వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 40వ వారం

ఖర్జూరం
ఖర్జూరం

ఖర్జూరం ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. పామ్‌ (palm) కుటుంబానికిచెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ఫోనిక్స్‌ డాక్టిలిఫెరా. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి.

మనిషికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని ఒయాసిస్సు ప్రాంతాలే దీని స్వస్థలం అని కొందరంటారు. పర్షియన్‌ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీ.పూ. సుమేరియన్లు తొలిగా పెంచారనీ తరవాత బాబిలోనియన్లూ అస్సీరియన్లూ ఈజిప్టియన్లూ మరింతగా పెంచి పోషించినట్లుగా చెబుతారు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి గౌరవిస్తారు. శాంతికీ, న్యాయానికీ, రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట. ఈ చెట్టును కేవలం పండ్ల కోసమే కాక నీడకోసం పశువుల మేతకోసం కలపకోసం ఆయుధాలు, తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగుచేసిన దేశం ఇరాక్‌. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరచెట్ల బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆలీస్‌ స్ప్రింగ్స్‌తోపాటు పశ్చిమ చైనా, పశ్చిమ భారతం, దక్షిణ పాకిస్తాన్‌లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్‌వన్‌గా ఈజిప్టు మన్ననలందుకుంటోంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు ...పూర్తివ్యాసం: పాతవి