రఘునాథపురం (రాజాపేట మండలం)
రఘునాథపురం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.
రఘునాథపురం | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°40′42″N 78°57′54″E / 17.678332°N 78.965063°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి - భువనగిరి జిల్లా |
మండలం | రాజాపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | గాడిపల్లి శ్రావణ్‌కుమార్ |
పిన్ కోడ్ | 508105 |
ఎస్.టి.డి కోడ్ 08685 |
ఈ గ్రామం రాజాపేట మండలంలో అతి పెద్ద గ్రామం.ఈ గ్రామంలో నూటికీ 90 శాతం మంది పద్మశాలీ కులస్తులు నివసిస్తున్నారు. వీరంతా మరమగ్గాలు (సాంచలు) లను జీవనంగా చేసుకుని బతుకుతున్నారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఓ రకంగా ఈ గ్రామం ఆర్థికంగా ముందంజలోనే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ తయారైన లుంగీలు (గుడ్డలు) నేరుగా ముంబాయి, సూరత్ ల నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఇక్కడి పొట్టిమర్రి వద్ద సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. తూర్పున రామస్వామి గుట్ట ఉంది. ఇది ఆధ్యాత్మికంగా ఇపుడిపుడే బాగా అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడా సినిమా థియేటర్లు లేనపుడే ఇక్కడ 1984లో గణేష్ టాకీస్‌ను నిర్మించారు. అయితే ప్రస్తుతం అది మూతపడింది. గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. పదో తరగతి పరీక్షలు రాయడానికి ఇదే కేంద్రం కావడంతో పరిసర గ్రామాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకే వచ్చి చదువుకుని వెళ్తారు. ఇక్కడ తుమ్మల బాయి చాలా గుర్తింపు ఉంది. యాదగిరిగుట్ట నుంచి రఘునాథపురం గ్రామానికి ప్రతి అరగంటకు ఓ ఆర్టీసీ బస్సు నడుస్తుంది. ఈ గ్రామంలోనే సబ్ పోస్టాఫీసు ఉంది.పిన్‌కోడ్ 508105.... ఈ గ్రామానికి చెందిన చల్లూరి పోచయ్య ఆలేరు శాసనభ నుంచి 1978లో కాంగ్రెసు పార్టీ తరపున గెలుపొంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గ్రామ జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 4,380. అందులో పురుషులు: 2,235, స్ర్రీలు: 2,145 ఉన్నారు. ఇక్కడ 925 నివాసాలున్నాయి..
గ్రామ చరిత్ర
మార్చుమండల కేంద్రమైన రాజాపేటతో సమానంగా ఇది అభివృద్ధిని సాధించింది. ఆర్థిక, సామాజిక రంగాల్లో పురోగమించిన గ్రామంగా చెప్పుకోవచ్చు. ఆలేరు రైల్వేగేటు, యాదగిరిగుట్ట, రాజాపేట ప్రాంతాల నుంచి గ్రామానికి మూడు ప్రధాన రహదారులు అందుబాటులో ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చురఘునాథపురం గ్రామం ఒకప్పటి జైనబసదులున్న చారిత్రకప్రదేశం.విష్ణుకుండినుల ఏలుబడినుండి కాకతీయుల పాలనదాకా ఆవూర్లో కట్టించిన ఆలయాలు, శిల్పాలు రఘునాథపురం చరిత్రను వివరిస్తున్నాయి. రఘునాథపురం నుండి వయా గౌరాయపల్లి ద్వారా వెళ్ళే రోడ్డుమార్గంలో రఘునాథపురం ఊరు దాటగానే రోడ్డుకు దక్షిణంవైపు రోడ్డుకుఆనుకుని వున్న మట్టిలో రెండు విరిగిన జైనశిల్పాలు పడివున్నాయి.అందులో ఒకటి తలలేని ఆసనస్థితిలోవున్న నాలుగడుగుల ఎత్తున్న జైన మహావీరుని విగ్రహం, రెండవది నడుమునుండి మెడవరకు మూడడుగులు మాత్రమేవున్న మరొక జైనశిల్పం. బహుశః అది నేమినాథునిదై వుండవచ్చు.అక్కడికి పదడుగులదూరంలో ఒకప్పుడు గుడిశిథిలాలుండేవని గ్రామస్థులు చెపుతున్న చోటున్నది. అక్కడే కీసరలో దొరికిన ఇటుకలవంటివి గట్టిగా కాల్చిన ఎర్రని 8అంగుళాల వెడల్పు,16 లేదా21 అంగుళాల పొడవుండి 4అం.ల మందం వున్న రెండు, మూడు ఇటుకలు ఉన్నాయి. రోడ్డవతలవున్న కల్లూరి మనోహర్ రెడ్డి మామిడితోటలో 40 అడుగుల లోతున్న పురాతనమైన బావివుంది.దానికి పడమటి అంచున పొలంలో 9అడుగుల ఎత్తైన వీరగల్లుంది.దానిపైన శిథిలాక్షరాలలిపి ఉంది.ఆలేటివాగులో కలిసే రఘునాథపురంవాగుకు దక్షిణాన చిన్నఒర్రెకాలువ పక్కన పాటిగడ్డ, పాటిగడ్డలో హనుమాండ్లు, పాతవూరడుగు పెంకులు, ఇటుకలు, రోళ్ళతో నిండి ఉంది.కొన్నినిజాంకాలంనాటి ముస్లింల సమాధులున్నాయి.అక్కడ ఒకచోట ఇనుముచిట్టెం, ఇనుపపరిశ్రమవున్నట్లు ఆనవాలుగా బూడిదనిండిన నల్లని మట్టినేల ఉంది.
గ్రామంలో వున్న శివాలయం (కొత్తగా రామాలయం కూడా) అతిపురాతన శైవమఠం.శివాలయపు అంతరాళం ఉత్తరాశికి లలాటబింబంగా ఏనుగులు అభిషేకిస్తున్న శివలింగం చెక్కివుంది.ఇట్లాంటి ఆలయనిర్మాణాలు కీసరలో కూడా ఉన్నాయి.నిజానికి ఈచిన్నశివాలయం త్రికూటదేవాలయం.తూర్పు అభిముఖం గావున్న గర్భగుడిలో చతురస్రాకార పానవట్టంపై శివలింగం, దానిపక్కన తర్వాత కాలంలో ప్రతిష్ఠితమైన జంటనాగుల నాగబంధశిల్పం, వెనక చిన్న వినాయక విగ్రహం ఉన్నాయి.గర్భగుడిలో పైకప్పుకు అష్టదళపద్మాన్ని గర్భీకరించుకున్న అష్టకోణయంత్రం చెక్కబడివుంది.ఎదురుగా రాష్ట్రకూటులకాలంనాటి నందివిగ్రహం ఉంది.దక్షిణంలోని ఉపాలయంలో వీరభద్రుడు, వీరభద్రుని ఉపాలయద్వారానికి కలశాలు చెక్కివుండడం విశేషం.కలశం జైనాలయాల చిహ్నం.ఉత్తరంగావున్న ఉపాలయంలో దుర్గలు ప్రతిష్ఠించబడి ఉన్నారు.ఇటువంటి మనోహరమైన వీరభద్రునిశిల్పం రాజపేటమండలంలోని పాముకుంట గ్రామంలోకూడా ఉంది. గుడిబయట మూడు వినాయకశిల్పాలు సుందరంగా ఉన్నాయి.రెండడుగుల ఎత్తు, నాగబంధం, ఒక చతుర్భుజగణపతిశిల్పం,4 అడుగులఎత్తు, రెండుచేతులు, నాగకిరీటం, జందెంవున్న మట్టిరంగురాతి వినాయకశిల్పం, మూడో వినాయకుడు 2అడుగుల ఎత్తుంది.శిల్పాన్నిబట్టి ఈనాలుగు వినాయకశిల్పాలు ఒకేకాలానికి చెందినవి కావనిపిస్తున్నది.విష్ణుకుండినులు, చాళుక్యులకాలంలో చెక్కినవి. ఆలయప్రాంగణంలో చెన్నకేశవుని శిల్పం ఉంది.విగ్రహశీర్షానికి అంచున దశావతారాలు చెక్కివున్నాయి.ఈశిల్పం వీరభద్రునిశిల్పరీతులతో పోలి, అందంగా ఉంది.ఆలయపాలకుడిగా భైరవుడున్నాడు.చతుర్భుజుడు, నగ్నదేహం, పేగుల జందెం, పెద్దపురుషాంగం, చేతులలో పిడికత్తి, కొంగకాలుకత్తి, గొడ్డలి, రక్తపాత్రలతో భయంకరంగా వున్నాడు కపాలభైరవుడు.
ఒక వినాయకుని పక్కన వున్న శిథిలశిల్పం లోహసంబంధమైన రాతితో చెక్కినట్లుంది.వాతావరణానికి శైథిల్యం పొందింది.ఈ శిల్పం వంటిది ఆలేరుపోచమ్మగుడిలో వున్న శైవాచార్యుని విగ్రహంతో పోలివుంది.అంటే రఘునాథపురంలో కూడా కాపాలికులుండేవారని, జైనబసదిని, విగ్రహాలను వారే కూల్చివుంటారని అనుకోవడానికి వీలున్నది.ఇక్కడ కాపాలికులుండేవారని చెప్పడానికి కాసారంగ్రామం శివార్లలో పెద్దబండకు చెక్కిన భైరవుని (తలమాత్రమే) శిల్పం నిదర్శనం.
విద్యా సౌకర్యాలు
మార్చుఇక్కడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పాటు దూరవిద్య పాఠశాల, ప్రైవేటు విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
మార్చుఇక్కడి నుంచి ప్రతి అరగంటకు యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేగాకుండా హైదరాబాద్, జగద్గిరిగుట్ట, జనగాం, హన్మకొండ వంటి ప్రధాన ప్రాంతాలకు బస్సలు నడుస్తాయి.
మౌలిక వసతులు
మార్చుఎస్సీ బాలుర వసతి గృహం ఉంది. పొట్టిమర్రి వద్ద 332 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్. . పదోతరగతి పరీక్షా కేంద్రం అనుమతి ఉంది. ప్రతి ఆదివారం అంగడి జరుగుతుంది.
రాజకీయాలు
మార్చుఈ గ్రామానికి చెందిన చల్లూరి పోచయ్య 1978లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన జనతాపార్టీ నుంచి పోటీ చేసిన వెంకటస్వామిపై 35 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1983 వరకు ఎమ్మెల్యేగా విశేష సేవలందించారు. ఆ తర్వాత ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్ తరపున పోచయ్య పోటీచేసి పరాజయం పొందారు. ఆ తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లోనూ 1987లో స్వతంత్ర అభ్యర్థిగా.. 2002లో సీపీఐ అభ్యర్థిగా పోచయ్య పోటీచేసి ఓడిపోయారు. 14.05.2020 రోజున ఆయన కన్నుమూశారు.
అదేవిధంగా కల్లూరి పెద్ద రామచంద్రారెడ్డి పోలీస్ పటేల్‌గా సేవలందించారు. ఆయన ప్రస్తుతం దివంగతులయ్యారు. ఆయన కుమారుడు కల్లూరి శ్రీరాంరెడ్డి కూడా ఇదే గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో వీఏఓగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూడా పదవి విరమణ చేశారు. గ్రామ మొదటి సర్పంచిగా కల్లూరు రాఘవరెడ్డి ఎన్నికయ్యారు. ఆయన వరుసగా మూడు మార్లు విజయం సాధించి సుదీర్ఘ సేవలందించారు. ఆ తర్వాత సర్పంచులుగా సంగిశెట్టి యాదగిరి, కట్కం నారాయణ, సీత సుదర్శన్, గుర్రం అంతమ్మ, రాచకొండ స్వామి ఎన్నికయ్యారు. ఇక 2013లో జరిగిన ఎన్నికల్లో రామిండ్ల నరేందర్ ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో గాడిపల్లి శ్రావణ్‌కుమార్ సర్పంచిగా ఎన్నికై కొనసాగుతున్నారు. ప్రముఖ జర్నలిస్టు ముత్యాల నర్సింహులుతో పాటు కల్లూరి ఊర్మిల, బుడిగె పెంటయ్య, తుంగ బాలు, కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి వంటి నాయకులు ఇక్కడ ఎందరో ఉన్నారు.
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
మార్చు- రఘునాథపురం శివారులో రామస్వామిగుట్ట ఉంది. ఇది ఇపుడిపుడే ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధిస్తోంది. శివరాత్రి, కార్తీక మాసం, శ్రీరామనవమి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక వేడుకలు జరుగుతుంటాయి.
- గ్రామం నడిబొడ్డున రామాలయం ఉంది. ఇందులో సీతారాములు, శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు వంటి దేవతలు కొలువుదీరి ఉన్నారు.
- గ్రామదేవతలుగా పోచమ్మ, పెద్దమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రతియేటా శ్రావణ మాసంలో కులాల వారిగా బోనాల వేడుకల్ని ఘనంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
- ఇక పొట్టిమర్రి రోడ్డులో గొల్లకురుమల సంయుక్తాధ్వర్యంలో బీరప్ప, మహాంకాలమ్మ ఆలయాల్ని నిర్మించారు. శ్రావణ మాసంలోనే వీరు కూడా బోనాల వేడుకల్ని నిర్వహిస్తారు.
- ఇక ఊరందరూ కలిసి ఆలేరు రోడ్డులో దుర్గమ్మ, ఎల్లమ్మ ఆలయాల్ని నిర్మించారు. ఇక్కడ కూడా ఊరు ప్రజలందరూ తమ ఇళ్లల్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా.. ఈ ఇద్దరు అమ్మవార్లకు పూజలు చేశాకే ఆ వేడుకల్ని జరుపుకొంటారు. ఓ రకంగా ఈ ఆలయాలు ఊరికి గ్రామదేవతలుగా నిత్య పూజలు అందుకుంటున్నాయి.
- గ్రామంలో గతంలో కంచెగా పిలిచే చోట 2014లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.
నల్లటి శిలావిగ్రహంతో స్వామి వారు చూడ ముచ్చటగా దర్శనమిస్తారు.
ప్రధాన పంటలు
మార్చుప్రధాన పంటలుః వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, కూరగాయలు
ప్రధాన వృత్తులు
మార్చుప్రధానంగా ఇక్కడి వారంతా ఎక్కవగా మరమగ్గాల (సాంచలు) ను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. పద్మశాలీ కులస్తులు నిర్వహించే ఈ మరమగ్గాలు ఇతర కులస్తులకు కూడా జీవనాధరంగా నిలుస్తోంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారు కూడా ఇక్కడికి వచ్చి సాంచలను కూలికి నడిపి ఉపాధి పొందుతున్నారు. ఆయా సాంచలపై గుడ్డలు, లుంగీలు తయారవుతాయి.ఈ గ్రామంలో వ్యవసాయం, పాడి పారిశ్రామలు కూడా ముఖ్య జీవనాధారలుగా ఉన్నాయి.
ప్రముఖులు (నాడు/నేడు)
మార్చు- సంగిశెట్టి శంభయ్య: ఈయన ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి. యుక్త వయసులో హైదరాబాద్‌కు వలస వెళ్లిన ఇతను ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఆది నుంచి ఇతనికి సామాజిక సేవ కార్యక్రమాలంటే ఏనలేని ప్రేమ. సొంతూరులోని రఘునాథపురంలో తన తండ్రి నర్సయ్య పేరుతో సొంతంగా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను కట్టంచాడు. అదేవిధంగా తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లోనూ అతను అన్నదాన సత్రాలు నిర్మించారు. నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసాడు. ఆయన 1994లో దివంగతులయ్యారు.
- ముత్యాల నర్సింహులు: సీనియర్ పాత్రికేయుడు. 1999 నుంచి ఈనాడు దినపత్రికలో పనిచేస్తున్నాడు.
- సంగిశెట్టి శ్రీనివాస్:తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీ కారుడు.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.