షాజహానా
షాజహానా సమకాలీన తెలుగు ముస్లింవాద కవయిత్రిగా ప్రసిద్ధురాలు. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
విశేషాలు
మార్చుఈమె 1974, జూన్ 14న ఖమ్మం జిల్లా, పాల్వంచ గ్రామంలో దిలావర్ యాకూబ్ బీ దంపతులకు జన్మించింది. తెలుగులో ఎం.ఎ. చదివింది. తెలుగులో ముస్లింవాద సాహిత్యం అనే అంశంమీద పరిశోధన జరిపి పి.హెచ్.డి పట్టాను పొందింది. ఈమె తండ్రి దిలావర్, భర్త స్కైబాబ ఇరువురూ రచయితలే. ఈమె రంగవల్లి మెమోరియల్ కథా అవార్డు, సంస్కృతి పురస్కారం, రంగినేని ఎల్లమ్మ అవార్డు అందుకున్నది. భారత ప్రభుత్వం తరఫున గౌరవ అతిథిగా ఫ్రాంక్‌ఫర్ట్ బుక్‌ఫేర్ (జర్మనీ) కి వెళ్లింది. మాస్కో బుక్‌ఫేర్ (రష్యా) లో కవితా పఠనం గావించింది.[2]
రచనలు
మార్చుఈమె కవితలు, కథలు, వ్యాసాలు పలు పత్రికలలో ప్రకటించింది. ఈమె రచనలు ఇంగ్లీష్, జర్మన్, హిందీ, కన్నడ భాషలలోకి తర్జుమా అయ్యాయి.
రచనల నుండి ఉదాహరణ
మార్చుకాలీ దునియాఁ
బుర్ఖా వేసుకున్నప్పుడు
ప్రపంచం నల్లగ అవుపించేది
బుర్ఖాలను చీల్చేసి...
శరీరాల్తో సహా తగలబెడ్తున్నప్పుడు
బిత్తరపోయిన ప్రాణాలకు ఒక్కసారిగా
ఈ దునియాఁ మొత్తం
నల్లగా... ఎండిన రక్తం ముద్దలా
ఇప్పుడు బుర్ఖా వేసినా వేయకున్నా
ప్రపంచమంటే -
కాషాయశిల...!
కత్తి మొన...!
పొడుచుకొచ్చిన పురుషాంగం...!
ఇంత క్రూరత్వం దాగుంటుందనే గదా
మమ్మల్ని బైటికి రానివ్వడం లేదంటున్నారు
ఈ భయానక నిజం స్వప్నమైతే
కళ్ళు... బూసుల్ని దులుపుకున్నట్లు తుడిచేసేవి
ఇంతింతగా మోసపోవటం అబద్ధమైతే...
ఖుషీలో మునిగి తేలేవి... మనసులు!
కానీ నిజం నిప్పై కాల్చింది
నీరై ముంచింది
కాషాయమై...
దింపుడు గళ్ళెం లేకుండా చేసింది!
ప్రపంచం 'మాయిపొర'లో ఇరుక్కుని
ఉమ్మనీరు తాగి
ఇవ్వాళ కాషాయం కక్కుతోంది...!
మా కాళ్ళ సందుల్లోంచొచ్చి
మమ్మల్ని బరిబత్తల పరిగెత్తించారే...
నీ ఇంట్లో ఆడది కూడా
రహస్యంగా మా కోసం కన్నీళ్ళు కార్చి ఉంటుంది!
మగ నాకొడుకుల ఊపిరి
బయటికి రాకుండా నొక్కేస్తే
పీడా పోతుందని ఒక్కసారైనా
మీ అమ్మ అనుకునే ఉండాలి
ఈ మగజాతంతా ఇంతకంటే
ఏం చేయగలరు?
స్త్రీకి పురుషుడి నగ్నత్వం ఎంత పాతో
అరాచకం
అమానుషం
క్రూరత్వం అంతే పాత!
సృష్టికి ఒక్కరే తల్లీ తండ్రీ అని నమ్ముతున్న దాన్ని
నీకు నాకు మధ్యా రక్త సంబంధం లేదంటావా?
గుండెల్ని పెకిలించి
పొట్టలు చీల్చి
యోనుల్లో ఆయుధాలు పొడిచి
ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకొనుండొచ్చు
కానీ 'నన్ను' హత్య చేయలేవు
అనంతంగా సాగే జీవనదిని
నేను బతకడమే కాదు
నిన్ను పుట్టించి బతికించేది నేనే...!
అయినా
స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదెవరు?
ఎప్పటికీ ప్రపంచం
నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే...!
బహుమతులు - పురస్కారాలు
మార్చు- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 March 2017. Retrieved 18 April 2017.
- ↑ అక్షర శిల్పులు - సయ్యద్ నశీర్ అహ్మద్ - పేజీ:143