వికీపీడియా:తెవికీ వార్త/2011-10-03/యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణ

తెవికీ వార్త
తెవికీ వార్త
యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణ

యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణ

టి.సుజాత , అక్టోబర్,03, 2011
పుట్టగొడుగు గూగుల్ యాంత్రిక అనువాదిత (మానవప్రమేయంలేని) వ్యాసం
పుట్టగొడుగు ఇంగ్లీషు మాతృక

వికీపీడియా లో నాణ్యత గల వ్యాసాలు తయారుచేయటం అంత సులభం కాదు. అయితే ఇంగ్లీషు నుండి అనువాదం చేయటం కొంత సులభం,ఎందుకంటే వ్యాసానికి కావాలసిన ఆంగ్ల పాఠ్యం, బొమ్మలు తయారుగా వున్నాయికాబట్టి. ఇంతకు ముందు సాధారణ సభ్యులు ఏ సాఫ్ట్వేర్ వాడకుండా నేరుగా అనువాదం చేసేవారు. ఇటీవల గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ మెరుగుపరచటంకోసం గూగుల్ గుత్తేదారులద్వారా సాఫ్ట్వేర్ వాడి అనువాదం చేయించడంమరియు వాటి నాణ్యతను మెరుగుపరచకుండా ప్రాజెక్టు ముగించడంతో, తెవికీలాంటి భారతీయ భాషా వికీలలో ఈ వ్యాసాలు ఒక సమస్యగా మారాయి. గూగుల్ ప్రాజెక్ట్ అయిపోయింది కనుక ఈ వ్యాసాల వరవడి తగ్గినా కొంత మంది సభ్యులు సాఫ్ట్వేర్ వాడి అనువాదం చేస్తూనే వుంటారు కాబట్టి కొన్ని అనువాద వ్యాసాలు వస్తూనే ఉంటాయి. ఈ వ్యాసంలో ఈ సమస్యని దీనిని వివిధ కోణాలలో విశ్లేషించి, పరిష్కారం సూచించే ప్రయత్నం జరిగింది.

అనువాద వ్యాసాల అవసరము

అనువాద వ్యాసాల అవసరము ఉందా అనే విషయములో భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయినా అనువాద వ్యాసాల అవసరము వికీపీడియాకు ఎంతో ఉంది. మన సంస్కృతి, మన నగరాలు, మన పండుగలు, మత సాహిత్యము గురించిన వ్యాసాలు అయితే మనము సులువుగానే నేరుగా మన భాషలో వ్రాయవచ్చు. రాష్ట్రేతర విషయాలైనా మన దేశములో ఉన్నంత వరకు మనము వ్రాయవచ్చు. కాని ఇతరదేశాల విషయాలను మనము ఇతర భాషల నుండి అనువాదము చేసుకోవడము ద్వారానే తెలుగులో వ్రాయగలము. ప్రపంచ దేశాల గురించి ప్రపంచ నగరాల గురించి తెలుసుకోవాలంటే ఇతర భాషల నుండి సమాచారము సేకరించవలసిన అవసరం ఉంది. వికీపీడియా అన్నది అంతులేని విజ్ఞాన ఖని కనుక దీనిలో చోటు చేసుకునే విషయాలకు పరిమితి ఉండదు. ఎందుకంటే ప్రపంచములో శోధించి తెలుసుకొనవలసిన విషయములు అనంతము. మనము వాడుకుంటున్న, మనవిలా కనపడుతున్న టమేటాలు, మిరపకాయలు, జీలకఱ్ఱ వంటివి అనేకాలు మనదేశములో ముందుగా తెలిసి వాడినవి కాదు. అలాగే కాఫీ, టీలు కూడా. మన జీవన విధానములో కలసిపోయిన ఆహార పదార్ధాల విషయమే ఇలా ఉంటే సాంకేతిక విషయాల గురించి చెప్పవలసిన పని లేదు. కనుక వాటి పుట్టు పుర్వోత్తరాలు, వాటిని ముందుగా కనిపెట్టిన వారు, వాటి ఉత్పత్తి మన దేశములో అది ఎలా ప్రవేశించింది తెలుసుకోవాలంటే సమాచారము ఇతర భాషల నుండే లభ్యమౌతుంది. అందువలననే అనువాద వ్యాసాలు వికీపీడియాకు కావాలి.

ఆంగ్లము నుండి అనువదించుటకు కారణము

వికీపీడియా వ్యాసాలలో అనువాద వ్యాసాలు అన్నది ఒక అంతర్భాగం. సాధారణంగా ఆంగ్ల వికీపీడియా నుండి అనేక వ్యాసాలు వివిధ భాషలలో అనువదించబడతాయి. కారణం ఆంగ్ల వికీపీడీయాలో అనేక వందల క్రియాశీలక సభ్యులు పనిచేస్తూ ఉండడమే. ఇంకొక కారణం అవి విశ్వసనీయమైన ఆధారాలతో వ్రాయబడుతుంటాయి. వనరుల లింకులూ వ్యాసములో చోటు చేసుకుంటాయి కనుక అవి ఖచ్చితమైన సమాచారము కలిగి ఉంటాయి. ఆంగ్ల వికీపీడియా అనేక విషయాల వ్యాసాలతో పరిపుష్ఠము. ఈ కారణంగా ఆంగ్ల వ్యాసాలు అనేక ఇతర అంతర్జాతీయ భాషలలోకి అనువదింపబడుతూ ఉంటాయి.

యాంత్రిక అనువాద వ్యాసాల పై సభ్యుల అభిప్రాయాలు

గూగుల్ సంస్థ తన యాంత్రిక అనువాద సాఫ్ట్వేర్ మెరుగు కొరకు గుత్తేదారులద్వారా ఇంగ్లీషు వికీ లోని వ్యాసాలను తెలుగులోకి అనువదించింది. దీనివలన అక్టోబర్ 1, 2011 నాటికి దాదాపు 921 యాంత్రిక అనువాద వ్యాసాలు తెవికీ లో వచ్చి చేరాయి. వీటి నాణ్యతని సమీక్ష చేసి మెరుగుపరచటమో లేక తొలగించడమో చేయవలసిన అవసరం తెవికీ సభ్యులపై వుంది. చర్చా పేజీలలోనూ రచ్చబండలోను వికీపీడియా సభ్యులు యాంత్రీకృత అనువాద వ్యాసాల విషయంలో అసంతృప్తి, అసహనము తెలియజేశారు. ఈ వ్యాసాలు అసహజముగా ఉండి పాఠకులకు చదవడానికి ఏ మాత్రము ఆసక్తిని కలిగించకపోవడం, అధికమైన ఆంగ్ల పదాలు, ఎర్ర లింకులు, సహజత్వానికి దూరముగా ఉన్న వాక్య నిర్మాణ శైలి, యాంత్రీకృత అనువాద వ్యాసాలు వికీలో ముందు వ్రాయబడిన వ్యాసాలను తొలగించి వాటి స్థానంలోకి చేర్చటం, సంస్కరించే విషయములో ఏ విధమైన శ్రద్ధ వహించక గూగుల్ వాటిని నేరుగా తెవికీలోకి ఎక్కించడము లాంటివి ఇందుకు కారణాలు. వీటిని పూర్తిగా నియంత్రించటం లేదా అనువాద ప్రక్రియను మెరుగుపరచి అనువాద వ్యాసాలను సంస్కరించిన తరువాత తెవికీ లోకి తీసుకురావాలన్న ఆభిప్రాయాలు వ్యక్తమైనవి. ఈ విషయమై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపినా సఫలీకృతం కాలేదు. దీనికి సంబంధించి తెలుగు వికీపీడియన్లు చేసిన సూచనలను పాటించకుండానే గూగుల్ తన ప్రాజెక్టు ముగించింది.

అనువాద వ్యాసాల సంస్కరణ అవకాశాలు

  • ప్రధానమైన లోపము అసంబద్ధమైన భాష. అనువాద వ్యాసాలకు మూలం ఆంగ్లం కనుక భాష చాలా అసంబద్ధ శైలిలో ఉండి కొన్ని వ్యాసాలు పుర్తిగా చదవడానికి వీలు కాని పరిస్థితిలో ఉన్నాయి. ఉదాహరణకు పుట్టగొడుగు వ్యాసం మొదటి రూపం చూడ వచ్చు. ఇలాంటి వ్యాసాలు సంస్కరించడం కంటే నేరుగా అనువదిస్తేనే తక్కువ సమయంలో నాణ్యమైన వ్యాసాన్ని తయారు చేయవచ్చు. భారతీయ భాషల శైలి ఆంగ్లభాషకు పూర్తిగా భిన్నంగా ఉండడమే భాష ఇంత అసంబద్ధంగా ఉండడానికి కారణం. ఇలాంటివి సరిచేయడం అత్యంత శ్రమతో కూడినది మరియు కష్టమైనది. కొన్ని సమయాలలో సరి చేయడం అసాధ్యమే.
  • ఎర్ర లింకులు వీటిని ప్రయత్నము మీద సరి చేయవచ్చు.
  • పనిచేయని మూసలు. వీటిని కూడ ప్రయత్నము మీద సరి చేయవచ్చు.
  • దిగుమతి కాని చిత్రాలు. వీటిని సరిచేయడమో లేక తొలగించడమో చేయాలి. ఇది సరిచేయడం సులువే.
  • ముందున్న వ్యాసాల స్థానంలో కొత్త వ్యాసాలను చేర్చడం. ఇది నివారించ వలసిన విషయం. నేరుగా వ్రాసే వ్యాసాలు చిన్నవైనా, వికీపీడియాకు అనుగుణంగా లేకపోయినా శైలి బాగుంటే వ్యాసాలు ఆసక్తికరంగా ఉంటాయి. వికిపీడియా వ్యాసాలకు విషయము, విజ్ఞానమే ప్రధానమైనా, ఆసక్తికరంగా కూడా ఉన్నప్పుడే వ్యాసం ప్రయోజనం నెరవేరుతుంది. పాత వ్యాసాలు తొలగించడాన్ని సభ్యులు గుర్తించాలి అలా గుర్తించినా దానిని సరి చేయడానికి పాత వ్యాసాన్ని పునఃప్రతిష్టించడం తెలిసి ఉండాలి.

సంస్కరించే సమయములో గమనించవలసిన విషయాలు

యాంత్రికృత వ్యాసాలను మాత్రము సంస్కరణ చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ వ్యాసాలలో ముందుగా ఎర్ర లింకులు అధికముగా ఉంటాయి. దానికి కారణం ఆంగ్ల వికీపీడియాలో అనేక వ్యాసాల లింకులు ఆయా వ్యాసాలలో చోటు చేసుకోవడమే. ఉదాహరణగా ఒక నగరాన్ని గురించి వ్రాసే సమయములో ఆ నగరములో ఉన్న వ్యాపార సంస్థలు, మత సంబంధ ఆలయాలు, మసీదులు, చర్చిలు మొదలైనవి, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, చివరికి రహదార్లకు కూడా లింకులు ఉంటాయి. అందుకు కారణం వాటన్నింటికి ఆంగ్ల వికీ పీడియాలో ప్రత్యేక వ్యాసాలు ఉండడమే. ఆ లింకులన్నీ ఇతర భాషలలో అనువదించబడే సమయములో అలాగే లింకులుగా ఉంటాయి కనుక అవి ఎర్ర లింకుగా ఉంటాయి. ఆ ఎర్ర లింకులకు వ్యాసాలు అనువాద భాషలో ఉండడానికి ఎక్కువగా అవకాశము ఉండదు. భవిష్యత్తులో కూడా వాటికి వ్యాసాలు రావడం కష్టమే కనుక వాటిని తొలగించ వలసిన అవసరం ఎంతో ఉంది.

భాషా శైలి సవరించుట

తరువాత చేయవలసిన పని వాక్య నిర్మాణము. సాధారణంగా ఆంగ్ల వాక్యాల నిర్మాణం తెలుగు వాక్యాల నిర్మాణానికి భిన్నంగా ఉంటుంది. యాంత్రీకంగా అనువదించబడిన కారణంగా వ్యాసాలలో వాక్యాలు అసంబద్ధముగా, సంప్రదాయ విరుద్ధముగా వున్నప్పుడు, వ్యాసాలను చదవడానికి ఇబ్బందిని, అనాసక్తిని కలిగిస్తాయి.అందువలన వ్యాసము ఉపయోగం దెబ్బ తింటుంది. కనుక సరిదిద్దే సమయములో వాక్య నిర్మాణము మీద దృష్టి పెట్టి చక్కటి శైలిలో వ్యాసాన్ని సరిదిద్దవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ పని చేయడానికి చక్కని అనుభవము ఆయా భాషల మీద అవగాహన కావాలి.

ఆంగ్ల పదాలు

తరవాత గమనించ వలసిన విషయము ఆంగ్ల పదాలు. యంత్రానువాద కారణంగా వ్యాసములో అనువదించడానికి వీలు కాని పదాలు యదాతధంగా అలాగే ఉంటాయి. అది కాక కొన్ని సంస్థలు, పాఠశాలలు మొదలైన అనేక సంస్థల పేర్లు వాటి పుర్తి పేర్లు కాక సంక్షిప్త నామాలుగా లేదా పొడి అక్షరాలుగా ఉంటాయి. ఆ పొడి అక్షరాలు అనువదించబడడానికి వీలు కాదు కనుక అవి అనువదించబడక అలా ఆంగ్లములో ఉండిపోతాయి. కనుక అవి వ్యాసములో అలాగే చోటు చేసుకుంటాయి. వాటిని తొలగించి వాటిని అనువదించబడిన భాషలోకి మార్చవలసిన అవసరము ఉంది. అనువదించబడకుండా ఉండే ఆ ఆంగ్ల పదాలు, ఆంగ్ల అక్షరాలు ఇతర భాషా వ్యాసాలలొ ఉండడము వ్యాసము నాణ్యతను తగ్గిస్తుంది. అనవసర ఆంగ్ల పద ప్రయోగము ఇతర భాషా వ్యాసాలలొ చోటు చేసుకోవడము హర్షణీయము, ఆమోదయోగ్యము కాదు. కనుక ఆంగ్ల అక్షరాలను తొలగించి వాటి స్థానములో తెలుగు పదాలను, అక్షరాలను ఉంచాలి.

మూసలు

ఆ తరువాత విషయము మూసలు ఆంగ్ల వికీపీడియాలో ఉండే మూసలు ఇతర భాషా వికీపీడియాలలో ఉండే అవకాశము లేదు కనుక నిరుపయోగమైన మూసలను కూడా తొలగించాలి. తరువాత టేబుల్స్‌లో ఆంగ్ల పదాలు ఉంటాయి. అవి మూసలు కనుక అలాగే ఉంటాయి. వీలైతే వాటిని కూడా అనువదించ వచ్చు. వాటిని అనువదించే సమయములో అత్యంత జాగరూకత అవసరము. అనుభవము ఉన్న సభ్యులే వాటిని సరి చేయవచ్చు. లేకున్న టేబుల్స్ పాడైపోయే ప్రమాదము ఉన్నది. వీటిని చక్కగా సరి చేసినప్పుడు వ్యాసము చదవడానికి ఆసక్తికరంగా మారుతుంది.

రెండు విండోలు

వ్యాసము సరిదిద్దే సమయములో ఆ వ్యాసాన్ని రెండు విండోలుగా దిగుమతి చేసుకోవాలి. అంటే వ్యాసాన్ని రెండు పేజీలుగా దిగుమతి చేసుకోవాలి. ఎందుకంటే సరిదిద్దే సమయములో ఎర్ర లింకులు ఏవో నీలి లింకులు ఏవో అర్ధము కాదు. కనుక ఒక విండోను సరిదిద్దడానికి మరొక విండోను సరి చూసుకోవడానికి ఉపయోగించాలి. ఎందుకటే నీలి రంగు లింకులు వ్యాసములో అలాగే ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కనుక వాటిని తొలగించకుండా అలాగే ఉంచాలి. ఆంగ్ల పదాలను మార్చడానికి ఇది చాలా ఉపయోగకరము కనుక ఒక పేజీని అలాగే ఉంచి మరొక పేజీను దిద్దడానికి ఉపయోగించినప్పుడు పొరపాట్లు తక్కువగా ఉంటాయి. అనువాదము చేసీ సమయములో వ్యాసంలోని పదాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడము ఎంతైనా అవసరం. ఈ జాగ్రత్తలను పాటించినప్పుడు వ్యాసము చక్కగా సంస్కరించబడి చదవడానికి అనువుగా ఆసక్తికరంగా మారిపోతుంది.

పరిష్కారం

  • అనువాద వ్యాసాలను గుర్తించిన వెంటనే వాటి లో వర్గం:యాంత్రిక అనువాద వ్యాసాలు అని రాసి వర్గం లో చేర్చడం. ఇలా చేసినట్లైతే ఆసక్తి కలిగిన వారు వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు.
  • సభ్యులు వారికి తెలిసినది చిన్న విషయమైనా సరే మార్పు చెయ్యలి. మిగిలినది ఇతర సభ్యులు పూర్తి చేస్తారు. ఇలా చేసినప్పుడు వ్యాసాలు సంస్కరించడం వేగవంతమౌతుంది.
  • సభ్యులు అయా వ్యాసాల చర్చా పేజీలలో తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియ చేయాలి. అలా చేసినప్పుడు ఆ వ్యాసాల గురించిన స్పందనలు అనువాదకులకు చేరుతాయి.

ముగింపు

తెవికీలో యాంత్రిక అనువాద వ్యాసాలు చేరటం ఒక విధంగా వ్యాసాల సంఖ్య, వ్యాస నిడివిని పెంచడానికి తోడ్పడ్డాయి. అయితే సాధారణ వ్యాసాలతో పోల్చితే నాణ్యతా లోపాలు వున్నాయి. ఈ వ్యాసంలో అనువాద వ్యాసాల లోపాలను, వాటి పరిష్కారాలను వివరించడం జరిగింది.

+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
Puttagodugu meeda ichchina yantrika vyasam ghoramga undi. Deenni samskarinchavalasina avasaram entaina undi. Googleloni itara anuvadalanni ilage unte annitini samskarinchavalasi untundi. Can any one tell me how to help in that process? I am a freelance journalist working for competetive magazines like vijeta competitions in Hyderabad.
Above comment by user with IP address: 117.195.163.108 on 31 Dec 2012
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. గూగుల్ వారి కొన్ని వ్యాసాల నాణ్యత బాగానే వున్నది. వాటిని ఈ వారం వ్యాసంగా కూడా వాడటం జరిగింది. మీరు తెవికీలో తెలుగు టైపు నేర్చుకొని కొంత మార్పులు చేసే అనుభవం పొందితే ఆ తరువాత ఈ వ్యాసం లో చెప్పిన సూచనలు పాటించి వ్యాసాలను మెరుగుచేయవచ్చు.--అర్జున (చర్చ) 10:19, 31 డిసెంబర్ 2012 (UTC)
ఇంకొక సంగతి పైన తెలిపిన వ్యాసం ఒక వికీపీడియన్ తో గూగుల్ పరికరం వాడి మార్చబడిన రూపం. ఇది గూగుల్ ప్రాజెక్టులో మానవీయంగా మార్పులు చేసి చేర్చినది కాదని తెలిసింది. మానవీయంగా మార్పులు చేయబడిన వ్యాసాల నాణ్యత కొంత వరకు మెరుగుగానే వున్నట్లే--అర్జున (చర్చ) 10:29, 31 డిసెంబర్ 2012 (UTC)