వత్సవాయి వేంకటనీలాద్రిరాజు

వత్సవాయి వేంకటనీలాద్రిరాజు (జ: 1881 - మ: 1939) క్షత్రియునిగా జన్మించిన ప్రముఖ కవి, శతావధాని, విమర్శకుడు.

ఇతడు వసిష్ఠగోత్రుడు. వీరి తండ్రి: వేంకట సీతారామరాజు. ఇతని జన్మస్థానము: మోడేకుఱ్ఱు, నివాసము: తుని.

రచనలు మార్చు

ఇతడు రచించిన సంస్కృత కృతులు: 1. ఆంధ్రక్షత్రియులు (విమర్శనాత్మకము. 1920 ముద్రి.) 2. ఆంధ్రమేఘసందేశము (1912 ముద్రి) 3. అభిజ్ఞాన శాకుంతలము (1933 ముద్రి) 4. విక్రమోర్వశీయము. 5. మాళవికాగ్ని మిత్రము (ఆముద్రితములు).

ఈ నీలాద్రిరాజుగారికి దేశములో గవిరాజని ప్రసిద్ధ వ్యవహారము. ఈయన తుని సంస్థాన విద్వత్కవి. రాజులలో గవి యగుటయు గాక, కవులలో రాజగుటయు నీయనకు గవిరాజ బిరుదము చరితార్థ మయినది.

ఈక్షత్రియకవి, మోడేకుఱ్ఱు సంస్కృత పాఠశాల పండితులు ఆకొండి వ్యాసలింగశాస్త్రి గారి సన్నిధానమున సంస్కృతాంధ్రసాహితి సంగ్రహించెను. పాణినీయమునను గొంత ప్రవేశము కలిగించుకొనెను. కవిత్వము మంచి చిక్కని పలుకుబళ్లతో నుండి చక్కగ నడపింపగల నేర్పరు లీయన. పెద్దన, తిమ్మనార్యుడు మున్నగువారి శైలి వీరి కవిత కొరవడి. భాష నిర్దుష్టము, శిష్టసమ్మతముగ నుండును. కాళిదాసుని యభిజ్ఞాన శాకుంతలము, మేఘసందేశము ననువదించి వెలువరించిరి. విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము కూడ దెనిగించిరని తెలియ వచ్చును గాని యచ్చుపడలేదు.

కాళిదాసుని ప్రతి కృతికి నెన్నో పరివర్తనములున్నవి. అందులో నభిజ్ఞాన శాకుంతలమునకు మన తెలుగులో బేరుపడిన యనువాదములు పది-పదునైదుదాక నున్నవి. శ్రీ పరవస్తు రంగాచార్యులు గారు (వీరిది రెండంకములు మాత్రమే 'సకలవిద్యాభి వర్ధనీ పత్రిక' లో వెలువరింపబడినది), కందుకూరి వీరేశలింగము గారు, వేదము వేంకటరాయశాస్త్రి గారు, రాయదుర్గము నరసయ్య శాస్త్రి గారు, దాసు శ్రీరామకవి గారు, వడ్డాది సుబ్బారాయుడు గారు, నిడమర్తి జలదుర్గా ప్రసాదరాయడు గారు, మంత్రిప్రెగడ భుజంగరావు గారు, కాంచనపల్లి కనకమ్మ గారు, పేరి కాశీనాథశాస్త్రి గారు, వీరెల్లరును శాకుంతలాపరివర్తనకర్తలు. తరువాత మన కవిరాజుగా రొకరు. వీరి తెలుగుసేతలో విశేషములు రెండున్నవి. కేవలము మూజానుసారముగ ముక్కకుముక్క తెలిగింపక వ్యాఖ్యానసాహాయ్యమున భాష్యప్రాయముగ బెంచి రచించుట యొకటి. సంస్కృతమునను, దెనుగునను దొల్లి ప్రచురితములగు ప్రతులన్నియు బట్టిచూచి, పాఠభేదములు, ప్రక్షిప్తప్రదేశములు లెస్సగ బరికించి పూర్వాపర సందర్భములు తాఱుమాఱు గాకుండ జేయుట రెండవది. కవితాధార సంగతి వేఱే చెప్పనేల ?

నీలాద్రిరాజుగారు పెద్దాపురము రాజ్యమును బరిపాలించిన శ్రీ రాజా వత్సవాయి వేంకటసింహాద్రి జగత్పతీంద్రుని యాదరమున దుని సంస్థాన కవిగానుండి పేరందెను. తునిరాణి శ్రీ సుభద్రాంబిక యీకవిని బహుగౌరవముతో జూచినది. నేటి తునిరాజుగారు శ్రీ వత్సవాయి వేంకటసూర్యనారాయణ జగపతిరాజావారి పట్టాభిషేక సందర్భమున బ్రదర్శనము చేయుటకై కవిరాజుగారు శాకుంతల మాంధ్రీకరించినటులు ప్రస్తావనలో నున్నది. శ్రీవారి సంస్థానమున నీయన జేగీయమానముగ శతావధానము గావించెను. ఆంధ్రభారతీ తీర్థవారు 'కవిభూషణ' యను బిరుదముతో నీయనను సత్కరించిరి. కవిరాజుగారు తాను శతావధాని నన్న సంగతి యీపద్యములలో బేరుకొనెను.


నీలాద్రిరాజుగారు కవియు, శతావధానియు గాక మంచి విమర్శకుడని 'ఆంధ్ర క్షత్రియులు' అనిన చిన్నపుస్తకము వలన దెల్లమగును. శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు 'ఆంధ్రులచరిత్రము' లో నాంధ్ర దేశమును బరిపాలించిన కాకతీయులు సూర్యవంశక్షత్రియులని తొలుత వ్రాసి, తరువాత జతుర్థకులజులని మరల వ్రాసిరి. పరస్పరవిరుద్ధముగ నిటులు వ్రాయుటకు గారణమేమని యడుగ మొదటిది భ్రమయనియు, రెండవది ప్రమ యనియు బిమ్మట వాదించిరి. అప్పుడు మన కవిరాజుగారు శ్రీ రావుగారి వ్రాతను సప్రమాణముగ గాదని వాదించి కాకతీయులు క్షత్రియులే యని యీ పుస్తకములో దేల్చివ్రాసిరి.

ఈ కూర్పునకు బీఠికవ్రాయుచు విమర్శకాగ్రేసరులు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు చిట్టచివర నిట్టులుతమయభిప్రాయము వెలిబుచ్చిరి.

"...ప్రతాపరుద్రాదులు శూద్రులను భ్రమ పల్వురకు గలిగినది. నేనును నందులోని వాడనేగాని శ్రీ కవిరాజుగారు వ్రాసిన యీగ్రంథము చూచినతరువాత నే నిదివఱకు దలచినది తప్పని గ్రహించి దిద్దుకొన వలసినవాడ నయితిని."

వంశక్రమము మార్చు

ఈ పద్యము వీరి వంశాది విశిష్టతను విస్పష్టపఱుచును. ఆంధ్ర మేఘసందే శావతారికలో గవిరాజుగారు తమ సహాధ్యాయనిచే జెప్పించుకొన్నటులు వ్రాసిన పద్యమిది.

సీ. రాజకేసరివర్మ రాజేంద్రచోళాది
జనపతుల్ కూటస్థ జనులు మీకు
భూలోక వైకుంఠాకవులు రంగ వేంకటే
శ్వరు లన్వవాయదైవములు మీకు
తెలుగురాయనరేంద్ర తిమ్మరాయన జగ
త్పతు లన్వయప్రదీపకులు మీకు
భగవత్పద ధ్యాన పర విశిష్టాద్వైత
మత మన్వయక్రమాగతము మీకు

గీ.ననికి వెనుకంజ వేయక యనుతృణములు
వదలి దివిచూఱకోలు సద్ర్వతము మీకు తళుకుకనకంబునకు బరీమళము వోలె కావ్యనిర్మాణ మతి యశస్కరము మీకు.

మూలాలు మార్చు

  • ఆంధ్ర రచయితలు, మొదటి భాగము, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, అద్దేపల్లి అండ్ కో, 1950, పేజీలు: 280-5.