మోత్కూర్ గ్రంథాలయం

మోత్కూర్ గ్రంథాలయం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ పట్టణకేంద్రంలోని గ్రంథాలయం.[1] గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు, సాహితీవేత్తల, జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ, పుస్తకాల సేకరణలో భాగంగా ‘ఇంటికో పుస్తకం-గ్రంథాలయ భాగస్వామ్యం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి వేల పుస్తకాలు సేకరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రంథాలయం గుర్తింపు పొందింది.[2]

మోత్కూర్ గ్రంథాలయం
మోత్కూర్ గ్రంథాలయ భవనం
దేశముభారతదేశం
తరహాశాఖా గ్రంథాలయం
స్థాపితము1986
ప్రదేశముమోత్కూర్, యాదాద్రి భువనగిరి జిల్లా
గ్రంధ సంగ్రహం / సేకరణ
సేకరించిన అంశాలుపుస్తకాలు, పరిశోధన గ్రంథాలు, దిన-వార-మాసిక-పక్ష-వార్షిక పత్రికలు, చేవ్రాతలు
గ్రంధాల సంఖ్య~ 25,000 పుస్తకాలు/పత్రికలు
చట్టపరమైన జమఔను
ప్రాప్యత, వినియోగం
వినియోగించుటకు అర్హతలుఎవరైనా రావచ్చును

చరిత్ర

మార్చు
 
గ్రంథాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకం

మోత్కూరు గ్రంథాలయం 1986లో ప్రారంభమైంది. 1988 మే 1న అప్పటి రాష్ట్ర హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ఈ గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎంపీ డా. బద్దం నరసింహారెడ్డి, రామన్నపేట ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నీలం సహానీ, సర్పంచ్ డా. జి. లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ గ్రంథాలయంలో ఆదనపు గది నిర్మాణానికి రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ నుంచి 10 లక్షల రూపాయలు మంజూరుకాగా 2023 మే 14న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ శంకుస్థాపన చేశాడు.[3][4]

ఇందులో చైతన్య స్ఫూర్తిని రగిలించే అనేక పుస్తకాలు ఉన్నాయి. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏటా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.

గ్రంథాలయ కమిటీ

మార్చు

2014, నవంబరు 14న గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటుచేయబడి, ప్రస్తుతం ఇదే కమిటీ కొనసాగుతోంది.

  • చైర్మన్: కోమటి మత్స్యగిరి
  • వైస్ చైర్మన్: పోల్నేని స్వామి రాయుడు
  • ప్రధాన కార్యదర్శి: కప్పే యాకేశ్
  • కోశాధికారి: అన్నందాసు రామలింగం
  • ప్రచార కార్యదర్శి: కూరేళ్ళ రవి
  • డైరెక్టర్స్: నిలిగొండ కృష్ణ, బొల్లెపల్లి వీరేశ్, అవిశెట్టి సోమయ్య, దేవరపల్లి నర్సిరెడ్డి, దొంతోజు శ్రీనివాస్, గూడ అంజయ్య, బోడ సంధ్య

పుస్తకాల సేకరణ

మార్చు

2020, సెప్టెంబరు 9న తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ నారాయణరావు జయంతి) సందర్భంగా 10,000 పుస్తకాల సేకరణ లక్ష్యంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పుస్తకాల సేకరణ కార్యక్రమం మొదలయింది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో అనేకమంది దాతలు ముందుకు వచ్చి మోత్కూర్ గ్రంథాలయానికి పుస్తకాలు, ర్యాక్స్, కుర్చీలు, కంప్యూటర్ బహుకరించడం జరిగింది.[5]

ఇంటికో పుస్తకం - గ్రంథాలయ భాగస్వామ్యం

మార్చు

ప్రతి ఒక్కరికీ పుస్తకంతో, గ్రంథాలయంతో అనుబంధం ఉండాలనే ఉద్దేశంతో 2020, ఏప్రిల్ 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని దళితవాడ నుంచి ‘ఇంటికో పుస్తకం-గ్రంథాలయ భాగస్వామ్యం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి వేల పుస్తకాలు సేకరించి, గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతున్నారు.[6]

కార్యక్రమాలు

మార్చు
  1. ప్రతి ఏటా నవంబరు 1న వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి సందర్భంగా గ్రంథాలయం ఆధ్వర్యంలో మోత్కూర్ పాత బస్టాండ్ గాంధీ విగ్రహం నుండి గ్రంథాలయం వరకు పుస్తక ప్రియులతో పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు. హైదరాబాద్‌, భువనగిరి, ఆలేరు, రామన్నపేట, నల్లగొండ ప్రాంతాల కవులు, రచయితలు, మేధావులు, విద్యావంతులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమవుతారు.
  2. జాతీయ రాష్ట్రస్థాయి సాహితీవేత్తలు, ఉద్యమ నేతల జయంతులను, వర్ధంతులు జరుపబడుతున్నాయి.
  3. తెలంగాణ అవతరణ దినోత్సవం, తెలంగాణ భాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాల సందర్భంగా భాషా పరిరక్షణకు సంబంధించి అవగాహన సదస్సులు కూడా నిర్వహించబడుతున్నాయి.

మూలాలు

మార్చు
  1. "మోత్కూరు గ్రంథాలయానికి 50 పుస్తకాల అందజేత". ETV Bharat News. Archived from the original on 7 November 2021. Retrieved 7 November 2021.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (18 November 2020). "గ్రంథాలయ వారోత్సవాలకు కొవిడ్‌". andhrajyothy. Archived from the original on 7 November 2021. Retrieved 7 November 2021.
  3. ABN (2023-05-15). "గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు : ఎమ్మెల్యే కిషోర్‌". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-05-14. Retrieved 2023-05-15.
  4. "గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు". Sakshi. 2023-05-15. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
  5. "మోత్కూరు గ్రంథాలయానికి 260 పుస్తకాల బహూకరణ!". ETV Bharat News. Archived from the original on 7 November 2021. Retrieved 7 November 2021.
  6. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (16 October 2021). "ఉండమ్మా పుస్తకమిస్తా!". Namasthe Telangana. Archived from the original on 17 October 2021. Retrieved 7 November 2021.