సుజాత (పత్రిక)
సుజాత సచిత్ర సారస్వత మాసపత్రిక తొలి సంచిక 1927 జనవరిలో వెలువడింది. హైదరాబాదు నుండి పసుమాల నృసింహశర్మ సంపాదకత్వంలో ఈ పత్రిక వెలువడింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రభృతులు ఈ పత్రిక నిర్వహణలో పాటుపడినారు. “త్రివర్ణ చిత్రములు, వాజ్మయ విషయిక విమర్శనలు, మహాకవుల జీవితములు, మనోరంజకములగు కథలు, నాటకములు, హృదయానందకరములగు పద్యములు, శాస్త్రీయ పరిశోధనా వృత్తాంతములు, ఆంధ్రదేశమునకు సంబంధించిన అముద్రిత శాసనములు, ఉత్కృష్ట ఆంధ్రేతర రచనల అనువాదములు, ముఖ్యముగా మహారాష్ట్ర, హిందీ, ఉర్దూ, ఫారసీ కవిత్వ విశేషణములు మున్నగునవి పేరుబడసిన పండితులచే వ్రాయింపబడి, ఉత్తమరీతిన ముద్రింపబడి ప్రకటింపబడును” అని ఈ పత్రిక ప్రకటించుకుంది. “ఈ సుజాతయు ఆంధ్రులయాడుబిడ్డగా ‘తెలంగాణ’మందు పుట్టినది. ‘సుజాత’ అన్వర్థయై సోదరాంధ్రుల కీర్తిభాగ్యములకు పెంపు తెచ్చునని విశ్వసించుచున్నాము.యుగాంతరముల నుండి ప్రవహించుచున్న ఆంధ్రసభ్యత భిన్న భిన్న నాగరకతల తోడునీడలలో మెలగి నేటికందిన విలక్షణ జీవితము ప్రదర్శించుటయే సుజాత యొక్క ప్రధాన సుభాషితము” అని మొదటి సంచికలోని స్వవిషయములో సంపాదకుడు తెలిపినాడు. ఈ పత్రిక 1940వరకు అత్యున్నత ప్రమాణాలతో నడిచింది. సురవరం ప్రతాపరెడ్డి, మల్లాది రామకృష్ణశాస్త్రి, గుడిపాటి వెంకటచలం, భాస్కర రామచంద్రరావు, బూర్గుల రామకృష్ణారావు,శేషాద్రి రమణ కవులు, ఉమర్ అలీషా,మాడపాటి హనుమంతరావు, సిరిగురి జయరావు, ఒద్దిరాజు సోదరులు మొదలైన వారి రచనలు ఈ పత్రికలో కనిపిస్తాయి. ప్రాచీనార్యులలో వర్ణ వ్యవస్థ(వ్యాసము), చండ భార్గవము(నాటిక), అదృశ్యశక్తి (కథ), నటి (కథ), ప్రేమపూజ(కథ), జరిగిన కథ(కథ),లండన్ విద్యార్థి(కథ),రక్తమూల్యము (కథ), ఆదిలక్ష్మి(కథ), విపరీత సాహసము (కథ) మొదలైన రచనలు ఈ పత్రికలో ప్రకటించబడ్డాయి.
తిరిగి ఈ పత్రిక వికృతి నామ సంవత్సరం శ్రావణ మాసానికి సరియైన 1950, ఆగస్టు నెలలో గడియారం రామకృష్ణశర్మ సంపాదకత్వంలో పునరుద్ధరింపబడి మూడు సంవత్సరాలు నడిచింది. రెండవసారి ప్రారంభమైన ఈ పత్రిక తొలి(?) సంచికలో సంపాదకుడు ఈ విధంగా నివేదనము చేశాడు.“నాటి ‘సుజాత’ పోకడలు ఆదర్శనీయములు. ఆ గౌరవము చేతనే ఆ పేరును గ్రహించితిమి. ఆ స్థాయిని అందుకొనగలిగినచో కృతార్థులమయ్యెదము. సంస్కృతి ప్రచారము, ఆంధ్రుల అభ్యుదయ వికాసములే మా పరమ లక్ష్యములు.సాహిత్యము, చరిత్ర, విజ్ఞానములకు సంబంధించిన రచనలకు ప్రాధాన్యత ఒసగబడును. సరళములై, సుబోధకములై ఉన్న ఉత్తమ రచనలకు స్వాగతము పల్కెదము”
1950లో పునఃప్రారంభమైన పత్రికలో అంబటిపూడి వెంకటరత్నం, అనుముల సుబ్రహ్మణ్యశాస్త్రి, పొట్లపల్లి రామారావు, పల్లా దుర్గయ్య, దూపాటి వెంకట రమణాచార్యులు, గిడుతూరి సూర్యం, ఆదిరాజు వీరభద్రరావు, గడియారం వెంకటశేషశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, బిరుదురాజు రామరాజు, చొల్లేటి నృసింహశర్మ, వేలూరి శివరామశాస్త్రి, కోదాటి నారాయణరావు, కాళోజీ నారాయణరావు, వానమామలై వరదాచార్యులు, నందగిరి ఇందిరాదేవి, పైడిమర్రి వెంకటసుబ్బారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, తల్లావఝుల శివశంకరస్వామి, దాశరథి కృష్ణమాచార్య, పర్చా వెంకటేశ్వరరావు, దేవులపల్లి రామానుజరావు తదితరుల రచనలు ప్రచురింపబడ్డాయి.