మాదరి భాగ్య గౌతమ్ ఆది హిందూ భవనం క్రేందం నిర్వాహకుడు, సమాజ సేవకుడు, మానవతావాది. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

భాగ్యరెడ్డివర్మ, లక్ష్మీదేవి దంపతులకు గౌతమ్ ఏకైక సంతానం.[1] 1913, ఆగస్టు 22న జన్మించిన గౌతమ్, చిన్నతనం నుంచి తండ్రి భాగరెడ్డి వర్మ నడిపే ముద్రణాలయంలో గడుపుతూ, అక్కడి చర్చలు వింటూ ఉండడం వల్ల చిన్న వయసులోనే మానసిక పరిపక్వత పెంచుకున్నాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన తండ్రితో చనువుగా ఉంటూ ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు.

గౌతం నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి,. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించాడు. భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో నడిచిన ‘ఆది హిందూ పత్రిక’లో తన వంతు సహకారం అందించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, రజాకార్ల వ్యతిరేక పోరాటంలోను పాల్గొని కొంతకాలం పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ కాలంలోనే గౌతమ్ తన ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించాడు. తండ్రి స్థాపించిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా చేరి ఎంతోమంది విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దాడు. 1943లో అప్పటివరకు బాల బాలికలకు ఉమ్మడి పాఠశాలగా ఉన్న పాఠశాలను బాలికల పాఠశాలగా మార్చి, భాగ్య స్మారక బాలికల ఉన్నత పాఠశాలను జీవితాంతం నడిపాడు.

1942-52 సంవత్సరాల మధ్య ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే గౌతమ్ హైదరాబాదు సంస్థాన రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1952లో జరిగిన మొట్టమొదటి శాసనసభా ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాడు. బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలోని హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసంస్కరణల సంఘంలో గౌతమ్ సభ్యుడు. దళితులకు, పేదలకు భూములు దక్కడానికి ఆ కమిషన్ సభ్యుడిగా ఆయన శ్లాఘనీయమైన కృషి చేశారు. గౌతమ్ 1962లో శాసనమండలికి ఎన్నికై 1968 వరకు ఆంధ్రపదేశ్ విధాన పరిషత్ (శాసనమండలి) సభ్యులుగా ఉన్నాడు. 1971 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. భారతీయ బౌద్ధ మహా సభలకు గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేశాడు. 1992 లో భారత ప్రభుత్వం గౌతమ్ సామాజిక సేవలను గుర్తించి ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈయన రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేతుల మీదుగా 1992, ఏప్రిల్ 6న పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.[2]

ఎం.బి.గౌతమ్ తన తండ్రి జీవిత చరిత్రను భాగ్యోదయం అన్న పేరుతో వ్రాసి, ప్రచురించాడు.

భాగ్య గౌతమ్ 98 ఏళ్ళ వయస్సులో 2010 జూలై 8న మరణించాడు.

మూలాలుసవరించు