మల్లాది వెంకట సత్యనారాయణ రావు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మల్లాది వెంకట సత్యనారాయణరావు (1932 మే 6 - 1996 నవంబరు1) సంగీత విద్వాంసులు, రేడియో కళకారుడు, సంగీత కళానిధి బిరుదాంకితుడు. సుమారు 45 సంవత్సరాలుగా వయోలిన్ వాద్య కళాకారునిగా సంగీత ప్రపంచానికి సుపరిచితుడు.
బాల్యం, సాధారణ విద్య
మార్చుమల్లాది వెంకట సత్యనారాయణ రావు కాకినాడ సమీపంలోని ద్రాక్షారామంలో మల్లాది సత్యనారాయణ మూర్తి, సూర్యకాంతం దంపతులకు ప్రథమ కుమారుడిగా 1932 మే 6న జన్మించాడు. తండ్రి సత్యనారాయణ మూర్తి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మండపేట లో పనిచేస్తూండటంతో అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు.
ప్రేరణ
మార్చుతండ్రి మల్లాది సత్యనారాయణ మూర్తి సహజకవి. ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ఉప్పొంగే విధంగా ప్రత్యేకంగా కవితలు రాసి తమ పాఠశాల విద్యార్థులకు నేర్పేవాడు. దాంతో అందరూ అతనికి 'కవిగారు' అంటూ గౌరవంగా పిలిచేవారు. సంగీతమంటే ఆయనకు చాలా ఇష్టం. తండ్రి ఎప్పుడూ చెప్పే మంచిమాటలు, లలితకళలపై అతనికున్న ఆసక్తి కుమారుడిపై అధిక ప్రభావం చూపాయి. అదేవిధంగా తల్లి సూర్యకాంతం 'కామేశ్వరీదేవి' భక్తురాలు. తల్లి ద్వారా సంక్రమించిన ఈ భక్తి భావం మల్లాదిని దేవీ ఉపాసకునిగా తీర్చి దిద్దింది. తన 24 ఏళ్ళ వయసులో తండ్రి మరణం మల్లాది జీవితంలో కోలుకోలేని పరిణామం.
సంగీత శిక్షణ
మార్చుమండపేటలోని బోర్డు మిడిల్ స్కూల్ (ప్రస్తుతం ఇది కాలేజీ ) లో విద్యాభాసంచేస్తున్న సమయంలోనే తన తొమ్మిదవయేట (1941 డిసెంబరు 16 న) ఏడిద గ్రామానికి చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాసులు నల్ల సత్యం వద్ద సంగీత శిక్షణ ప్రారంభించాడు. మండపేటలో సంగీతం నేర్చుకుంటున్న తొలిదశలో నాగుల్ని ఆడించే వ్యక్తి వద్ద ప్రత్యేకంగా నాగస్వర వాదనం నేర్చుకున్నాడు. రామచంద్రపురంలో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసిన అనంతరం భాషాప్రవీణ చేస్తున్న సమయంలో సంగీతంపై మక్కువతో దానిని మధ్యలోనే విడచిపెట్టి, విజయనగరం సంగీత కళాశాలలో మ్యూజిక్ వయోలిన్ డిప్లమో చేసాడు. ఆ తర్వాతి కాలంలో ఒకల్ లోనూ డిప్లమో చేసి, సంగీత కళాకారులుగా కాకినాడలో స్థిరపడ్డారు. హరికథకులకు వయోలిన్ వాద్య సహకారం అందిస్తూనే, హరికథకులు దువ్వూరి సుబ్బారావు భాగవతార్ వద్ద హరికథా గానంలో ప్రత్యేక శిక్షణ పొందాడు.
ఉద్యోగ జీవితం
మార్చుకాకినాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సంగీతోపాధ్యాయులుగా సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ చేసాడు. అనేకమంది శిష్య ప్రశిష్యులను సంగీత కళాకారులుగా తీర్చిదిద్దిన మల్లాది వెంకట సత్యనారాయణ రావు సుదీర్ఘ కాలం సంగీత విద్వత్సభ, శ్రీరామ సమాజం జాయింట్ సెక్రటరీగానూ, అలాగే లయన్స్ సంగీత పాఠశాలలో శిక్షకులుగానూ విశేష సేవలందించాడు. ఆకాశవాణి కోసం ప్రత్యేక సంగీత రూపకాలు తయారుచేసి విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల ద్వారా అందించారు. టీచర్స్ ట్రయినింగ్ సర్టిఫికేట్ కోర్సులో సంగీత విభాగానికి చాలా సంవత్సరాలపాటు ఇనస్ట్రక్టరుగా పనిచేసాడు.
కళాకారునిగా
మార్చువయోలిన్ వాదనంతో బాటు, గాత్రంలోనూ మల్లాది నిష్ణాతుడు. సంగీత కళాకారులకు వాద్య సహకారం అందించడంతోబాటు, వయోలిన్ సోలో కచేరీలు, గాత్ర కచేరీలు ఇచ్చాడు. అలాగే పార్వతీకల్యాణం, రుక్మిణీ కల్యాణం హరికథలనూ గానం చేశాడు. మల్లాది నాగస్వర వాదనంలో అందెవేసిన చెయ్యి.
కాకినాడ, బరంపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లో అభిమానుల కోరికపై వీరు నాగస్వరం వాయించినప్పుడు అనేక నాగులు పడగ విప్పి నృత్యం చేయడం నాటి ప్రత్యక్ష్య సాక్షుల గుండెల్లో చెరగని ముద్ర. సినీ నటుడు, నటవిరాట్ బిరుదాంకితుడు రావు గోపాలరావు మల్లాదికి అత్యంత సన్నిహితుడు. 1952 నుండి 1965 మధ్య సంవత్సరాల కాలంలో రావు గోపాలరావు దర్శకత్వంలో మల్లాది సంగీత దర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించిన ‘విక్రాంతి’ నాటకం నాటక ప్రియుల అభిమానాన్ని చూరగొంది.
బిరుదులు, సత్కారాలు
మార్చుకపిలేశ్వరపురం జమిందారు యస్.పి.పి.బి.కె. సత్యనారాయణ రావు కపిలేశ్వరపురంలో నిర్వహించే హరికథా పాఠశాల విద్యార్థులకు మల్లాది హరికథా గానంలో మెళకువలు నేర్పాడు. సువర్ణ పతక, సువర్ణ సింహ తలాట గ్రహీత, సంగీత కళానిధి, మధుర గాయక, గానకళా సరస్వతి వంటి బిరుదులూ, ఘన సత్కారాలు పొందిన మల్లాది ఆంధ్ర దేశం నాలుగు చెరగులా విస్తృతంగా పర్యటించి హరికథకులకు వైలిన్ సహకారం అందించడంతో బాటు వయోలిన్ సోలో కచ్చేరీలు ఇచ్చారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సుమారు పది సంవత్సరాలబాటు ప్రతి ఏటా కళ్యాణమహోత్సవాలకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు వాద్య సహకారం అందించారు.
కుటుంబ వివరాలు
మార్చుఇతనికి ముగ్గురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద తమ్ముడు మల్లాది సుబ్బారావు జబల్ పూర్ లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు సెక్షన్ ఆఫీసర్ గా, రెండవ తమ్ముడు మల్లాది వెంకటరావు విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అసిస్టెంట్ జనరల్ మానేజర్ గా, మూడవ తమ్ముడు మల్లాది రామకృష్ణారావు ఎచ్.ఎస్.సి.ఎల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫోర్ మెన్ గా రిటైర్ అయ్యారు. పెద్ద చెల్లెలు విజయకుమారి వైజాగ్ లో హిందీ పండిట్ గా, చిన్న చెల్లెలు కామేశ్వరి కాకినాడలో సాధారణ గృహిణిగా ఉన్నారు. తీవ్ర అస్వస్థత కారణంగా 1996 నవంబరు 1న తన 64వ ఏట గుండెపోటుతో కాకినాడలో మృతి చెందారు. వీరికి భార్య సుబ్బలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మల్లాది సత్యనారాయణమూర్తి ఉపాధ్యాయుడుగా, రెండవ కుమారుడు మల్లాది సుబ్బారావు ఇంజనీరుగా, మూడవ కుమారుడు మల్లాది కామేశ్వరరావు జర్నలిస్టుగా ఉన్నారు.
చిత్రమాలిక
మార్చు-
వయోలిన్ వాయిద్యంతో మల్లాది వెంకట సత్యనారాయణ రావు
-
మల్లాది వెంకట సత్యనారాయణ రావు గాత్రకచేరి
-
ఆకాశవాణి "వనితావాణి" కార్యక్రమం రికార్డింగులో మల్లాది వెంకట సత్యనారాయణ రావు
-
మల్లాది వెంకట సత్యనారాయణ రావు గారికి సత్కారం
-
షష్టిపూర్తి సందర్భంగా భార్య సుబ్బలక్ష్మితో మల్లాది వెంకట సత్యనారాయణ రావు