వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 42వ వారం

భారత రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకరుగా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త, నీలం సంజీవరెడ్డి . అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913 మే 18 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు థియొసోఫికల్ పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు ఆయన చరిత్రలో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకు పోయింది. 1940 ల నుండి 1970ల వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను ఆయనకు ప్రమేయముంది.

1929లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళాడు.1940 1945 ల మధ్య ఎక్కువకాలం ఆయన జైలులో ఉన్నాడు. 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభ కు ఎన్నికయ్యాడు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసాడు. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్.జి.రంగా తో పోటీ పడ్డాడు. ప్రకాశం మద్దతుగల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభా సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు.

ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించాడు. 1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి