శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్

(శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ నుండి దారిమార్పు చెందింది)

అలనాటి మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడం విజయా పిక్చర్స్ వారి ప్రత్యేకత. కథ కంటే కథనం మిన్న. ఇంటిల్లిపాదీ చక్కగా నవ్వుకునే చిత్రాలకి ట్రేడ్ మార్క్ విజయా సంస్థ. ఆ కోవలో వ్రయత్నమే శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్. పొట్ట కోసం ఒక నిరుద్యోగి పడే పాట్లు ఈ చిత్ర కథాంశం.

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం కృష్ణ,
జయప్రద,
పద్మనాభం,
జగ్గయ్య,
కాంతారావు,
జి.వరలక్ష్మి,
అల్లు రామలింగయ్య,
రమాప్రభ
సంగీతం పెండ్యాల
నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిత్రకథ

మార్చు

బి.ఎ. పాసైన మాధ్యూస్ (కృష్ణ) అనే ఒక యువకుడు పొట్ట పట్టుకొని పట్నం వస్తాడు. తన స్నేహితుడు (పద్మనాభం) సాయంతో ఒక బ్రాహ్మణ హొటల్ లో ముత్తయ్య అనే పేరుతో సర్వర్ గా పనికుదుర్చుకుంటాడు. ఆ హోటల్ పేరే "శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్". ఆ హొటల్ యజమాని శేషాద్రి (జగ్గయ్య) భార్య చని పోయింది. యుక్త వయస్సుకు వచ్చిన కుమార్తె రాజేశ్వరి (జయప్రద) ఉంది. నాయనమ్మ (వరలక్ష్మి) మనవరాలిని మరీ సాంప్రదాయ పధ్ధతిలో పెంచుతుంది. సర్వర్ గా సరిగా పని చేయలేకపోడంతో పని నుంచి తొలగిస్తాడు యజమాని. యజమాని కూతురు మాటని కాదనడని తెలిసి ఆమె దగ్గర హృదయ విదారకమైన కథ చెబుతాడు. దానికి కరిగి పోతుంది ఆమె. వేరే పని ఇయ్య లేక కూతురుకు ఇంగ్లీష్ చెప్పే పనికి కుదురుస్తాడు యజమాని. నాయనమ్మ వరస కలిపి ఇద్దరికీ పెళ్ళి చేయాలని యోచిస్తుంది. ఈ తమషా సంఘటనల మధ్య శేషాద్రి కూడా హిందువు కాదని, క్రిస్టియన్ అని బ్రతుకు తెరువు కోసం ఇరవై సంవత్సరాల క్రితం మతం దాచి బ్రాహ్మణ కాఫీ హొటల్ ప్రారంభించేడని తెలుస్తుంది. నాయక, నాయికల వివాహంతో కథ సుఖాంతమవుతుంది.

కథలో తొంగి చూసే హాస్యం కథనంలో లోపించింది. దానితో ప్రేక్షకుల ఆశించిన రీతికి సినిమా చేరలేక పోయింది. దానితో చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు. చాలా గొప్ప చిత్రం కాక పోవచ్చు కానీ కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రం.

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
రాకోయీ అనుకోని అతిథి కాకి చేత కబురైనా పంపక పాలగుమ్మి పద్మరాజు పెండ్యాల పి.సుశీల
నా పేరు బికారి నా దారి ఎడారి దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల ఎస్.పి.బాలసుబ్రమణ్యం
ఏటిగట్టు పోలేరమ్మా నిన్ను ఏటేటా కొలిచేనమ్మో కొసరాజు పెండ్యాల ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, బృందం
ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా దాశరథి పెండ్యాల ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట అప్సరసలే పేరంటాలు దేవతలే పురోహితులంటా దాశరథి పెండ్యాల పి.సుశీల

మూలాలు

మార్చు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.