మోహన్ లాల్ సుఖాడియా

మోహన్ లాల్ సుఖాడియా ( 1916 జూలై 31 – 1982 ఫిబ్రవరి 2) భారతీయ రాజకీయ నాయకుడు, 1954 నుండి 1971 వరకు,17 ఏళ్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 38 ఏళ్ళకే ముఖ్యమంత్రై, రాజస్థాన్లో ప్రధాన సంస్కరణలు చేపట్టి, అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఇందుకుగానూ, ఈయన ఆధునిక రాజస్థాన్ వ్యవస్థాపకుడిగా పరిగణించబడుతున్నాడు.[1][2] సుఖాడియా, ఆ తరువాతి కాలంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు.

మోహన్ లాల్ సుఖాడియా
మోహన్ లాల్ సుఖాడియా


పదవీ కాలం
13 నవంబరు 1954 -13 మార్చి 1967
ముందు జై నారాయణ్ వ్యాస్
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
26 ఏప్రిల్ 1967 - 9 జూలై 1971
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత బర్కతుల్లా ఖాన్

వ్యక్తిగత వివరాలు

జననం 31 జూలై 1916
ఝాలావర్, రాజస్థాన్
మరణం 2 ఫిబ్రవరి 1982 (65 సంవత్సరాలు)
బికనేర్, రాజస్థాన్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేస్

ప్రారంభ జీవితం

మార్చు

మోహన్‌లాల్ సుఖాడియా, రాజస్థాన్‌లోని ఝాలావర్ లో ఒక జైన కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి పురుషోత్తం లాల్ సుఖాడియా, బొంబాయి, సౌరాష్ట్ర జట్టులో ప్రసిద్ధి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.[3] నథ్‌ద్వారా, ఉదయ్‌పూర్లలో ప్రాథమిక విద్య పూర్తిచేసుకొని, సుఖాడియా బొంబాయి వెళ్ళి, అక్కడ వి.జె.టి.ఐలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో డిప్లొమా పూర్తిచేశాడు. అక్కడ చదువుతున్న కాలంలో విద్యార్థి సంఘానికి ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యాడు. కళాశాల బ్రిటీషు ప్రధానోపాధ్యాయుడైన మిస్టర్ బెర్లీ, కళాశాలలో జరిగే ఉత్సవానికి బొంబాయి గవర్నరును ఆహ్వానించాలని అనుకున్నాడు. కానీ, సుఖాడియా ఇతర విద్యార్థులతో కలిసి ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించి, గవర్నరుకు బదులుగా అప్పటి బొంబాయి ముఖ్యమంత్రి బి.జి.ఖేర్‌ను ఆహ్వానించాలని పట్టుబట్టారు. చివరకు కళాశాల అధికారులు విద్యార్థుల కోరికను మన్నించక తప్పలేదు.[3] ఈ విధంగా సుఖాడియా బ్రిటీషు పాలనపై విజయవంతంగా తన తొలి తిరుగుబాటును ప్రారంభించి, నాయకత్వ లక్షణాలను, యాజమాన్యనైపుణ్యాన్ని చాటుకున్నాడు. కళాశాలలో చదువుతుండగా, సుఖాడియాకు సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, యూసుఫ్ మెహరలీ, ఆశోక్ మెహతా వంటి అనేక జాతీయ నాయకులతో పరిచయమేర్పడింది. సుఖాడియా తరచుగా బొంబాయిలో పటేల్ నేతృత్వంలో జరిగే కాంగ్రేస్ కార్మికులు, స్వచ్ఛందసేవకుల సమావేశాలకు హాజరయ్యేవాడు.[4]

నథ్‌ద్వారాకు తిరిగివచ్చిన ఒక చిన్న ఎలక్ట్రిక్ రిపేరు దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ దుకాణము సుఖాడియా, ఆయన స్నేహితులు కలిసి అంతటా జరుగుతున్న బ్రిటీషు అరాచకాలను, ఆ ప్రాంతపు ఆర్థిక సామాజిక స్థితిగతులను చర్చించేందుకు సమావేశస్థలిగా మారింది.[5] సుఖాడియా తన సహచర పనివారితో కలిసి ఆ ప్రాంతంలో అనేక సామాజిక అవగాహనా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలకు ప్రణాళికలు వేసి, అమలుపరచేవారు.

1938 జూన్ 1 న ఈయన బియావర్‌లో ఇందుబాలను పెళ్ళిచేసుకున్నాడు. ఆ రోజుల్లో ఇలాంటి కులాంతర వివాహం సామాన్యమైన విషయం కాదు. నథ్‌ద్వారా, ఉదయపూర్లో గట్టి ప్రతిఘటన ఎదురౌతుందని సుఖాడియా బియావర్లో ఆర్య సమాజ పద్ధతి ప్రకారం పెళ్ళి చేసుకున్నాడు. ఇందుబాలతో నథ్‌ద్వారకు తిరిగి వచ్చినప్పుడు, అనేక మంది అనుచరులు వీరికి ఘనస్వాగతం ఇచ్చారు. సంతోషం పట్టలేని యువ అనుచరులు, నథ్‌ద్వారా వీధుల వెంట ఒక ఉత్సవంలా ఊరేగిస్తూ, "మోహన్ అన్న జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. ఇది సుఖాడియా జీవితంలో ఒక మరపురాని స్ఫూర్తిదాయకమైన ఘటనగా మిగిలిపోయింది. సుఖాడియా ఈ విషయాన్ని చనిపోయే కొన్ని రోజులకు ముందు ఒక ప్రత్యర్థికి వెల్లడించాడు.[6]

స్వతంత్ర్యోద్యమ పోరాటం

మార్చు

రాజులు, జాగీర్దారుల నిరంకుశ పాలన, మితిమీరిన పన్నుభారాన్నినిరసిస్తూ రాజ్‌పుటానా అంతటా ప్రజామండలాలు వెలశాయి. ఈ మండళ్లు ఆయా సంస్థానాల్లో సాంఘిక హక్కుల ఉద్యమాలకు, పాలనాసంస్కరణలకు దశాదిశానిర్దేశం చేశాయి. ఉదయపూరు సంస్థానంలో, 1938లో ప్రముఖ సామాజిక కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధుడైన మాణిక్యలాల్ వర్మ ఆధ్వర్యంలో మేవార్ ప్రజామండలి ఏర్పడింది. ఏర్పడిన ఒక సంవత్సరానికి అందులో మోహన్ లాల్ సుఖాడియా వంటి యువకుడు చేరటంతో మరింత నూతనోత్సాహం వచ్చింది.[7]

రాజస్థాన్లో స్వాతంత్ర్య పోరాటం బ్రిటీషు రాజ్, సంస్థాన ధీశులు, స్థానిక జమీందార్ల నుండి ద్విగుణీకర, త్రిగుణీకరమైన అవరోధం ఎదుర్కొంది. సుఖాడియా ఇతర కార్యకర్తలతో కలిసి రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలు, గ్రామాలను సందర్శించి, స్థానిక రైతులు, గిరిజనులను కలిసి, వారికి రాజ్యాంగ హక్కుల గురించి అవగాహన కలుగజేసి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేందుకు ప్రోత్సహించాడు. స్థానిక జమీందార్ల ఆగ్రహానికి గురౌతామన్న భయంతో, ఈ జాతీయవాద కార్యకర్తలకు ఎవరూ తమ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చేవారు కాదు. స్థానిక జమీందార్లు, కార్యకర్తల సంపర్కం, ఈ సాదాసీదా రైతులకు మంచిది కాదని నిర్ణయించి, ప్రజా సేవకులు భిల్ గ్రామాల్లో అడుగుపెట్టడానికి అనుమతించలేదు. భిల్ గ్రామాల్లో అడుగుపెట్టినందుకు తరచూ పోలీసులు కార్యకర్తలను కొట్టి, నిర్భంధించేవారు.

1946లో అనేక రాజ్యాల ప్రజామండళ్ళు ఏకమై రాజ్‌పుటానా ప్రాంతీయసభ అనే రాష్ట్రస్థాయి సంస్థ ఏర్పడింది. ఈ కొత్తగా ఏర్పడిన సంస్థ యొక్క అధికారవర్గంలో సుఖాడియా చేరాడు. ప్రతి 2-3 నెలలకు ఒక సంస్థానంలో పార్టీ సమావేశం జరిగేది. ఆ సమావేశానికి అన్ని సంస్థానాల నుండి ప్రతినిధులు హాజరై, రాష్ట్రంలో ఉమ్మడి సమస్యలపై చర్చించి, వాదించేవారు. ఈ సమావేశాల్లో సుఖాడియా యొక్క చాకచక్యమైన సమస్యా పరిష్కార నైపుణ్యాలకు సదస్యలు అత్యంత విలువనిచ్చేవారు.ఈ విధంగా సుఖాడియా రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందాడు.

మహాత్మాగాంధీ పిలుపుకు ప్రతిస్పందిస్తూ 1942లో రాజస్థాన్ మొత్తం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది. ఈ ఉద్యమంలో ప్రముఖనాయకులైన మాణిక్యలాల్ వర్మ, హీరాలాల్ శాస్త్రి, గోకుల్‌భాయ్ భట్, జై నారాయణ్ వ్యాస్, మోహన్‌లాల్ సుఖాడియా పాల్గొన్నారు. ఉద్యమ తీవ్రతను గ్రహించిన బ్రిటీషు ప్రభుత్వం దాన్ని ఆపటానికి పై స్థాయి నేతలనందరినీ జైళ్లో పెట్టింది. 25 ఏళ్ళ వయసులో సుఖాడియా ఒకటిన్నర సంవత్సరం పాటు జైలులో గడిపాడు.

1943లో కుంభవృష్టితో భిల్వారా తదితర ప్రాంతాలకు గణనీయమైన ఆస్తిమరియు ప్రాణ నష్టం కలిగింది.సుఖాడియా స్వచ్ఛంద సేవకులను పురికొల్పి బాధితులకు ఆహారము, మందులు, వస్త్రాలు అందేలా చేశాడు.

స్వాతంత్రం తర్వాత పాలనలో

మార్చు

1947, ఆగస్టు 15న, రాజస్థాన్ కు చెందిన 22 పెద్దా, చిన్న సంస్థానాలు భారత యూనియన్లో చేరటానికి సమ్మతించాయి. అయితే ఈ విలీనము, ఏకీకరణ, రెండు సంవత్సరాల పాటు, కొన్ని విడుతలుగా జరిగింది.[8] తొలి విడతలో, ఆల్వార్, భరత్‌పూర్, ధోలాపూర్, కరౌలీ సంస్థానాలు కలిసి మత్స్య సమాఖ్య ఏర్పడింది.[8]

1948, మార్చి 25న బాన్స్వాడా, బుండీ, దుంగర్‌పూర్, ఝాలావర్, కిసాన్‌ఘడ్, షాపూరా, టోంక్, కోటా సంస్థానాలు కలిసి రాజస్థాన్ సమాఖ్య ఏర్పడింది.[8] రాజస్థాన్ సమాఖ్య ఏర్పడిన మూడు రోజులకు, ఉదయ్‌పూర్ మహారాణా, 1948, మార్చి 28న రాజస్థాన్ సమాఖ్యలో చేరటానికి నిర్ణయించాడు. 1948 ఏప్రిల్ 18న సమాఖ్యను లాంఛనంగా ప్రారంభించాడు. మాణిక్య లాల్ వర్మ నేతృత్వంలో మంత్రివర్గం ఏర్పడింది.[8] ఈ మంత్రివర్గంలో సుఖాడియా నీటిపారుదల, కార్మిక శాఖామంత్రిగా పనిచేశాడు. నాలుగవ విడతలో, బికనేరు, జైసల్మేరు, జైపూరు, జోథ్‌పూరు సంస్థానాలు రాజస్థాన్ సమాఖ్యలో చేరాయి. 1949 మార్చి 30న సర్దార్ పటేల్ సంయుక్త రాజస్థాన్‌ను ఆవిర్భవించాడు. హీరాలాల్ శాస్త్రి మంత్రివర్గాన్ని ఏర్పరచి, రాజస్థాన్ యొక్క తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.[8] 1949, మే 15న మత్స్య సమాఖ్య కూడా రాజస్థాన్లో కలిసింది.[8]

1951, మార్చిన హీరాలాల్ శాస్త్రి రాజీనామా చేసిన తర్వాత, జై నారాయణ్ వ్యాస్ చేపట్టాడు. ఈయన కొత్త మంత్రివర్గంలో సుఖాడియాను మంత్రిగా నియమించాడు. 1952లో రాజస్థాన్లో తొలిసారి శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం 1952, మార్చి 3న టీకారాం పలివాల్ ముఖ్యమంత్రి అయ్యి కొంతకాలం ఉన్నాడు. 1952 నవంబరు 1న ఆయన స్థానంలో జై నారాయణ్ వ్యాస్ ముఖ్యమంత్రి అయ్యాడు. వ్యాస్ మంత్రివర్గంలో సుఖాడియా రెవెన్యూ, నీటి పారుదల, వ్యవసాయం తదితర ప్రధాన శాఖలకు మంత్రిగా ఉన్నాడు.

1952 ఎన్నికల తర్వాత, రామరాజ్య పరిషదుకు చెందిన 22 మంది సభ్యులు జై నారాయణ్ వ్యాస్ ప్రోద్భలంతో కాంగ్రేసు పార్టీలో చేరారు. అయితే చాలా మటుకు రామరాజ్య పరిషదు సభ్యులు మాజీ జమిందార్లు కావడంతో, జరుగుతున్న భూసంస్కరణలపై ప్రభావం పడుతుందని భావించి, కాంగ్రేసు కార్యకర్తలు వ్యాస్ నిర్ణయాన్నివ్యతిరేకించారు. జైనారాయణ్ వ్యాస్ పై పెరుగుతున్న అసంతృప్తి వల్ల కాంగ్రేసు అధిష్టానవర్గం శాసనసభలో ఈయన్ను విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టమని కోరింది.[9] అనుభవశాలి అయిన జై నారాయణ్ వ్యాస్, ఆయన మంత్రివర్గంలోనే రెవెన్యూ మంత్రి ఐన 38 ఏళ్ళ సుఖాడియాతో తలపడ్డాడు. స్వతంత్ర భారతంలో తొలిసారి ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా ముఖ్యమంత్రి పదవికై పోటీపడ్డారు. సుఖాడియా ఎనిమిది ఓట్లతో జై నారాయణ్ వ్యాస్ ను ఓడించి, అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పదవిలో 1954, నవంబరు 13 నుండి 1971 జూలై 8 వరకు, 17 ఏళ్ల పాటు కొనసాగి రికార్డు సృష్టించాడు. ఈయన నెలకొల్పిన రికార్డు జ్యోతీ బాసు 1994లో అధిగమించేవరకు నిలచి ఉంది.[10]

రాజస్థాన్ రాజకీయాల్లో సుఖాడియా శకం

మార్చు

రాజస్థాన్ కాంగ్రేస్ స్థాపన, అభివృద్ధి

మార్చు

1946లో వివిధ రాజ్యాల ప్రజామండళ్లు, ఒకే నిర్ణయాధికార, వ్యవస్థీకరణ సరళత దృష్ట్యా విలీనమై రాజ్‌పుఠానా ప్రాంతీయ సభ ఏర్పడినప్పుడు రాజస్థాన్ కాంగ్రేస్ స్థాపనకు బీజంపడింది.[11] రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ రాజకీయ హేమాహేమీలు భాగమైన ప్రాంతీయ సభ అధికార కమిటీ యొక్క పదిహేను మంది బృందంలో మోహన్ లాల్ సుఖాడియా ఒకడు.[12] ఇతర కమిటీ సభ్యులతో కలిసి పార్టీ యొక్క నిర్ణయాలను, విధానాలను ప్రచారం చేయటంలో సుఖాడియా కీలకపాత్ర వహించాడు.[12] బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రేసు సమావేశంలో రాజ్‌పుఠానా ప్రాంతీయ సభను భారత జాతీయ కాంగ్రేసు యొక్క ప్రాంతీయ విభాగంగా ప్రకటించడంతో, పార్టీని భారత జాతీయ కాంగ్రేసులో కలపాలనే కోరిక 1948 ఏప్రిల్లో సాకారమైంది.[13] తొలి ఆరు సంవత్సరాల్లో (1948-1954) నలుగురు ముఖ్యమంత్రులు మారి, పార్టీలో అస్థిరత వళ్ళ, అస్థవ్యస్థంగా సాగింది. పార్టీ నాయకత్వ పగ్గాలు సుఖాడియాకు అందించే వరకు ఇలాగే కొనసాగింది. పార్టీకి సుస్థిరత తెచ్చి, ప్రాంతీయ కాంగ్రేసు పార్టీని వ్యవస్థీకరించడం సుఖాడియా రాజకీయ నైపుణ్యం, నాయకత్వ పటిమకు తార్కాణం.[14] ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలపాటు కొనసాగటం ప్రజల్లో, పార్టీ వర్గాల్లో సుఖాడియాకు ఉన్న మద్దతు, ఆప్యాయతను తెలియజేస్తుంది.

రాష్ట్రంలో భూసంస్కరణలు

మార్చు

స్వతంత్రం వచ్చేనాటికి, రాజస్థాన్లో శతాబ్దాలపాటు కొనసాగిన జమీందారీ వ్యవస్థ, రాష్ట్ర సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో లోతుగా ఇంకి ఉంది. పేదరైతులు జమిందారుల అరాచకాలకు బలైపోయేవారు. తాము దున్నే భూమిపై ఏ హక్కులు లేక పెద్ద మొత్తంలో కౌలు చెల్లించేవారు. జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రేసు ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దుచేస్తూ చట్టంచేసింది. జమిందారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో చట్టం యొక్క ప్రభావం పరిమితంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రేసు ప్రభుత్వం 1952లో రాజస్థాన్ జాగీర్ల రద్దు చట్టాన్ని చేసింది.[15] ఈ చట్టం వల్ల రాష్ట్రంలో జాగీర్దారీ వ్యవస్థ రద్దు చేయటమే కాకుండా, ఇలాంటి చట్టాలు జ్యుడీషియల్ రివ్యూ పరిధిలోకి రాకుండా ఆస్తికి సంబంధించిన ప్రాథమిక హక్కును సవరించింది. సమానమైన రెవెన్యూ యంత్రాంగాన్ని నెలకొల్పకుండా, భూ సంస్కరణలను అమలు చేయటం కష్టమనే భావనతో సుఖాడియాకు మంత్రివర్గంలోక్లిష్టమైన రెవెన్యూ శాఖను అప్పగించారు.[16] 1954లో సుఖాడియా ముఖ్యమంత్రి పదవిచేపట్టినపుడు, సంస్కరణలను అమలుచేసే క్లిష్టమైన పని ఆయన ముందుకు వచ్చింది. సుఖాడియా ప్రభుత్వం 1959లో రాజస్థాన్ జమిందారీ, బిస్వేదారీ రద్దు చట్టాన్ని చేసి, కౌలు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇచ్చి రాజస్థాన్లో శతబ్దాల నుండి కొనసాగుతున్న జమీందారీ వ్యవస్థను కూల్చేసింది..[17] జాగీర్దారులు, జమీందార్ల రాజకీయ పరపతి, వివిధ సంస్థానాల్లో, వివిధ రకాల అయోమయమైన భూవ్యవస్థలు ఉండటం, కచ్చితమైన భూమిలెక్కలు లేకపోవటం సంస్కరణల అమలును చాలా కష్టతరం చేశాయి. సుఖాడియా ఈ సమస్కలన్నింటినీ ఎదుర్కొని రాష్ట్రంలో విజయవంతంగా సంస్కరణలను చేపట్టాడు.[18]

విద్య, వైద్య రంగ అభివృద్ధి

మార్చు

భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం తర్వాత తన తొలి ప్రసంగంలో అజ్ఞానం, అనారోగ్యం యొక్క నిర్మూలన దేశం ముందున్న అత్యంత కీలక పని అనిప్రకటించాడు.[19] బ్రిటీషు పాలన చివర్లోకల్లా దేశంలో అత్యల్ప అభివృద్ధి స్థాయిలో ఉన్న రాజస్థాన్లో అజ్ఞానం, అనారోగ్యం నిర్మూలన మరింత కఠినతరమైనది. ఇరవయవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో రాజస్థాన్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కెల్లా కనిష్ఠమైన అక్షరాస్యత, గరిష్ఠమైన మరణాలసంఖ్య కలిగి ఉంది.[20] రాజస్థాన్ వలసపాలనలో విద్య, వైద్య రంగాలలో ఎదుర్కొన్న పూర్తి నిర్లక్ష్య ధోరణిని, సుఖాడియా పాలనాకాలంలో తీవ్రంగా వ్యతిరేకించింది.[20] సుఖాడియా ప్రభుత్వం సామాజక రంగంపై మరింత దృష్టి పెట్టడంతో, ఆదాయ వనరులు తక్కువగా ఉన్నా, సామాజిక సేవలపై ఖర్చు చేస్తున్న ఆదాయం పెంచుతూనే వచ్చింది.[20] ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సుఖాడియా విద్యాశాఖ మంత్రిగా కొనసాగటం ఈయన ప్రాథమ్యాలకు మరో తార్కాణం.[21] 1970 దశకం చివరి కల్లా తత్ఫలితాలు కనిపించాయి. విద్యా వైద్య రంగాల్లో రాజస్థాన్ ఉత్తర కేంద్ర రాష్ట్రాలకంటే, భారత సగటుకంటే గణనీయంగా మెరుగుపడింది. 1969 కల్లా విద్యా రంగంలో రాజస్థాన్ యొక్క పెట్టుబడి రాష్ట్ర ఆదాయోత్పత్తిలో 3.2 శాతానికి పెరిగింది. అదే కాలంలో ఉత్తర ప్రదేశ్ 1.5 శాతం మాత్రమే విద్యపై ఖర్చు చేసింది. ఇదే విధంగా వైద్య రంగంలో 1970-71 సంవత్సరానికి రాజస్థాన్ తలసరి ఖర్చు 8.23 రూపాయలు కాగా, ఉత్తర ప్రదేశ్ 3.2 రూపాయలు ఖర్చు చేసింది.[20]

నోట్స్

మార్చు
  1. Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 5.
  2. Bhatt, Rajendra Shankar. Aadhunik Rajasthan Ke Swapnadrashta Shri Mohanlal Sukhadia. p. 12.
  3. 3.0 3.1 Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 17.
  4. Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 18.
  5. Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 19.
  6. Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 20.
  7. Ralhan, O. P. Encyclopaedia of Political Parties. p. 1008.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "History of Legislature in Rajasthan". Rajasthan Government. Archived from the original on 2009-06-19. Retrieved 2008-08-20.
  9. Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 40.
  10. Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 10.
  11. Sission, Richard. The Congress Party in Rajasthan. p. 97.
  12. 12.0 12.1 Sission, Richard. The Congress Party in Rajasthan. p. 99.
  13. Sission, Richard. The Congress Party in Rajasthan. p. 98.
  14. Sission, Richard. The Congress Party in Rajasthan. p. 252.
  15. "Acts passed in Rajasthan". Rajasthan Government. Retrieved 2008-10-25.
  16. Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 23.
  17. "Acts passed in Rajasthan". Rajasthan Government. Retrieved 2008-08-20.
  18. "Report on Implementation of Land Reforms" (PDF). Planning Commission of India. Archived from the original (PDF) on 2009-04-10. Retrieved 2008-10-21.
  19. "Constituent Assembly of India". 'Parliament of India'. Retrieved 2008-10-26.
  20. 20.0 20.1 20.2 20.3 "Subnationalism and Social Development:A Comparative Analysis of Indian States". University of Pennsylvania. Archived from the original on 2011-07-19. Retrieved 2008-10-26.
  21. Kochar, Kanhiyalal. Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia. p. 47.

మూలాలు

మార్చు
  • Kochar, Kanhiyya Lal (1999), Rajasthan mein Swatantrata Sangram Ke Amar Purodha : Mohan Lal Sukhadia, Rajasthan Swarn Jyanthi Samaroh Samiti
  • Sisson, Richard (1972), The Congress Party in Rajasthan, University of California Press, ISBN 0-520-01808-7
  • Sharma, Shalendra (1999), Development and Democracy in India, Lynne Rienner Publishers, ISBN 1-55587-810-5
  • Ralhan, O. P. (2002), Encyclopaedia of Political Parties, Anmol Publications PVT. LTD., ISBN 81-7488-865-9
  • Chabda, Praveen Chandra; Mishra, R K (1964), Rajasthan - A decade of Reconstruction, Pratibha Publication, Jaipur
  • Sukhadia, Mohanlal (1962), Our Administrative Problems, Information Department, Rajasthan Government
  • Saxena, Shankar Sahay (1960), Joh Desh Ke Liye Jiye (Jashogatha Loknayak Shri Maniklal Verma), Muktiwani Publication
  • Devi, Maharani Gayatri (1976), A Princess Remembers - The Memorial of Maharani of Jaipur, Vikas Publishing House

బయటి లింకులు

మార్చు