సప్తర్షులు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హిందూ పురాణాల ప్రకారం సంప్రదాయాలను సంస్కృతిని కాపాడేందుకు బ్రహ్మ చే నియమించబడ్డ పురాణ పురుషులు
సప్తర్షులు ఎవరు
మార్చుఅసలు వీరు ఆకాశమందు గొప్ప వెలుగు గల చుక్కలవలె మనకు కనబడుచున్నారు. ఈ వెలుగునకే దేవభాషయందు "జ్యోతి" అనుపేరు ఉంది. ఇట్టి జ్యోతిస్సులను గూర్చి విచారించు శాస్త్రమే జ్యోతిశ్శాస్త్రము. అందులో వీరి పేర్లు అనేక విధములుగా వర్ణింపబడినవి. వీరు ఒక మన్వంతరము కాలము అనగా 71 మహాయుగముల కాలము వరకు మాత్రమే ఒక నియతమార్గమునందు తిరుగుదురు. ఆకాలముపైన వీరు పరమేశ్వరునిలో లీనమవుదురు. తిరిగి మరియొక మండల స్థానమునకు వచ్చి మరియొక మన్వంతరకాలము ఇట్లే సంచరించెదరు. ఈ అభిప్రాయము మత్స్య పురాణములో బాగుగా విచారించబడింది. అందులో మొదటి స్వయంభువు మన్వంతర కాలములో సప్తర్షుల పేర్లు మన సంప్రదాయం ప్రకారం చెప్పబడిన ఏడుగురు ఋషులే ఏడు నక్షత్రాలుగా ఆకాశంలో వెలుగుతున్నారు. ఆ సప్తర్షులు...
- మరీచి, # అత్రి మహర్షి, # అంగిరసు, # పులస్త్యుడు, # పులహుడు, # క్రతువు, # వశిష్ఠుడు
రెండవదగు స్వారోచిషమన్వంతరములో వారు
- దత్తుడు *నిశ్చ్యవనుడు * స్తంబుడు * ప్రాణుడు * కశ్యపుడు * ఔర్యుడు * బృహస్పతి అను వారులు సప్తర్షులు.
మూడవదగు ఉత్తమ మన్వంతరములో
- కౌకురుండు * దాల్భ్యుడు * శంఖుడు * ప్రవహణుడు * శివుడు * స్మితుడు * సస్మితుడు అనువారులు సప్తర్షులు.
నాలుగవదగు తామస మన్వంతరములో
- కలి * పృధువు * అగ్ని * అకసి * కపి * జల్పుడు * ధీమంతుడు అనువారలు సప్తర్షులు.
అయిదవదగు రైవత మన్వంతరములో
- దేవబాహువు * సుబాహువు * పర్జన్యుడు * సోమపుడు * ముని * హిరణ్యరోముడు * సప్తాశ్వుడు అను వారలు సప్తర్షులు.
ఆరవదగు చాక్షుష మన్వంతరములో
- భృగువు * సుధాముడు * విరజుడు * సహిష్ణువు * నాధుడు * వివస్వానుడు * అతినాముడు అనువారలు సప్తర్షులు.
ఏడవదగు ప్రకృతమందు జరుగుచున్నది అగు వైవస్వత మన్వంతరములో
అనువారలు సప్తర్షులు.
కాని, జ్యోతిశ్శాస్త్రమునకును, పురాణమునకును ప్రకృతమందలి సప్తర్షి మండలములోని వారల పేర్లు విషయములో భేదము కనిపిస్తున్నది. ఇందుకు ప్రమాణము మహాభారతంలోని ప్రామాణిక శ్లోకం (శాంతిపర్వం 340-69,70)
- మరీచిరంగిరాస్చాత్రిః పులస్త్యః పులహః క్రతుః
- వశిష్ఠ ఇతి సప్తైతే మానసా నిర్మితాహి తే
- ఏతే వేదవిదో ముఖ్యా వేదాచార్యాశ్చ కల్పితాః
- ప్రవృత్తి ధర్మణశ్చైవ ప్రాజాపత్యే చ కల్పితాః
- మరీచి * అత్రి * అంగిరసు * పులస్త్యుడు * పులహుడు * క్రతువు * వశిష్ఠుడు ఈ పేర్లు మొదటిదగు స్వాయంభువు మన్వంతరము లోని సప్తర్షుల పేర్లతో సరిపడినవి.
అదియుకాక సప్తర్షుల పేర్లు వివిధ గ్రంథాలలో స్వల్పమార్పులతో కనుపిస్తాయి. "శతపథ బ్రాహ్మణము", "బృహదారణ్యకోపనిషత్తు" (2.2.4) లలో అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు సప్తర్షులని చెప్పబడింది. కృష్ణ యజుర్వేదం (సంధ్యావందన మంత్రం) లో అంగీరసుడు, అత్రి, భృగువు, గౌతముడు, కశ్యపుడు, కుత్సుడు, వశిష్ఠుడు సప్తర్షులని చెప్పబడింది.
సప్తర్షుల లక్షణాలు
మార్చుసప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14) లో ఇలా చెప్పబడినవి - దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ ఏడు గుణములు గల మహర్షులు "సప్తర్షులు"గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.
వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.
మరీచి
మార్చుఇతడు భగవంతుని అంశావతారము అంటాఱు. ఇతనికి అనేకమంది భార్యలున్నారు. వారిలో "సంభూతి" అనే ఆమె ముఖ్యురాలు. ఆమె దక్ష ప్రజాపతికి అతని భార్య ధర్మవ్రత యందు జన్మించింది. మరీచి మహర్షి అధిక సంతానవంతుడు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే.
అంగిరసుడు
మార్చుఇతడు అసాధారణ ఆధ్యాత్మిక తేజో సంపన్నుడు. ఇతనికి పెక్కురు భార్యలున్నారు. వారిలో ముఖ్యులు సురూప (మరీచి కుమార్తె), స్వరాట్టు (కర్దముని కూతురు), పథ్య (మను పుత్రిక). సురూపకు బృహస్పతి (కొన్ని చోట్ల శుభ అనే భార్యయందు అని ఉంది), స్వరాట్టుకు గౌతముడు, వామదేవుడు మొదలగు ఐదుగురు పుత్రులు, పథ్యకు విష్ణు మొదలగు మువ్వురు పుత్రులు జన్మించారు. అగ్ని పుత్రిక యైన ఆత్రేయ యందు అంగిరసులు జన్మించారు.
అత్రి
మార్చుఇతను దక్షిణ దిశకు చెందినవాడు. మహాపతివ్రతయైన అనసూయ (కర్దమ, దేవహూతుల కూతురు, కపిలుని చెల్లెలు) ఇతని ధర్మపత్ని. సీతారాములుతమ వనవాస కాలంలో అనసూయ, అత్రిల ఆతిథ్యం స్వీకరించారు. ఈ దంపతులకు త్రిమూర్తుల అంశతో ముగ్గురు పుత్రులు - దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు - జన్మించారు.
పులస్త్యుడు
మార్చుఇతడు మహాధర్మపరుడు, తపస్వి, తేజస్వి, యోగశాస్త్ర నిష్ణాతుడు. ఒకమాఱు పులస్త్యుని అభ్యర్థన మేరకు పరాశరుడు రాక్షస సంహారార్థం చేసే యాగం ఆపేశాడు. అందుకు ప్రసన్నుడై పులస్త్యుడు పరాశరుని సకల శాస్త్రప్రవీణునిగా చేశాడు. పులస్త్యుని భార్యలు సంధ్య, ప్రతీచి, ప్రీతి, హవిర్భువు. దత్తోలి, నిదాఘుడు, విశ్వ వసు బ్రహ్మ మొదలగువారు పులస్త్యుని కుమారులు. దత్తోలి అగస్త్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనువారు విశ్రవసుబ్రహ్మ కుమారులు.
(కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు విశ్రవసుని కుమారులని ఆంటారు. ఒకసారి సరిచూడవలసినది)
పులహుడు
మార్చుఇతడు మహా ప్రభావశాలి, జ్ఞాని. సనందన మహర్షి వద్ద దివ్యజ్ఞానము పొంది, దానిని గౌతమునికి అందించెను. దక్ష ప్రజాపతి కుమార్తె క్షమ, కర్దముని కుమార్తె గతి అనువారు పులహుని భార్యలు.
క్రతువు
మార్చుఇతడు గొప్ప ఆధ్యాత్మిక తేజస్సంపన్నుడు. కర్దముని పుత్రిక క్రియ, దక్షుని పుత్రిక సన్నతి ఇతని భార్యలు. ఇతని వలన వాలఖిల్యులు అని పేరు పొందిన 60 వేల మంది ఋషులు జన్మించారు. వీరు సూర్యుని రథమునకు అభిముఖంగా నడచుచుందురు.
వశిష్ఠుడు
మార్చుఇతడు సూర్యవంశ ప్రభువుల పురోహితుడు. అష్టసిద్ధులు గలవాడు. సనాతన ధర్మమునెరిగినవారిలో ముఖ్యుడు. మహాసాధ్వి అరుంధతి ఇతని ధర్మపత్ని. వసిష్ఠుడు శ్రీరామునకు బోధించిన తత్వజ్ఞాననము యోగవాశిష్ఠము అని ప్రసిద్ధి పొందినది.
ఖగోళ నక్షత్ర సముదాయం
మార్చుఖగోళ పరిభాషలో Big Dipper (Ursa Major) నక్షత్రసముదాయంలో చెప్పబడే తారల పేర్లు:
భారతీయ నామం |
Bayer Desig |
పాశ్చాత్య నామం |
---|---|---|
క్రతు | α UMa | Dubhe |
పులహ | β UMa | Merak |
పౌలస్త్య | γ UMa | Phecda |
అత్రి | δ UMa | Megrez |
అంగీరస | ε UMa | Alioth |
వశిష్ఠ | ζ UMa | Mizar |
మరీచి | η UMa | Alkaid |
"వశిష్ఠ" నక్షత్రానికి ప్రక్కన తక్కువ కాంతితో కనిపించే జంటనక్షత్రం పేరు "అరుంధతి" (Alcor/80 Ursa Majoris).
వనరులు
మార్చు- "గీతా తత్వవివేచనీ వ్యాఖ్య" - రచన:జయదయాల్ గోయంగ్‌కా; అనువాదం:డా.ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వెంకటరామయ్య; ప్రచురణ: గీతాప్రెస్, గోరఖ్‌పూర్