వరంగల్ సెంట్రల్ జైలు

వరంగల్ సెంట్రల్ జైలు వరంగల్లో ఉన్నది .

వరంగల్ సెంట్రల్ జైలు వరంగల్లో ఉన్నది. దీనిని నిజాం పాలనా సమయంలో నిర్మించారు. నిజాం హయాంలో స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులు, పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేజీ సత్యమూర్తి, మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కోబాడ్‌ గాంధీ, శాఖమూరి అప్పారావు, విరసం నేత వరవరరావు, సీపీఐఎంఎల్‌ (జనశక్తి) వర్గ నాయకుడు కూర రాజన్న, ఆర్‌ఓసీ రవూఫ్, నూడెమోక్రసీ గడ్డం వెంకట్రామయ్య అలియాస్‌ దొరన్న, బోగా శ్రీరాములు అలియాస్‌ మాధవ్, ధనసరి సమ్మన్న అలియాస్‌ గోపి, మధుతోపాటు దళ కమాండర్, సభ్యులు ఇక్కడ ఖైదీలుగా గడిపారు.[1]

వరంగల్ సెంట్రల్ జైలు
వరంగల్ సెంట్రల్ జైలు
పటం
Locationవరంగల్, తెలంగాణ, భారతదేశం
Coordinates17°59′45″N 79°35′31″E / 17.9959°N 79.5919°E / 17.9959; 79.5919
Opened1885
Managed byడైరెక్టర్ జనరల్ & ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, తెలంగాణ ప్రభుత్వం

చరిత్ర మార్చు

దీనిని 1886లో నిజాం పాలనలో ఉత్తర తెలంగాణ ప్రాంత ఖైదీల కోసం నిర్మించారు. ఈ  జైలును బ్రిటిష్‌ ఇంజనీర్లు డంగు సున్నం, ఇంగ్లండ్‌ నుంచి తెప్పించిన ఇనుమును వాడి నిర్మించారు. ఇప్పటికీ లాకప్‌ ఇనుప కడ్డీలపై మేడిన్‌ ఇంగ్లండ్‌ అని ఉంటుంది. దీని విస్తీర్ణం 66 ఎకరాలు. కాళోజీ నారాయణరావు మెడికల్‌ యూనివర్సిటీకి ఆరు ఎకరాలు ఇవ్వడంతో అరవై ఎకరాలు మిగిలాయి. సుమారు 30 ఎకరాల్లో పరిపాలనా భవనం, ఖైదీల బ్యారెక్‌లు, హై సెక్యూరిటీ బ్యారెక్‌లు, ఖైదీల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కర్మాగారాలు, ఆస్పత్రిలు ఉన్నాయి. జైలు నిర్మించిన సమయంలో 51 బ్యారెక్‌లను నిర్మించారు. భద్రత కోసం ఎత్తయిన ప్రహరీ, ఐదు వాచ్‌ టవర్లు, పరిపాలనా కోసం మరో టవర్‌ను కట్టారు. 2010లో రెండు కొత్త బ్యారెక్‌లు, హై సెక్యూరిటీ ప్రహరీ, నాలుగు కొత్త వాచ్‌ టవర్లను నిర్మించారు.

భద్రత మార్చు

ఈ జైలులో కమాండ్‌ కంట్రోల్‌ రూం, హైసెక్యూరిటీ బ్యారక్స్, నిరంతర పర్యవేక్షణతో హైసెక్యూరిటీ బ్యారక్స్‌లో 48 సెల్స్‌ ఉన్నాయి. వీటికి ప్రత్యేక లాకింగ్‌ సిస్టం, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. ఈ జైల్లోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి 24 గంటల పాటు సిబ్బంది నిఘా ఉంటుంది. భద్రతా చర్యల్లో భాగంగా 154 శక్తివంతమైన హైరిజల్యూషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నక్సల్స్‌ కోసం ప్రత్యేకంగా నక్సల్స్‌ బ్యారెక్‌ (ఎన్‌ఎక్స్‌ఎల్‌) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జైల్లో 956 ఖైదీలు ఉన్నారు.

ఉపాధి మార్చు

ఈ  జైలులో అనేక పరిశ్రమలు ఉన్నాయి. జైలు ఆవరణలో రెండు పెట్రోల్‌ పంపులను ఖైదీలతో నిర్వహిస్తున్నారు. దర్రీస్, సబ్బులు, ఫినాయిల్, స్టీల్‌ బీరువాలు, బెంచీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి ఉత్పత్తులను ‘మై నేషన్‌’ బ్రాండ్‌ పేరిట విక్రయిస్తారు. వాటి నుంచి సంవత్సరానికి సుమారు రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. నేరాలు చేసేవారి మనస్తత్వం మార్చేందుకు ‘ఉన్నతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీజీ కోర్సులను జైలులోనే అందిస్తున్నారు.

జైలు తరలింపు మార్చు

ఈ జైలుని కూలగొట్టి అందులో రీజనల్‌ కార్డియాక్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం మామునూరులో కొత్త జైలు నిర్మాణానికి స్థలం కేటాయించింది. కొత్త నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఖైదీలను ఇతర జైళ్లలో ఉంచుతారు.[2]

మూలాలు మార్చు

  1. "Warangal Central Jail: కాలగర్భంలోకి 135 ఏళ్ల చరిత్ర!". Sakshi. 2021-06-02. Retrieved 2021-08-08.
  2. "Prisoners Shifted, 135-Year-Old Telangana Jail Being Emptied For Hospital". NDTV.com. Retrieved 2021-08-08.

ఇవి కూడా చూడండి మార్చు