వికీపీడియా:వికీపీడియాలో "మరియు" వాడుక
రచ్చబండలో "మరియు" వాడుకపై మొదలైన చర్చ ఇది. ఇకపై చర్చను ఇక్కడ కొనసాగించవలసినది.
వికీపీడియా వ్యాస రచనలలో "మరియు" వాడకం - చర్చ
మార్చుతెలుగు వికీపీడియాలో భాషా శైలికి సంబంధించిన మార్గదర్శకంలో "మరియు" ఉండకూడదన్న నియమం ఉన్నది, దానిని సూచన గా మార్చాలని నేను కోరుతున్నాను, మన చర్చలలో కూడా చాలా సార్లు వాడాము, అవి ఇక్కడ చూడవచ్చు, ఈ పదం రెండు వాక్యాలు లేదా పదబంధాలను కలపడానికి ఉపయోగించే సమాసంజనం. ఇది వాక్యాల మధ్య సంబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.ఎప్పటి నుండో తెలుగు లో మరియు వాడకం ఉన్నట్లు 1951 లో ఒక పుస్తక శీర్షిక లో కూడా ఉన్నట్లు ఇక్కడ తెలుస్తున్నది. కొంత మంది రచనలలో శైలికి ఉదాహరణగా పేర్కొనే ఈనాడు పత్రిక లో కూడా ఈ పద వాడకం చూడవచ్చు . అన్ని సందర్భాల్లోనూ ఒకే విధంగా ఉపయోగించబడదు, ముఖ్యంగా తెలుగు నుండి ఇంగ్లీష్ వంటి భాషలలో అనువాదం చేసేటప్పుడు పదబంధాల మధ్య సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయడానికి "మరియు" ఆవసరం అయితే, ప్రతి సందర్భంలోనూ "మరియు" అనే పదం అవసరమా అనేది వాక్య నిర్మాణం, అర్థం మరియు రచయిత శైలిపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అది ఎంచుకొనే స్వేఛ్చ ఆ రచయితకు ఉండాలి. ఎక్కువ శాతం రచయితలు విరివిరిగా "మరియు" వాడుతూ వాక్య నిర్మాణాలు చేయరు అని నేను భావిస్తున్నాను,ఇంకా కృత్రిమ మేధ, యాంత్రిక (ఏఐ) అనువాదం కూడా కృతకం గా ఉండదు, .కాబట్టి తెలుగులో మరియు అసహజం ఏమీకాదు కాబట్టి ఈ పదము నిర్బంధం కాకూడదు. ఈ విషయం మీద అనేక సార్లు చర్చ జరిగినది , అయితే మరింత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది, కావున దయచేసి మీ అభిప్రాయాలు తెలియచేయగలరు. Kasyap (చర్చ) 13:35, 28 జూలై 2024 (UTC)
- తరచుగా కాకపోయినా, వాడక తప్పనిసరి అయిన చోట అంటే వాడకపొతే సరిఅయిన అర్ధం అందచేయక పొతే వాడవచ్చని నాఅభిప్రాయం' ఆంగ్లం లో కూడా 'and' ఒకే వాక్యం లో పదే పదే వాడము. V.J.Suseela (చర్చ) 06:18, 29 జూలై 2024 (UTC)
- "మరియు" అనేది అతి తక్కువ చోట్ల వాడవచ్చు అని నా అభిప్రాయం. వద్దు అని చర్చ జరిగి ఎక్కువ మంది సభ్యులు తెలుగు వికీపీడియా వాడకూడదు అనే అభిప్రాయం తీర్మానం చేశాక పొరపాటున అక్కడక్కడ వాడిన బాటు తోటి తొలగింపు చేస్తూ ఉంటే ఎందుకొగొడవన గొడవ మరియు వాడవలసిన చోట ఓ కామా పెడితే సరిపోతుందిగా అని సర్దుకుపోవడమే విశేష అనుభవిజ్ఞులు చదువరి గారు వారి వాడుకరి పేజీలో మొదటి పదం మరియు వాడకూడదు. అని ఉండడంతో ఇక మరియూను వదిలేయడం జరిగింది. కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు రెండు మూడు మంత్రుత్వ శాఖలు కేటాయింపులు జరిగినప్పుడు తప్పకుండా మరియు అనే పదము ప్రతి పత్రిక వాడటం నేను చాలా సార్లు గమనించాను. ఆంగ్లంలో అండ్ ఉన్నప్పుడు తెలుగులో మరియు ఎప్పుడో ఒకచోట వాడటంలో తప్పులేదు. ఎందుకంటే అది ఏమి "జిహాద్" పదం కాదు కదా. ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్చర్చ 15:41, 28 జూలై 2024 (UTC)న
- @Kasyap గారూ, మీరు ఈనాడు పేరు ఎత్తారు కాబట్టి, ఏమో ఈమధ్య ఏమైనా ఈనాడు పాలసీ మారిందేమో మరియు విషయంలో ఎందుకైనా మంచిదని ఒకసారి ఈనాడు పత్రిక పోర్టల్ తెరిచి నాకు కనిపించిన వార్తలు (ర్యాండమ్ గా) ఎన్నుకుని తెరిచి చూశాను.
- "సివిల్స్ కలని చిదిమేసిన నిర్లక్ష్యం" అన్న మొదటి పేజీ వార్త అది. అందులో కొన్ని వాక్యాలు చూస్తే:
- తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డాల్విన్ (24)గా గుర్తించారు అని రాశారే తప్ప ఆంగ్ల ధోరణిలో తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25) "మరియు" నవీన్ డాల్విన్ (24)గా గుర్తించారు అని రాయలేదు.
- విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భారాస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు సంతాపం తెలిపారు. - ఈ వాక్యంలో కూడా మరియు లేకుండానే కానిచ్చేశారు.
- సుప్రీం కోర్టులో నితీశ్‌కు ఎదురుదెబ్బ అన్న వార్త తెరిచాను: ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ కోటా అని రాశారు తప్ప ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అని రాయలేదు.
- ఎన్నికల్లో గెలిపించి కేజ్రీవాల్ అవమానానికి గుణపాఠం చెప్పండి అన్న మరో వార్తలో "దిల్లీ, పంజాబ్‌లలో" అని, "విద్య, వైద్య సౌకర్యాల్లేవు" అని రాశారు. దిల్లీ మరియు పంజాబ్, విద్య మరియు వైద్య అని రాయలేదు.
- 300 ఇళ్లు... ఒక్కటే కరెంటు మీటరు! అన్న వార్తలో "కర్రలు, చెట్లకొమ్మలే ఊతంగా సర్వీసు తీగల నుంచి వైర్లు" అన్నప్పుడూ కర్రలు మరియు చెట్లకొమ్మలే ఊతంగా అని రాయలేదు.
- మను మాణిక్యం అన్న వార్తలో ఫైనల్లో రమిత, బబుత అన్నారు, రమిత మరియు బబుత కాదు. వార్తలో పలుచోట్ల మను, జస్పాల్ అని ఉంది, మను మరియు జస్పాల్ కాదు. అట్లానే, "రమిత జిందాల్, అర్జున్ బబుత", "మను నైపుణ్యం, ప్రతిభ", "తండ్రి సమానుడు, మంచి స్నేహితుడు" వంటి పదాల విషయంలో కూడా మధ్యలో మరియు లేదు.
- ఇలా ఈనాడు పత్రికలో వారానికి వందలు, వేలాది ఉదాహరణలు సామాన్యంగా యాంత్రికానువాదంలో మరియు వచ్చేచోట కామాతో పెట్టి వాడేవి చెప్పుకుంటూ పోవచ్చు. (నేను క్రమంతప్పకుండా శ్రద్ధగా ఈనాడు చదివే పాఠకుణ్ణి కాబట్టి నాకు తెలుసు) ఆ విధంగా చూస్తే ఈనాడు పత్రికలో కూడా ఉన్నాయని మీరిచ్చిన ఉదాహరణలు ఎప్పుడో, ఎక్కడో ఉప సంపాదకుల కన్నుగప్పి ప్రచురితమైనవే తప్పించి ఈనాడు పత్రికల ప్రామాణిక భాషలోనివి కావని నిస్సంశయంగా చెప్పవచ్చు. పవన్ సంతోష్ (చర్చ) 09:44, 29 జూలై 2024 (UTC)
- [భాషా నియమం-1] భాష మౌలికత విషయంలో మనం వికీపీడియాలో ప్రత్యేకంగా నియమాలు రాసుకోవాల్సిన అచసరం లేదన్న సంగతి మనకు తెలిసిందే. అంటే అతడు బెంగళూరు వెళ్ళింది, ఆ పదిమందీ పోటీలో పాల్గొన్నాడు, నేను రేపు అన్నం తిన్నాను అనేవి తప్పు వాక్యాలు, అలాంటివి రాయకూడదు అని మనం ప్రత్యేకంగా నియమాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవి తప్పు వాక్యాలేనని మనందరికీ తెలుసు. అలాంటి వాటిపై చర్చ చెయ్యాల్సిన అవసరమే లేదు. కానీ, "మరియు" విషయమై ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే అది ఒప్పో తప్పో మనకు ఇదమిత్థంగా తెలీదు. అంచేత దానిపై మనకు భిన్నాభిప్రాయాలున్నాయి. భాష లోని ఒక మౌలిక విషయంపై మన అభిప్రాయాల అవసరం ఏర్పడడం శోచనీయమే. కానీ, దానికి మనం చేయగలిగినదేమీలేదు. ఎందుకంటే, భాషావేత్తలు, పండితులు, ప్రామాణికమైన పత్రికలు వగైరాలు చెప్పినదాన్ని పాటించేవాళ్లమే తప్ప, మనమేమీ భాషావేత్తలం కాదు. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెబుతున్నారు అనేది తెలుసుకుంటే మన సమస్య పరిష్కారమౌతుంది. అంచేత మనందరం, మనమన అభిప్రాయాలు చెప్పడం కాకుండా ఈ కోణంలో కృషి చేద్దాం అని నా అభిప్రాయం. ఇక్కడ, ఈనాడులో ఎలా రాస్తున్నారు అనే విషయమై ఇద్దరు రాసారు. అలాగే ఇంకా ఇతరులు ఏం చెబుతున్నారు అనేది కూడా అందరం వెతుకుదాం, పరిశీలిద్దాం.
- నేను వాటి గురించి వెతికాను. మన వికీసోర్సు లోనే చేకూరి రామారావు గారి "తెలుగు వాక్యం" పుస్తకం దొరికింది. దయచేసి ఈ అధ్యాయం చదవండి. __చదువరి (చర్చ • రచనలు) 11:46, 29 జూలై 2024 (UTC)
- [భాషా నియమం-2] రంగనాయకమ్మ గారు రాసిన "వాడుక భాషే రాస్తున్నామా?" అనే పుస్తకం చూడండి. గూగుల్ పుస్తకాల్లో ఇక్కడ ఉంది అందులో 22 వ పేజీలో చూడండి - తెలుగులో "మరియు" రాయకూడది అని ఆమె రాసారు. __చదువరి (చర్చ • రచనలు) 12:50, 29 జూలై 2024 (UTC)
- [భాషా నియమం-3] 'మరియు' మాత్రమే కాకుండా 'యొక్క', 'లేదా', ఇది ఇలా ఉండగా... లాంటి మరెన్నో పదాలు కూడా వాడకూడదు. ఈ విషయం BCJ/MCJ లాంటి జర్నలిజం కోర్సుల్లో ఉంటుంది. దయచేసి దీన్ని చూడండి: https://www.egyankosh.ac.in/bitstream//123456789/14716/1/UNIT-19.pdf Muralikrishna m (చర్చ) 14:54, 29 జూలై 2024 (UTC).
- "మరియు" వాడకం అన్నమాచార్య కృతి మనసిజ గురుడితడో "" లాంటి అనేక కీర్తనలలో , మొదటి తెలుగు అనువాదాలలో ఒకటి అయిన బైబిల్ , మరియు ప్రభుత్వ చట్టము లో, అనేక పదనిఘంటువు లలో పదకోశములలో, ఆధునికవ్యవహారకోశం తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 , ఉర్దూ - తెలుగు నిఘంటువు (బి.రామరాజు) 1962 అర్ధ వివరణలలోనూ,ఉదాహరణలలోనూ, అమ్మనుడి ,వంటి తెలుగు భాష కోసం పనిచేసే పత్రికలతో సహా ఇతర పాత రచనలలో కనుగొనబడింది , [పుస్తక శీర్షికలతో] వాడుకలో వున్నది, ఇది సోషల్ మీడియాలో, లక్షలసార్లు ఇంటర్నెట్ ఇంకా ఈనాడు నెట్ లో సుమారు ( 24000 సార్లు ) ఆంధ్రజ్యోతి వెబ్ లో [14 వేల సార్లు ] ) , ఇంకా [| 1965 నాటి ] ) గోల్కొండ, ఆంధ్రపత్రిక, ఇతర పత్రికలు మరియు పుస్తకాలలోనూ, ప్రస్తుతము వున్న అనేక వార్తా పత్రికలలో , లక్షల సార్లు మరియు విస్తృతంగా ఉపయోగించబడుతున్నది. కాబట్టి ఈ పద వాడకం వ్యవహారిక భాషతోపాటూ, ప్రామాణిక భాషలో ఉన్నదని చెప్పవచ్చు.. Kasyap (చర్చ) 05:23, 31 జూలై 2024 (UTC)
- @Kasyap గారూ, అన్నమాచార్యల కృతిలోనూ, బైబిల్ అనువాదంలోనూ మరియు అన్న పదం "And" ప్రధానంగా వాడేట్టుగా ( used to connect words of the same part of speech, clauses, or sentences, that are to be taken jointly.) వాడలేదు. అలా వాడరు కూడా. ఎలా వాడతారంటే - ఇప్పుడు మనం "మరి" అని ఎక్కడైతే వాడుతున్నామో అక్కడ వాడతారు.
- "మనసిజ గురుడితడో
- మరియు గలడో వేదవినుతుడు డితడుగాక వేరొకడు గలడో" అని మీరు తెచ్చిన ఉదాహరణలో మరి పెట్టి చూడండి.
- "మనసిజ గురుడితడో
- మరి గలడో వేదవినుతు డితడుగాక వేరొకడు గలడో" అన్నప్పుడు మీకు అర్థం అదే వస్తుంది. అంటే - used to introduce an additional comment or interjection అన్న అర్థంలో మరియు వాడేవారు. భాష అభివృద్ధి చెందే కొద్దీ "యు" లుప్తమైంది.
- బైబిల్ ఉదాహరణ తీసుకుందాం:
- "కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.
- మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే."
- అన్న వాక్యాల్లో మరియు బదులు మరి పెట్టండి.
- "కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.
- మరి పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే." అని వస్తుంది.
- ఇది ప్రాచీన తెలుగులో మరియు వాడిన విధానం. కాబట్టి, అన్నమయ్య సంకీర్తనల్లో ఉన్న మరియు, తొలి బైబిల్ ప్రతుల్లో ఉన్న మరియు మీరు చెప్పే వాడకం కానే కాదు.
- మీరిచ్చిన బైబిల్లోనే ఈ కింది విధంగా ఉన్న వాక్యం చూడండి:
- "కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే." మరి, మీ లెక్క ప్రకారం మరియు బైబిల్ అనువాదకులు వాడి ఉంటే - విశ్వాసము, నిరీక్షణ, మరియు ప్రేమ అని వాడాలి. ఎందుకు వాడలేదు? సమాధానం ఆలోచించి చెప్పండి. పవన్ సంతోష్ (చర్చ) 12:40, 1 ఆగస్టు 2024 (UTC)
- [భాషా నియమం-4] బూదరాజు రాధాకృష్ణ గారి గురించి ఇక్కడ పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. అగ్రగణ్యులైన భాషావేత్తల్లో ఆయనొకరు. భాషపై అనేక పుస్తకాలు రాసారాయన. ఆయన రాసిన తెలుగుభాషా స్వరూపం పుస్తకంలో (ఈ లింకులో ఆ పుస్త్యకాన్ని చదవవచ్చు) "మరియు" గురించి ఇలా రాసారు:
- పిదప, కనుక, మరియు, దనుక-వంటి పాతకాలపు మాటలను వాడుక చేయవద్దు. మారుమూల అవ్యయీభావ సమాసాల వాడుక మంచిది కాదు. ఉదా. యథాసంభవం. అయితే 'వృథాప్రయాస, ప్రయాస వృథా' వంటివి వాడవచ్చు (35 వ పేజీలో)
- 'మరియు' మొదలైన అవ్యయాల స్థానంలో మాటల చివరి అచ్చులకు దీర్హం వాడి రెండుమాటలు కలపవచ్చు. ఉదా. వాడూ వీడూ, అదీ ఇదీ (35 వ పేజీలో)
- హిందీ ఇంగ్లీషుల్లోలాగా 'ప్రత్యేకశబ్దాలు ("ఔర్", "అండ్"- వంటి సముచ్చయార్ధకాలనూ, "యా", "ఆర్" -వంటి వికల్పార్థకాలనూ) వాడకుండానే 'కానీ, కాబట్టి, అయినా, అయితే” వంటి అవ్యయాలతో రెండు వాక్యాలను కలవవచ్చు. ఉదా. ఆమె చక్కనిది, కాని గర్వంలేదు; ఆయన పెద్దమనిషి కాబట్టి అబద్దం చెప్పడు; వాడు దొంగ, అయినా మర్యాదస్థుడే; ఆమె పనికత్తె, అయితే ఒళ్లు దాచుకుంటుంది (36 వ పేజీలో)
- [భాషా నియమం-5] ప్రముఖ పాత్రికేయుడు గోవిందరాజు చక్రధర్ గారు (ఈయనకు ప్రచురణ సంస్థ కూడా ఉంది) "మీరూ జర్నలిస్ట్ కావచ్చు" అనే పుస్తకంలో (ఇక్కడ చదవొచ్చు) ఇలా రాసారు: "మరియు" అనేపదం తెలుగు జర్నలిజంలో నిషిద్ధం. ఇంగ్లీషు కాపీలో "అండ్" వచ్చినపుడు మరియు దొర్లకుండా తదనుగుణంగా వాక్యనిర్యాణం దిద్దాలి__చదువరి (చర్చ • రచనలు) 04:11, 2 ఆగస్టు 2024 (UTC)
- నేను మొదట చెప్పినట్లు " మరియు అన్ని సందర్భాల్లోనూ ఒకే విధంగా ఉపయోగించబడదు, దానికిని అనుగుణముగా నేను ఇచ్చిన ఉదాహరణలు పూర్తిగా చూడగలరు, ఇదేమీ నిషేదిత పదం కాదు కాబట్టి "మరియు" ఉండకూడదన్న నియమం సవరించాలి. Kasyap (చర్చ) 08:02, 2 ఆగస్టు 2024 (UTC)
- @Kasyap ఏ సందర్భంలో అన్నది చెప్పండి. పవన్ సంతోష్ (చర్చ) 10:25, 2 ఆగస్టు 2024 (UTC)
- కశ్యప్ గారూ, ఈ చర్చలో ఇచ్చిన లింకుల్లో, చేకూరి రామారావు గారు, రంగనాయకమ్మ గారు, జర్నలిజం కళాశాల, బూదరాజు రాధాకృష్ణ గారు, గోవిందరాజు చక్రధర్ గారు రాసిన పుస్తకాల్లో ఉన్నది - "మరియు" వాడకూడదు అనే. మరోసారి పై లింకులను చదవ వలసినది.__చదువరి (చర్చ • రచనలు) 10:40, 2 ఆగస్టు 2024 (UTC)
- కశ్యప్ గారు ఈనాడులో వెతికినపుడు 24 వేల లింకులున్నట్టు చెప్పారు. నేను బింగ్‌లో ["మరియు" site:eenadu.net] కోసం వెతగ్గా 22,600 ఫలితాలు కనిపించాయి. ఆ ఫలితాల్లో ర్యాండమ్‌గా ఒక 25, 30 దాకా పేజీలను తెరిచి చూసాను. నేను గమనించినది ఈనాడు వెతుకులాటలో కనిపిస్తున్న ఫలితాలు చాలావరకు తప్పుదోవ (మిస్‌లీడింగ్) పట్టిస్తున్నాయి. ఇవి చూడండి:
- కొన్ని పేజీల్లో అసలు "మరియు" అనే పదం లేనే లేదు (వెతుకులాట ఫలితాల్లో చూపించింది గానీ సదరు పేజీలో మాత్రం మరియు అనే మాట లేనే లేదు). ఉదాహరణకు: 1,2,3,4,5
- కొన్ని పేజీల్లో అసలు మరియు లేదు, కానీ 1 (ఒక్క చోట) ఉన్నట్లు బ్రౌజరు "ఫైండ్" లో చూపిస్తోంది. ఉదాహరణలు: 1,2,3,4,5,6,7,8,9,10,11,12,13,14,15,16
- చాలా పేజీల్లో "జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్" అనే శీర్షిక/లింకు ఉంది. ఆ లింకులో ఉన్న "మరియు" తప్పించి పేజీ పాఠ్యంలో ఎక్కడా లేదు. ఉదాహరణలు: 1,2,3,4
- "జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్" అనే లింకు కొన్ని పేజీల్లో "జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్" అని ఉంది.
- దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే, ఒకే ఒక శీర్షికలో ఉన్న "మరియు" కారణంగా ఈనాడు ఫలితాల్లో 23 వేల పేజీలున్నట్లు చూపిస్తోంది, (ఇవన్నీ ఈనాడు ప్రతిభ లోనివే కావడం విశేషం)
- మరొక విశేషం: అదే బింగ్‌లో "జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్" site:eenadu.net కోసం వెతికాను. మొత్తం 24 వేల ఫలితాలు చూపించింది. అంటే ఈనాడులో ఉన్న "మరియు" లన్నీ ఈ "జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్" అనే లింకు ద్వారా వచ్చినవే అని, పాఠ్యంలోనివి కావని కూడా స్పష్టమౌతోంది. __చదువరి (చర్చ • రచనలు) 10:52, 2 ఆగస్టు 2024 (UTC)
- కశ్యప్ గారు ఆంధ్రజ్యోతిలో 14 వేల "మరియు"లు ఉన్నాయన్నారు. ఆ వాడుక అంత ప్రామాణికమే అయితే, ఇతర సాధారణ వాడుకలో ఉన్న పదాల లాగే దాని వాడుక కూడా ఉండాలి గదా? వేరే కొన్ని పదాల కోసం బింగ్ ద్వారా ఆంధ్రజ్యోతిలో వెతికితే ఫలితాలు ఇలా ఉన్నాయి: మంత్రి - 7,91,000, కూడా - 5,73,000, మాట, మాటలు - 2,21,000, కార్యక్రమం, కార్యక్రమాలు, కార్యక్రమాల - 5,71,000, ప్రకటించారు, ప్రకటన - 9,56,000, నిరుద్యోగం, నిరుద్యోగులు, నిరుద్యోగ - 3,38,000. ఒకవేళ "మరియు" అనేది ప్రామాణికమైన వాడుకే అయితే, ఈ పదాల కంటే ఎన్నో రెట్లు వాడి ఉండాల్సింది (ఇంగ్లీషులో అండ్ వాడుకను తలచుకోండి). మరి, కేవలం 14 వేలే ఉన్నాయే?
- అలాగే 1965 వార్తాపత్రికల ఆర్కైవు లింకులను గమనిస్తే వాటిలో సింహభాగం వాటిలో వచ్చిన ప్రకటనల్లోనివే అని కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణలు: 1,2,3,4,5
- మరియు కోసం పైన చూపిన ప్రామాణిక ఫలితాలన్నీ ఎక్సెప్షన్లే, నియమాలు కావు. నియమాలు పైన చూపిన పుస్తకాల లింకుల్లో ఉన్నాయి, పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 11:45, 2 ఆగస్టు 2024 (UTC)
- [భాషా నియమం-6] అధికార భాష తీరుతెన్నులు అనే పుస్తకంలో, ప్రభుత్వ వ్యవహారాల్లో భాష ఎలా ఉండాలి అని అప్పటి అధికార భాషా సంఘ కార్యదర్శి, సి ధర్మారావు గారు ఇలా రాసారు.
- ఇంగ్లీషులో అడుగడుగునా కనీవించే 'and' అనే పదానికి తెలుగులో మరియు అని వాడ కూడదు. Both Staff and Officers అంటే “సిబ్బంది, అధికార్లు అంతా" అనాలీ కానీ 'మరియు' వాడకూడదు. అట్టాగే ఇంగ్లీషులో తరచుగా కనిపించే కర్మణి ప్రయోగం Passive Voice తెలుగు భాషకు నప్పదు
- ధర్మారావు గారు తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొనేవారు. __చదువరి (చర్చ • రచనలు) 05:29, 3 ఆగస్టు 2024 (UTC)
- [భాషా నియమం-7] ఆచార్య లకంసాని చక్రధరరావు గారు "తెలుగు భాషా చరిత్ర - భాషాశాస్త్రం" పుస్తకంలో ఇలా రాసారు:
- రెండుకాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడటం ఈ సంయుక్త వాక్య లక్షణం. సంయుక్త వాక్యాలను సూచించటానికి ఆంగ్ల భాషలో but, or, and హిందీ భాషలో ఔర్, యా, మగర్ వంటి శబ్దాలను ప్రయోగిస్తారు. తెలుగు భాషలో రెండు వాక్యాలను కలిపే ప్రత్యేక పదంలేదు. తెలుగులోని 'మరియు’ పదం కేవలం కల్పితం.
- __చదువరి (చర్చ • రచనలు) 06:33, 3 ఆగస్టు 2024 (UTC)
- నేను ‘ఈనాడు’ తెలుగు వార్తాపత్రికలో సుమారు 18 సంవత్సరాలు పనిచేశాను. ‘భూభ్రమణం’, ‘జ్ఞాననేత్రం’ శీర్షికలను ప్రతీ రోజూ, ‘సిరిసిరికబుర్లు’, ‘ప్రగతిపథం’, ‘గుడ్ హెల్త్’, ‘కంప్యూటర్ చిప్‍చాట్’ వంటి అనేక శీర్షికలను వారంవారం నిర్వహించాను. ఎన్నో వార్తలను, వార్తాకథనాలనూ కూడా రాశాను. ఈనాడు పత్రికకోసం ఎన్నో ప్రకటనలనూ, ఎన్నో కరపత్రాలనూ కూడా రూపొందించాను. ఈ మొత్తం సమయంలో - నేను ఎక్కడా ‘మరియు’, ‘యొక్క’, ‘బడు’ అనే పదాల ప్రయోగం జరుపనే లేదు. వాటి అవసరమూ రాలేదు. నాతోబాటు మా సహచర మిత్రులు ఎవ్వరూ ఈ పదాలను వాడేవారు కాదు. ఈనాడు జర్నలిజం క్లాసులకు నేను ఎప్పుడూ హాజరు కాలేదు కానీ, ఈనాడులోని మా సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు విభాగానికి శ్రీ బూదరాజు వారు వచ్చినప్పుడు, అప్పటి ఇష్టాగోష్టిలో వారు ఆ పదప్రయోగాల వాడకం వద్దనే అనేవారు. నాకింకా బాగా గుర్తు - వారు ‘‘బడు’ అని రాసేవాళ్లు ఒట్టి బడుద్ధాయిలు’ అనీ చమత్కరించేవారుకూడా! ఏమైనా, మాటలో, రచనలో ‘బ్రెవిటీ’ అవసరం. మన నిత్యజీవితంలో మన మాటల్లో కనబడని, అర్థానికి అదనపు అర్థం అందించని, అనవసరమైన పదాలైన ‘మరియు’, ‘యొక్క’, ‘బడు’ అనేవి వద్దనే నా అభిప్రాయం. అవి అవసరం లేదనే నాకు - నా వ్యక్తిగతమైన అనుభవం నేర్పిన పాఠం. 106.212.244.114 02:47, 4 ఆగస్టు 2024 (UTC)
- పై అభిప్రాయం నేను రాసిందే. అది రాస్తున్న సమయంలో - నా వాడుకరి పేరు - ‘రాధాపతి’ అని ఉండేది. కానీ, ఆ వాడుకరి పేరును మార్చుకుని, ‘పాలకోడేటి’ అనే నా అసలుపేరుతో రాయాలని నిర్ణయించుకుని, దానికై దరఖాస్తు చేశాను. ఆ కొత్త వాడుకరి పేరుకు అప్పటికి అనుమతి రాని కారణంగా - నా ఐపి అడ్రస్ అక్కడ ప్రచురితమయింది. ఇప్పుడు - నా వాడుకరి పేరు -‘పాలకోడేటి’కి అనుమతి లభించిన కారణంగా ఈ వివరణను తెలియజేస్తున్నాను. Palakodety (చర్చ) 04:50, 5 ఆగస్టు 2024 (UTC)
- [భాషా నియమం-8] ద్రవిడ భాషల రీతులపై పరిశోధన చేసిన భాషావేత్త ప్రఖ్య శ్రీశైల సుబ్రహ్మణ్యం గారు ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు అనే పుస్తకంలో సంయుక్తవాక్యాలు ఎలా ఏర్పడతాయో రాస్తూ ఇలా అన్నారు: రెండు నామాలకీ చివర సముచ్చయార్ధకమైన దీర్ణం చేరిస్తే 126 [సంయుక్తవాక్యం] సిద్దిస్తుంది. - దీర్ఘాలు రాయమన్నారు, "మరియు" వాడమనలేదు. __చదువరి (చర్చ • రచనలు) 03:55, 4 ఆగస్టు 2024 (UTC)
- కొన్ని పత్రికలు, ముఖ్యంగా "ఈనాడు" లాంటివి, ఒక పదాన్ని నిర్దిష్టమైన విధంగా వాడాలని నిర్ణయించుకోవచ్చు. కానీ అదే పత్రిక కూడా కొన్ని సందర్భాల్లో ఆ నియమాన్ని పాటించకపోయిన ఉదాహరణలు చూసాము .ఈ పదం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో విరివిగా కనిపిస్తుంది, అంటే దీన్ని ప్రామాణికంగా భావించవచ్చు. కొన్ని సంస్థలు, వ్యక్తులు భాషా ప్రయోగాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తాయి. అయితే, అటువంటి ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవు నా అభిప్రాయం ప్రకారం వుండకూడదు , భాష అనేది జీవం గలది, అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు సరైనది కాదుగా భావించిన వాడకం కొంతకాలానికి మారవచ్చు.--Kasyap (చర్చ) 04:34, 4 ఆగస్టు 2024 (UTC)
- పైన ఇచ్చిన లింకులో, "మరియు"లు విరివిగా కనిపించే వెతుకులాట ఫలితాలలో ఒకదాన్ని నేను పరిశీలించాను. దాని గురించి కింది ఉపవిభాగంలో రాసాను. __చదువరి (చర్చ • రచనలు) 06:07, 4 ఆగస్టు 2024 (UTC)
- @Kasyap గారూ, ఈనాడు పాలసీ మారలేదు. మీరు రేపు వచ్చే ఈనాడు పేపర్ తీసుకోండి. మొదటి పేజీ తెరవండి ఆమూలాగ్రం పరిశీలించండి. ఒక్క మరియు వచ్చినా పాలసీ మారిందని భావించొచ్చు. భాష జీవం గలది, అది మారుతూనే ఉంటుందన్నది నిస్సందేహం. కానీ, మరో వంద ఏళ్ళు గడిచినా "ఆవిడ వచ్చాడు" అని తెలుగు వచ్చినవారెవ్వరూ అనరు. రానివారు పొరబాటున ఒక వంద చోట్ల రాసినంతమాత్రాన దాన్ని ప్రామాణికంగా భాష తెలిసినవారు తీసుకోరు. అదీ సంగతి.
- బైదవే, మీరు ఈ వాదనలో చాలా రకాల దాట్లు వేస్తున్నారు. మొదట మొదలుపెట్టినప్పుడు ఈనాడులో ఉంది అన్నారు. అంటే అది ప్రామాణికం అన్నట్టు. ఇప్పుడు, ఈనాడు నుంచి ప్రామాణికత కోసం ఇంకెక్కడికో వెళ్తున్నారు. మీకు ఎక్కడ దాని వాడకం దొరికితే అది ప్రామాణికం అయిపోదు. ప్రభుత్వ వ్యవహారాలను ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ప్రామాణికంగా తీసుకునే అవకాశం లేదని చెప్పక తప్పదు. ప్రభుత్వం సాంకేతికంగా తమ వెబ్సైటు ఎలా నడుపుతుందో చూసి ఆ ప్రమాణాన్ని అనుసరించి మన వికీపీడియా నడిపితే మునిగిపోతాం. దురదృష్టవశాత్తూ ప్రభుత్వ పనుల నాణ్యత అలా ఉంది.
- అది పక్కన పెడితే, స్వయంగా అధికార భాషా సంఘ కార్యదర్శి హోదాలో అధికార భాష ఎలా ఉండాలన్నది సి. ధర్మారావుగారు పుస్తకంలో నిర్దేశిస్తూ మరియు వాడకూడదూ అన్నారని చదువరి గారు చెప్పింది కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఇక ఈ చర్చ ఏ విధంగా సజావుగా సాగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పవన్ సంతోష్ (చర్చ) 12:27, 4 ఆగస్టు 2024 (UTC)
- పవన్ గారు నేను చర్చ ను సరిగానే చేస్తున్నాను అనుకొంటున్నా . మీరు చెప్పిన ఈనాడు మెయిన్ పేజీలలో కూడా వున్నది (eenadu.net/telugu-news/sports/india-full-schedule-at-paris-olympics-2024/0400/124137372) అలా నేను అనేక ఉదాహరణలు ఇచ్చాను,రంధ్రాన్వేషణకు కాదు , నేను పేర్కొనది ప్రభుత్వాల సైటు గురించి కాదు, ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు ప్రజల భాషా వృద్ధికి ప్రధాన సాధనాలు. వాటిలో ఉండే పదాలు, భావాలు ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయి, భాషను నియంత్రించడం అనేది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రతి ఒక్కరికీ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది, ఈ పాఠ్యపుస్తకాల, వివిధ మాద్యమాల ద్వారా ప్రజలు నేర్చుకొన్న, వాడుకలో వున్న పదాలను మనం తెలుగు వికీపీడియాలో నిషేదిస్తాము అంటే ఎలా ? , ఒకటి చెప్పదలచుకున్నా ఈ పదం మరియు వాడాలని ఉన్నతమాత్రాన అవసరం లేకపోయినా వాఖ్య లో ఇరికించను అలా అని నాకు అవసరం అనిపించినప్పడు వికీ లో వాడకుండా వుండను. : Kasyap (చర్చ) 09:39, 6 ఆగస్టు 2024 (UTC)
- @Kasyap గారూ, ఈనాడు నుంచి ఉదాహరణ ఇచ్చినందుకు (ఛాంపియన్ పేజీ ఇది) చాలా చాలా ధన్యవాదాలు. ఈ పేజీలో మీరిచ్చిన ఉదాహరణే మీ వాదన తప్పు అని నిరూపిస్తోంది. మీరు ఇచ్చిన వార్తలో 97 సార్లు రెండు పేర్ల మధ్య కామా వస్తే ఒక్కసారి మరియు వచ్చింది. వార్తలోని 80-90 లైన్లు ఎత్తిరాసే ఓపిక లేదు కాబట్టి మరియు అన్నది వచ్చిన జులై 28 భాగం మొత్తంలో ఇద్దరి పేర్లు వరుసగా వచ్చిన సందర్భాలన్నీ ఎత్తిరాస్తున్నాను. ఒకే ఒక్క సారి మరియు వస్తే, మిగిలిన అన్నిసార్లూ కామా పెట్టి రాశారు. 97 సందర్భాలూ చూసుకోవాలంటే ఆ లింకులోనే చూసుకోవచ్చు. అంటే మరియు రాసింది పొరబాటున, కామా పెట్టింది శైలి. (బహుశా, ఒక్క మరియు వచ్చినా పాలసీ మారిందని భావించొచ్చు అన్న నా మాటను పట్టుకుంటారేమో, ఒక్క మరియు కొట్టేయడానికి 97 కామాలు ఉన్నాయని గమనించి, నా నోటిజారుడుతనాన్ని మన్నించండి)
- "జులై 28
- బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
- పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
- మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో మరియు అశ్విని పొన్నప్ప)
- షూటింగ్: 10మీ ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ (ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్)
- ఆర్చరీ మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (దీపికా కుమార్, అంకితా భకత్, భజన్ కౌర్)
- టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
- మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల)
- షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా)
- టెన్నిస్ పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ)"
- దీన్నిబట్టే మరియు ఈనాడులో సరిగానే వాడారు అన్న మీ వాదన తప్పు అని తేలట్లేదూ? మీ ఉదాహరణ మీ వాదననే కొట్టేస్తోంది. వికీపీడియాలో విషయాలను చర్చల ద్వారా, ఆధారాల ద్వారా నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్య ధోరణి అంటే నిబంధనలు లేకపోవడం కాదు. (బైదవే, వికీపీడియా ప్రజాస్వామ్యం కాదు) ప్రతీ ప్రజాస్వామ్యంలోనూ నియమాలు, నిబంధనలూ ఉంటాయి. కానీ, ఉత్తమమైన పద్ధతి ఏదో నిర్ణయించుకునేందుకు ప్రమాణాలు, పరిశోధనలు, అనుభవం పరిగణనలోకి తీసుకుని చర్చ చేయడం ప్రజాస్వామిక పద్ధతుల్లో ఒకటి. మీరు ఇచ్చిన ప్రతీ ఉదాహరణ మీదా సాధ్యమైనంత ఓపికతో చర్చ చేస్తున్నాను. ఇంతకన్నా ప్రజాస్వామ్యయుతమైన ధోరణి ఏముంటుంది? కాబట్టి, దయచేసి మీరూ ప్రజాస్వామ్యయుతమైన పద్ధతిలో నేను మీ ఉదాహరణ నుంచే ఎత్తిచూపిన ఈ అంశంపై మీ ఉద్దేశం ఏమిటో చెప్పి చర్చను మీరే ముగిస్తే బావుంటుంది. పవన్ సంతోష్ (చర్చ) 01:24, 27 ఆగస్టు 2024 (UTC)
- నేను మీకు ఈనాడు పత్రికతో పాటు, ఇతర చాలా ఉదాహరణలు ఇచ్చాను. అయినా మీరు ఈనాడు గురించే మాట్లాడుతున్నారు మీరు ఏడిటర్ కన్నుగప్పి ఆ పదం చేరి వుంటుంది అన్నదానికి నేను పై ఉదాహరణ ఇచ్చాను. కేవలం ఈనాడు ఒక్కటే కాదు.నేను మీకు అందించిన సమాచారం ఆధారంగా, 'మరియు' అనే పదంపై నిషేధం తెలుగులో "మరియు" వాడకూడదనేది తెలిసినదే అనటం కొందరి పరిమిత దృక్పథం అని నేను భావిస్తున్నాను దాని అర్ధం కామాలు తీసివేసి మరియులు వాడమని కూడా కాదు. నేను చేసిన చర్చలో ఇతర అనేక మూలాల నుంచి దీనికి విరుద్ధమైన సాక్ష్యాలు ఉన్నాయి.ఇతర పత్రికలు, పుస్తకాలు,టెక్స్ట్ బుక్స్ , ఆర్కైవ్ లింకులు కూడా సమానంగా ముఖ్యమైనవి కాదా ? ఆ పత్రికను, ఇంకెవరో చెప్పిందానిని మాత్రమే నేను ప్రమాణికంగా తీసుకోను. ఆ పదాన్ని వాడే స్వేచ్ఛ ఆ రచయితకు ఉండాలి అనేది నా ఉద్దేశం!: Kasyap (చర్చ) 16:14, 27 ఆగస్టు 2024 (UTC)
- @Kasyap గారూ, "తెలుగులో "మరియు" వాడకూడదనేది తెలిసినదే" అని రాసినది నేనే (రచ్చబండలో). ఈ సంగతిని మీరు నేరుగా నా పేరును ఉద్దేశించి రాసి ఉండాల్సింది. "కొందరి" పరిమిత దృక్పథం అనకుండా చదువరి పరిమిత దృక్పథం అని ఉంటే నాకు గౌరవంగా ఉండేది. ఇకపై నన్ను ఉద్దేశించి విమర్శించదలిస్తే నేరుగా నా పేరును ఉదహరించి రాయవలసినదిగా అభ్యర్థన.
- పోతే, తెలుగులో "మరియు" వాడకూడదు అని చెప్పింది నేను కాదు. అది భాషా నియమం. ఆ ముక్క చెప్పటానికి ఇతరులు, నేనూ 9 మంది రాసిన భాషా నియమాలను ఇక్కడ ఉదహరించాం. నేనిక్కడ నా సొంత కవిత్వమేమీ రాయలేదు. మరి, అది నా పరిమిత దృక్పథం అని ఎందుకన్నారు?__ చదువరి (చర్చ • రచనలు) 01:56, 28 ఆగస్టు 2024 (UTC)
- @Chaduvari గారు, అది భాషా నియమం అని మీరు అంటున్నారు,అనేక చోట్ల మన వికీపీడియా చర్చా పేజీలతో సహా అనేక పుస్తకాల్లో, అంతర్జాలంలో తెలుగు పండిత, పామరులు అవసరం అయినప్పుడు మరియులు వాడటం చూసాము, అయినా తెలుగులో "మరియు" వాడకూడదనేది తెలిసినదే అనటం పరిమిత దృక్పథం కాక మరి ఏమిటీ ? నా బోటి వారందరూ తెలుగు నేర్చుకొనే తెలుగు వాచకం లో నాకు తెలిసినంత వరకూ ఆ నియమం ఎక్కడా లేదు కదా, ఏవో కొన్ని పత్రికలు తప్ప అనేకులు ఈ పదం వాడుతున్నారు కదా! Kasyap (చర్చ) 13:18, 28 ఆగస్టు 2024 (UTC)
- @Kasyap గారూ,
- బూదరాజు రాధాకృష్ణ, భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు,.. గార్ల వంటి ఉద్దండులైన భాషావేత్తలు చెప్పిన నియమం అది. దాన్నీ, నాబోటి వారందరూ తెలుగు నేర్చుకునే తెలుగు వాచకాన్నీ పోల్చడానికీ,
- భాషా నియమానికీ, వికీపీడియా చర్చా పేజీలతో సహా అనేక పుస్తకాల్లో, అంతర్జాలంలో తెలుగు పండిత, పామరులు అవసరం అయినప్పుడు మరియులు వాడటానికీ
- వీటికి నేనూ ఒక పేరు పెట్టి, మిమ్మల్ని తక్కువ చేసి మాట్టాడొచ్చు. కానీ అలా మాటాణ్ణు. ఇక మీతో ఎంత చర్చించినప్పటికీ నేను ఇంతకు ముందు రాసిన దానికి మించి, సముదాయానికి పనికొచ్చే విషయాలను ఇంకేమీ రాయలేననని నాకు అర్థమైంది. అంచేత మీతో నా చర్చ ముగిస్తున్నాను. నమస్కారం.
- --------------------
- ఇక్కడ తొమ్మిది మంది చెప్పిన భాషా నియమాలను, లింకులతో సహా రాసాం. అందరూ "మరియు" వాడనే కూడదు అనే చెప్పారు.
- "మరియు" వాడాల్సిందే అని చెప్పే నియమం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ చెప్పలేదు.
- కాబట్టి భాషా నియమాల ప్రకారం "మరియు" వాడకూడదు అనేది నిర్ద్వంద్వం.
- పోతే.. ఏ ఈనాడునైతే పదేపదే ఉదహరించి, వాళ్ళు వాడుతున్నారు చూడండి అని చెప్పారో, ఆ ఈనాడు వెతుకులాట ఫలితాలను కూడా విశ్లేషించి చూపాను. అవి కేవలం తప్పులు - వాడుకలో వచ్చిన తప్పులు, వెతుకులాట ఫలితాల్లోనే వచ్చిన తప్పులు అని చూపాను. అంతేకాదు, స్వయానా ఈనాడులో పనిచేసిన పెద్దలు, గురువులూ చెప్పిన నియమం ఒకటుంది -మరియు వాడకూడదు అని (పైన Palakodety గారు రాసినది చూడండి). ఈనాడు పెట్టుకున్న నియమాన్ని మాత్రం పట్టించుకోకుండా, ఆ నియమాన్ని పాటించి "మరియు" వాడని కోట్లాది వాక్యాలను పరిగణించకుండా, ఆ నియమాన్ని ఉల్లంఘించిన కొద్దిపాటి సందర్భాలను మాత్రమే పరిగణించి, ఆ ఉల్లంఘననే పాటించాలనుకోవడం సరైన ధోరణి కాదని నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. __ చదువరి (చర్చ • రచనలు) 16:34, 28 ఆగస్టు 2024 (UTC)
- @Kasyap గారూ,
- @Chaduvari గారు, అది భాషా నియమం అని మీరు అంటున్నారు,అనేక చోట్ల మన వికీపీడియా చర్చా పేజీలతో సహా అనేక పుస్తకాల్లో, అంతర్జాలంలో తెలుగు పండిత, పామరులు అవసరం అయినప్పుడు మరియులు వాడటం చూసాము, అయినా తెలుగులో "మరియు" వాడకూడదనేది తెలిసినదే అనటం పరిమిత దృక్పథం కాక మరి ఏమిటీ ? నా బోటి వారందరూ తెలుగు నేర్చుకొనే తెలుగు వాచకం లో నాకు తెలిసినంత వరకూ ఆ నియమం ఎక్కడా లేదు కదా, ఏవో కొన్ని పత్రికలు తప్ప అనేకులు ఈ పదం వాడుతున్నారు కదా! Kasyap (చర్చ) 13:18, 28 ఆగస్టు 2024 (UTC)
- @Kasyap గారూ, మీరు మొదటి వ్యాఖ్య నుంచే ఈనాడు ప్రస్తావన తీసుకువస్తూ వచ్చారు. మీరిచ్చిన ఆ ఒక్క వార్తలోనే మీరు ఒక్క మరియు చూపిస్తే, ఎన్ని మరియుల బదులు కామాలు ఉన్నాయో నేను చూపించాను. చదువరి గారు పుంఖానుపుంఖాలుగా పత్రికా రచయితలకు పాఠాలు చెప్పినవాళ్ళు, శైలీ మార్గదర్శకాలు రాసిన పెద్దలు, విద్యావేత్తలు, భాషావేత్తలను కోట్ చేశారు. ఈ ఉల్లంఘనలు ఆమోదించుకుంటూ పోవాలి అనుకుంటే అంటే రేపటి నుంచి "ఆవిడ రాజమండ్రి వెళ్ళాడు" అని రాసేవాళ్ళు కూడా వస్తారు. వాళ్ళనీ ఆమోదించుకుంటూ పోవాల్సి ఉంటుంది. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 09:51, 4 సెప్టెంబరు 2024 (UTC)
- నేను మీకు ఈనాడు పత్రికతో పాటు, ఇతర చాలా ఉదాహరణలు ఇచ్చాను. అయినా మీరు ఈనాడు గురించే మాట్లాడుతున్నారు మీరు ఏడిటర్ కన్నుగప్పి ఆ పదం చేరి వుంటుంది అన్నదానికి నేను పై ఉదాహరణ ఇచ్చాను. కేవలం ఈనాడు ఒక్కటే కాదు.నేను మీకు అందించిన సమాచారం ఆధారంగా, 'మరియు' అనే పదంపై నిషేధం తెలుగులో "మరియు" వాడకూడదనేది తెలిసినదే అనటం కొందరి పరిమిత దృక్పథం అని నేను భావిస్తున్నాను దాని అర్ధం కామాలు తీసివేసి మరియులు వాడమని కూడా కాదు. నేను చేసిన చర్చలో ఇతర అనేక మూలాల నుంచి దీనికి విరుద్ధమైన సాక్ష్యాలు ఉన్నాయి.ఇతర పత్రికలు, పుస్తకాలు,టెక్స్ట్ బుక్స్ , ఆర్కైవ్ లింకులు కూడా సమానంగా ముఖ్యమైనవి కాదా ? ఆ పత్రికను, ఇంకెవరో చెప్పిందానిని మాత్రమే నేను ప్రమాణికంగా తీసుకోను. ఆ పదాన్ని వాడే స్వేచ్ఛ ఆ రచయితకు ఉండాలి అనేది నా ఉద్దేశం!: Kasyap (చర్చ) 16:14, 27 ఆగస్టు 2024 (UTC)
- పవన్ గారు నేను చర్చ ను సరిగానే చేస్తున్నాను అనుకొంటున్నా . మీరు చెప్పిన ఈనాడు మెయిన్ పేజీలలో కూడా వున్నది (eenadu.net/telugu-news/sports/india-full-schedule-at-paris-olympics-2024/0400/124137372) అలా నేను అనేక ఉదాహరణలు ఇచ్చాను,రంధ్రాన్వేషణకు కాదు , నేను పేర్కొనది ప్రభుత్వాల సైటు గురించి కాదు, ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు ప్రజల భాషా వృద్ధికి ప్రధాన సాధనాలు. వాటిలో ఉండే పదాలు, భావాలు ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయి, భాషను నియంత్రించడం అనేది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రతి ఒక్కరికీ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది, ఈ పాఠ్యపుస్తకాల, వివిధ మాద్యమాల ద్వారా ప్రజలు నేర్చుకొన్న, వాడుకలో వున్న పదాలను మనం తెలుగు వికీపీడియాలో నిషేదిస్తాము అంటే ఎలా ? , ఒకటి చెప్పదలచుకున్నా ఈ పదం మరియు వాడాలని ఉన్నతమాత్రాన అవసరం లేకపోయినా వాఖ్య లో ఇరికించను అలా అని నాకు అవసరం అనిపించినప్పడు వికీ లో వాడకుండా వుండను. : Kasyap (చర్చ) 09:39, 6 ఆగస్టు 2024 (UTC)
- ఈనాడు ఉదాహరణలో 24 వేల "మరియు"లు ఎక్కడి నుండి వచ్చాయో చూసాం. వాళ్ళకో రూలుంది. దాన్ని అతిక్రమించిన సందర్భాలూ - చాలా తక్కువ - ఉన్నాయి. అయితే ఆ రూలును అతిక్రమించిన సందర్భాలను మాత్రమే పరిగణించి, రూలు మాత్రం పట్టించుకోనక్కర లేదనడం సమంజసంగా లేదు. పైగా ఆ రూలు భాషావేత్తలు చెప్పిన నియమమే తప్ప, వాళ్ళు స్వంతంగా తయారు చేసినది కాదు. ఇక్కడ చూడాల్సింది నియమ నిబంధనలను. ఇక పాఠ్యపుస్తకాల సంగతి - అవి ఆయా సబ్జెక్టుల నిపుణులు రాసేవి, భాషావేత్తలు రాసేవి కావు. ఆ పుస్తకాల్లో "మరియు" రాస్తున్నారంటే దానర్థం, ఆ నియమాన్ని పాటించడం లేదనే. మరో సంగతి - పైన మురళీకృష్ణ గారు రాసిన అంశం అలాంటి పాఠ్యపుస్తకం (గ్రాడ్యుయేషను, పోస్టు గ్రాడ్యుయేషను పుస్తకాలు) లోనిదే. అది భాషకు సంబంధించిన పుస్తకం, అక్కడ ఆ నియమాన్ని చాలా స్పష్టంగా నిర్వచించారు. __చదువరి (చర్చ • రచనలు) 06:23, 4 ఆగస్టు 2024 (UTC)
- [భాషా నియమం-9] ఒకప్పుడూ ఉస్మానియా యూనివర్సిటీ భాషాశాస్త్ర శాఖలో ఆచార్యుడిగా పనిచేసిన భద్రిరాజు కృష్ణమూర్తి గారి సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకడమీ వారు తెలుగు భాషాచరిత్ర అనే పుస్తకం వేసారు. ఒకప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ తెలుగు ఎమ్‌ఏ లో ఇది పాఠ్యపుస్తకంగా ఉండేదట. ఆ పుస్తకంలో భాష గురించి అనేక మంది వ్యాసాలు రాసారు. చేకూరి రామారావు గారు రాసిన ఒక వ్యాసంలో ఇలా రాసారు:
- ఇంగ్లీషు హిందీ భాషల్లోలాగా రెండు వాక్యాల్ని కలిపే సముచ్చయార్థక, వికల్పార్థక శబ్దాలు తెలుగులో లేవు. నామబంధాలను మాత్రం చివరి స్వరాలకు దీర్ఘీకరించటంద్వారా ఏకనామ బంధం చెయ్యవచ్చు. ఉదా : లలితా సుబ్బారావూ కలిసివచ్చారు. నామబంధాలకు 'ఓ' శబ్దంచేరిస్తే వికల్పార్థంలో కలపవచ్చు. రామారావో సుబ్బారావో వస్తారు.
- పదాలను దీర్ఘీకరించమని చెప్పారు తప్ప, మరియు వాడమనలేదు. అసలు అలాంటి పదాలు తెలుగులో లేవని చెప్పారు. ఈ పుస్తకం వికీసోర్సులో కూడా ఉంది చూడవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 08:27, 4 ఆగస్టు 2024 (UTC)
- "మరియు" వాడకం అన్నమాచార్య కృతి మనసిజ గురుడితడో "" లాంటి అనేక కీర్తనలలో , మొదటి తెలుగు అనువాదాలలో ఒకటి అయిన బైబిల్ , మరియు ప్రభుత్వ చట్టము లో, అనేక పదనిఘంటువు లలో పదకోశములలో, ఆధునికవ్యవహారకోశం తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 , ఉర్దూ - తెలుగు నిఘంటువు (బి.రామరాజు) 1962 అర్ధ వివరణలలోనూ,ఉదాహరణలలోనూ, అమ్మనుడి ,వంటి తెలుగు భాష కోసం పనిచేసే పత్రికలతో సహా ఇతర పాత రచనలలో కనుగొనబడింది , [పుస్తక శీర్షికలతో] వాడుకలో వున్నది, ఇది సోషల్ మీడియాలో, లక్షలసార్లు ఇంటర్నెట్ ఇంకా ఈనాడు నెట్ లో సుమారు ( 24000 సార్లు ) ఆంధ్రజ్యోతి వెబ్ లో [14 వేల సార్లు ] ) , ఇంకా [| 1965 నాటి ] ) గోల్కొండ, ఆంధ్రపత్రిక, ఇతర పత్రికలు మరియు పుస్తకాలలోనూ, ప్రస్తుతము వున్న అనేక వార్తా పత్రికలలో , లక్షల సార్లు మరియు విస్తృతంగా ఉపయోగించబడుతున్నది. కాబట్టి ఈ పద వాడకం వ్యవహారిక భాషతోపాటూ, ప్రామాణిక భాషలో ఉన్నదని చెప్పవచ్చు.. Kasyap (చర్చ) 05:23, 31 జూలై 2024 (UTC)
యర్రా రామారావు అభిప్రాయం
తెవికీనందు మరియు వాడాలనా, లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. మనం ఎక్కడైనా లేదా ఏ సందర్బంలోనైనా మాట్లాడేటప్పుడు మరియు పదం మాట్లాడం. మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఈ సంగతి మనందరికి తెలుసు. తెవికీలో మనం మాట్లాడే వాడుకభాష ఉపయోగించాలని మనందరకు తెలిసిన విషయమే... అసలు అసరంలేని పదం ఎందుకు ఉపయోగించాలని నా అభిప్రాయం.ఇదిగో వాళ్లు ఇలా వాడారు, అందువలన మరియు వాడకం తప్పుగాదు అనవచ్చు. దానికి నేను చిన్న రెండు ఉదాహరణ చెపుతాను. ఈ చర్చలో ఈ దిగువ వాక్యాలు కాసేపు నేను రాసాను అనుకుందాం. "ఈ చర్చలో తెవికీనందు మరియు వాడవచ్చు అని కశ్యప్ గారు చర్చను ప్రవేశపెట్టగా, ఆ చర్చలో వి.జె.సుశీల గారు మరియు ప్రభాకర్ గౌడ్ గారూ, మరియు పవన్ సంతోష్ గారు, మరియు చదువరి గారూ మరియు ఒక అజ్ఞాత వాడుకరి గారూ వారి అభిప్రాయాలు వెళ్లబుచ్చారు. ఈ చర్చ ఎక్కువగా కశ్యప్ మరియు చదువరి గార్ల మధ్యనే సాగుతుంది." అని రాసాను అనుకుందాం.
దీనినే మరియు లేకుండా అర్థవంతమైన వాక్యం ఎలా రాయచ్చో మీ అందరికి ప్రత్వేకంగా నేను మరలా రాసి చూపించాల్సిన అవసరంలేదనుకుంటాను.
అలాగే ఇంకో ఉదాహరణ: మనం "మేము తిరుపతి వెళ్లివచ్చాం" అని ఎవరితోనైనా మాటల సందర్బంలో చెప్పాం మనుకోండి. అవతలివారు తెలుసుకుందామని ఎవరెవరు వెళ్లారు అని వెంటనే అడగటం సహజం.దానికి మనం నేనూ, మా ఆవిడా, పెద్దోడు, చిన్నోడు, వెళ్లివచ్చాం అని చెపుతాం. అంతేగానీ నేను మరియు మా ఆవిడ మరియు మా పెద్దోడు మరియు మా చిన్నోడు వెళ్లివచ్చామని ఎవ్వరూ చెప్పరు.
ఇదిగో ఈ సందర్బాలలో పలానా రామారావుగారు ఉపయోగించారు, అందువలన వాడవచ్చు అని అభిప్రాయం వెళ్లబుచ్చటం ఈ చర్చకు సరియైన హేతువు కాదని నా అభిప్రాయం. నేను వెంటనే చర్చలో స్పందించకుండా, నాదగ్గర ఉన్న పుస్తకాలలో ఎక్కడైనా, ఏ సందర్బంలో నైనా మరియు పదం వాడారా అని కొన్ని పుస్తకాలు పరిశీలించాను. కాానీ ఆ మరియు పదం వాడిన సందర్బాలు నాకు కనిపించలేదు. నాది ఒకటే అభిప్రాయం. అవసరం లేని ఆ మరియు పదం తెవికీలో ఎందుకువాడాలి? వాడకూడదనేదే నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 07:20, 4 ఆగస్టు 2024 (UTC)
- ఈరోజు వికీసోర్సులో 1916లో ప్రచురించిన "గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1" లో "మఱియొకటియును" అనే పదాన్ని గమినించాను. మనం రోజు, "మరొకటి ఇవ్వండి", "మరొకరిని కలవాలి" అనే పదాలలో వాడుతున్నాం కదా, వాటిని కూడా వికీలో వాడకుండా నిషేధించాలా? Saiphani02 (చర్చ) 16:18, 12 అక్టోబరు 2024 (UTC)
- @Saiphani02 గారూ మీరు ఈ చర్చలో మీ సందేహం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు. మీరు పైన వివరించిన మఱియొకటి లేదా మరొకటి, మరొకరిని ఈ పదాలు, మరియు అనే పదం కోవకు చెందవని నా అభిప్రాయం. నిషేదించటం లేదా వాడటం అనేది సముదాయం నిర్ణయానికి లోబడి ఉంటుంది తప్ప ఏ ఒక్కరో అభిప్రాయం ప్రకారం అమలు కాదు. యర్రా రామారావు (చర్చ) 16:38, 12 అక్టోబరు 2024 (UTC)
- @Saiphani02 గారూ ఈరోజు మీ సందేహం చూడడము జరిగింది. దాదాపు 100 సంవత్సరాలు పూర్వం (1916) ఉపయోగించిన భాషకు ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆ గ్రంథాలయ సర్వస్వము పత్రికవారు కూడా మార్పులను ఎప్పటికి అప్పుడు అన్వయించుకొని ఇదే విధమైన విధానం అనుసరిస్తున్నారు. నేను ఆ పత్రికకి దాదాపు 60 పైగా వ్యాసాలు రాసాను. కాబట్టి వారి విధానం నాకు పరిచయమే. V.J.Suseela (చర్చ) 17:30, 12 అక్టోబరు 2024 (UTC)
- Vjsuseela గారూ, " ఇప్పుడు ఆ గ్రంథాలయ సర్వస్వము పత్రికవారు కూడా మార్పులను ఎప్పటికి అప్పుడు అన్వయించుకొని ఇదే విధమైన విధానం అనుసరిస్తున్నారు." అని రాసారు గదా, కేవలం స్పష్టత కోసం అడుగుతున్నాను మేడం.. వారి ప్రస్తుత విధానం "మరియు" వాడాలనా, వాడకూడదనా? __ చదువరి (చర్చ • రచనలు) 01:13, 13 అక్టోబరు 2024 (UTC)
- చదువరి (చర్చ • రచనలు) గారు! నాకు భాషా పరిజ్ఞానం తక్కువ. అయితే వికీసోర్స్ లోకి మనం తెచ్చిన గ్రంథాలయ సర్వస్వము పత్రికలలో నేను గమనించాను. అప్పట్లో 'మరియు', 'యొక్క' పదాలు విరివిగా వాడారు. భాష కూడా గ్రాంధికంకు దగ్గరగా ఉంది. ఆకాలం లో ప్రచురించబడిన ఇతర పత్రికలూ, పుస్తకాలు (ఆర్కైవ్స్, తెలుగు వికీసోర్స్లో చూడవచ్చు) ఇదే పంధాలో ఉన్నాయి. ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ప్రకారం 'మరియు','యొక్క' పదాలు గ్రంథాలయ సర్వస్వము పత్రికలలో ఉపయోగించరు. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 03:04, 13 అక్టోబరు 2024 (UTC)
- Vjsuseela గారూ, " ఇప్పుడు ఆ గ్రంథాలయ సర్వస్వము పత్రికవారు కూడా మార్పులను ఎప్పటికి అప్పుడు అన్వయించుకొని ఇదే విధమైన విధానం అనుసరిస్తున్నారు." అని రాసారు గదా, కేవలం స్పష్టత కోసం అడుగుతున్నాను మేడం.. వారి ప్రస్తుత విధానం "మరియు" వాడాలనా, వాడకూడదనా? __ చదువరి (చర్చ • రచనలు) 01:13, 13 అక్టోబరు 2024 (UTC)
- ""మరొకటి ఇవ్వండి", "మరొకరిని కలవాలి" అనే పదాలలో వాడుతున్నాం కదా, వాటిని కూడా వికీలో వాడకుండా నిషేధించాలా?" - నాకు తెలిసినంతలో మరొక అనేది వన్ మోర్/ఎనదర్ అనే వాటికి సమానార్థకం. ఐ నీడ్ టు మీట్ వన్ మోర్ పర్సన్, గెట్ మి ఎనదర్, గివ్ మి వన్ మోరనే వాటిని అనువదించడంలో దీన్ని వాడతారు. ఆ సంపుటం లోని "మఱియొకటియును" (నేను అది చూడలేదు) కూడా ఇదే అర్థంలో వాడారని నాకు అర్థమౌతోంది. దాన్ని నేటి వ్యావహారికంలో "మరొకటి", "మరొకటీ" అని చెప్పుకోవచ్చు.
- ఎనదర్, అదర్, మోర్, అండ్, వంటి ప్రతీ ఇంగ్లీషు మాటకూ సందర్భోచితంగా మరొక, ఇంకొక, వేరొక (వికల్పార్థకం), , (కామా), అలాగే, అట్లాగే,.. వంటి మాటలు ఉన్నై. ఇవేవీ నిషిద్ధం కాదు. తెలుగులో "మరియు" వాడకూడదు అనేది మాత్రమే పై చర్చలో పదేపదే ఉదహరించిన భాషా నియమం. అంతేగానీ, అది "మరొక"ను పరిహరించలేదు.
- "మారు వడ్డించడం" అనే మాటొకటుంది కొన్ని ప్రాంతాల్లో. భోజనాల సమయంలో (నేను బంతి (పంక్తి) భోజనాల్లో విన్నానది) వాడతారు. "మళ్ళీ వడ్డించడం" అనే మాటకు పర్యాయపదం అది.
- -------
- ఇదంతా కేవలం నా మిడిమిడి జ్ఞానపు ఆలోచనలు తప్ప, పై ప్రశ్న స్థాయికి సరిపడే సమాధానం కాకపోవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 01:10, 13 అక్టోబరు 2024 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)గారు, స్థాయి అని కాదు, కానీ మరియు','యొక్క' పదాల చర్చ, 'మరొక' పదం సందర్భం వేరు అని తోస్తోంది. V.J.Suseela (చర్చ) 03:13, 13 అక్టోబరు 2024 (UTC)
తెలంగాణ SCERT వారి లింకుల గురించి
మార్చుపైన కశ్యప్ గారు తెలంగాణ SCERT వారి వెబ్‌సైటులో వెతికగా వచ్చిన ఫలితాల లింకు ఇచ్చారు. ఆ ఫలితాల్లో ఒక లింకు లోని పేజీలో ఒక వాక్యం ఇలా ఉంది:
- వివిధ వయస్సుల ప్రజలకు జంతువులు మరియు పక్షులకు ఆహారం యొక్క అవసరం, ఆహారము. మరియు నీటి లభ్యత మరియు ఇంట్లో మరియు పరిసరాల్లో నీటి వినియోగం గురించి విద్యార్థులు వివరిస్తారు
విద్యార్థులకు విద్య ఎలా నేర్పాలి అనే విషయాన్ని వివరిస్తూ రాసిన ఒక పుస్తకం లోనిది అనుకుంటాను, ఈ వాక్యం. అనేక "మరియు" లతో కూడిన ఈ వాక్యం ఎంత జీవంతో ఉందో మనకు మరొకరు చెప్పనక్కరలేదు (ఈ వాక్యం వెతుకులాట ఫలితాల్లో కనిపించింది, అందుకే తీసుకున్నాను). సరే, ఈ వాక్యాన్ని ఇంగ్లీషు లోకి అనువదించమని గూగుల్‌ను అడిగాను. అది ఇలా అనువదించింది.
Animals and birds need food, food for people of different ages. And students describe water availability and water use at home and in the neighborhood
అయితే ఈ వాక్యానికి అర్థం రెండు విధాలుగా వస్తుంది. నేను భాష అంతగా తెలిసినవాణ్ణి కాదు గానీ, ఇంతకంటే కాస్త బాగానే రాయగలనని భావిస్తూ, పై వాక్యాన్ని ఇలా రెండు విధాలుగా మార్చాను (ఇక్కడి వికీపీడియన్లు ఇంతకంటే చాలా బాగా మార్చగలరు):
- వివిధ వయస్సుల ప్రజలకూ, జంతువులకూ, పక్షులకూ ఆహారం అవసరం గురించీ, ఆహారం, నీటి లభ్యతల గురించీ, ఇంట్లోనూ పరిసరాల్లోనూ నీటి వినియోగం గురించీ విద్యార్థులు వివరిస్తారు
- దీని గూగుల్ అనువాదం: Students explain about the need of food for people of different ages, animals and birds, availability of food and water, water consumption in home and neighborhood.
అదే మూల వాక్యానికి మరో రకమైన అర్థం వస్తుంది, ఈ విధంగా:
- జంతువులు పక్షులకు ఆహారం అవసరం గురించీ, ఆహారం, నీటి లభ్యతల గురించీ, ఇంట్లోనూ పరిసరాల్లోనూ నీటి వినియోగం గురించీ వివిధ వయస్సుల ప్రజలకు విద్యార్థులు వివరిస్తారు
- ఈ వాక్యాన్ని కూడా గూగుల్ అనువదించింది, ఇలా: Students explain to people of different ages about food needs of animals and birds, availability of food and water, and water use in the home and neighborhood.
మూలం ఏది బాగుందో, ఇంగ్లీషు అనువాదం ఏది బాగుందో పరిశీలించండి.
ఇక్కడి మూల వాక్యం, ఏదో ఇంగ్లీషు మూలం నుండి అనువదించి ఉండవచ్చని నేను భావిస్తున్నాను. ఆ అనువాదం "మరియు" వలన చెడిపోయిందని కూడా భావిస్తున్నాను.
ఇవి కూడా చూడండి
మార్చుమరియు వాడుకపై గతంలో జరిగిన చర్చ
- అనువాద పరికరం - తరచూ వచ్చే సందేహాలు చర్చ పేజీలో జరిగిన చర్చ
- గతంలో రచ్చబండలో పెట్టిన ఒక సందేశం: 2020 ఫిబ్రవరి 8 న ఐఐఐటిలో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు "మరియు", "యొక్క", "బడు" (కర్మణి వాక్యం) అనేవి తెలుగు భాషకు స్వాభావికమైనవి కాదు. వికీపీడియాలో వాటిని రాయవద్దని అన్నారు.
నిర్ణయం
మార్చుపైన జరిగిన విస్తృతమైన చర్చలు చదివాను. రెండు నెలలు సమయం కూడా పూర్తయింది కాబట్టి ఈ చర్చపై నిర్ణయం వెలువరించే ముందు నేను కొన్ని సందేహాలు నివృత్తి చేయదలుచుకున్నాను. అవి నిర్ధారించుకున్న తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తే బాగుంటుందని కింద సందేహ నివృత్తి కోసమే ఒక విభాగాన్ని చేర్చి ఫలితం వేరే విభాగంలో ప్రకటిస్తాను.
సందేహ నివృత్తి
మార్చుపైన జరిగిన చర్చలో మరియు తెలుగు వికీపీడియాలో వాడొచ్చా, వాడకూడదా అనే విషయంపైన వాదనలు నడిచాయి. కశ్యప్ గారు మరియు అనే పదాన్ని వాడదలిచిన వారిని తెవికీలో వాడకుండా నిర్బంధం చేయకూడదు అని అభిప్రాయపడ్డారు. కశ్యప్ గారూ, నాకు తెలిసినంత వరకు ఆ పదం వాడకూడదనే నియమం ఉన్నా కొత్త వ్యాసాలలోనూ, పాత వ్యాసాల మార్పులు చేర్పులలోనూ ఆ పదం ఉంటే ప్రచురించడాన్ని మనం నిరోధించడం లేదు. మరియు అనే పదం తెవికీలో వాడకూడదు అనే నియమం వల్ల వ్యాస రచనలో దాన్ని వాడేవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పగలరా? వీలైతే ప్రతి ఇబ్బందినీ సూటిగా, స్పష్టంగా తెలియజేయండి.
"మరియు" వాడుక మన చర్చా పేజీలతో సహా అనేక వ్యాసాలలో వాడుకలో ఉన్నది, అనేక తెలుగు రచనలలో అందుబాటులో ఉన్నది, తెలుగు నుండి వేరే భాషలో యాంత్రిక అనువాదాలకు కూడా చాలా ఉపయోగం అయితే దాన్ని వికీపీడియాలో నిషేధించిన పదంగా పేర్కొనటం నాకు నచ్చలేదు. ఈ చర్చలో కూడా కొద్ది మందే పాల్గొనటం దానిమీద సమూహ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవటం, మీ నిర్ణయం :) . Kasyap (చర్చ) 16:12, 26 సెప్టెంబరు 2024 (UTC)