వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 10వ వారం

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.

తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.

కొందరు దసరా వేషాలు లేదా పగటి వేషాలు ధరిస్తారు. పాఠశాల ఉపాద్యాయులు విద్యార్ధులను వెంట పెట్టుకొని అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. విద్యార్ధులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు.


మైసూరు, కలకత్తా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా దసరా ఉత్సవాలు జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ....పూర్తివ్యాసం: పాతవి