వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 48వ వారం

ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.

ఘంటసాల గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణగారు మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఘంటసాల భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. 1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు. ఘంటసాల చేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆ పాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.


1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారు మ్రోగింది. తరువాత విడుదలయిన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. 1955లో విడుదలయిన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలయిన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి