యల్లాప్రగడ సుబ్బారావు

ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త

యల్లాప్రగడ సుబ్బారావు (1895 జనవరి 12 - 1948 ఆగష్టు 9) భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నాడు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.[1]

యల్లాప్రగడ సుబ్బారావు
యల్లాప్రగడ సుబ్బారావు
జననంజనవరి 12, 1895
ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం
మరణం1948 ఆగస్టు 9(1948-08-09) (వయసు 52)
పౌరసత్వంభారతీయత
జాతీయత భారతదేశం, భారతీయుడు
రంగములువైద్యశాస్త్రం
వృత్తిసంస్థలులెడర్లీ ప్రయోగశాల
చదువుకున్న సంస్థలుమద్రాసు మెడికల్ కళాశాల
హార్వర్డ్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిహెట్రజాన్ అను డ్రగ్ ఆవిష్కర్త
టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్
ముఖ్యమైన పురస్కారాలువైద్యశాస్త్రం
గమనికలు
కొత్తగా కనుగొనిన ఒక శిలీంధ్రం (ఫంగస్)కు ఇతని గౌరవార్ధం సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణం చేశారు.

బాల్యం - విద్యాభ్యాసంసవరించు

 
1995లో తపాలాశాఖ విడుదల చేసిన స్టాంపు

ఇతను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 1895, జనవరి 12న జన్మించాడు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఇతనిని చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి రాజమండ్రికి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించింది. ఫెయిలయ్యాడు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో మద్రాసుకు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది.[2]

మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఇతనికి బాల్యంలోనే అబ్బింది. సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రభావం ఇతని మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేచి, మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచనా చేశాడు. తన ఆలోచనను వివరింపగా, ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో మద్రాస్ వైద్య కళాశాల ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయినా ఇతనిని చేర్చింది. ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.

దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి వెళ్లిన ఇతను కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించాడు. ఈ బాధ నుండి కోలుకోకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఇతనిని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంత శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసు ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం. చేసి, కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పటల్ లో నెలకు అరవై రూపాయల జీతం మీద పనిచేశాడు. విదేశాలకు వెళ్ళీ పరిశోధనలు చేయాలని వైద్యశాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయాలనే దృఢ కాంక్షను రోజు రోజుకీ బలపరచుకున్నాడు. ఈ సందర్భంలోనే అతని ఆలోచనాశైలి ఇలా ఉంది.

ఈ ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని, తనను తాను ఉద్దరించుకునే మేధస్సును మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. అయితే విజ్ఞాన శాస్త్ర పరిధిలో అది చాలా చిన్న అడుగు మాత్రమే. సంఘర్షణ, పరిశోధకత్వం మానసిక స్థాయిలోనే జరిగింది. ఈ అంశాన్ని నేను ద్రవస్ఫటికాలను అధ్యయనం చేసినప్పుడు గ్రహించాను. ఇవి ఏకకణ సూక్ష్మ జీవి (అమీబా) భౌతిక ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రాణశక్తి మాత్రం గ్రహాంతర రోదసి నుంచి లభించింది. ఈ జీవ శక్తి ఏదో తెలియని కారణాల వల్ల విచిత్రంగా ద్రవస్ఫటికాల తరహా పదార్థాలలో ప్రవేశించి వుంటుందని నా అభిప్రాయం. ప్రకృతి-సృష్టి భ్రమణంలో మనకు తెలియకుండా/అవగాహనకు అందని ఖాళీలను మనం పూరించవలసి ఉంది

యల్లాప్రగడ సుబ్బారావు

సుబ్బారావు భావాలలో నైశిత్యం ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో అతను అతిసార వ్యాధితో శుష్కించిపోయాడు. మద్రాసు లోనే ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశాడు.ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు. ఇరువురు సోదరులూ ఈ వ్యాధితోనే మృతి చెందారు. ఆ రోజుల్లో దీనికి సరైన ఔషథం లేదు. రెండు దశబ్దాల అనంతరం దీనికి మందు (ఫోలిక్ ఆసిడ్) కనిపెట్టారు.

పరిశోధనలుసవరించు

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడం వలన ఇతను లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు. ఇతను రూపొందించిన హెట్రజాన్ అను మందు ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడింది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచంలోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ఆరియోమైసిన్‌ను కనుగొన్నాడు.

సుబ్బారావు సహచరుడు, 1988లో గెట్రూడ్ ఎలియాన్‌తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడం వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చింది".

కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రం (ఫంగస్) నకు ఇతని గౌరవార్ధం సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణం చేశారు. 1947లో అమెరికా పౌరసత్వానికి అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతం భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితకాలం మొత్తం వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితం చేశాడు.

మరణంసవరించు

యల్లాప్రగడ 'కరోనరి త్రాంబసిన్' వ్యాధితో 1948 ఆగష్టు 9వ తేదిన అమెరికాలో కన్నుమూశాడు. లెడర్లీ వైద్యపరిశోధనా కేంద్రం ముఖ ద్వారం దాటిన తర్వాత పెద్ద కాంస్య ఫలకంపై ఉన్న యల్లాప్రగడ సుబ్బారావు (Yellapragada Subbaraogari) చిత్రం క్రింద "యల్లాప్రగడ సుబ్బారావు - 1886-1948 పరిశోధకులు, విద్యావేత్త, తత్వవేత్త, దయామయుడు. లెడర్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్." అన్న వాక్యాలు అతని జ్ఞాపకార్థం ఉంచింది. అంతే కాకుండా ఈ ప్రముఖ భారతీయ వైద్యుని పట్ల గౌరవసూచకంగా లెడర్లీ సంస్థ వారు బొంబాయిలోని బల్సార్‌లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు .

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. జానమద్ది హనుమచ్చాస్త్రి రచించిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు- డా. యల్లాప్రగడ సుబ్బారావు. పేజీ 58 - 60
  2. "అజ్ఞాత మహనీయుడు". Sakshi. 2021-12-26. Retrieved 2022-02-03.

బయటి లింకులుసవరించు