సీమ కథలు -సింగమనేని నారాయణ సంకలనసారథ్యంలో వెలువడిన కథల సంపుటం.పద్దెనిమిదిమంది రాయలసీమ కవుల కలాలనుండి జాలువారిన కథలనుండి, ఆణిముత్యాలవంటి కథలను ఏరి, కూర్చి ప్రచురించిన కథలసంకలనం ఈపుస్తకము.తెలుగు కథాసాహిత్యానికి దాదాపు వందేళ్లచరిత్ర ఉంది. పలుతెలుగుపత్రికలు కథలకు ప్రోత్యాహంయిస్తూ, ప్రచురిస్తున్నాయి.అయినప్పటికి ప్రస్తుతం నవలలకే అగ్రతాంబులం అందుతున్నది. వారపత్రిక లలోనవలలే సిరియల్లుగా వస్తున్నాయి.తెలుగునవలలనే ప్రచురణకర్తలు/పుస్తక ప్రకాశకులు ఎక్కువసంఖ్యలో అచ్చువేస్తున్నారు.అయితే అరవైదశకంలో ప్రముఖకథారచయితల కథలను ప్రచురణకర్తలు సంకలానాలుగా అచ్చువేశారు. ఆతరువాత వచ్చిన ప్రేమ, సైంటిఫిక్, క్షుద్రశక్తులు, థ్రిల్లరు, సస్పెన్సు నవలల ప్రచురణ ప్రభంజనంలో కథలపుస్తకాల ప్రచురణ కొద్దిగా మందగించినమాట నిజం.అయితే ఈమధ్యకాలంలో పాఠకుల పఠనాభిరుచిలో మార్పువచ్చింది.నిజాల్నిదాచి, అవాస్తవలోకాన్నిరంగుటద్దాలలో చూపించి, పాఠకులను అవాస్తవభ్రమల ప్రపంచంలో విహరింపచేసే పైరకపు నవలల పైఆసక్తితగ్గి, ఇప్పుడిప్పుడే జీవితంలోనిసంఘటనలను, వాస్తవాలను పలుకోణాలనుండి సృజిస్తూ, చుట్టూజరుగుతున్న ఘోరాలను, అన్యాయలను, అక్రమాలను, కఠోర జీవిత, జీవన నగ్నసత్యాలను, ఎత్తిచూపిస్తూ కళ్ళకుకట్టేటట్లు రాస్తున్నకథలను యిప్పుడు మక్కువగా చదువుచున్నారు.క్రమేపి కథాసంకలనపుస్తకాలకు ఆదరణపెరుగుతున్నది. ఈమార్పు హర్షించతగినదే.

సీమ కథలు పుస్తక ముఖచిత్రం

తొలిమాట మార్చు

సీమ కథలు పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు వారు మొదటిసారిగా1992లో ప్రచురించారు. మలిముద్రణ1994లో జరిగింది. ఆతువాత మూడవముద్రణ 2010 లో. పుస్తకంలోని కథల సంకలనం: రాయలసీమ రచయిత'సింగమనేని నారాయణ'. ఇందులో మొత్తం పద్దెనిమిదికథలున్నాయి, పద్దెనిమిది రచయితలు తమఅనుభవాలను, వాస్తవ గ్రామీణుల యధార్దవ్యధలను, వెతలను పాఠకుల ముందించిన, బతుకు అనుభవాలను పిండిరాసిన కథలివ్వి.ఈపుస్తకంలోని కథలన్ని అంతకుముందే వివిధపత్రికలో అచ్చయిన కథలు. తెలుగురాష్ట్రంలో మిగతాప్రాంతాలకన్న ఒకప్రత్యేకమైన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవనజీవితమున్న గడ్డ-సీమగడ్డ. సీమప్రాంత గ్రామీణజనజీవనం వ్యవసాయంతో ముడివడివున్నది.భారతదేశంలో అతితక్కువ వర్షపాతమున్నప్రాంతంగా నమోదయినప్రాంతం'రాయలసీమ'గడ్డ. అందులో అనంతపురంజిల్లా, దేశంలోనే తీవ్రవర్షాభావంవున్న రెండోజిల్లా.ఇక్కడ ప్రాణాలు నిలవలన్నా, పోవాలన్నా'నీళ్ళే'కారణమంటే, నీళ్ళు పుస్కలంగాదొరికే రాష్ట్రంలోని ఇతరప్రాంతాలవారు విస్తుపోతారు. అట్టిరాయలసీమ చిద్రమైన పల్లెజనుల బతుకులను పాఠకులముందుంచిన పుస్తకం-సీమ కథలు.

మలిమాట మార్చు

ఈపుస్తకంలోని పద్దెనిమిదికథలలో మొదటి ఆరుకథలు అనంతపురం జిల్లాకు, ఆతర్వాతి ఆరుకథలు కడపజిల్లాకు, కడ ఆరుకథలు చిత్తూరు జిల్లాకు సంబంధించినకథలు.ఎందుచేతనో ఈప్రచురణలో కర్నూలుజిల్లా కుచెందిన కథలకు తావుదొరకలేదు.

సంకలనంలోని కథలు-రచయితలు

కథ రచయిత రచానాకాలం
నీళ్ళు స్వామి ఆంధ్రజ్యోతివీక్లీ-1991
హైనా కె.ఎం.రాయుడు వాలిన మబ్బులు సంపుటి-1988
మన్నుతిన్న మనిషి చిలుకూరి దేవపుత్ర ఆంధ్రప్రభవీక్లి-1991
కల్లమయిపాయ శాంతి నారాయణ ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచిక-1991
రాములవారి గుడి ముందు మోహ్న ఆంధ్రజ్యోతివీక్లి-1977
అడుసు సింగమనేని నారాయణ ఇండియా టుడే-1991
కసాయి కరువు చక్రవేణు ఆంధ్రప్రభవీక్లీ-1986
గుక్కెడు నీళ్లు ఎన్.దాదా హయత్ ఆంధ్రజ్యోతివీక్లీ-1985
నమ్ముకున్న నేల కేతు విశ్వనాథరెడ్డి ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక-1982
కర్రోడి చావు తులసీ కృష్ణ ఆంధ్రజ్యోతివీక్లీ-1976
ఐదు రూపాయలు వై.సి.వి.రెడ్డి గట్టిగింజలు సంపుటి.
కొత్తదుప్పటి ఎస్.వెంకటరామిరెడ్డి ఆంధ్రప్రభవీక్లీ-1991
పాతాళగంగ కె.సభా సభాకథల సంకలనం
ఎడారికొయిల మధురాంతకం రాజారాం ఆంధ్రప్రభవీక్లీ-1986
జీవనం డాక్టరు లంకిపల్లె ఆంధ్రప్రభవీక్లీ-1986
బంగారు సంకెళ్ళు పులికంటి కృష్ణారెడ్డి ఇండియా టుడే-1991
అత్యాచారం మధురాంతకం నరేంద్ర ఆంధ్రజ్యోతివీక్లీ-1991
ప్రతిజ్ఞ మహేంద్ర ఉదయంవీక్లీ-1987

ఈసీమ కథల్లో ఏముంది? మార్చు

తాగేటందుకు గుక్కెడునీళ్లకై నెత్తిమీద, భుజాలమీద, సంకళ్లో కుండలు, కడవలు పెట్టుకొని మైళ్ళకుమైళ్ళు ఆడ, మగ, పిల్లలు అనేతేడా లేకుండ మిట్టమధ్యహన్నం, అపరరాత్రి వేళాపాలా లేకుండ నడచివెళ్ళడం ఉంది. తాగునీటికై రోజూ కొట్లాటలు, తగాదాలు, బుర్రలు బద్దలు కావటాలు, జైలుకెళ్ళడాలున్నాయి. ఇంట్లో మంచినీళ్లయిపోతే చెంబుపట్టుకెళ్ళి ఇంటీంటికి తిరిగి అడుక్కొవడంవుంది. పొలంలోనాట్లు వేసి, మబ్బులేలేని ఆకాసం వైపుఆశగా వానచినుకుకై చూసే గాజుకళ్ళబక్కరైతుల బతుకులున్నాయి. కరువొస్తే, తమకుటుంబంలో ఒకరిగాచూసుకొనే గొడ్లకు పిడెకెడు మేతలేక, కొనేసత్తువలేక, మనసు రాయి చేసు కొని కసాయివాళ్లకు అమ్మే పల్లెజీవుల బతుకులున్నాయి. బావుల్లో నీళ్ళుచాలక, కరెంటురాక పంపులు పనిచేయ్యక, లోఒల్టెజి కారణంగా మోటార్లుకాలిపోయి, పైర్లు ఎండిపోతుంటే చూడలేక ప్రాణాలు గిజగిజ లాడుతుంటే, పుట్టినప్పటినించి తామునమ్ముకున్న నేలతల్లిఒడిలోనే కనులుమూసిన ఛిద్రమైన రైతు వ్యధలున్నాయి.

రెక్కలుముక్కలుచేసుకొని, కుటుంబంలోని వారంత తమ స్వంతపొలాల్లోనే కూలీలుగా మారి పంటపండిస్తె, వడ్దివ్యాపారులు, ఎరువులు, నాసిరకంవిత్తనాలు, నకిలీపురుగుల మందులు అప్పుగాయిచ్చిన ఆంగడి వాళ్ళు, పంటకొనటానికి వచ్చిన దళారులు, కొనుగోలుదారులు రాబందులవలె చుట్టూచేరి, రైతు కష్టఫలాన్నిదోచుకొని రైతును నడిబజారులో బిచ్చగాడిలా నిలబెట్టిన నిజాలున్నాయి.నగరంలో విలాసవంతమైన జీవితానికై హైటెక్కు వ్యభిచారం చేస్తుంటే, ఒకపూటనైన పస్తులున్న పిల్లలకడుపునింపెటందుకు "ఆతప్పు"చేస్తె తప్పెముందనుకునే కూలిపనిచేసె చెంగమ్మ లాంటి ఆడబ్రతుకులున్నాయి.

అందినకాడికి అప్పుచేసి, తాళిబొట్టుతో సహ అయినకాడికి అన్నీ అమ్మి, బావి త్రవ్విస్తే, అందులో బండపడి, తమబతుకులు బండలై, ఆబావిలోనే శవాలైన చితికిన రైతుబతుకులున్నాయి. పూలమ్మినచోట కట్టెలమ్మలేక పక్కజిల్లాలకు, కూలీలగా, ప్యాక్టరిలలో కార్మికులుగా వెళ్లిన జనుల వుదాంతాలున్నాయి.

రైతులబ్రతులు బాగుపడితే తమ ఆధిపత్యంసాగదని వారిని అలాగేవుంచే రాజకీయవేత్తలు, కుళ్ళు రాజకీయాలు ఉన్నాయి. ఇవ్వని వెరశి రాయలసీమ ప్రజల బడుగు బ్రతుకులు.

కడమాట మార్చు

కథలగురించి టూకీగా

నీళ్ళు:కథపేరింటేనే కథాంశమెమిటో తెలిసిపోతున్నది. తాగేనీళ్ళను పొందెటందుకై మధ్యతరతి సగటుజీవుని పోరాటం ఈ కథా వృత్తాంతం. బిందెడునీళ్ళకై కొట్టుకున్నవాళ్ళు బెయిల్‍ఇప్పించెవారులేక జైలుగదిలో అల్లాడుతుంటే, రాజకీయ లబ్ధికై నీళ్ళపైపులు బద్దలుకొట్టిన వాళ్ళు బయట స్వేచ్ఛగా తిరుగటం ఈకథలోని కొసమెరుపు.

హైనా:నారాయణప్ప మూడెకరాల సేద్యంచేస్తున్నాడు. బోరుంది, పంపుంది. కాని కరెంటే లేదు ఏప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్దితి. రోజంతా చేనికాడే కరెంట్ రాకడకై ఎదురు చూపులయ్యే. పులిమీద పుట్ర లాగా వూరిలోకి హైనా వచ్చి పిల్లలనెత్తుకుపొతున్నదన్నవార్త. హైనాను చంపేటందుకు వూరిజనమంతా ఒక్కటైనారు.ఈ సందర్భంలో సూరన్న నారాయణతో అంటాడు...

"పేదరికాన్ని ఆసరాచేసుకునే ప్రభుత్వాలూ మంత్రులూ పుట్టుకొస్తారు. పేదరికం నశిస్తే ఈవ్యవహరమే వుండదు. ఏదేశంలో నయినా ఇంతే జరిగేది. అందుకే ప్రభుత్వాలు పుట్టాక అవి వశించకుండా వుండే పనులే చేస్తాయి. బ్యాంకుల అప్పులూ, వడ్డిలూ, సబ్సిడీలూ, చిల్లర సహాయాలూ, అన్నీఅవే.మనల్ని కలిసికట్టుగా చేరకుండా పేదరికాన్నిపూర్తిగా తొలగించకుండా-అట్లాచావకుండా ఇట్లాబతక్కుండా శవల్లా నడిపిస్తాయి. కాబట్టే హైనాను ఎదుర్కొటానికి కలిసినట్లుగా కరువును ఎదుర్కోటానికి కలవం. పిల్లలకు భవిష్యత్తు లేకుండా హైనాచేస్తే, ఎవ్వరికి భవిష్యత్తు లేకుండా కరువు చేస్తున్నది. ఎన్నోవేలరెట్లు హైనా కన్న కరువు భయంకరమైనా ఎందుకు అడ్దుకోలేమో ములాన్ని ఆలోచించం.."అంటాడు.

ఆతరువాత హైనా కంటబడగానే నారాయణప్పఆవేశంగా, కసిగా హైనాను ముక్కముక్కలుగా నరికి చంపుతాడు. నారాయణప్పఆవేశం, కసి హైనామీదకాదు.. తరతరాలుగా తమను కరువులో వుంచుతున్న ముంచుతున్న వ్యవస్దమీద. .ప్రభుతమీద.

మన్నుతినమనిషి: అనంతపురంజిల్లాలోని గ్రామం చెన్నప్పది.పదెకెరాల పొలమున్నది. కరువుపుణ్యాన ఈమధ్యకాలంలో పంట చేతికొచ్చిందిలేదు. చెన్నప్పకొడుకు రామచంద్రడు తనపెల్లాం ఒబులమ్మ, ఇద్దరుపిల్లలతో బళ్ళారికొచ్చి, పెళ్లంతోపాటు బెల్దారికూలీ పనికెల్లుతున్నాడు. ఉండేగుడిసెకు నూరురూపాయలు బాడిగె, ఊళ్ళొని తండ్రికి వందరూపాయలు పంపాలె. జరగడం కష్టంగా ఉంది. అందుకే ఒబులమ్మ ఊర్లోని పొలాన్ని అమ్మేసి ఇక్కడే జాగాకొని గుడెసె వేసుకొంటె, బాడిగె డబ్బులు మిగులుతాయి. మామను ఇక్కడికే తెచ్చి వుంచుకుందామని రోజు పోరు.మొదటపెళ్ళం మాటలు కొట్టిపడెసిన, చివరికి వూరికొచ్చి, రాత్రి తండ్రికి అసలు విషయం చెప్తాడు. చెన్నప్ప ఒప్పుకోడు. ఈనాడైతే కరువొచ్చినమాట నిజమైన, ఇప్పటివారకు ఆధుకున్నది ఆభూమేకదా అంటాడు. అమ్మకం విషయమై తండ్రి కొడుకులకు గట్టీగా గొడవ అవుతుంది. అలిగిన చెన్నప్ప కోపంగా బయటికెల్తాడు. కోపంతగ్గిన రామచంద్రుడు, ఓబులమ్మ రాత్రంతా బెంగగా చెన్నప్పకై ఎదురు చూస్తుంటారు. వుదయాన్నే అందరు తోటల్లో, చేలల్లోని బావుల్లో వెదుకుతారు.చివరికి తనపొలంలో.....

వాడిపోయిన వేరుశనగ చేలో, తల్లిఎదమీద అదమరిచి నిద్రిస్తున్న పసివాడిలా, నిర్విచారంగా నిర్మలంగా ఉంది చెన్నప్ప శవం.రామచంద్రుడు చేష్టలుడిగి తండ్రిశవం మీద పడిపోయినాడు.

కల్లమయిపాయ:సీమలో వ్యవసాయాన్ని నమ్ముకున్నరైతుకు కరువొచ్చి పండకపోతే 'అప్పులు', అదృష్టంబాగుండి పంట పండితే 'పస్తులు' అనేది అక్షరసత్యం. విత్తనాలకు ఎరువులకు, మందులకు, ఇంటి అవసరానికి అప్పులిచ్చినవాళ్ళు పంటకళ్లంలో నుండగానే కాకుల్ల వాలిపోతారు. పంట దిగుబడి ఇరవైమూటల వడ్లు వస్తే, కళ్లంనుండి బండి ఇంటిపట్టుకు చేరేటప్పటికి మూడు మూట లైయ్యాయి. ఆమూడు మూటలవడ్లతోటే ఆఎడాదింత కుటుంబం బతకాలా?.

"https://te.wikipedia.org/w/index.php?title=సీమ_కథలు&oldid=2141898" నుండి వెలికితీశారు