ముక్కు పుడక (సినిమా)

ముక్కుపుడక భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. గోపాలరెడ్డి నిర్మాతగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో సుహాసిని, భానుచందర్, విజయశాంతి, గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు చలన చిత్రం. తమిళంలో విజయవంతం అయిన గోపురంగళ్ సైవతిలై సినిమాను ముక్కుపుడకగా పునర్నిర్మించారు. జె.వి.రాఘవులు సంగీతం, గణేష్ పాత్రో మాటలు అందించారు.

ముక్కు పుడక
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఎస్.గోపాలరెడ్డి
తారాగణం భానుచందర్,
చంద్రమోహన్ ,
సుహాసిని, విజయశాంతి
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అందచందాలు లేకున్నా మంచి మనసున్న మంగతాయారు (సుహాసిని)ని అర్థంచేసుకోని భర్త ప్రసాద్ (భానుచందర్) మరో అమ్మాయి రీనా (విజయశాంతి)ని మోసగించి పెళ్ళిచేసుకోవడం, అది బయటపడి, భార్య విలువ తెలిసుకోవడం సినిమా కథాంశం. సినిమా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని, ఘన విజయం పొందింది. కథాంశం, సుహాసిని నటన, విలక్షణమైన గొల్లపూడి మారుతీరావు పాత్రపోషణ, పాటలు వంటివి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ పొందాయి.

మంగతాయారు (సుహాసిని) పల్లెటూరి పిల్ల, జడ కుక్కతోకలా వంకరగా ఉంటుంది. ఎంత దువ్వినా, ఏం చేసినా వంకర పోదు. ఆమె చూడడానికి నల్లని రంగులో ఉంటుంది. తాయారుని చూడడానికి వచ్చిన సంబంధాల వాళ్లంతా తిరిగి వెళ్ళిపోతూంటారు తప్ప పెళ్ళి కుదరదు. మంగతాయారు తండ్రి (పి.ఎల్.నారాయణ)కి చిన్ననాటి స్నేహితుడు పెంటా పరబ్రహ్మం (గొల్లపూడి మారుతీరావు) కలిసినప్పుడు మంగ పెళ్ళి విషయం ప్రస్తావనకు వస్తుంది. పెళ్ళికెదిగిన కూతురు వివాహం సమస్య అయిపోయిందని బాధపడుతున్న స్నేహితుడికి పరబ్రహ్మం తన కొడుకు ప్రసాద్ (భానుచందర్)కి ఇచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇస్తాడు.

ప్రసాద్ తన భార్య అప్సరసలా ఉండాలని ఊహల్లో తేలిపోతూండే మనిషి, కాబోయే భార్య కోసం ఒక అందమైన ముక్కుపుడక చేయించి పెట్టుకుంటాడు. తీరా పెళ్ళిచేసుకున్న మంగతాయారు తన ఊహలకు భిన్నంగా ఉండడంతో ఆమెని పురుగులా చూస్తాడు. మంగ మంచితనం, తనపై ప్రేమ, అత్తమామలతో సఖ్యత వంటివి ఏవీ అతనికి సంతృప్తిని ఇవ్వవు. దాంతో బదిలీ చేయించుకుని మద్రాసు వెళ్ళిపోతాడు. మద్రాసులో తన సహోద్యోగి రీనా(విజయశాంతి)కి తనకు పెళ్లికాలేదని, అనాధనని అబద్ధాలు చెప్పి పెళ్ళిచేసుకుని కాపురం పెడతాడు. భర్తని వెతుక్కుంటూ మద్రాసు వెళ్ళిన మంగ అతని ఇంట్లోనే పనిమనిషిగా చేరుతుంది. అతను మరో పెళ్ళిచేసుకున్నా కోపగించుకోక అభిరుచికి తగిన అమ్మాయిని వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నాడని భర్త సంతోషమే తన సంతోషంగా సంతృప్తి చెందుతుంది. మంగ మంచితనాన్ని, తన వల్ల పనిమనిషిగా పడుతున్న పాట్లని కూడా ప్రసాద్ అర్థం చేసుకోడు.

ఇంతలో ఒకరోజు నిజం బయటపడుతుంది, దాంతో మోసం చేసి పెళ్ళిచేసుకున్నందుకు రీనా మండిపడుతుంది. ఆవేశంలో అతడిని చంపబోతుంది రీనా. ఇంతచేసిన భర్తనీ క్షమించి వదలమని ప్రాధేయపడి మంగతాయారు కాపాడుతుంది. తన దగ్గర ముక్కుపుడక పెట్టుకోదగినది, తాను భార్యగా చూసుకోవాల్సినదీ తాయారునేనని ప్రసాద్ అర్థంచేసుకుంటాడు. రీనా త్యాగం చేసి తెరమరుగు అవుతుంది. మంగతాయారు, ప్రసాద్ తమ ఊరికి బయలుదేరి రైలు ఎక్కడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

సినిమాలోని సాంకేతిక వర్గం వివరాలు:[1]

నిర్మాణం

మార్చు

తమిళంలో తర్వాతి కాలంలో ప్రముఖ దర్శకుడిగా ఎదిగిన మణివణ్ణన్ తొలి చిత్రం - గోపురంగళ్‌ సైవతిలై. ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. సినిమా తెలుగు రీమేక్ హక్కులు నిర్మాత ఎస్.గోపాలరెడ్డి కొన్నారు. గోపురంగళ్ సైవతిలై సినిమా కథను తెలుగుదనం వచ్చేలా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శక రచయితలు కోడి రామకృష్ణ, గణేష్ పాత్రో ట్రీట్మెంట్ రాసి ముక్కుపుడక సినిమాగా తీశారు.

సంగీతం

మార్చు

సినిమాకు జె.వి.రాఘవులు సంగీతం అందించారు. "చినుకు చినుకుగా, చిగురు మెత్తగా", "మగని మనసుకే గుర్తు మగువ ముక్కుపుడక" పాటలు ప్రాచుర్యం పొందాయి.[1]

స్పందన

మార్చు

ముక్కుపుడక సినిమా ప్రేక్షకాదరణ పొంది, ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. సుహాసిని, గొల్లపూడి మారుతీరావుల నటన, గణేష్ పాత్రో సంభాషణలు, ముక్కు పుడక గురించిన టైటిల్ సాంగ్ ప్రత్యేకించి మన్ననలు పొందాయి.[1]

పాటల జాబితా

మార్చు

1.చినుకు చినుకుగా చిగురు మెత్తగా , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ

2. నా కళ్ళలోన నడిచింది స్వప్నం ఆ స్వప్న వీణ , రచన: సి.నారాయణ రెడ్డి, గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం .

3 బంతులాడేనే పుబంతులాడేనే బాలకృష్ణమ్మ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

4 . మగని మనసుకే గురుతు మగువ ముక్కుపుడక , రచన: సి.నారాయణ రెడ్డి, గానం పులపాక సుశీల.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 కె (21 April 2017). "భార్య రూపం కన్నా హృదయం ముఖ్యమని చెప్పే". సాక్షి. నాటి సినిమా. Archived from the original on 4 జూన్ 2017. Retrieved 4 June 2017.

2 . ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.