వడ్లమాని విశ్వనాథం
వడ్లమాని విశ్వనాథం నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవాడు.
జీవిత విశేషాలు సవరించు
ఇతడు 1912లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, నందంపూడి అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.[1] బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడుగారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించాడు.
నాటకరంగం సవరించు
1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదినీ సభలో ప్రవేశించాడు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో "హరిశ్చంద్ర" నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించాడు. ఆ నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు. ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు చంద్రమతిని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది. కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో కాకినాడ లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు. ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను, ధ్రువ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్భుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించాడు. 1926 నాటికి ప్రమీలార్జునీయంలో ప్రమీల, 'చింతామణి'లో చింతామణి, జవ్హరీబాయి, సావిత్రి, మోహిని మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించాడు. బాలకృష్ణుడు మొదలు భక్తరామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు సమస్త ముఖ్య స్త్రీ, పురుష పాత్రలను ఇతడు ధరించాడు.
ముఖ్యంగా ఇతడు నటించిన “ప్రమీల", "రోషనార", "చింతామణి" నాటక ప్రదర్శనాలతో వచ్చిన డబ్బుతో కాకినాడలో ది యంగ్ మెన్స్ పాలెస్ థియేటర్ కట్టడమనేది చర్చిత ప్రసిద్ధమైన విషయం. ఆ గౌరవం ఇతడికే దక్కింది.
ఇతడు స్త్రీ పాత్రలేకాక, రామదాసు లో "రామదాసు", విప్రనారాయణలో "విప్రనారాయణ" మొదలైన పురుష పాత్రలను అద్భుతంగా అభినయించి మెప్పించాడు.
1930 లో "యంగ్‌మెన్స్ యూనియన్" పేరుతో స్వంత కంపెనీ స్థాపించి 1932 వరకు నడిపి, ఎస్.పి.లక్ష్మణస్వామి, ఎ.వి.సుబ్బారావు, రేలంగి మొదలయిన బాల్యమిత్రులతో ఆనేక నాటకాలను ప్రదర్శించాడు. ఆ తరువాత 1935 వరకు పారుపల్లి సుబ్బారావుగారి కంపెనీలో బలిజేపల్లి వారితో హీరోయిన్‌గా ఎన్నో నాటకాలు ఆడాడు. సి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఇతడి సహకారంతో స్వంత కంపెనీ స్థాపించి "తుకారాం", "పతితపావన", "చింతామణి", "రాధాకృష్ణ" వగైరా నాటకాలు ప్రదర్శించాడు. దురదృష్టవశాత్తు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్క్రమించాడు.
సినిమారంగం సవరించు
ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడం వల్ల సినిమా రంగంలో ప్రవేశించాడు. పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్యం (1939) నుండి శ్రీవెంకటేశ్వర మహత్యం (1960) వరకు, నాటి శివరావు నటించిన పరమానందయ్య శిష్యులకథ(1950) నుండి పరమానందయ్య శిష్యులకథ(1966) వరకు అనేక చిత్రాలలో బహువిధమైన పాత్రలను ధరించాడు.
ఇతడు నటించిన సినిమాల జాబితా:
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1939)
- పరమానందయ్య శిష్యులు (1950)
- సంతోషం (1955)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
- నవగ్రహ పూజామహిమ (1964)
- పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా) (1966)
- తల్లి ప్రేమ (1968)
- రాజకోట రహస్యం (1971)
- మల్లమ్మ కథ (1973)
సన్మానాలు సవరించు
తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులందరితోను నటించి, లెక్కలేనన్ని బంగారు పతకాలు, రజితపాత్రలు అందుకున్నాడు. మైసూర్ మహారాజా, హైదరాబాదు రాజా కృష్ణప్రసాద్, జయపూర్ మహారాజా వంటి కళాపోషకులతో సత్కరింపబడ్డాడు.
బిరుదులు సవరించు
- ఆంధ్ర రంగస్థల నక్షత్రం
- బాలనట భానుడు
- రంగస్థల ప్రసూన
- భావ చింతామణి
- నటశిఖామణి
మూలాలు సవరించు
- ↑ నటరత్నాలు Archived 2020-08-08 at the Wayback Machine - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి - ఆంధ్రప్రభ వారపత్రిక - 15-03-1972[permanent dead link]