వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2019/నివేదిక
అనుకున్న ప్రకారమే 2019 డిసెంబరు 22 వ తేదీన తెవికీ 16 జన్మదిన సమావేశం జరిగింది. హైదరాబాదు, గచ్చిబౌలి లోని కోలివ్ గార్నెట్ భవనం లోని సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకూ జరిగింది. సమయాన్ని వృథా కానీయకుండా, సీరియస్ చర్చలతో సమావేశాన్ని అర్థవంతంగా నిర్వహించుకున్నారు. ప్రముఖ రచయిత, పాలకోడేటి సత్యనారాయణరావు గారు రావడం, చర్చలో చొరవగా పాల్గొనడం ఒక విశేషం. 11 గంటలకు కాఫీ, 2 గంటలకు భోజనం, 5 గంటలకు టీ అందించారు.
సన్నాహకాలు
మార్చుడిసెంబరు 17 న జరిపిన సన్నాహక సమావేశంలో అనుకున్న విధంగా సభ్యులు ఏర్పాట్లు చేసారు. వేదికను కేటాయింప జేసుకుని, సిద్ధం చేయించి శశి గారు కార్యక్రమ నిర్వహణకు స్థలాన్ని సిద్ధం చేసారు. కేకు ఆర్డరు చేసి పెట్టారు. కశ్యప్ గారు ఫ్లెక్సీలు, బహుమతులు (వికీపీడియా లోగో ముద్రించిన కాఫీ కప్పులు) మొదలైన వాటిని తయారు చేయించి, తీసుకు వచ్చారు. బి.కె. విశ్వనాధ్, వీవెన్ గార్లు తగు డిజైన్లను సమకూర్చారు.
10 గంటలకు సమావేశ స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలు కట్టడం పూర్తి చేసారు. కాఫీ ఆర్డరు చేసారు.
హాజరైనవారు
మార్చు- ఆదిత్య పకిడె
- యర్రా రామారావు
- పాలకోడేటి సత్యనారాయణరావు
- పవన్ సంతోష్ సూరంపూడి
- తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి)
- కృపాల్ కశ్యప్
- ప్రణయ్‌రాజ్ వంగరి
- శశి (జంగం వీర శశిధర్)
- దిగవల్లి రామచంద్ర
- వీవెన్
- రాజశేఖర్
- ఐ.మహేష్
- కోడిహళ్ళి మురళీమోహన్ (స్వరలాసిక)
వికీపీడియా లోటుపాట్లపై చర్చ
మార్చుముందుగా వికీపీడియాలోని లోటుపాట్ల గురించి, వాటిని మెరుగుపరచే పద్ధతుల గురించీ చర్చించారు.
పాలకోడేటి సత్యనారాయణరావు
మార్చు- వ్యాసాల్లోని భాష బాగాలేదు, కృతకంగా ఉంటోంది.
- ఏకవచన ప్రయోగం బాగులేదు.
పవన్ సంతోష్
మార్చు- వాడుకరులు నాణ్యత గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వికీ శిక్షకులు ముందు తాము వికీ గురించి, నాణ్యతా ప్రమాణాల గురించీ క్షుణ్ణంగా నేర్చుకోవాలి.
- అంతర్జాలంలో స్వేచ్ఛగా అందుబాటులో ఉన్న స్ట్రక్చర్డ్ డేటాను ఉపయోగించుకుని వివిధ వర్గాలకు చెందిన వ్యాసాలను (ఉదా:సినిమా వ్యాసాలు, వ్యక్తుల వ్యాసాలు వగైరాలు) మెరుగు పరచడం/సృష్టించడం చెయ్యవచ్చు. గ్రామాల వ్యాసాల్లో ఈ పద్ధతినే అనుసరించాం.
- వ్యాసాల్లోని శైలిని మెరుగుపరచుకోవాలి. అందుకు గాను వాడుకరులకు మార్గదర్శకంగా ఉండే వికీపీడియా:శైలి వ్యాసాన్ని, దాని అనుబంధ వ్యాసాలనూ మెరుగు పరచుకోవాలి.
వీవెన్
మార్చు- వికీలో కొన్ని సందర్భాల్లో చర్చలను మరీ సాగదీస్తున్నారు. వాడుకరులు పట్టువిడుపులను చూపించాలి. నేను చెప్పిందే సరైనదనే మొండితనాన్ని విడనాడాలి.
- వికీపీడియా గురించి ప్రచారం చేసే సందర్భంలో దానితో పాటు సోదర ప్రాజెక్టులైన వికీసోర్స్, వికీడేటా వంటి వాటి గురించి కూడా చెప్పాలి.
- తెవికీ వాడుకరులు తమ సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలి. బాట్‌లు తయారు చెయ్యడం, నడపడం, మూసలు తయారు చేసుకోవడం వంటి పనులు చెయ్యాలి.
శశి
మార్చు- వికీలో నియమ నిబంధనలు మరీ కఠినంగా ఉండడంతో కొత్తవాళ్ళు ఉత్సాహంగా రాసేందుకు అవరోధంగా ఉన్నాయి.
ప్రణయ్‌రాజ్
మార్చు- ఏకవాక్యపు సినిమా వ్యాసాలను విస్తరించే బదులు వాటిని తొలగించి కొత్తగా రాయవచ్చు గదా.
- ఉన్నవాటిని తొలగించడం ఎందుకు.. వాటినే విస్తరిస్తే సరిపోతుంది గదా అని కొందరు సభ్యులు చెప్పారు
- ప్రస్తుతం రెవిన్యూ గ్రామాలకు మాత్రమే పేజీలు పెట్టాం. రెవిన్యూయేతర గ్రామాలకు కూడా పేజీలు పెట్టాలి. వాటికి తగిన డేటాను తెలంగాణ పభుత్వం నుండి సేకరిస్తాను.
- ఆంద్రప్రదేశ్ రెవిన్యూయేతర గ్రామాల డేటాను కూడా సేకరించాలని సభ్యులు ఆయన్ను కోరారు.
- వికీ పురోగతిని అడ్డుకునే దుశ్చర్యలను నిరోధించేందుకు వికీలో ఒక వ్యవస్థ ఉండాలి.
దిగవల్లి రామచంద్ర
మార్చు- తన మిత్రుల వద్ద ఇటీవలి చరిత్రకు సంబంధించి వారి తండ్రి తాతల ద్వారా వచ్చిన సమాచారం ఉందని, వారు దాన్ని టైపు చేసి ఇస్తే వికీ శైలి లోకి మార్చి ప్రచురిస్తారా అని రామచంద్ర గారు అడిగారు. ఎవరైనా ముందుకు వస్తే తాను వారిని సంప్రదిస్తానని ఆయన చెప్పారు.
- సముదాయ సభ్యుల్లో దీని పట్ల ఆసక్తి ఉన్నవారు రాజశేఖర్ గారిని సంప్రదిస్తే ఆఅయన తగు ఏర్పాట్లు చెయ్యగలరు.
కృపాల్ కశ్యప్
మార్చు- తెవికీ అభివృద్ధి కోసం ఐఐఐటి వంటి బయటి సంస్థలు చేసే పనుల పట్ల సముదాయ సభ్యులు భయపడ కూడదు. ఆ సంస్థలను వ్యతిరేక భావంతో కాక, స్నేహభావంతో చూడాలి.
- భాష ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కొత్తవారిని భయపెట్టకూడదు.
- వికీపీడియాను ప్రచారం చేసేటపుడు, అక్కడ చదవడమే మనం కూడా రాయవచ్చు అనే విషయాన్ని అందరికీ స్పష్టంగా తెలిసేలా చెప్పాలి.
- ఐఐఐటి వారు చేపట్టిన ప్రాజెక్టులో, వారు తయారు చేసే కొత్త వాడుకరులు నేరుగా వికీలో రాయరని, ముందు ఐఐఐటి వారి ప్రైవేటు వెబ్‌సైటులో వ్యాసాన్ని తయారు చేసి, సంతృప్తికర స్థాయికి చేరుకున్నాక, తెవికీలో ప్రచురిస్తారు.
భోజన విరామం
మార్చుసుమారు 2 గంటలకు చర్చలను ఆపారు. వికీపీడియాఅ 16 వ పుట్టినరోజు సందర్భంగా కేకు కోసారు. ఆ తరువాత భోజనం. భోజనాలయ్యాక 2:45 నిమిషాలకు సమావేశం తిరిగి మొదలైంది.
రాజశేఖర్
మార్చు- కొత్త వాడుకరులను బెదరగొట్టకుండా, ప్రోత్సహించాలి.
- ఫలానా వ్యాసం ఉంటే బాగుంటుందని భావించిన పాఠకులు గాని, వాడుకరులు గాని, ఆ సంగతిని తెలియజేసేందుకు ఒక కోరికల జాబితా పేజీ ఉండాలి.
- తెలంగాణ ప్రభుత్వం స్వేచ్ఛా హక్కులతో విడుదల చేసిన పుస్తకాలను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచేందుకు కృషి చెయ్యాలి. ప్రణయ్‌రాజ్ గారు ఆ బాధ్యత స్వీకరించారు.
- వికీసోర్సులో సాంకేతిక సహాయం అవసరం ఉంది. సభ్యులు అందుకు తోడ్పడాలి.
యర్రా రామారావు
మార్చు- కొత్త వ్యాసాన్ని సృష్టించే ముందు ఆ వ్యాసం ఈసరికే ఉందా అనేది వాడుకరులు చూడడం లేదు. (ఐదారు ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు)
- కొన్ని సార్లు ఇంగ్లీషు వికీ నుండి వ్యాసాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. మహా అయితే కొద్దిగా అనువాదం చేసి వదిలేస్తున్నారు. మిగతాది అలాగే ఉండిపోతోంది. తిరిగి పట్టించుకోవడం లేదు.
- ఇటీవలి మార్పులపై వాడుకరులు నిఘా పెట్టాలి. అనేక దుశ్చర్యలు జరుగుతున్నాయి. వాటిని సరిచేస్తూండాలి.
- వర్తమాన వ్యావహారిక భాషను అనుసరించి పదాంతంలో "ము" వచ్చేచోట, అనుస్వారం వాడాలి. చాలా వ్యాసాల శీర్షికల్లో కూడా అది పాటించలేదు.
- శ్రీ, గారు వంటి గౌరవ సూచికలను వాడుతున్నారు. ఇవి వికీశైలికి విరుద్ధం.
- యొక్క, మరియు వంటి పదాలు తెలుగు భాషకు సహజమైనవి కావు. వాటిని వాడకూడదు.
- ఏకవచన ప్రయోగం తెవికీ శైలి. దాన్ని కొందరు పాటించడం లేదు.
- వ్యాసాన్ని సృష్టించిన తరువాత, దాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని సృష్టించిన వారు పట్టించుకోవడం లేదు.
- నిర్వహణ మూసలు పెట్టిన వ్యాసాల్లో, తగు అభివృద్ధి పనులు చేసాక సదరు నిర్వహణ మూసలను తొలగించడం లేదు. ఉదాహరణకు, బొమ్మ కావాలి అణే మూసను పెట్టిన వ్యాసంలో, బొమ్మను చేర్చాక, ఆ మూసను తీసెయ్యాలి. కానీ కొన్ని సందర్భాల్లో అలా జరగడం లేదు.
- అయోమయ నివృత్తి పేజీలకు లింకులు ఇవ్వకుండా నివారించాలి
- వాడుకరులు ప్రత్యేక పేజీలను గమనిస్తూండాలి. అనాథ పేజీలు, అగాధపేజీలు వంటి ప్రత్యేక పేజీల్లో చేరిన వ్యాసాల విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూండాలి. అలాగే చిన్న పేజీల జాబితాను చూపించే ప్రత్యేక పేజీని కూడా గమనిస్తూండాలి.
స్వరలాసిక
మార్చుఈ మధ్య కాలంలో ఇతర వ్యాపకాల కారణంగా వికీలో అంత చురుగ్గా రాయడం లేదు. ఇకపై చురుగ్గా రాస్తాను.
ఆదిత్య పకిడె
మార్చు- వికీపీడియా ప్రచార కార్యక్రమాల్లో ఇతర వికీ ప్రాజెక్టులను కూడా ప్రచారం చెయ్యాలి.
- కొత్త వాడుకరులు వికీలో చేరాక, వారిని ఫాలో అప్ చేస్తూ ప్రోత్సహిస్తూండాలి.
ఐ మహేష్
మార్చు- ఎన్వికీలో ఉన్నట్లు తెవికీలో కూడా "డ్రాఫ్ట్" పేరుబరి ఉండాలి. వ్యాసాన్ని ఈ పేరుబరిలో సంతృప్తికరంగా తయారుచేసాక, ప్రధాన పేరుబరి లోకి తరలించవచ్చు.
- మేడారం జాతర ఫోటోల పోటీని నిర్వహిస్తాను. (ఇతర సభ్యులు దాని పట్ల సానుకూలంగా స్పందిస్తూ కొన్ని సూచనలు చేసారు)
- తెవికీ శైలి గురించి వాడుకరులు నేర్చుకునేందుకు మరింత వివరమైన వ్యాసాలు ఉండాలి.
- తెలుగు వారికి చెందిన వ్యాసాలు ఎన్వికీలో ఉన్నాయి గానీ, తెవికీలో లేవు. వాటిని తెలుగులోకి తీసుకు రావాలి.
చదువరి
మార్చు- వ్యాసాల్లోని భాష, మరీ ముఖ్యంగా అనువాద వ్యాసాల్లో, చాలా కృతకంగా, దోషభూయిష్టంగా ఉంటోంది. వాక్య నిర్మాణం కూడా సరిగా ఉండడం లేదు. అలాంటి వ్యాసాలను ప్రచురించే వాడుకరులకు ముందు తెలియజెప్పాలి. వాటిని సవరించమని కోరాలి. అయినా ఫలితం లేకపోతే, వారు రాసిన అలాంటి వ్యాసాలను తొలగించాలి.
- తెవికీ చర్చల్లో వాడుకరులు పెద్దగా పాల్గొనడం లేదు. అందరూ చర్చల్లో పాల్గొంటేనే తెవికీ పురోభివృద్ధి సాధ్యపడుతుంది.
పై అభిప్రాయాలన్నిటినీ క్రోడికరించి వికీపీడియా పేరుబరిలో ఒక పేజీలో పెట్టాలని, సమావేశానికి హాజరు కాని వాడుకరులు అక్కడ స్పందించవచ్చని, అందరి స్పందనలను పరిగణన లోకి తీసుకుని అవసరమైన విధానాలను, మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చనీ సభ్యులు భావించారు. తదనుగుణంగా తయారు చేసిన పేజీని చూడండి. అక్కడే అభిప్రాయాలూ రాయండి.
వికీపీడియా యూజర్ గ్రూప్ నిర్మాణం
మార్చురెండవ అంశంగా ఒక యూజర్ గ్రూపును ఏర్పాటు చేసుకోవాలనే విషయం గురించి చర్చ జరిపారు. దీని గురించి అధ్యయనం చేసిన పవన్ సంతోష్ గారు ఇలా చెప్పారు.
- ముందు యూజర్ గ్రూపు పరిధిని నిర్వచించుకోవాలి. అంటే - తెలుగు వికీపీడియా యూజర్ల గ్రూపా (వేరే భాషల వికీల యూజర్లు, తెలుగు వికీసోర్సు, వికీడేటా యూజర్లూ దీని కిందికి రారు), తెలుగు వికీమీడియా యూజర్ల గ్రూపా (అంటే, తెవికీ, వికీసోర్సు, విక్షనరీ వంటి అన్ని తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల యూజర్లు దీని కిందికి వస్తారు. కానీ ఇతర భాషల యూజర్లు రారు), ఆంధ్ర తెలంగాణ వికీమీడియా యూజర్ల గ్రూపా (ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని భాషల, అన్ని వికీమీడియా ప్రాజెక్టుల యూజర్లు వస్తారు. భౌగోళికంగా ఇతర ప్రదేశాల్లో ఉన్న తెలుగు వికీ యూజర్లు రారు) అనేది నిశ్చయించుకోవాలి. ఆ విధంగా గ్రూపు పేరును పెట్టుకోవాలి.
- ఆ పేరును వికీమీడియా ఆమోదించాక, దాని నీడన మనం పనులు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలను పవన్ గారు వికీపీడియా పేరుబరిలో ఒక పేజీని సృష్టించారు. వాడుకరులు అక్కడ స్పందించవచ్చు.
పుస్తక ప్రదర్శనలో తెవికీ స్టాలు
మార్చుఇది చివరి చర్చాంశం. హైదరాబాదులో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో తెలంగాణ ప్రభుత్వం, ఐఐఐటిలు సంయుక్తంగా ఒక స్టాలును నిర్వహిస్తున్నాయి. తెవికేయులు తమకు వీలైనపుడు ఈ స్టాలును సందర్శించి తెవికీ ప్రచారంలో పాల్గొనాలని సభ్యులు భావించారు. ఏవైనా సందర్భాలను పురస్కరించుకుని రెండు సార్లు ఈవెంట్లు జరపాలని సభ్యులు భావించారు. అందులో ఒకటి, ప్రణయ్‌రాజ్ 1200 రోజుల్లో 1200 వ్యాసాలు పూర్తి చేసిన సందర్భంగా ఆయన్ను సన్మానించాలి. రెండవది పవన్ సంతోష్ గారు సమావేశం మరుసటి రోజున (డిసెంబరు 23 న) సూచించారు. తెవికీలో తెలంగాణ గ్రామాల వ్యాసాలను అభివృద్ధి చేసిన ప్రాజెక్టు గురించి ఒక ఈ-పుస్తకాన్ని తయారు చేసి విడుదల చెయ్యడం.
ఈ చర్చతో సమావేశం ముగిసింది. సభ్యులంతా ఫోటోలు దిగారు. జ్ఞాపికగా తెచ్చిన కప్పును సభ్యులందరికీ కశ్యప్ గారు అందించారు. ఆ తరువాత సభ్యులంతా నిష్క్రమించారు.
చిత్రమాలిక
మార్చుతెవికీ పదహారేళ్ళ పండగ నాటి ఫోటోలు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
| ||||||||
ఫోటోలు తీసినవారు: ఐ.మహేష్, శశి |