు నచ్చని దుస్తులని ధరించటం
  • భర్తను నిర్లక్ష్యం చేయటం
  • వివాహేతర సంబంధాలను ఏర్పరచుకోవటం
  • భర్త పట్ల అనాసక్తత కనబరచటం, అతనిని అవమానించటం
  • తాను ఆత్మహత్య చేసుకుంటానని భర్తను బెదిరించటం
  • భర్తను ఇంటి బయటే ఉండేలా చెయ్యటం
  • భర్త చొక్కాను చించి వేయటం
  • సమయానికి వంట చేయకపోవటం/సరిగా వంటచేయకపోవటం
  • భర్త అభీష్టానికి వ్యతిరేకంగా పుట్టినింటికి వెళ్ళి వస్తూ ఉండటం
  • ఇంటి పనిని చేయటానికి నిరాకరించటం
  • భర్త పని చేసే కార్యాలయంలో ఫిర్యాదు చేయటం
  • భర్త పై నిరసన వ్యక్తం చేయటం
  • భర్త పై నిరాధారమైన అభియోగాలు మోపటం
  • వేరు కాపురం పెట్టాలని భర్తను వత్తిడికి గురి చేయటం

మానసిక క్రౌర్యం

మార్చు

మానసిక క్రౌర్యానికి విశాలమైన అర్థము ఉన్ననూ ఇటువంటి కేసులలో ఈ విధంగా నిర్వచించబడినది -

When either party causes mental pain, agony or suffering of such a magnitude that it severs the bond between the wife and husband. In other words, the party who has committed wrong is not expected to live with the other party 
(ఇరువురిలో ఎవరైనను, భార్యాభర్తల బంధాన్ని విడదీసేంతగా, ఎవరి మనసునైనను గాయపరచిననూ, ఎవరిని వేదనకి గురి చేసిననూ, బాధించిననూ అది మానసిక క్రౌర్యమే. అనగా బాధించినవారు బాధపడినవారితో సహజీవనము చేయరాదు.)

ఈ క్రింది చర్యలు మానసిక క్రూర చర్యలుగా నిర్ధారింపబడినవి

  • భర్త, అతని కుటుంబీకులు సంతానాన్ని కావాలనుకొన్నప్పుడు కనీసం రెండు మార్లు గర్భాన్ని తొలగించివేసుకొనటం
  • భాగస్వాములలో ఒకరి ప్రవర్తన మరొకరికి అనాలోచితంగా అగుపించటం, పర్యవసానాలను లెక్క చేయకపోవటం, భరింపరానంత విపరీతంగా ఉండటం
  • తప్పుడు కేసులు బనాయించటం

లైంగికత/లైంగిక సంబంధాలు

మార్చు

వివాహం సాధారణ, సమగ్ర లైంగిక సంబంధంతోనే పరిపూర్ణం అవుతుంది. వివాహం జరిగే నాటికి భాగస్వాములలో ఎవరికైననూ జనాంగాలు లోపాలు కలిగి ఉండటం వలన గానీ లేదా ఏదేని ఇతర కారణాల వలన సాధారణ లైంగికానందాన్ని ఇవ్వలేక పోవటం గానీ జరిగితే అవి వివాహాన్ని అసంపూర్ణంగానే ఉంచేస్తాయి కాబట్టి, అటువంటి వివాహమును తప్పించటం లేదా రద్దు చేయటం జరుగుతుంది.

అక్రమ సంబంధ అరోపణలు

మార్చు

భర్తపై మోపబడ్డ వివాహేతర సంబంధ అభియోగాలు నిరాధారాలు అని తేలిననూ అది కూడా క్రూరమైన చర్య క్రిందకే జమకట్టబడుతుంది.

జాగ్రత్తలు/సలహాలు/సూచనలు

మార్చు

2012 నాటికి నమోదైన 498A కేసులలో ఋజువైన నేరాలు కేవలం 15% మాత్రమే. నానాటికీ ఇవి తగ్గుముఖం పట్టటం శుభపరిణామం. అయితే నిరాధారమైన ఆరోపణలకు మానవ ప్రయత్నంతో కొంతవరకు కళ్ళెం వేయవచ్చును. వాటిలో కొన్ని -

  • పెళ్ళికి ముందే భార్యాభర్తలిరువురూ సంబంధిత చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొనటం
    • ఎటువంటి పరిస్థితులలో భార్య నిజంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చును? దాని వలన లాభనష్టాలేమిటి?
    • భర్తగా తన బాధ్యతలేమిటి. ఏం చేయాలి? ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు? తప్పుడు కేసులకు వ్యతిరేకంగా భర్త ఎలా పోరాడవచ్చు?
    • ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టాలలో అతివేగంగా చోటుచేసుకొంటున్న మార్పులు, ఎప్పటికప్పుడు అమలులోకి వస్తున్న తాజా సవరణలు
  • పెళ్ళి అయిన తర్వాత భర్త జాగరూకతతో ఉండటం (ఉదా: ఈ నాటి సాంకేతిక అభివృద్ధితో ఫోన్ ద్వారా జరిగే/ఇతర సంభాషణలను రికార్డు చేసే అవకాశం ఉంది. ఇటువంటి రికార్డింగులు కోర్టులో ఋజువులుగా ప్రవేశపెట్టినా వాటి వల్ల నేరాలు ఎంతవరకు ఋజువయ్యే అవకాశం ఉన్నదనేది ప్రశ్నార్థకమే, అయిననూ వ్యవహారాన్ని అంతదూరం వరకు తీసుకెళ్ళకుండా ఉండటమే అందరికీ, అన్నివిధాలా శ్రేయస్కరం)
  • పెళ్ళి అయిన తర్వాత ఒక వేళ ఏవయినా అభిప్రాయ భేదాలు తలెత్తితే భర్త ఓర్పు, సహనం, సంయమనం పాటించటం
  • భర్త తన భావోద్రేకాలను అదుపులో ఉంచుకొనగలగటం (సహజంగానే భారతీయ సమాజంలో నెలకొని ఉన్న వివిధ పరిస్థితుల దృష్ట్యా, స్త్రీకి చిన్నతనం నుండే తన భావోద్రేకాలను అదుపుచేసుకొనటం అలవడుతుంది. స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలను అనుభవించిన పురుషునిలో ఈ శక్తి తక్కువగా ఉంటుంది. ఘర్షణ కల వివాహ బంధంలో సాక్ష్యాల కోసం ప్రయత్నించే భార్య, భర్త భావోద్రేకాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించే ప్రమాదం ఉంది. తర్వాత ఆ సాక్ష్యాలతో అతనిని బెదిరించే ప్రమాదమూ ఉంది.)
  • ఎట్టి పరిస్థితులలోనూ భర్త హద్దు మీరరాదు (ఉదా: భార్యను దుర్భాషలాడటం, కొట్టటం లేదా ఇతర శారీరక/మానసిక హింసకు పాల్పడటం చేయరాదు)
  • చుట్టు ప్రక్కల వారితో భర్త సరైన సంబంధబాంధవ్యాలను నెరపటం (నాలుగు గోడల మధ్య స్త్రీ ఎంత క్రూరంగా ఉన్ననూ, బయటి ప్రపంచానికి తాను సౌమ్యురాలనే భావననే కలిగించగలుగుతుంది. సమాజంలో కూడా స్త్రీ పడే బాధలన్నింటికీ పురుషుడే కారణం అన్న భావం నెలకొని ఉంది.[28] దీనివలన భర్త స్థానంలో ఉన్న పురుషుడిని అపార్థం చేసుకొనే అవకాశమే ఎక్కువ ఉంది. కావున బంధుమిత్రులపై కోపతాపాలను, విసుగును ప్రదర్శించినచో వారు భర్తనే అనుమానించే ప్రమాదం పొంచి ఉన్నది)
  • తమ వివాహ బంధంలో ఘర్షణ చోటుచేసుకొంటున్నది అని భర్తకు అనిపించిన వెంటనే తమ సమీప/శ్రేయోభిలాషులైన వారితో న్యాయనిపుణులని సంప్రదించటం, తగు జాగ్రత్తలను తీసుకొనటం
  • ఆర్థికంగా జాగ్రత్త పడటం. ఢిల్లీ వంటి మహానగరాలలో విడాకుల చట్టం ఒక పరిశ్రమగా పరిఢవిల్లుతూ ఉండటంతో అక్కడి యువకులు పెళ్ళికి ముందే తమ ఆస్తి-పాస్తులన్నీ తమ పేరున కాక, తల్లి పేరిటనో, తోబుట్టువుల పేరిటనో మార్చుకొంటున్నారు.
  • తమ పై కేసు వేసినది అని తెలియగానే భర్త/అతని సంబంధీకులు బెంబేలు పడరాదు. కేసు వేయగనే జైలు పాలు అని భావించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ అనవసరంగా ఎవరినీ అరెస్టు చేయరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను గుర్తుంచుకోవాలి. మొదట బెయిళ్ళకు దరఖాస్తు చేసుకోవాలి. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం ఈ చట్టంలో బెయిలు రావటం సులభతరం, చవక అయినది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఒక్క పని జరిగిపోతే, మిగతా సమస్యలను తర్వాత ఎలా అయినా పరిష్కరించుకొనవచ్చును.

హఠాత్పరిణామాలు

మార్చు

సంసారంలో తరచూ ఘర్షణలు ఏర్పడటం, భర్త పట్ల క్రౌర్యానికి దారి తీసే ప్రమాదము ఉంది. భార్యకు ఆ ఉద్దేశం లేకపోయిననూ, ఇతరుల ప్రోద్బలాలు, దురుద్దేశ్యాలకు ఆమె లొంగటం వలన తను న్యాయస్థానాన్ని అశ్రయించే అవకాశం ఎంతయిననూ ఉంది. దీని వలన భర్త ఉద్యోగరిత్యా, వ్యక్తిగతంగా కొన్ని హఠాత్పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. వీటికి భర్త సంసిద్ధంగా ఉండాలి.

  • ప్రభుత్వ ఉద్యోగం అయితే 24 గంటలు మించి అతను జైలులో ఉంటే సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. (ఇటువంటి వ్యాజ్యాలలో అదే పనిగా శుక్రవారం జైలులో వేసే ప్రమాదం ఉంది. దాని వలన సోమవారం వరకు భర్త జైలులో గడపవలసిన ఆగత్యం ఏర్పడుతోంది.) కొంత కాలం తర్వాత మరల ఉద్యోగంలో చేరవచ్చును. ప్రభుత్వం స్త్రీ కే అనుకూలంగా ఉంటుంది కాబట్టి భరణం వంటి విషయాల నిర్ణయాలలో భర్త చేతిలో ఏమీ ఉండదు. సంబంధిత లావాదేవీలు సదరు కోర్టు, ప్రభుత్వం చూసుకొంటాయి. (భర్త జీతం అటాచ్ మెంట్ జరుగుతుంది.)
  • ప్రైవేటు సంస్థలు చట్టపరంగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి స్థానమివ్వటానికి సంకోచిస్తాయి. ఉన్న ఉద్యోగం ఊడనూవచ్చు. క్రొత్త ఉద్యోగాలు రాకపోనూవచ్చును. కేసు పరిష్కారం తర్వాతనే ఉద్యోగం గురించి ఆలోచించవలసి రావచ్చు.[29]
  • భర్త వ్యక్తిగతంగా బాధపడవలసి ఉంటుంది. ఒంటరితనాన్ని భరించవలసి ఉంటుంది. సంతోషంగా ఉన్న జంటలను, వారి పిల్లలను చూచి పాత జ్ఞాపకాలతో మనసు భారమవుతుంది.
  • విషయం తెలిసిన బంధుమిత్రులు భర్తను అనుమానించే అవకాశం ఉంది. దూరమయి పోయే ప్రమాదమూ ఉంది. వీలైతే, అవసరమనుకొంటే వాస్తవాలు వాళ్ళకు వెల్లడించాలి. అంతవరకూ నమ్మని వారు సైతం, తన భార్య కోర్టు మెట్లు ఎక్కినది అని తెలియగనే వాస్తవాన్ని గ్రహించే అవకాశమూ లేకపోలేదు.
  • భార్యను వెనక్కి తెచ్చుకొని సంసారం చేయటమా, శాశ్వతంగా ఈ బంధాన్ని తుడిచివేయటమా అన్న అంతిమ నిర్ణయం భార్యా-భర్తలదే. ఈ విషయంలో ఎవరి ప్రభావాలకి లోను కాకుండా, ప్రశాంతంగా ఆలోచించి, దీర్ఘకాలిక ఆలోచనలతో ముందుకు కదలాలి. చేసిన తప్పుని తెలుసుకొని మసలుకొనే భార్య అయితే, అంతకన్నా అదృష్టమే లేదు. కానీ మరల మరల ఇలా జరగదు అనే నమ్మకం లేకపోతే మాత్రం, ఆ బంధాన్ని అక్కడితో తుడిచివేయటమే సర్వులకూ క్షేమదాయకం.
    • వరకట్న వేధింపు చట్టాల ద్వారా ఏమీ చేయలేకపోయాం, కాబట్టి వేరే నేరారోపణలు మోపాలి అని ఆలోచించే భార్య/ఆమె కుటుంబీకులు లేకపోలేదు
    • ప్రమాదవశాత్తు భార్య తీవ్రగాయాల పాలైనా/మరణించినా, ఆత్మాహుతికి ప్రయత్నించినా, ఆ ప్రయత్నంలో తీవ్రగాయాలపాలైనా/మరణించినా మరల హత్యానేరారోపణలను ఎదుర్కొనవలసిన ప్రమాదం భర్తకు ఉన్నది
    • హతాశురాలైన భార్య పతిహత్యకు కూడా ఒడిగట్టవచ్చును

అనుబంధ చట్టాలు

మార్చు

గృహ హింస (Domestic Violence)

మార్చు

ఈ చట్టం గురించి ఒక న్యాయవాది -

The Act is meant to aid persons who have suffered domestic violence and have been thrown out of their houses as it provides them the right to a shared household. Many people misuse the act to harass their spouses.
"(నిజంగానే గృహ హింసకు గురై ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన వారికి ఈ చట్టం ఆ ఇంట్లో భాగస్వామిగా ఉండటానికి హక్కును ఇచ్చినది. కానీ చాలా మంది వారి జీవిత భాగస్వామిని హింసించటానికే ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తారు.)[30]

498A తో బాటుగా గృహ హింస చట్టం, భరణం చట్టాలను భార్య ప్రయోగించే అవకాశం ఉన్నది. 498A, గృహ హింస చట్టాలకు ఇట్టే తేడా లేదు. పోలీసుల, న్యాయవాదుల జోక్యం లేకుండా సామరస్య పరిష్కరణ కొరకే ప్రత్యేకమైన గృహహింస చట్టం తేబడినది. గృహహింస జరిగినట్లు సాక్ష్యాలుంటే స్త్రీ-శిశు సంక్షేమ మహిళా అధికారి దంపతులకి కౌన్సిలింగ్ నిర్వహించి భార్యకు భర్త నుండి రావలసిన పరిహారం ఇప్పించే వసతి ఉన్నది. అయితే ముందు కోర్టును ఆశ్రయించి తర్వాత సంక్షేమాధికారిని ఆశ్రయించినచో, ఈ కేసు విచారన కూడా కోర్టు పరిధికే వెళుతుంది.[31]

భరణం (Maintenance)

మార్చు

భార్య నిరుద్యోగి అయినచో ఆమె ఐపీసీ సెక్షను 125 క్రింద తాత్కాలిత/శాశ్వత భరణం కోరే అవకాశం ఉన్నది. అయితే, భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి ఎంత జీతం వస్తోంది, అతని స్థిర/చరాస్తులేవి అన్న వాటికి భార్య వద్ద ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఉండాలి. వీటిని పరిశీలించిన తర్వాత వివాహం జరిగి ఎంత కాలమైనది, ఎంత మంది పిల్లలు ఉన్నారు, నిజంగానే భార్య ఉద్యోగం చేసే పరిస్థితులు లేవా వంటి అంశాలని పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం ఎంత భరణమివ్వాలో నిర్ణయిస్తుంది. భరణం ఎంత అన్నది కేసు-కేసుకీ మారుతూ ఉండటం మూలాన దీనికి ఖచ్చితమైన నియమనిబంధనలేవీ లేవు.[32][33]

కేసు జరిగినన్ని రోజులు కోరే భరణం తాత్కాలితం కాగా విడాకులు తీసుకొన్న తర్వాత కోరే భరణం శాశ్వతం. ఇది నెలవారీగా తీసుకోవాలా, జీవితకాల భరణం ఒకే మారు తీసుకోవాలా అన్నది భార్య నిర్ణయం. క్రింది కోర్టులో విధించిన భరణం ఎక్కువగా ఉన్నది అని భర్తకు అనిపించినచో, అతను పై కోర్టును ఆశ్రయించవచ్చును. విధించబడిన భరణం ఎందుకు ఎక్కువ అనే విషయంపై వాదోపవాదాలు విన్న తర్వాత పై కోర్టు తగిన చర్యలు తీసుకొంటుంది.

భరణం కడుతూ ఉండే సమయంలో, నెలవారీగా కట్టే భరణం భర్త కట్టలేకపోయినచో, అతడు భార్యను వెనక్కి పిలిపించకొనవచ్చును. భార్య రాని పక్షంలో భర్త కోర్టుని ఆశ్రయించవచ్చును. నెలవారీ భరణమూ ఇవ్వక, తనను వెనక్కీ పిలుచుకొనక ఉండే భర్త పై మరల భార్య దావా వేయవచ్చును. ఈ పరిస్థితులలో భర్తను జైలుకి పంపే అవకాశం ఉన్నది. జైలు వలన జీవనభృతి కోల్పోయే ప్రమాదమూ ఉన్నది.

ఒకే మారు జీవితకాలం భరణం ఇచ్చినచో ఇరువురూ కొత్త జీవితాలని ప్రారంభించవచ్చును.

అసౌకర్యాలు

మార్చు
  • ఈ చట్టాలను భార్య తనకు అనుకూలమైన ప్రదేశం నుండే ప్రయోగించవచ్చును. చాలావరకు ఈ ప్రదేశం తన పుట్టినిల్లు అయ్యి ఉండవచ్చును. భర్త ఉద్యోగం చేసే ప్రదేశం భార్య పుట్టినింటికి దూరం అయితే ఆ వ్యయప్రయాసలు తప్పవు. వయోవృద్ధులైన భర్త తల్లిదండ్రులను కూడా ఈ కేసులలో ఇరికించినట్లయితే శారీరకంగా/మానసికంగా, వారు పడే బాధలు వర్ణనాతీతం.
  • వియ్యంకులు స్థానికంగా బలం/బలగం గల వారై, భర్త స్వస్థలం, భార్య పుట్టినిల్లు ఒకటే కానపుడు పలు సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఉదాహరణకు స్థానిక లాయర్ల/పోలీసుల సహకారం భర్తకు కావలసినంత మేరకు అందకపోవటం. వియ్యంకులు లాయర్లను/పోలీసులను రాజకీయ/ధన/ఇతర ప్రలోభాలకు లోను చేసి ప్రభావితం చేయగలగటం. కేసు భార్య వైపు వారికే అనుకూలంగా నడిచేటట్లు చూడటం

సాక్ష్యాధారాలు

మార్చు

మిగతా చట్టాలలో వలె భర్త పట్ల క్రౌర్యం చట్టంలో కూడా అభియోగాలు మోపే వ్యక్తే వాటి సాక్ష్యాధారాలను చూపవలసి ఉంటుంది. సరైన సాక్ష్యాధారాలు ఉండి, క్రౌర్యం గనుక ఋజువైతే ఏకగ్రీవంగా కోర్టు విడాకులను మంజూరు చేయటం జరుగుతుంది.

ఉపసంహరణ/కేసుల కొట్టివేత

మార్చు

సరియైన సాక్ష్యాధారాలు లేకపోయిననూ/సాక్షులు (భార్య కూడా సాక్షే) తాము కేసును ఉపసంహరించుకోవాలనుకొన్ననూ వారి వద్ద నుండి వాంగ్మూలమును తీసుకొని 498ఏ కేసు కొట్టివేయబడుతుంది. ఒకవేళ లోక్ అదాలత్ ద్వారా కేసును ఉపసంహరించుకొనదలచుకొంటే, మూడు నెలల గడువు వరకు కేసును పరిశీలనలో ఉంచి (ఈ కాలంలో ఎటువంటి గృహహింస జరగనిచో), ఎటువంటి విచారణ లేకుండా లోక్ అదాలత్ ద్వారా కేసు కొట్టివేయబడుతుంది.

గృహహింస, భరణం వంటి కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొనే సౌలభ్యం కలదు.

విడాకులు

మార్చు

విడాకులను మంజూరు చేసే అధికారం మాత్రం లోక్ అదాలత్ కు లేదు. ఇరువురి అంగీకారంతో విడాకుల దరఖాస్తును పొందిన కోర్టు, ఆరు నెలల గడువు సమయమిచ్చి, అప్పటికి కూడా భార్య విడాకులు కోరుకొంటూ ఉంటేనే, వాటిని మంజూరు చేస్తుంది.

సినిమాలలో

మార్చు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో గయ్యాళి అత్తగా/భార్యగా సూర్యకాంతం భర్తపై ప్రత్యక్షంగా, అల్లుడిపై పరోక్షంగా క్రూరత్వం కనబర్చే పాత్రలకి పెట్టింది పేరు.

సామాజిక దృక్పథం

మార్చు

క్రూరత్వాన్ని అనుభవించే భర్తను, సమాజం ఎప్పుడూ హాస్యాస్పదంగానే పరిగణిస్తోంది. భర్త పడే వేదన తేలికగానే తీసుకొనబడుతోంది.

సయ్యద్ మక్దూం ఆత్మాహుతి

మార్చు

అహ్మదాబాద్ కు చెందిన, కెనడాలో స్థిరపడిన మక్దూంకు, భారతదేశానికి చెందిన ముస్కాన్ సెర్ అనే ఒక స్త్రీ తో షాదీ.కాం లో పరిచయమైనది.[34] ఆమె కోసం అతను కెనడా వదిలి భారతదేశానికి వచ్చి ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. వారికి ఒక కుమారుడు (సయ్యద్ రెయ్యాన్). అయితే అంతకు ముందే ఆమెకు వివిధ పేర్లతో నాలుగు మార్లు వివాహములైనవని, నాలుగు మార్లూ వరకట్న వేధింపు చట్టాలతోనే ఆమెకు వారితో విడాకులవటమే కాక పలుమార్లు తాను అబార్షన్ చేయించుకొన్నదని మక్దూం కు తెలిసినది. ముస్కాన్ యొక్క అసలు రంగు మక్దూంకు తెలియటంతో ఆమె అతనిపై మరల ఈ చట్టాల దుర్వినియోగానికి ఒడిగట్టినది. దీనితో వారు విడిపోయారు. మక్దూం ను మానసికంగా వేధించి అతని ఆస్తిపాస్తులను సొంతం చేసుకోవాలనే దురుద్దేశ్యంతోనే ముస్కాన్ తో సహా ఆమె కుటుంబసభ్యులందరూ కలిసి అతనిని కుమారునికి దూరం చేశారు. ఆమె రెయ్యాన్ ఆలన-పాలనలపై సరిగా ధ్యాస చూపేది కాదని, బాలుడిని శారీరకంగా హింసించేదని కూడానని ఒక లేఖలో మక్దూం పేర్కొన్నాడు. స్వాభావికంగానే పిల్లలంటే ఇష్టపడే మక్దూం, తాము విడిపోయినా తన రక్తం పంచుకుపుట్టిన రెయ్యాన్ పై గల అమితమైన ప్రేమను మాత్రం చంపుకోలేకపోయాడు. రెయ్యాన్ ను చూడకుండా ఉండలేకపోయాడు. రెయ్యాన్ ను చూడటానికి మక్దూం చేయని ప్రయత్నం లేదు.

I fell at her feet and begged to see my son. But to no avail. [35] 
 (మా అబ్బాయిని చూడనివ్వమని ఆమె కాళ్ళపై పడి నేను ప్రాధేయపడ్డాను. కానీ ఫలితం లేకపోయింది.) 

పాషాణ హృదయురాలైన ముస్కాన్ ఏ మాత్రం కరగకపోవటంతో మక్దూం వకీలును ఆశ్రయించాడు. కానీ మక్దూం యొక్క ప్రేమాభిమానాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోలేని తన వకీలు కేసును సాగదీయటం తప్ప మరేమీ చేయలేకపోయాడని వాపోయాడు. రెయ్యాన్ ను తనకు చూపించటానికి సహాయపడమని తన భార్యను, ఆ సామాజిక వర్గాన్ని ప్రాధేయపడుతూ 2009లో మక్దూం తన పై తనే ఒక వీడియో తీసుకొన్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ దానిని యూట్యూబ్ లో ఎక్కించి ఆత్మహత్య చేసుకొన్నాడు.[36]

స్త్రీ సంక్షేమ చట్టాలపై సమరశంఖం ఊదిన సుహైబ్ ఇల్యాసీ

మార్చు

పైసా కట్నం లేకుండా, పెళ్ళి ఖర్చులు కూడా తనే భరించి అంజును ప్రేమ వివాహం చేసుకొన్న, ఢిల్లీకి చెందిన లఘుచిత్ర రూపకర్త సుహైబ్ ఇల్యాసీకి తన భార్య తమ ప్రేమకు కానుకగా ఒక కుమార్తెను ఇచ్చింది. కొంతకాలం తర్వాత ఇతర కారణాల వలన ఆమె ఆత్మహత్య చేసుకొన్నది. ఆమె వైపు తల్లిదండ్రులు/సోదరుడు అతని పై హత్యానేరాలు మోపారు. అతని పేరుప్రతిష్ఠలు మంటగలపాలని, అతని కుమార్తె సంరక్షణ వారికే చెందాలనేదే వారి దురుద్దేశ్యం. కానీ ఇల్యాసి పై వారు చేసిన ఏ నేరారోపణలు ఋజువు కాలేదు.

అయితే స్వీయ జీవితంలో తను అనుభవించిన ఈ బాధ కంటే, తన స్నేహితుడు సయ్యద్ మక్దూం అనుభవించిన వేదన, క్షోభలు మరింత దయనీయమైనవని, దాని ప్రేరణతోనే తాను 498A: The Wedding Gift అనే విమర్శాత్మక లఘుచిత్రాన్ని నిర్మిస్తున్నానని ఇల్యాసి తెలిపాడు.

మృదుభాషి అయిన ఇల్యాసి మాటలలో -

I believe we need strict laws against dowry. It is a thousand-year-old custom and there are greedy people in our society. Women are killed and men are cruel. That is the reality. But we need to amend the law so that innocent men do not suffer when the law is misused. That is the sole purpose of my film - to stop this ordeal.
(కఠినమైన వరకట్న వ్యతిరేక చట్టాలు ఉండాలని నేను నమ్ముతున్నాను. ఇది ఒక వెయ్యి సంవత్సరాల పురాతన సంప్రదాయం, పైగా సంఘంలో చాలా మంది దురాశపరులే ఉన్నారు. క్రూరులైన మగాళ్ళ వలనే వివాహిత స్త్రీలు హత్యలకు గురవుతున్నారు. ఇది వాస్తవమే. కానీ, ఈ చట్టం దుర్వినియోగం వలన ఏ అమాయక పురుషుడూ బాధించబడకుండా ఉండేలా దీనిని సవరించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. నా లఘుచిత్రం యొక్క ఏకైక లక్ష్యం - పురుషజాతి ఎదుర్కొంటున్న ఈ కఠిన పరీక్షకు చరమగీతం పాడటమే.)

ఇవి కూడా చూడండి

మార్చు
  1. నిషా శర్మ వరకట్న వేధింపు వ్యాజ్యం
  2. సుహైబ్ ఇల్యాసీ
  3. మొహమ్మద్ షమీ పై అక్రమ సంబంధాల ఆరోపణలు
  4. పురుషులపై హింస
  5. పురుషుల హక్కులు
  6. పురుషవాదం
  7. అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఈ సమస్య పై తెలుగులో వచ్చిన కథలు

మార్చు
  • వేమూరి వేంకటేశ్వరరావు, "లోలకం," రచన ఇంటింటి పత్రిక, మార్చి 2008, కథాపీఠం పురస్కారం అందుకున్న కథ; "మహాయానం" ఇ-పుస్తకంలోని కథా సంకలనంలో తిరిగి ముద్రించబడింది, kinige.com

మూలాలు

మార్చు
  1. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ వెబ్ సైటు
  2. వధూవరుల మంగళవచనములు
  3. "THE DOWRY PROHIBITION ACT, 1961,(Act No. 28 of 1961)". Archived from the original on 2015-03-18. Retrieved 2015-08-08.
  4. భర్త/అతని కుటుంబీకులు, ఇల్లాలిని వరకట్న వేధింపులకు గురి చేయకుండా రక్షించటానికే రూపొందించబడ్డ చట్టం
  5. What is IPC-498a ? Why is it misused ?[permanent dead link]
  6. Government proposes making IPC 498A compoundable
  7. 4 జూలై 2014 సిడ్నీ మార్నింగ్ అవర్
  8. Misuse of Section 498A: A reality check
  9. "నా కోడలి అక్రమ సంబంధమే నా ఆత్మాహుతికి కారణం (ద టెలిగ్రాఫ్ - 24 జూలై 2010)". Archived from the original on 2015-09-24. Retrieved 2015-10-24.
  10. False cruelty cases under Section 498A ruining marriages, SC says
  11. విడాకులు ఒక పరిశ్రమగా పరిఢవిల్లుతున్నాయని తెలిపిన మెన్స్ రైట్స్ ఇండియా
  12. [ఎన్ ఆర్ ఐ లు అయితే మరిన్ని కష్టాలు (హన్స్ ఇండియా - 24 జనవరి 2015)]
  13. భార్య వేసిన తప్పుడు కేసులతో డిప్రెషన్ బారిన పడిన భర్త (డి ఎన్ ఏ ఇండియా - 4 జూలై 2014)
  14. Cases of married men committing suicide on the rise: Report[permanent dead link]
  15. "Sec-498 A I.P.C. – Its Use And Misuse". Archived from the original on 2015-08-29. Retrieved 2015-08-08.
  16. "Why supreme court calls 498a as "Legal Terrorism"?". Archived from the original on 2015-08-11. Retrieved 2015-08-08.
  17. Misuse of dowry provisions is legal terrorism: Court
  18. ఢిల్లీకి చెందిన సాధనా రామచంద్రన్ అనే మహిళా న్యాయవాది వ్యాఖ్య
  19. లింగ వివక్షకు సమాధానం చట్టాలు కాదన్న పురుష హక్కులు సంఘాలు (ద గార్డియన్ - 13 డిసెంబరు 2007)
  20. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించాడు, అందుకే చంపాను - శిల్పారెడ్డి
  21. "అతనొక శాడిస్టు. అందుకే చంపాను - శిల్పారెడ్డి". Archived from the original on 2015-07-21. Retrieved 2015-08-17.
  22. గృహ హింస ఫిర్యాదు ఫారం[permanent dead link]
  23. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-19. Retrieved 2015-03-23.
  24. Arnesh Kumar vs State Of Bihar & Anr on 2 July, 2014 Bench: Chandramauli Kr. Prasad, Pinaki Chandra Ghose
  25. Preeti Gupta & Anr vs State Of Jharkhand & Anr on 13 August, 2010
  26. http://www.lawyersclubindia.com/articles/Cruelty-against-Husband-5694.asp#.VQ-zFf6UckE
  27. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-27. Retrieved 2015-03-23.
  28. బాధితులెప్పుడూ స్త్రీలే, చట్టాలను వీరు దుర్వినియోగం చేయలేరు అనుకోవటం పొరబాటు (టైమ్స్ ఆఫ్ ఇండియా - 17 ఆగష్టు 2010)
  29. ఆదర్శాలకు పోయి పేదింటి పిల్లను చేస్కొన్నందుకు నాకు తగిన శాస్తే జరిగినది (డెక్కన్ హెరాల్డ్ - 15 మే 2009
  30. గ్రహ హింస చట్టం దుర్వినియోగం గురించి ఒక న్యాయవాది (డెయిలీ మెయిల్ - 30 నవంబరు 2013)
  31. "Protection of Women from Domestic Violence Act, 2005" (PDF). Archived from the original (PDF) on 2013-03-01. Retrieved 2015-08-08.
  32. "The Impact of New Illinois Maintenance Guidelines". Archived from the original on 2015-11-25. Retrieved 2015-08-08.
  33. Husband is bound to give maintenance to separated wife, says Supreme Court
  34. 10 ఏప్రిల్ 2009, టైమ్స్ ఆఫ్ ఇండియా
  35. 16 ఏప్రిల్ 2009, మిడ్ డే
  36. సయ్యద్ అహ్మద్ మక్దూం చివరి సందేశం యూట్యూబ్ లంకె

ఇతర లింకులు

మార్చు
  1. http://www.supremecourtcases.com/index2.php?option=com_content&itemid=99999999&do_pdf=1&id=46177 Archived 2017-07-10 at the Wayback Machine
  2. http://www.supremecourtcases.com/index2.php?option=com_content&itemid=54&do_pdf=1&id=19042[permanent dead link]