వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 22వ వారం

ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1883-1960) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంధాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. రాయలసీమ కు ఆ పేరు పెట్టింది ఆయనే. 1928లో కర్నూలు జిల్లా నంద్యాల లో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అప్పటి వరకు దీనిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు.


ఇతను కర్నూలు, గుత్తి, నంద్యాల లో ప్రాధమిక, ఉన్నత విద్య చదివాడు. మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత రాజమండ్రి లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907 లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.


ఆ తరువాత స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1908 లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు విపరీతబుద్ధి (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు. 1927 లో కాంగ్రెసు అభ్యర్ధిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసాడు.


1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంధాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంధాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. 1952 లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేసాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించాడు. ఆయన స్మారకార్ధం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది.

పూర్తివ్యాసం పాతవి