ఈ సినిమా హేమారెడ్డి మల్లమ్మ అనే శివభక్తురాలి జీవిత కథ ఆధారంగా చిత్రించబడింది. ఈమె కథను ముందు 1946లో కన్నడ భాషలో హేమారెడ్డి మల్లమ్మ అనే పేరుతో సౌందర్య రాజన్ దర్శకత్వంలో గుబ్బి వీరణ్ణ నిర్మించారు.

మల్లమ్మ కథ
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ.సంజీవి
తారాగణం కృష్ణ,
శారద
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నేపథ్య గానం పి.సుశీల
గీతరచన దాశరథి కృష్ణమాచార్య
నిర్మాణ సంస్థ ఆర్.ఎస్. మూవీస్
భాష తెలుగు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాత: బి.చెంచురామయ్య
  • దర్శకత్వం: అక్కినేని సంజీవి
  • మాటలు: వీటూరి
  • పాటలు: వీటూరి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, దాశరథి
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • నేపథ్యగానం: పి.సుశీల, ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది, రఘురాం, కౌసల్య, రమోలా
  • నృత్యం: వెంపటి సత్యం
  • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
  • కూర్పు: బి.ఎస్.ప్రకాశ్
  • ఛాయాగ్రహణం: ఎ.ఆర్.కె.మూర్తి

నటీనటులు

మార్చు

కథా సంగ్రహం

మార్చు

నాగలాపురంలో అతి సామాన్యమైన కుటుంబంలో మల్లమ్మ జన్మించింది. చిన్న తనంలోనే తల్లి చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచాడు తండ్రి లింగారెడ్డి. తండ్రి వలె ఆమె శివభక్తురాలు. శివరాత్రి ఉత్సవాలను చూస్తున్న మల్లమ్మను అక్కడున్న అమ్మలక్కలు ఆమె జాతకం మంచిది కాదని పుట్టగానే తల్లిని పోగొట్టుకుందని తిట్టారు. అంత వరకు అమ్మ దేవుని వద్దకు వెళ్ళిందని లింగారెడ్డి చెప్పినమాటలు అబద్ధం అనిపించాయి. అమ్మను చూపించమని శివుని విగ్రహం ముందు మోకరిలి ప్రార్థించాడు. భక్తవశంకరుడైన శివుడు ఆమె తల్లి రూపంలో వచ్చి మల్లమ్మను లాలించాడు. రాత్రంతా తమవద్దమే ఉండమని చిన్నారి మల్లమ్మ చేసిన ప్రార్థనను త్రోసిపుచ్చలేక పోతాడు శివుడు.

ఆనంద తాండవం చేస్తూ ఉండగా మధ్యలో అదృశ్యుడైన పరమశివుడు లేకుండా కైలాసం వెలవెల బోతున్నది. అక్కడికి కలహప్రియుడైన నారదుడు వచ్చి భోళాశంకరుడు ఐన వారికి, కాని వారికి వరాలిచ్చి నవ్వులపాలవుతున్నాడనీ, అతడిని అదుపులో ఉంచుకోమని పార్వతిని పురిగొల్పి వెళ్ళిపోయాడు. పాత్రాపాత్రత తెలియకుండా వరాలివ్వకూడదని స్వామీ అని పిలువగానే ఏమీ అని ప్రత్యక్షం కారాదని శివుణ్ణి కట్టడి చేసింది పార్వతి. మల్లమ్మ కారణజన్మురాలని, మహాభక్తురాలని ఆమె పిలుపు విన వెళ్ళకుండా ఉండలేక పోయానని శివుడు ఎంతగా చెప్పినా పార్వతి వినలేదు. నా శక్తి కంటే నీ భక్తురాలి భక్తి ఎక్కువా అని ప్రశ్నించింది పార్వతి. అవును శక్తి కంటే భక్తి గొప్పది అంటాడు శివుడు. శక్తి కంటే భక్తి గొప్పదని నిరూపిస్తానని శివుడు పార్వతితో పందెం కడతాడు.

మల్లమ్మకు పెళ్ళీడు వచ్చింది. పాత బంధుత్వాలు మరచిపోకుండా హేమారెడ్డి తన రెండవకొడుకు వెంగళరెడ్డికి మల్లమ్మను ఇచ్చి పెళ్ళి చేశాడు. ఈ సంబంధం పెద్ద కోడలు చండికి ఇష్టం లేదు. తన పెత్తల్లి కూతురును చేసుకోలేదని ఆమెకు కడుపు మంట. అవీ ఇవీ చెప్పి అత్త మనసు పాడుచేసింది. మేనకోడలు చెప్పినట్టుగా అత్త దుర్గ ఆడేది. కొత్త కోడలు అని చూడకుండా మల్లమ్మతో ఇంటి చాకిరీ అంతా చేయిస్తారు. ఏదో సాకు చెప్పి వెంగళరెడ్డిని పొలంలోనే పడుకోమనే వారు. అన్నీ సహించింది మల్లమ్మ. మామతో కలిసి శివపూజలు చేసేది. మామగారికి ఆమె అంటే అభిమానం.

ఏరువాకలో అరకలు దున్నుతున్న వీరారెడ్డిపై పిడుగులు పడి ఎడ్లు చనిపోతాయి. వీరారెడ్డి చూపు పోతుంది. ఇవన్నీ ఎడ్లకు హారతినిచ్చి ఎదురు వచ్చిన మూలానే అని అత్త, తోడికోడలు ఆడిపోసుకుంటారు. ఆ దోషం పోవడానికి సహస్రఘటాభిషేకం చేయాలంటారు. వేయి కడవలూ రాత్రికిరాత్రే మల్లమ్మనే తోడమన్నారు. మల్లమ్మ తన శక్తి కొలదీ తోడింది. ఇక తోడలేక గంగాభవానీని ప్రార్థించింది. గంగ కరుణించింది. బిందెలు నిండాయి. అత్తకి, తోడికోడలుకి కళ్ళు కుట్టాయి. ఎలాగైనా ఆమెపై కక్ష తీర్చుకోవాలనుకున్నారు. అదను కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

శివుడి ప్రదక్షిణ చేస్తున్న మల్లమ్మను ఆ ఊళ్ళో తిరుగుబోతు రంగడు బలాత్కరించబోతాడు. అది చూసిన అమ్మలక్కలు మల్లమ్మ చెడిపోయిందని అత్తతో చెబుతారు. ఆమె నమ్మింది. కానీ ఆ సమయంలో పొలం నుండి తిరిగి వస్తున్న వెంగళరెడ్డి రంగడిని కొట్టి మల్లమ్మను కాపాడుతాడు. కానీ నలుగురు దృష్టిలో చెడిపోయిన మల్లమ్మను ఇంటిలోనికి రాకుండా పశువులపాకలో ఉండమన్నారు అత్త, తోడికోడలు. పూజకు విగ్రహాలు కూడా తీసుకోవడానికి వీలులేదన్నారు. శివపూజ చేయనిదే శివుడికి నైవేద్యం పెట్టనిదే ఉండని మల్లమ్మకు ఇది కంటకంగా తోచింది. రుబ్బురోలునే శివలింగంగా భావించి పూజించసాగింది. అది చూసిన దుర్గ, చండి ఆమెను పిచ్చిది అన్నారు. వెంగళరెడ్డికి మారుమనువు చేయాలనుకున్నారు. మల్లమ్మ బ్రతికుండగా అది అసాధ్యమని భావించి ఆమెను చంపడానికి చండి విఫల ప్రయత్నం చేసింది.

మల్లమ్మ మీద కన్ను వేసిన రంగడు ఒక రాత్రి పాకలో దూరి ఆమెను బలాత్కరించబోయాడు. మల్లమ్మ ఎదురు తిరిగి అక్కడ ఉన్న కత్తిపీట తీసుకుని అతడిని బెదిరించింది. దాంతో రంగడు పారిపోయాడు. ఇది చూసిన దుర్గ, చండి ఇంట్లో మగవాళ్ళకీ దృశ్యం చూపించారు. మగవాళ్ళు మారు పలకలేక పోయారు. దీనికి తోడు ఇంట్లో పోయిన దేవుడి వెండి విగ్రహాలు మల్లమ్మనే దొంగిలించిందని నిందమోపి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అవమానాలతో కృంగిపోయిన మల్లమ్మను ఒక కోయరాజు ఆదరిస్తాడు. తన ప్రియురాలు సరస కోసం ఇంట్లో నగలు దొంగలించిన వేమారెడ్డి పశ్చాత్తాపంతో ఇంటికి వచ్చి ఆ విషయం చెబుతాడు. వెంగళరెడ్డి మల్లమ్మను వెదుకుకుంటూ వెడతాడు. రంగడు మళ్ళీ మల్లమ్మను బలాత్కరించబోయాడు. వెంగళరెడ్డి రంగడిమీద పడ్డాడు. ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు. వెంగళరెడ్డి రంగడి చేతిలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇది చూసిన మల్లమ్మ తన భర్తను కాపాడమని శివుని గొంతెత్తి ప్రార్థించింది. ఆమె భక్తికీ, ప్రార్థనకూ ప్రకృతి చలించిపోయింది. శివుని ఆత్మజ్యోతి బయలు దేరి మల్లమ్మలో చేరింది. శివుడు స్థాణువు అయిపోయాడు. నారదుడు పార్వతితో తనకు పతిభిక్ష పెట్టమని మల్లమ్మను వేడుకోమంటాడు. పార్వతికి పతిభిక్ష లభించింది. జ్యోతి శివునిలో చేరింది. మల్లమ్మ మహాభక్తురాలని, శక్తి కన్నా భక్తి గొప్పదని పార్వతి అంగీకరించింది.

మల్లమ్మ భక్తికి సంతసించి శివుడు ఆమెక్కూడా శ్రీశైలంలో తన సన్నిధిలోనే స్థానం లభిస్తుందని ఆశీర్వదించాడు. ఆ విధంగా వెలసిన మల్లమ్మ విగ్రహం నేటికీ శ్రీశైలం దేవాలయంలో ఉంది.[1]

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా వీటూరి ఎస్.పి.కోదండపాణి పి.సుశీల
భవహరణా శుభచరణా నాగాభరణా గౌరీరమణా దాశరథి ఎస్.పి.కోదండపాణి పి.సుశీల
శరణం శ్రీ కైలాసనాథా వర తాండవ కేళీవినోదా వీటూరి ఎస్.పి.కోదండపాణి జె.వి.రాఘవులు బృందం
క్రూరుడని యెరింగి కోరి వరమొసంగి (పద్యం) వీటూరి ఎస్.పి.కోదండపాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
తొలివాన కురిసిందీ తొలకరి వచ్చిందీ కొసరాజు ఎస్.పి.కోదండపాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే సినారె ఎస్.పి.కోదండపాణి పి.సుశీల, కౌసల్య బృందం
నిన్నటిదాకా నీవు కన్నె పడుచువూ సినారె ఎస్.పి.కోదండపాణి బృందం
మచ్చలేని చందమామను ఎప్పుడైనా చూశారా సినారె ఎస్.పి.కోదండపాణి పి.సుశీల
సరిసరి ఈ వేళ ఈ బిగువేల? గడసరి నా సామి రావేల? వీటూరి ఎస్.పి.కోదండపాణి ఘంటసాల, పి.సుశీల
అంతా శివమయమే కాదా శ్రీ శివలీలలు వినరాదా వీటూరి ఎస్.పి.కోదండపాణి పి.సుశీల బృందం
ఎంతటి సరసుడివో ప్రియా ఎంతటి చతురుడివో ప్రియా సినారె ఎస్.పి.కోదండపాణి ఘంటసాల, పి.సుశీల
కానరావా దేవాదేవా దీనజనపోషా వీటూరి ఎస్.పి.కోదండపాణి పి.సుశీల బృందం

మూలాలు

మార్చు
  1. ఈశ్వర్. మల్లమ్మ కథ పాటల పుస్తకం. p. 12. Retrieved 14 August 2020.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

మార్చు