రామకృష్ణ (చిత్రకారుడు)

(రామకృష్ణ(చిత్రకారుడు) నుండి దారిమార్పు చెందింది)

రామకృష్ణ తెలుగులో మనకున్న మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. ఇతని పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ. ఇతడు తెలుగులోనే కాక, ఆంగ్లంలోకూడ కార్టూన్లు వేయటం జరిగింది. చిత్రకారుడు బాపు ప్రభావంతో వ్యంగ్య చిత్రరంగానికి ఆకర్షించబడిన మరొక మంచి చిత్రకారుడితను. భారత దేశంలోని అతి పెద్ద బ్యాంకులో మేనేజరు పదవిలో బాధ్యతలు నిర్వహిస్తూనే, కార్టూనిస్ట్‌గా పేరుతెచ్చుకోవటం ఇతని ఏకాగ్రత, కష్టపడే తత్వం తెలియచేస్తాయి.

మునగపాటి శివ రామకృష్ణ
RAMAKRISHNA CARTOONIST PHOT FOR WIKI.jpg
రామకృష్ణ
జననంమునగపాటి శివ రామకృష్ణ
జులై 11, 1946
ప్యాపర్రు గ్రామం, గుంటూరు జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుఎమ్‌.ఎస్‌.రామకృష్ణ
వృత్తిబ్యాంకు మేనేజరు (రిటైర్డ్), చిత్రకారుడు
సాధించిన విజయాలుమానేజరు
భార్య / భర్తసుగుణ
పిల్లలుకుమార్తె జయంతి సునీత
తండ్రిమునగపాటి విశ్వనాధ శాస్త్రి
తల్లిమునగపాటి విశాలాక్షి

వ్యక్తిగతంసవరించు

ప్యాపర్రు గ్రామంలో 1946, జులై 11న రామకృష్ణ జన్మించాడు. ఈయన తండ్రి మునగపాటి విశ్వనాథశాస్త్రి, తల్లి మునగపాటి విశాలాక్షి. తండ్రి మంచి కవి. ఇతని భార్య పేరు సుగుణ. వీరి ఏకైక సంతానం కుమార్తె జయంతి సునీత. భారతీయ స్టేట్ బ్యాంకులో అనేక దశాబ్దాలు పనిచేసి, మేనేజరుగా 2003లో పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం హైదరాబాదు లోని ఎస్.బి.ఐ.కాలనీ, కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు.

వ్యంగ్య చిత్ర రంగ ప్రవేశంసవరించు

ఇతని మాటలలోనె చెప్పాలంటే "కార్టూన్ రంగంలో అడుగుపెట్టడానికి స్పూర్తి, పూజ్యులు, గురుదేవులు బాపు వేసిన బాణాసంచాల్లాంటి కార్టూన్లు, ఆ బొమ్మల్లోని హావభావాలు, నవ్వించి, కవ్వించే డైలాగులు" అని చెప్తాడు. 1967వ సంవత్సరంలో బొమ్మలు వేయటం మొదలు పెట్టి, ప్రారంభంలోనే, పోటీలలో ప్రథమ బహుమతి సంపాదించిన కీర్తి ఇతనిది. "లోకోక్తి చిత్రిక" అన్న ఆంశంమీద ఇతను ఆంధ్రప్రభలో వేసిన మొదటి కార్టూన్‌కు, మొదటి బహుమతి లభించింది. ఆ విధంగా ప్రథమ విజయంతో మొదలయ్యిన ఇతడి వ్యంగ్యచిత్ర ప్రాభవం, తెలుగులోని అన్ని వార, మాస పత్రికలతో పాటు, కొన్ని కన్నడ, తమిళ, హిందీ పత్రికల వరకూ పాకింది. ఇంతేకాక అప్పటి కార్టూన్ పత్రిక శంకర్స్ వీక్లీ (Shanakar's Weekly) (కార్టూనిస్ట్ శంకర్ పిళ్ళై నడిపిన పత్రిక 1975లో ప్రభుత్వంచే ప్రకటించబడిన అత్యవసర పరిస్థితి వల్ల మూతపడింది)లోనూ, కార‌వాన్ (Caravan-Now 'Alive'), ఉమన్స్ ఎరా (Women's Era), వైజ్‌క్రాక్ (Wisecrack), సన్‌ (Sun), సం‌డే (Sunday), భావాన్స్ జర్నల్ (Bhavan's Journal), యూత్‌టైమ్స్ (Youth Times), న్యూస్‌టైమ్‌ (Newstime) మొదలగు ఆంగ్ల పత్రికలో కూడా ఇతని వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడినాయి.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలుసవరించు

 
రామకృష్ణ ప్రచురించిన మొట్టమొదటి వ్యంగ్య చిత్రం. మొదటి కార్టూన్‌కే పోటీలో మొదటి బహుమతి రావటం ప్రత్యేకత
 • సామాన్యంగా, కార్టూన్లు కొన్ని గీతల సమాహారంగా ఉండి, ఒక రూపాన్ని తీసుకురావటం చూస్తుంటాం. ఇతని చిత్రాలలో ఒక చోటమొదలు పెట్టిన గీత, ఎక్కడా తెగకుండా, బొమ్మ పూర్తి చేసి వదిలిపెడుతుంది.
 • మరొక వైవిధ్యం, కార్టూన్ సంభాషణలు, గీసినవారి చేతివ్రాతలోనె ఉంటాయి. ఇతను స్వంత చేతివ్రాతతో వ్రాయటం ఒరవడిని కొనసాగిస్తూనే, సంభాషణలను ప్రింట్ అక్షరాలలో వేయటం మొదలు పెట్టి, మరొక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు.
 • ఆంగ్ల పత్రిక కార్వాన్‌లో ఇతడు వేసిన పూర్తి పేజీ రంగు కార్టూన్ శీర్షిక "హబ్బీ", ఉమన్స్ ఎరాలో "రజిత" దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు, పేరు తెచ్చిపెట్టింది. .
 • అలాగే, తెలుగులో సృష్టించిన 'మిసెస్‌ అవతారం', "గొడుగు", "సింగినాదం" వ్యంగ్య చిత్రాలు చక్కటి ప్రజాదరణ పొందినాయి
 • ఆంధ్రభూమి దినపత్రికలో మొదటి పుటలో పాకెట్‌ కార్టూన్లు గీసాడు.
 • తాను పనిచేసిన భారతీయ స్టేట్ బ్యాంకు సిబ్బంది కొరకు ప్రచురించబడే పత్రిక (House Journal)లో కార్టూన్లు వెయ్యటమే కాక,ఆ బాంకువారు ప్రతి సంవత్సరం ప్రచురించే తెలుగు కాలెండరును ఒక దశాబ్దం పాటు, పూర్తిగా పథకరచన చేసి, తన బొమ్మలతో నింపి ఆకర్షణీయంగా తయారుచేసి, సిబ్బందిని, ఖాతాదారులను ఆనందపరచాడు.
 • తెలుగు వ్యాపార ప్రకటనలలో వ్యంగ్య చిత్రాలు ఇతడి కార్టూన్లతోనే మొదలు. నాగార్జునా సిమెంటు, విష్ణు సిమెంటు, మిడాన్‌ మెన్స్‌వేర్ సంస్థల ఉత్పత్తులకు, విడివిడిగాను, సామెతలను, సినిమా పాటలనూ, పారడీగా అన్వయిస్తూ, నేటి సామాజిక స్థితిగతులను జోడించి, ఇతను పత్రికలలో వేసిన వ్యంగ్య చిత్రాలకు మంచి స్పందన లభించింది.
 • ఇంతేకాక, ఆంధ్రప్రదేశ్ టెలికమ్యూనికేషన్స్ వారికి ప్రజలు టెలిఫోన్ ఎలా వాడాలి అన్న విషయంమీద, నేషనల్ సేవింగ్స్ వారికి చిన్న మొత్తల ఫొదుపు పథకాల గురించి రంగు రంగుల వ్యంగ్యచిత్ర ప్రకటనలు గీసి ప్రజలకు తగినంత అవగాహన ఏర్పడటానికి దోహదపడ్డాడు.
 • ఎయిడ్స్-హెచ్.ఐ.వి, కండోమ్ విషయాలమీద రాష్ట్ర/దేశవ్యాప్తంగా కరపత్రాల పంపిణీ వగైరాల ద్వారా ప్రచారం కోసమై వేసిన 26 కార్టూన్లు మంచి మెప్పుపొందాయి.
 • ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంప్యూటర్ సాంకేతికతను వాడుకుని, ఇతను గీసిన కార్టూన్లను, శాటిలైట్ ఇంటర్ ఏక్టివ్ నెట్‌వర్క్‌ (Sattelite Inter-Active Network) సంస్థ కొరకు, వారు నిర్వహించిన వత్తిడి నివారణ (Stress Management)విషయం మీద ఇవ్వబడిన ఉపన్యాసాలకు జోడించి,అహ్మదాబాదులోని ఇస్రో (Isro) స్టుడియోలనుండి ప్రసారం చేశారు.

కవితా ప్రక్రియసవరించు

 
రామకృష్ణదే మరొక కార్టూను

ఇతని తండ్రి మునగపాటి విశ్వనాథశాస్త్రి మంచి పద్య కవి. తండ్రి దగ్గరనుండి పుణికి పుచ్చుకున్న పద్య కవితావేశాన్ని, నేటి సామాజిక పరస్థితులను విశ్లేషిస్తూ హాస్య, వ్యంగ్య పద్యాలను రచించి, హైదరాబాదులో జరిగే కవి సమ్మేళనాలలో చదివి ప్రజలను రంజింప చేయటమే కాక, ప్రముఖ కవుల నుండి ప్రశంసలను కూడా అందుకుంటున్నాడు.

ప్రోత్సాహకాలుసవరించు

 • ప్రముఖ ఆంగ్ల కార్టూనిస్ట్ అబూ అబ్రహం (పూర్వం ఇండియన్ ఏక్స్‌ప్రెస్ పత్రిక ఆస్థాన వ్యంగ్య చిత్రకారుడు) సంపాదకత్వం వహించి, ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ (Penguin) ప్రచురించిన "ది ఇండియన్ కార్టూన్స్" (The Indian Cartoons) దేశంలోని ప్రముఖ కార్టూనిస్టులలో ఇతని పేరును కూడా ఉదహరించి, ఇతని కార్టూన్లను ప్రచురించటం
 • దూరదర్శన్‌, జెమిని టివి వారు ఇతనితో ఇంటర్‌వ్యూలు ప్రసారం చెయ్యటం

ప్రముఖుల అభిప్రాయాలుసవరించు

 • బాబు-ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారులు-రామకృష్ణ కార్టూన్లు శ్రద్ధాసక్తులతో వేసినట్టుంటాయి. తొందరపాటు కనపడదు. తుంపులేకుండా సాగిపోతుంది గీత. సంభషణరహిత వ్యంగ్యచిత్రాలు వేయడంలో మంచి నేర్పు ఉంది. కనువుందు చేసే రంగుల కార్టూన్లు వేయడంలో అనుభవశాలి.
 • జయదేవ్-ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు-తెలుగు కార్టూనిస్టుల్లో ప్రత్యేకతను సంతరించుకున్నవాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. రామకృష్ణ ఆ కోవకు చెందిన వ్యంగ్య చిత్రకారుడు. రామకృష్ణ గీతలు నిండుగా, హుందాగా, నిశ్చలంగా ఉండి కన్నుల పడుగ చేస్తాయి. పాత్రలలో బావోద్వేగం, దూకుడు నీయంత్రించి కనిపిస్తుంది. అచ్చులో పొదిగిన అక్షరాలు పోలిన రామకృష్ణ వ్యాక్య, ఆయన ప్రత్యేకం. భావాన్ని స్పష్టీకరణ చేయటంలో రామకృష్ణకి సాటి మరొకరు లేరు.

వ్యంగ్యచిత్ర మాలికసవరించు