రాజమండ్రి దేవీచౌక్

మైసూరు ఉత్సవాల తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో రాజమహేంద్రవరం నగరంలో శరన్నవరాత్రి శోభ వెల్లివిరుస్తుంది. దసరా వచ్చిందంటే ముఖ్యంగా నగర నడిబొడ్డునగల దేవీచౌక్ లో ఉత్సవాలు సందడి చేస్తాయి. అందుకే నగరచరిత్రలో దేవిచౌక్ ఉత్సవాలు అంతర్భంగంగా నిలిచాయి.

దేవీచౌక్‌
దేవీచౌక్‌
మతం
అనుబంధంహిందూ
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
ప్రదేశం
ప్రదేశంరాజమండ్రి,తూర్పు గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్
పురపాలకసంఘంరాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
వాస్తుశాస్త్రం.
స్థాపకుడుబత్తుల చంటి, శిఘాకొల్లి మాణిక్యాలరావు, రాచకొండ వీర్రాజు, పరుచూరు వెంకటేశ్వరరావు
లక్షణాలు
మినార్లు1
మినార్ ఎత్త్తు48.7 metres (160 ft)
దేవీచౌక్, రాజమండ్రి

చరిత్ర మార్చు

రాజమండ్రి దేవిచౌక్ అంటే రాష్ట్రంలో తెలియని వారుండరు. అంతగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో 1956లో బత్తుల చంటి, శిఘాకొల్లి మాణిక్యాలరావు, రాచకొండ వీర్రాజు, పరుచూరు వెంకటేశ్వరరావు సౌజన్యంతో బొంబాయ్ (ముంబాయి) నుంచి నలుదిక్కులా కన్పించే క్లాక్ టవర్ తెచ్చి, అమర్చడంతో ఆనాటి ఎం.ఎల్.ఎ పోతుల వీరభద్రరావు ఆవిష్కరించారు.'కీ'ని ఆనాటి కమీషనర్ ఠాగూర్ లాల్ స్వీకరించారు. ఇక ప్రతి శుక్రవారం భక్తులతో ఎంతోసందడిగా కన్పించే దేవిచౌక్ దసరా ఉత్సవాల్లో తిరునాళ్ళను తలపిస్తుంది.

ఒకప్పుడు మైసూర్ ఉత్సవాలను తలపించే రీతిలో ఇక్కడ దేవి శరన్నవరాత్రి వైభవం వుండేది. రానురాను కొంతమార్పు వచ్చినా, ఈనాటికీ నాటకరంగ కళాకారులకు మాత్రం ప్రధానవేదికగా విరాజిల్లుతోంది దేవిచౌక్. ఒకప్పుడు మూడు లాంతర్ల జంక్షన్ గా, లక్ష్మివారపు పేట నాలుగు రోడ్ల కూడలిగా వ్యవహారంలో వుండే ఈ ప్రాంతం దేవి ఉత్సవాలతో దేవిచౌక్ గా రూపాంతరం చెందింది. గడిచిన 83ఏళ్లుగా దేవిచౌక్ తన విశిష్టత చాటుకుంటోంది. తెల్లవార్లు నాటకం నడిచినా జనం ఓపిగ్గా కూర్చుని తిలకించడం ఈనాటికీ కొనసాగుతోంది. ఉత్సవ సమితి ప్రస్తుతం అధ్యక్షులు శ్రీ తోలేటి ధనరాజు, కార్యదర్శి శ్రీ పడాల శివరామలింగేశ్వరరావు (చిన్నబ్బాయి) తదితరులతో కొనసాగుతోంది. ఈఏడాది కూడా దేవిచౌక్ 5వీధులను విద్యుత్ కాంతులతో, జంక్షన్ ని లైటింగ్ తో కూడిన సెట్టింగ్స్ తో కనువిందుగా తీర్చిదిద్దారు.[1]

1934లో శ్రీకారం మార్చు

1934లో బత్తుల నాగరాజు-మునియ్య సోదరులు శ్రీ దేవి నవరాత్ర మహోత్సవాలకు ఇక్కడ శ్రీకారంచుట్టారు.ఆరోజుల్లో రూ200/-లతో చేపట్టిన ఉత్సవాలు క్రమేపి లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్వహించే స్థాయికి చేరాయి. మాజీ ఎం.ఎల్.ఎ బత్తుల మల్లికార్జునరావు (చంటి)1940లో సారథ్యం వహించడంతో ఆనాటినుంచి ఉత్సవ రూపురేఖలు మారాయి. ఆరోజుల్లో గుత్తిలావుండే మూడు లాంతర్లలో కిరోసిన్ పోసి దీపాలు వెలిగించేవారు. అయితే తూర్పుగోదావరి ఆనాటి ఎస్.పి.రాఘవేంద్రరావు చొరవతీసుకుని, ఎలక్ట్రిక్ లైట్లను అమర్చడంతో సరికొత్త శోభ సంతరించుకుంది. 1963లో బత్తుల బ్రదర్స్ సౌజన్యంతో కలకత్తా నుంచి పాలరాతి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి, ఆనాటి మున్సిపల్ చైర్మన్ నిడమర్తి వెంకట నరసింహం చేతులమీదుగా ప్రతిష్ఠించడంతో, మూడు లాంతర్ల జంక్షన్ దేవిచౌక్ గా కొత్త పేరు సంతరించుకుంది.

ఉత్సవాల నిర్వహణతో కీర్తి తెచ్చిన'చంటి' మార్చు

దేవిచౌక్ ఉత్సవసమితికి 1940లో సారథ్యం చేపట్టిన బత్తుల చంటి 1974వరకు దాదాపు పాతికేళ్ళ పాటు సమర్ధవంతంగా నవరాత్రి వేడుకలను నిర్వహించి, దేవిచౌక్ ఉత్సవాలకు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో సైతం కీర్తి తెచ్చారు.అప్పట్లో మూడు ప్రధాన స్టేజిలను ఏర్పాటుచేసి, ఓ స్టేజి ఫై ప్రథమ శ్రేణి ప్రదర్శనలు, మరో స్టేజి ఫై ద్వీతీయ శ్రేణి ప్రదర్శనలు, ఇంకో స్టేజిమీద హరికథలు, బుర్రకథలు తదితర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ, బహుముఖంగా దేవిచౌక్ ఉత్సవాలను తీర్చిదిద్దారాయన. విజయా డ్రస్ కంపెనీ నిర్వాహకులు, అభినవ కృష్ణరాయ, నార్ని కేదారేశ్వరుడు ఉత్సవాలకు ఇతోధికంగా సహకరించారు.మొదట్లో భ్రమరదాసు హరికథలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలతో సాగినా, 1961నుంచి సురభి నాటకాలు, ఆతర్వాత, పౌరాణిక, సాంఘిక నాటకాలతో దేవి ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. అప్పట్లో ఓవైపు భోగం మేళం కూడా నడిచేది. ప్రస్తుతం తుమ్మలావ ప్రాంతంగా పిలిచే ఈప్రాంతంలో అప్పట్లో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటుచేసేవారు. స్కేటింగ్, మూవింగ్ డాల్స్, వంటి విజ్ఞాన వినోద ప్రదర్శనలతోపాటు స్టాల్స్ ఏర్పాటుతో జాతరను తలపించేది. ఓపక్క రాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులను రప్పించి, నాటక ప్రదర్శనలు నిర్వహించడం, మరోవైపు నాటకరంగ నేపథ్యంగా సినీ పరిశ్రమలో రాణిస్తున్న నటీనటులను, ముఖ్యంగా జంటలను ఆహ్వానించి సత్కరించడం చేసేవారు. భారీ ఎత్తున దేవిచౌక్ నలుచెరగులా సందడిగా ఉత్సవాలు సాగుతున్న క్రమంలో 1974లో రోడ్ కం రైల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ఆనాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ ఆలీ వస్తున్నారన్న కారణంగా ట్రాఫిక్ దృష్ట్యా ఆనాటి ఉత్సవాలలో నిలిచిపోయిన ఎగ్జిబిషన్ ఇక అక్కడితో పూర్తిగా ఆగిపోయింది.

నాటక రంగానికి ఆయువు పట్టు మార్చు

కిరాయి ఇవ్వకపోయినా పర్వాలేదు దేవిచౌక్ లో చాన్స్ వస్తే చాలు అనుకున్న కళాకారులు ఎందరో ఉన్నారు. ఆనాటినుంచి ఆక్రేజ్ అలానే ఉంది.ఎందుకంటే ఇక్కడ ముఖానికి రంగు వేసుకుని, స్టేజిఫై ఆడటమంటే ఓ వరంగా భావించే నట దిగ్గజాలు ఎందరో ఉన్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇక్కడ నాటకాలు ఆడే కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నాటకరంగం బతికి బట్టకడుతోందంటే కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ బద్దంగా నిర్వహించే నాటక సంస్థలే కారణం. అందులో రాజమండ్రి దేవిచౌక్ అగ్ర తాంబూలం అని చెప్పాలి. ముఖ్యంగా పౌరాణిక నాటకాలు ఇక్కడ నడుస్తాయి. ఇక్కడికి నాటకాలు చూడ్డానికి గోదావరి జిల్లాలలోని పలు ప్రాంతాలనుంచి నాటకప్రియులు వస్తుంటారు. సీను బాగున్నా, పద్యం నచ్చినా వన్స్ మోర్ అంటూ, తమకు తోచిన విధంగా చదివింపులు చదివిస్తూ, ఉత్సాహపరుస్తారు.అంతేకాదు రాజానగరం, జగ్గంపేట, బిక్కవోలు తదితర ప్రాంతాలనుచి వివిధ ఉత్సవకమిటీల ప్రతినిధులు ఇక్కడి నాటకాలు వీక్షించి, నచ్చిన నాటకాన్ని ఎంచుకుని కళాకారులను తమ ప్రాంతాలకు ఆహ్వానిస్తుంటారు. ఆవిధంగా పలుచోట్ల ఉత్సవాలకు దేవిచౌక్ గీటురాయి అయింది.

సత్కారం అందుకున్న సినీ ప్రముఖులు మార్చు

గతంలో చాలామంది నాటకరంగం నుంచే సినీ రంగానికి కళాకారులు వెళ్ళేవారు. కనీసం నాటకరంగ అనుభవం అయినా వుండేది. అందుచేత దేవిచౌక్ ఉత్సవాలకు సినీకళాకారులను రప్పించి సత్కారాలు చేసే సంప్రదాయం నడిచేది. అంతేకాదు కొంతమంది నటీనటులు ప్రదర్శనలు కూడా ఇవ్వడానికి వచ్చేవారు. నటయశస్వి ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, జగ్గయ్య, ధూళిపాళ, రేలంగి వెంకర్త్రామయ్య, రాజసులోచన-సి. ఎస్.రావు, గిరిజ- పద్మనాభం, అంజలి-ఆదినారాయణ రావు, సావిత్రి-జెమిని గణేషన్, జమున, డాక్టర్ అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, శారద-చలం, రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, తదితర ప్రముఖులు ఇక్కడ సత్కారం అందుకున్నారు. ఇందులో రేలంగి, రాజసులోచన తదితరులు ప్రదర్శన కూడా ఇచ్చారు. రాజసులోచన ఓ ఏడాది నృత్య ప్రదర్శన ఇస్తుండగా, ప్రమాదవశాత్తు పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో ప్రదర్శన నిలిచిపోయింది. పక్కనే ఉన్న బుద్ధుడు హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని, వెళ్ళిన ఆమె ఆతర్వాత సంవత్సరం మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రదర్శన ఇచ్చి, ప్రేక్షకులను అలరించారు.

ప్రదర్శనలిచ్చిన దిగ్గజాలు మార్చు

దేవిచౌక్ స్టేజిఫై ఎందరో దిగ్గజాలు నాటక ప్రదర్శనలిచ్చారు. ఈలపాట రఘురామయ్య, రేలంగి, పిశిపాటి, షణ్ముఖ ఆంజనేయరాజు, మద్దాల రామారావు, సంపత్ నగరం లక్ష్మణరావు, డి.వి.సుబ్బారావు, ఆచంట వెంకటరత్నంనాయుడు, వై.గోపాలరావు, ఇళ్ళ వెంకట్రావు. ఎస్.సైదులు, గూడూరి సావిత్రి, వరలక్ష్మి, జయరాజ్, కురిటి సత్యంనాయుడు, శీమకుర్తి నాగేశ్వరరావు, వెంకట్రావుగుప్తా, రామరాజు, ఇలా ఎంతోమంది ఇక్కడ నాటక ప్రదర్శనలిచ్చి, మెప్పించారు. సీనియర్ నటీనటులు కొందరు గతించినా, వారి వారసులు కూడా ఇక్కడ ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ఇక సంపత్ నగరం లక్ష్మణరావుగా పిలవబడే పేపకాయల లక్ష్మణరావు ఎన్నోఏళ్ళుగా ఇక్కద శ్రీరామాంజనేయ యుద్ధంలో ఆంజనేయ పాత్రతో అలరిస్తూ, కొడుకు సీతారామాంజనేయులుని రాముని పాత్రలో, మనవడు జునియర్ లక్ష్మణరావు రెండవ ఆంజనేయునిగా వెయిస్తున్నారు.

ఉత్సవ సమితి సేవలు మార్చు

బత్తుల చంటి తర్వాత చందన మల్లయ్య సారథ్యంలో ఉత్సవాలు నడిచాయి. ఆతర్వాత 1977లో మాదిరెడ్డి చెన్న కేశవరావు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి, కార్యదర్శి పడాల శివరామ లింగేశ్వర రావు (చిన్నబ్బాయి ) తదితరులు సహకారంతో సమర్ధవంతంగా ఉత్సవాలు కొనసాగించారు. స్వర్గీయ బత్తుల చంటి తనయుడు, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు, శ్రీ రాజరాజేశ్వరి డెకరేటర్స్ అధినేత బత్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో ప్రతియేటా సెట్టింగ్స్ రూపుదిద్దుకుంటున్నాయి. దేవిచౌక్ వర్తకులతోపాటూ ఇతర ప్రాంతవాసులు, దాతల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తూ, 1980 దశకంలో శ్రీ దేవి కళ్యాణ మంటపం నిర్మించారు. మాదిరెడ్డి మరణం తర్వాత తోలేటి ధనరాజు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుండగా, కార్యదర్శిగా చిన్నబ్బాయి కొనసాగుతున్నారు. కళ్యాణ మంటపం ఎసిగా కూడా రూపాంతరం చెందింది. బత్తుల మల్లికార్జునరావు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ని, అలాగే కోర్లమ్మపేట మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ని దత్తత తీసుకుని అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులను, ప్రముఖులను ఉత్సవాల సందర్భంగా ఉత్సవ సమితి సత్కరిస్తోంది. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి సిఎమ్ గా వుండగా ఇక్కడకువచ్చి అమ్మవారిని దర్శించి, సత్కారం అందుకున్నారు. 2000సంవత్సరంలో నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేసి సత్కారం అందుకున్నారు. 2003 గోదావరి పుష్కరాల సందర్భంగా 1999లో నగరంలో రోడ్ల విస్తరణ చేపట్టినపుడు ముందుగా దేవిచౌక్ నుంచే శ్రీకారం చుట్టారు. ఇందుకు ఉత్సవ సమితి, వర్తకులు తోడ్పాటు అందించారు. ఫలితంగా దేవి చౌక్ విస్తరణకు నోచుకుని, గుడి కూడా అదనపు హంగులు సమకూర్చుకుంది.[2]

2016ఉత్సవాలు మార్చు

ఇక 2016అక్టోబరు1న 83వ శ్రీదేవీ నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమయి, వజయవంతంగా నడుస్తున్నాయి.అక్టోబరు 12వరకూ జరిగే ఈ ఉత్సవాల కోసం సెప్టెంబరు 30వ తేదీ రాత్రి 12గంటల 6నిమిషాలకు అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు.1వ తేదీ ఉదయం 8గంటల 48నిమిషాలకు కలశస్థాపన, కుంకుమ పూజలు.2వ తేదీన 108 దంపతులతో కుంకుమ పూజలు నిర్వహించారు.1వ తేదీరాత్రి జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావు ఉత్సవ స్టేజీ ప్రారంభించారు. ఎం.పీ శ్రీ మురళీమోహన్, ఎం.ఎల్.ఏ.శ్రీగోరంట్ల బుచ్చయ్యచౌదరి, అర్బన్ ఎస్. పి రాజకుమారి, ఎం.ఎల్.సి.లు శ్రీ సోము వీర్రాజు, శ్రీ ఆదిరెడ్డి అప్పారావు అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం రాత్రి కనకదుర్గ మహత్యం ప్రదర్శించారు. 2వ తేదీన ఘంటసాల ఆర్కెస్ట్రా, 3న సత్య హరిశ్చంద్ర నాటకం ఉంటాయి. 4వ తేదీన సమీరా భరద్వాజ్ కాంబినేషన్ లో విశాఖ రోషన్ లాల్ ఆర్కెస్ట్రా,5న మూడు (గయోపాఖ్యానం వార్ శీను-చింతామణిలో భవానిశంకర్-చింతామణిశీను-హరిశ్చంద్రలో కాటి శీను) రంగస్థల ఘట్టాలు, ; 6న మాయాబజార్, 7న సత్య హరిశ్చంద్ర ప్రదర్శించారు. 8న చింతామణి నాటకం, 9న కూచిపూడి నృత్య ప్రదర్శన, 10న బాలనాగమ్మ నాటకం,11న శ్రీరామాంజనేయ నాటకం,12న కురుక్షేత్రం నాటకం.[3]

మూలాలు మార్చు

  1. దేవీచౌక్ భక్తులతో కిటకిట[permanent dead link]
  2. 2008దేవీచౌక్ 75సంవత్సరాల ప్రత్యేక సంచిక
  3. "అక్టోబర్ 1నుంచి దేవీచౌక్ లొ 83వ శరన్నవరాత్రి మహోత్సవాలు". Archived from the original on 2016-10-03. Retrieved 2016-10-08.

ఇతర లింకులు మార్చు