వేదము వేంకటరాయ శాస్త్రి

రచయిత, కవి
(వేదము వేంకటరాయశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)

వేదము వేంకట రాయశాస్త్రి (డిసెంబర్ 21, 1853[1] - జూన్ 18, 1929) సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త

వేదము వేంకటరాయ శాస్త్రి
Vedam Venkataray Sastry.jpg
వేదము వేంకటరాయ శాస్త్రి
జననంవేదము వేంకటరాయ శాస్త్రి
డిసెంబర్ 21, 1853
మరణంజూన్ 18, 1929
ప్రసిద్ధిసుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు , నాటకకర్త
తండ్రివేంకట రమణశాస్త్రి
తల్లిలక్ష్మమ్మ
Notes
1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించాడు

జీవిత సంగ్రహంసవరించు

ఇతడు వేంకట రమణశాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించారు. ఈయన 1886లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండితపదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు. 1887లో బి.ఎ. పరీక్షలలో ఆంగ్లం, సంస్కృతం లలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. 1916లో సూర్యారాయాంధ్ర నిఘంటువుకు ప్రధాన సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు.

వెంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషావాది. సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించారు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన ప్రతాపరుద్రీయ నాటకం, 1901లో వ్రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవి[2] ఇవేకాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించారు.[3] వెంకటరాయ శాస్త్రి 1929, జూన్ 18న తెల్లవారు జామున 5:45కు మద్రాసులో మరణించారు.

వెంకటరాయ శాస్త్రి 1895లో హర్షుని నాగానందం తెనుగించి అందులోని నీచపాత్రల సంభాషణలకు వ్యవహారిక భాషను ఉపయోగించారు. ఈ ప్రయోగం సంస్కృత నాటకాల్లో నీచ పాత్రలకు ప్రాకృతాన్ని ఉపయోగించడం లాంటిదేనని సమర్ధించుకున్నారు. కానీ ఆనాటి సాంప్రదాయవాద సాహితీకారులు ఇది భాషాపతనం, సాహితీవిలువల దిగజారుడు అని విమర్శించారు. ఇందువలన సాహిత్యానికి జరిగిన నష్టాన్ని చర్చించడానికి పండితులు 1898 డిసెంబరులో మద్రాసులో సమావేశమయ్యారు. ఒకవైపు ఇలా విమర్శకులు విమర్శిస్తూ ఉండగానే, శాస్త్రి పంథాను అనేకమంది సృజనాత్మక సాహితీకారులు అనుకరించారు.[4][5]

గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రోత్సహించినవారు.1899 లో ఆంధ్ర భాషాభిమాన నాటక సమాజాన్ని స్థాపించారు. ఇతడు తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని నాగానందం (1891), అభిజ్ఞాన శాకుంతలం (1896), మాళవికాగ్నిమిత్రం (1919), ఉత్తర రామచరితం (1920), విక్రమోర్వశీయం, రత్నావళి (1921), ప్రతాపరుద్రీయం (1897), (ఇది ఓరుగల్లు ప్రభువైన,రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం) ఇంకా ఉషానాటకం (1901), బొబ్బిలి యుద్ధం (1916) ఇతడు వ్రాసిన నాటకాలు.

జీవిత విశేషములుసవరించు

1.పూండ్ల రామకృష్ణయ్య గారు శాస్త్రిగారికి వ్రాసిన జాబులో.... తే 22-3-'02 నెల్లూరు...ఆర్యా, నమస్కారములు. .......నేనురోగినైనాడను. దూరమునడువ లేను. ఎండసోకగూడదు. ఎట్లుజీవించగలనో దిగులుగానున్నది రాజైశ్వర్యములు వలసియున్నవి. ఆర్జననున్న...కుదురుపాటు చిక్కలేదు. చిత్తచాంచల్యము మెండుగానున్నది. ఇందుచే బక్షవాయువు వచ్చునట్లు తోచుచున్నది ఏదివచ్చినను ననుభవించక తీరదుగదా. విశేషములులేవు.

2.శాస్త్రులవారికి... వీరువ్రాసినజాబులు దాదాపు రెండువందలు. వానిలో కడపటిది 30-4-'03 తారీఖున వ్రాయబడింది. తర్వాతజాబులేదు. పూండ్ల రామకృష్ణయ్యగారు శాస్త్రులవారికి ఆప్తమిత్రులై తమపత్రికను వారిపత్రికగానే జరిపి అనుక్షణము సలహాలను పొందుచుండినవారు. ఆంధ్రకవిపండిత సంఘసమరమున శాస్త్రులవారికి తోడునీడగానుండిరి. పెక్కు అముద్రిత గ్రంథములను చక్కగా సంస్కరించి బహుగ్రంథ పరామర్శపూర్వకములైన విపులవిమర్శలతో ముద్రింపించిరి. 1904 సం. సెప్టెంబరు 1 తేదినాడు నెల్లూర, స్వర్గస్థులైరి. అముద్రిత గ్రంథచింతామణియు నిలిచిపోయింది.

3.శ్రీ శాస్త్రులవారు మదరాసు క్రైస్తవకళాశాలలో సంస్కృత ప్రధానపండితులుగాను శ్రీ సమర్థి రంగయసెట్టిగారి మరణానంతరము కాలేజిలో ప్రాచ్యభాషా ప్రవచనాధ్యక్షులుగాను (Superintendent of Vernacular studies) దాదాపు ఇరువదినాలుగు సంవత్సరములుండి 1910 సంవత్సరమున జనవరినెలలో విరమించిరి.

4...... ఒకదినము విస్తారము వర్షముకురియుచుండెను. శాస్త్రులవారు ఒక పెట్టెలో వస్త్రాదికములుంచుకొని, ఉడుపు ధరించి జోరువర్షములో గొడుగున్నను, తడిసి, కళాశాలచేరి, ఆ తడసిన దుస్తునుతీసి పెట్టెనుండి వేఱుదుస్తుధరించి తరగతికి పోయిరి. ఆదినము అనేకులు అథ్యాపకులు రాలేదు. ప్రిన్సిపాలుగారు, దొర, శాస్త్రులవారితో నిట్లనెను. "శాస్త్రిగారూ, చూచారా, ఏవిధంగావర్షంకురుస్తున్నదో ఫలానివారు రాలేదు. వారిపనికూడా తాము చూడగలరా." శాస్త్రులవారికి నాడు విస్తారము పనియుండెను. పైగా శాస్త్రులవారికే ఎక్కువపని తగులుచుండెను. అధికారులకును ఇతరాథ్యాపకుల యందు పక్షపాతముండినది. వెంటనే శాస్త్రులవారు "వర్షమే ఒకకారణంగా తాము భావించేపక్షములో నేనుకూడారాక ఇంటనే ఉందునే" అని శాస్త్రులవారు బదులుపలికిరి.

5. ..... వేసవికాలమున నొకదినమున తరగరిలో విద్యార్థియొకడు, శాస్త్రులవారు పాఠము చెప్పుచుండగా నిద్రబోవుచుండెను. దొర ఎచటినుండియోవచ్చి, శాస్త్రులవారి యనుమతిలేకయే వారిగదిజొచ్చి, ఆవిద్యార్థినిలేపి, శాస్త్రులవారినిచూచి Do you allow the boys to sleep in the class? అని యడిగెను. (విద్యార్థులను తరగతిలోనే నిద్రబోనిచ్చెదవా? అని యర్థము.) శాస్త్రులవారికి కోపమువచ్చింది. తరగతిలో తాము పాఠముచెప్పునప్పుడు తమ యనుజ్ఞలేకయే లోనప్రవేశించుట మర్యాదగాదు. వెంటనే వారు 'I do my duty' (నేను నాధర్మమును నెఱవేర్చుచున్నాను) అని బదులిచ్చిరి. ఈదెబ్బకు ఏమి బదులుచెప్పుటకును తోచక దొర వెడలి పోయెను.

6. ....శాస్త్రులవారికి ఎక్కుడుపని తగులుచుండెడిది. ఆవిషయమును తెలుపుటకై వారు అప్పుడప్పుడు ఇట్లడుగువారు. Who is the only christian in our college? అని అందులకు విద్యార్థులు మిల్లరనియు, (ప్రిన్సిపాల్) కాక మఱియొకరనియు చెప్పువారు శాస్త్రులవారు 'No! It is myself. I live by the sweat of my brow.' అని బదులుచెప్పువారు. మథ్యాహ్నము కార్యాధిక్యముచే వారిమొగమంతయు చెమటచే నిండిపోయెడిది.

7. ....శాస్త్రులవారికి ఈనౌకరిలో పెన్షనురాదు. కళాశాలవారు మొత్తముగా కొంతద్రవ్యమొసంగు నేర్పాట్లేవో చేసియుండిరి. శాస్త్రులవారికి సంస్కృతాంధ్ర గ్రంథములను పెక్కింటినిశోధించి ముద్రింపవలయునని కోర్కెయునుండినది. మరల నచ్చాఫీసును ప్రారంభించుటకై తమకు పరీక్షకాధికారములచేత నేర్పడిన ద్రవ్యమునుచేర్చి దాదాపు మూడువేల రూప్యములను ఆర్బత్ నేటుబ్యాంకిలో వేసియుండిరి. ఈడబ్బున్నదను ధైర్యముతో అచ్చాఫీసు ప్రారంభింపదలంచి ఒకప్పుడు తాముద్యోగమును వదలుకొనెదమని తమ ప్రిన్సిపాలుతో చెప్పగా నాతడు అంతగొప్ప సంస్కృతపండితుడు మరల తమకు దొరకడనియు, శాస్త్రులవారిని అంతత్వరగాపంపివేయుట తమకిష్టము లేదనియు ఇంకను కొంతకాల ముండవలసినదనియు కోరిరి. శాస్త్రులవారు రాజీనామానొసంగెదమని ఎంతచెప్పినను దొరలు ఒప్పుకొనలేదు ఆదినము సాయంకాలము శాస్త్రులవారు ఇంటికి వచ్చుచు మార్గమున ఆర్బతునేటు బ్యాంకిమునిగిపోయినదని తెలిసికొనిరి. రాజీనామాను దొరలోప్పుకొనకపోయినది మంచిదే యైనదనితలంచి కొంతకాలము ఆపనియందేయుండిరి.

8."నేను నాయాంథ్రాభిజ్ఞాన శాకుంతలమును ప్రకటించి వారికి ఒకప్రతి పంపితిని (శ్రీ వేంకటగిరి మహారాజా, కీ.శే. శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరు). అంతటవారు నాతో సమావేశముంగోరి మదరాసు మౌంటురోడ్డు మోతీమహలులో నాకు దర్శనమొసంగి సల్లాపానంతరము నాకు కొంతధనము పారితోషిక మొసంగవచ్చిరి. నేను వారిని ఇట్లు ప్రశ్నించితిని. 'ఈగ్రంథము ముద్రితమైనది. దీనికై యిపుడునేను అధమణున్ండనుగాను. జీవనమునకై నాకు క్రిశ్చియన్కాలేజిలో కొలువున్నది. ఏలఏలినవారు నాకు ఈధనమీయవలయును. ఏలనేను కైకొనవలయును?' అంతట వారు సెలవిచ్చిరి, 'మీకు కాలేజిలో జీతము స్వల్పము. అదిమీకు కుటుంబభరణమునకే చాలదు.మీరువ్రాయవలసినది, మేము ముద్రింపవలసినది. మనమిరువురము పరస్పరసాహాయ్యముతో ఈతీరున లోకోపకారము చేయవలసినది. కావున మీరు ఈలేశమును గ్రహించుట 'యుక్తము.' ఆమాటకును ఆప్రసాదమునకును నేను అత్యంతము సంతుష్టుడనై ఆపైకమును గ్రహించితిని. అప్పటినుండి నేను ప్రకటించిన ప్రతిపుస్తకమునకును, పుస్తకాదినిమిత్త నిరపేక్షముగా సయితము, వారు అప్రార్థితముగా నాకు మెండు ధనమిచ్చుచుండిరి."

9. 'ఇట్లు కొందఱు వదాన్యులు ధనమిచ్చినను, ఒకప్పటికి కూడిన ధనము ముద్రణాదికృత్యములకు పర్యాప్తముగాక యుండినది. ఆంధ్రగైర్వాణగ్రంథములనే రమారమి రు 900 లకు కొనవలసివచ్చింది. దుర్దైవవశమున మందదృష్టినైతిని. దానంజేసి కార్యసహాయులకై రు 1500 ఎక్కుడుగానే వ్యయమయినది. ఆసమయమున, నేను రిక్తుడను రుగ్ణుడను, నిరాయతిని బహుకుటుంబిని, ఉక్తకారణములచేత బహువ్యయుండనుంగాన, ముద్రణమునకు తక్కువపడిన ధనమును వ్యయించుటకు స్వశక్తి లేకయు నుంటిని. దానినెఱింగి యీ గ్రంథము తప్పకముద్రితమగుగాకయని నెల్లూరుజిల్లా కావలి తాలుకా ఇందువూరుగ్రామ్యవాస్తవ్యులు, భూస్వాములు శ్రీయుతులు ఎఱబ్రోలు రామచంద్రారెడ్డిగారు ....... నాకు ఏతద్గ్రంథ ముద్రణపూర్తికై అప్పుడప్పుడు రు. 2500 ల పరిమితిం జెందువఱకు విరాళమొసంగిరి.' ఈవిధముగా నీగ్రంథము 1927 సం జూలయినెలలో వెలువడినది. 'చేసెదనింకదత్పరత సేవలు చూడికుడుత్త దేవికిన్‌' అని 1913 సం కావించిన ప్రతిజ్ఞను ఇన్నాళ్ళకు చెల్లించుకొని 'చేసితినిప్డు తత్పరత సేవలు చూడికుడుత్తదేవికిన్‌' అని ముద్రించారు. ఆముక్తమాల్యద ముద్రితమై వెలువడినప్పుడు వారిహర్షమునకు మేరలేదు. (పుట. 184)

10. ...... ప్రతిదినమును ప్రొద్దున నొకటి రెండుగంటలు శరీరముపై స్పృహయుండెడిది. తర్వాత జ్వరము వచ్చెడిది. ఒడలు తెలియనిస్థితి. గంజి ఆహారము. ఉపనయనానంతరము నేను చెంతకుపోయితిని. 'మీకు, ఒంట్లో ఎట్లున్నదండీ?' అని యడిగితిని 'పరమ పదం, పరమపదం' అనిమాత్రము చాలకష్టముతో చెప్పగల్గిరి. ఆవెనుక వారికి చైతన్యము లేదు. మరల తెల్లవారులోపల 1929 సం. (1929) జూనునెల 18 తేది మంగళవారము వేకువను 5-45 గంటలకు పరమపదించిరి.' [6]

వారసత్వంసవరించు

వెంకటరాయ శాస్త్రి మనవడి పేరు కూడా వెంకటరాయశాస్త్రే. ఈయన తాతగారిలాగే నాటక రచయిత. వ్యామోహం మొదలైన నాటకాలను రచించారు. తాతగారి జీవితచరిత్రను "వేదం వెంకటరాయ శాస్త్రి జీవిత సంగ్రహము" పేరుతో వ్రాశారు. అలాగే తెలుగువారెవరు అనే పరిశోధనా గ్రంథాన్ని కూడా రచించారు. ఈయన అన్నదమ్ములు వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ అనే ప్రచురణాసంస్థను ప్రారంభించి అనేక తెలుగు పుస్తకాలను అచ్చువేశారు.[7]

గౌరవాలుసవరించు

 • 1920 : ఆంధ్ర మహా సభ చేత 'మహోపాధ్యాయ' బిరుదుపొందారు.
 • 1922 : ద్వారక పీఠ శంకరభగవత్పాదులచేత 'సర్వతంత్ర స్వతంత్ర', 'మహామహోపాధ్యాయ', 'విద్యాదానవ్రత మహోదధి' అనే సత్కారాలు పొందారు.
 • 1927 : ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చేత 'కళా ప్రపూర్ణ' గౌరవంతో సన్మానించబడ్డారు.
 • 1958 : కుమార సంభవ ప్రబంధకర్త నన్నెచోడుని కవిత్వంపై వీరు రాసిన 'నన్నెచోడుని కవిత్వము' అనే విమర్శనా గ్రంథానికి 'ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి' బహుమతి లభించింది.

రచనలుసవరించు

 • నాగానందము (1891)
 • శాకుంతలము (1896)
 • ప్రతాపరుద్రీయం (1897)
 • ఆంధ్ర ప్రసన్నరాఘవవిమర్శనము (1898)
 • స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణము (1899)
 • గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనము (1899)
 • విక్రమోర్వశీయము (1901)
 • మేఘసందేశ వ్యాఖ్య (1901)
 • ఉషా పరిణయము (1901)
 • ప్రియదర్శిక (1910)
 • విసంధి వివేకము (1912)
 • శృంగార నైషధ సర్వంకష వ్యాఖ్య (1913)
 • బొబ్బిలి యుద్ధము (1916)
 • మాళవికాగ్నివిత్రము (1919)
 • తిక్కన సోమయాజి విజయము (1919)
 • ఉత్తర రామచరిత్ర (1920)
 • విమర్శ వినోదము (1920)
 • ఆంధ్ర హితోపదేశ చంపువు
 • ఆంధ్ర సాహిత్య దర్పణము
 • ఆముక్తమాల్యదా సంజీవినీ వ్యాఖ్య (1921)
 • రత్నావళి (1921)
 • అమరుకావ్యము (ఆంధ్రవ్యాఖ్య) (1950)[8]
 • ఆంధ్ర దశకుమార చరిత్రము- దండి రాసిన సంస్కృత మూలానికి ఆంధ్ర గద్యానువాదం[9]

మూలాలుసవరించు

 1. Vedam Venkataraya Sastry, Volume 189 By Vedam Venkataraya Sastri పేజీ.70
 2. http://www.indianetzone.com/33/vedam_venkataraya_sastry_indian_theatre_personality.htm
 3. History of Indian literature, Volume 1 By Sisir Kumar Das
 4. Paravastu Chinnaya Suri By Būdarāju Rādhākr̥ṣṇa, Sahitya Akademi పేజీ.53
 5. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,. 2005.CS1 maint: extra punctuation (link)
 6. వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము రచయిత వేదము వేంకటరాయ శాస్త్రి, సంవత్సరం1943 ప్రచురణకర్త వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్
 7. http://openlibrary.org/a/OL376309A/Vedam_Venkataraya_Sastri
 8. వేంకటరాయశాస్త్రి, వేదము (1950). అమరుకావ్యము. వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్. Retrieved 2020-07-13.
 9. వేదము, వేంకటరాయశాస్త్రి (1912). ఆంధ్ర దశకుమార చరితము.

బయటి లింకులుసవరించు