?రూప్‌కుండ్
ఉత్తరాఖండ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 30°15′43″N 79°43′55″E / 30.262°N 79.732°E / 30.262; 79.732
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 5,029 మీ (16,499 అడుగులు)
జిల్లా (లు) చమోలి జిల్లా జిల్లా
జనాభా Nil


రూప్‌కుండ్, భారతదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు సరస్సు. 1942 లో సరస్సు అంచున ఐదు వందల అస్థిపంజరాలను కనుగొనడంతో ఇది క్యాతి పొందింది. ఈ ప్రాంతం వాసయోగ్య మైనది కాదు. హిమాలయాలలో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. నందా దేవి గేమ్ రిజర్వ్‌లో పనిచేసే రేంజర్, హెచ్ కె మధ్వాల్ 1942లో అస్థిపంజరాలను కనుగొన్నాడు. అయితే ఈ ఎముకల గురించి 19వ శతాబ్దం చివరలోనే నివేదికలు ఉన్నాయి.[1] సామూహిక వ్యాధులు, భూపాతం లేదా మంచుతుపాను కారణంగా వాళ్ళు మరణించి ఉంటారని గతంలో నిపుణులు అనుకున్నారు.

రూప్‌కుండ్ సరస్సు
రూప్‌కుండ్ సరస్సులో మానవ అస్థిపంజరాలు

2004లో భారతీయ, యూరోపియన్ శాస్త్రజ్ఞుల బృందం అస్థిపంజరాలను అధ్యయనం చేసేందుకు ఇక్కడ పర్యటించింది. ఈ బృందం ఆభరణాలు, పుర్రెలు, ఎముకలు వంటి ముఖ్యమైన ఆధారాలను కనుగొంది. మృతదేహాల కణజాలాన్ని భద్రపరచింది.[2] మృతదేహాల మీద చేసిన DNA పరీక్షల్లో, ఈ అస్థిపంజరాలు అనేక సమూహాల ప్రజలకు చెందినవని తేలింది. ఇందులో దగ్గర సంబంధం ఉన్న పొట్టి వ్యక్తులు (బహుశా స్థానిక మోతకూలీలు), పొడవాటి వ్యక్తులూ ఉన్నారు. ఈ అస్థిపంజర అవశేషాలు 500ల కన్నా ఎక్కువ మందికి సంబంధించినవై ఉంటాయని భావించారు. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఏక్సిలరేటర్ యూనిట్, రేడియోకార్బన్ డేటింగు పరీక్ష జరిపి, ఈ ఎముకలు సా.శ 850 నాటివిగా నిర్ణయించింది. ఈ కాలానికి 30 సంవత్సరాలు అటూ ఇటూగా ఉండవచ్చు.

పుర్రెలలోని బీటలను అధ్యయనం చేసిన హైదరాబాద్, పూణే, లండన్‌లోని శాస్త్రజ్ఞులు, ఈ వ్యక్తులు వ్యాధి కారణంగా మరణించలేదని, ఆకస్మిక వడగళ్ళతుఫాను వల్ల మరణించారనీ తెలిపారు.[2] వడగళ్ళు దాదాపు క్రికెట్ బాల్ అంత పెద్దవిగా ఉన్నాయి. వాటి నుండి తలదాచుకునేందుకు హిమాలయాలపై ఏ విధమైన ఆశ్రయమూ లేనందున అందరూ మరణించారు.[2] కాలుష్యంలేని గాలి, అతిశీతల స్థితుల కారణంగా అనేక మృతదేహాలు చెడిపోకుండా చక్కగా సంరక్షించబడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూపాతాలు జరగడం వలన కొన్ని మృతదేహాలు సరస్సులో పడిపోయాయి. మరణానికి ముందు ఈ వ్యక్తులంతా ఎక్కడకు వెళ్తూ ఉండి ఉంటారో నిర్ధారించలేకపోయారు. ఈ ప్రాంతంలో టిబెట్ వెళ్ళటానికి వర్తక మార్గాలు ఉన్నట్టు ఏ విధమైన చారిత్రిక ఆధారమూ లేదు. కానీ రూప్‌కుండ్, ప్రముఖ పుణ్యక్షేత్రమైన నందాదేవికి వెళ్ళే మార్గంలో ఉంది. నందా దేవి ఉత్సవం, రాజ్ జాట్ ఉత్సవాలతో దాదాపు 12 సంవత్సరాలకొకసారి జరపబడుతుంది[1][3].

సిసిఎంబి పరిశోధన ఫలితాలు

మార్చు

500 అస్థిపంజరాలపై హైదరాబాదు లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు చేసిన పరీక్షల ఫలితాలను వెల్లడించారు. వీరి జన్యుపరిశోధనల ఆధారంగా ఈ అస్థిపంజరాలు విభిన్న జాతులకు చెందిన వ్యక్తులవిగా గుర్తించారు. ఇవి భారతీయులతోపాటు మధ్యధరా, ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందినవారి అవశేషాలని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న ముఖ్యశాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్‌ చెప్పాడు.[4]

రూప్‌కుండ్‌ నుంచి సేకరించిన 72 ఎముకల నమూనాల్లో నుంచి మైట్రోకాండ్రియల్‌ డీఎన్‌ఏను (MT-DNA) సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఆ అస్థిపంజరాలన్నీ ఒక కాలానికి చెందినవి కావని, 7వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకూ వివిధ కాలాలకు చెందిన మూడు విభిన్న సమూహాలవనీ వారి పరిశోధనలో తేలింది. ఈ మూడు సమూహాల్లోనూ భారతీయులు దాదాపు వెయ్యేళ్ల క్రితం మరణించారు. గ్రీకు, క్రిటిన్‌, వియత్నాం, చైనాలకు చెందిన వారు 17 నుంచి 18వ శతాబ్దంలో మరణించారు అని తంగరాజ్ చెప్పాడు.[5]

అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి సీసీఎంబీ చేసిన పదేళ్ళ ఈ పరిశోధనలో ఈ అస్థిపంజరాల్లో సగం భారతీయులవిగా కాగా మరో సగం మధ్యధరా ప్రాంతం, గ్రీస్‌, క్రిటా జాతులకు చెందినవిగా వెల్లడైంది. ఒక నమూనా మాత్రం ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందిన వారిదిగా గుర్తించారు. టిబెట్‌లో వ్యాపారం కోసం వ్యాపారులూ, నందాదేవి దర్శనార్థం భక్తులూ ఈ మార్గం మీదుగా వెళ్తుంటే.. ప్రకృతి విపత్తుల కారణంగా సరస్సులో పడిపోయి మృతిచెంది ఉండొచ్చని అంచనా వేస్తున్నానని.. మరింత లోతైన పరిశోధనలతో ఈ విషయమై మరింత స్పష్టత వస్తుందని తంగరాజ్‌ చెప్పాడు.[4]

పర్యాటక రంగం

మార్చు

రూప్‌కుండ్ అనేది హిమాలయాలలోని అందమైన పర్యాటక కేంద్రం. ఇది త్రిశూల్ (7120 మీ), నంద్‌ఘుంగ్టి (6310 మీ) అనే రెండు పర్వత శిఖరాల మధ్యన ఉంది. బెడ్ని బుగ్యల్ యొక్క ఎత్తైన పచ్చిక బయళ్ళ వద్ద సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు ప్రతి ఆకురాలు కాలంలో ఒక సంప్రదాయ ఉత్సవం జరుపుకుంటారు. రూప్‌కుండ్ వద్ద పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నందా దేవి రాజ్ జాట్ అనే అతిపెద్ద ఉత్సవం జరుగుతుంది. సంవత్సరంలో చాలా భాగం అస్థిపంజర సరస్సు మంచుతో కప్పబడి ఉంటుంది. రూప్‌కుండ్ కు వెళ్ళే ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. దారంతటా అన్ని వైపులా పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది.

రూప్‌కుండ్ చేరటానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా, సాహస యాత్రికులు రోడ్డు మార్గం ద్వారా లోహజంగ్ లేదా వాన్ వరకూ ప్రయాణిస్తారు. అక్కడ నుండి, వాన్ వద్ద మిట్టను ఎక్కి, రాణీకీ ధార్ చేరతారు. అక్కడ కొంత పీఠభూమి ప్రాంతం కూడా ఉంది, ఇక్కడ రాత్రివేళలో బసచేయవచ్చు. ఒకవేళ ఆకాశం స్పష్టంగా ఉంటే, బెడ్ని బుగ్యాల్, త్రిశూల్ లను చూడవచ్చును. తరువాత బెడ్ని బుగ్యాల్ వెళతారు. ఇది వాన్ నుండి 12–13 కిమీ ఉంటుంది. గుర్రాలు, గొర్రెలు, కంచరగాడిదల కొరకు పెద్ద గడ్డి మైదానాలు ఉన్నాయి. అక్కడ ఉన్న రెండు దేవాలయాలు, ఒక చిన్న సరస్సు ఆ ప్రాంతం యొక్క అందాన్ని ఇనుమడింప చేస్తూంటాయి. బెడ్ని బుగ్యాల్ నుండి హిమాలయాల శిఖరాన్ని చూడవచ్చు. పర్వతారోహకులు అక్కడ నుండి భాగువబాస వరకూ వెళతారు, అది బెడ్ని బుగ్యాల్ నుండి 10–11 కిమీ ఉంటుంది. సంవత్సరంలో అధికకాలం భాగువబాసలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. త్రిశూల్‌ను, 5000ల మీటర్ల కన్నా ఎత్తున్న ఇతర శిఖరాలనూ ఇక్కడ నుండి దగ్గరగా చూడవచ్చు. చుట్టూ ఉన్న పర్వతాల వాలులపై మీద అనేక జలపాతాలను, భూపాతాలనూ చూడవచ్చును. భాగువబాస నుండి, పర్వతారోహకులు రూప్‌కుండ్ గాని, శిలా సముద్రం (శిలల సముద్రం) గానీ, జునర్గాల్లి కోల్ పాస్ ద్వారా వెళతారు. ఇది సరస్సుకు కొంచం పైన ఉంటుంది.

ప్రముఖ సంస్కృతిలో రూప్‌కుండ్ అస్థిపంజరాలు

మార్చు

రూప్‌కుండ్ యొక్క అస్థిపంజరాలను నేషనల్ జాగ్రఫిక్ లిఖితరూపం "రిడిల్స్ ఆఫ్ ది డెడ్: స్కెల్టన్ లేక్"లో ప్రదర్శించారు. [1]

సూచికలు

మార్చు
  1. 1.0 1.1 "Roopkund - Skeleton lake". Wondermondo.
  2. 2.0 2.1 2.2 http://www.రూప్కుండ్.com/2008/12/23/roopkund-lake/[permanent dead link]
  3. Sturman Sax, William (1991). Mountain goddess: gender and politics in a Himalayan pilgrimage (in English). Oxford University Press. pp. 256. ISBN 019506979X.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  4. 4.0 4.1 "అస్థిపంజర సరస్సు గుట్టు వీడింది. సగం భారతీయులవేనని నిర్ధారించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు". ఈనాడు. 21 Aug 2019. Archived from the original on 21 Aug 2019.
  5. "అస్థి పంజరాల గుట్టు రట్టు". ఆంధ్రజ్యోతి. 21 Aug 2019. Archived from the original on 21 Aug 2019.
  • ఐట్కేన్, బిల్. ది నందా దేవి అఫ్ఫైర్, పెంగ్విన్ బుక్స్ ఇండియా, 1994. ISBN 0-912616-87-3.

బాహ్య లింకులు

మార్చు