సురపురం సంస్థానం
సురపురం సంస్థానం, నైజాం రాజ్యంలోని సంస్థానాల్లో ఒకటి. ఈ సంస్థానం షోరాపురమని, షోలాపురమని, సూరాపురమని కూడా వ్యహహరించబడినది. కృష్ణా, భీమానదుల మధ్య ప్రదేశంలో, కృష్ణానది ఉత్తరతీరాన, బీజాపూరుకు నైఋతి దిశలో వ్యాపించి ఉండేది.[1] ఇది ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిరి జిల్లాలో ఉన్నది.
చరిత్ర
మార్చుపూర్వము మెదకు, కరీంనగర్ మండల సరిహద్దు ప్రాంతాలతో కూడుకున్న కాసలనాడు అను వాడుకగలిగిన భూమే ఈ కోసల దేశము. సురపుర సంస్థానాధీశుల్లో ఒకడు కోసలనాథుడునే రాజు పేరున వీరి వంశానికి కోసల వంశమని పేరువచ్చింది. ముదుగల్లు సీమలోని కోసలపేట ఈ వంశీయుల ఒకప్పటి రాజధాని. ఈ విధంగా వంశానికి కోసలవంశమని పేరువచ్చినందని ప్రతీతి. ఈ సంస్థాన ఆశ్రితకవులైన ఇమ్మడి అణ్ణయాచార్య, ఇమ్మడి శ్రీనివాసాచార్య రచనలలో ఈ వంశం యొక్క ప్రసక్తి ఉన్నది. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయములో ఉన్న సురపుర రాజుల వంశావలి అనే తెలుగు కైఫియత్తు ఆధారంగా డాక్టర్ రాఘవన్ సురపుర సంస్థాన చరిత్రను పునర్నిర్మించాడు.[2] ఈ వంశీయులు శ్రీరాముని భక్తుడైన బోయరాజు గుహుని సంతతవారని, అడవులలో నివసించేవారని తెలుగు కైఫియత్తు చెబుతున్నది. స్థానికంగా వీరిని బేడరులని వ్యవహరిస్తారు. బేడరు తెగ ప్రజలు ఈ సంస్థానపు ప్రజల్లో అధికసంఖ్యాకులు. మైసూరు రాష్ట్రంలోని రత్నగిరి, దక్షిణ మహారాష్ట్ర ప్రాంతం వీరీ పూర్వీకుల నివాసప్రాంతం. వీరిలో ప్రముఖులను నాయకులనే వ్యవహారనామం ఉన్నది.[1]
ఈ సంస్థానానికి మూలపురుషుడు వీరబొమ్మి నాయకుడు. ఈయన ఆయుధోపజీవి (ఉపాధికై ఆయుధం పట్టినవాడు). కృష్ణా, తుంగభద్ర నదుల దక్షిణభాగమున సర్దేశముఖి పదవిలో ఉండి సమకాలీన ప్రభువుల మన్ననలందుకున్నాడు. ఈ వంశీయులు గోల్కొండ, బీజాపూరు సుల్తానులకు తోడ్పడ్డారు. ఈ వంశంలోని వీరుడు కల్లప్ప చిన్న హనుమనాయకుడు, బీజాపూరు సుల్తానుల వజీరు, ముదగల్లు (ముద్గల్) దేశాయి ఐన బహిరీ వసంతరావు అనునతన్ని ఓడించి, విజయసూచకంగా బహిరీ అనే బిరుదును పొందారు. ఈ వంశీయులు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కూడా ఎదిరించి పేరుపొందారు. ఈ వంశ పాలకుల మరాఠాలకు సామంతులుగా ఉండేవారు. పీతాంబర పెదనాయక భూపాలుని కాలంనుండి నిజాముకు కప్పం కట్టేవారు. పీతాంబరుని కొడుకు పామినాయకుడు 1713లో హసనాపురం కొండచాలులో సురపురమును నిర్మించి దానిని రాజధానిగా చేసుకున్నాడు.[1][2]
1765 ప్రాంతంలో సంస్థానాన్ని పాలించిన పామి నాయకుడు, మరాఠాలకు కప్పం కట్టేవాడు. 1765-66 సంవత్సరంలో 19,901 రూపాయల కప్పం కట్టాడు. 1773-74 సంవత్సరంలో ఈయన తర్వాత సంస్థానానికి రాజా వెంకప్ప నాయక రాజయ్యాడు. పీష్వా ఈయనపై 40,001 రూపాయల నజరానా విధించాడు. ఈయన 1784-85లో పీష్వాకు కానుకగా ఒక ఏనుగును బహూకరించాడు. 1793-94లో దేవదుర్గం సంస్థానంలో వారసత్వ పోరు ప్రారంభమైంది. రాజా కిల్లిచ్ నాయక అక్రమ సంతానమైన రంగప్ప నాయక సంస్థానాధికారం తన చేతుల్లోకి తీసుకున్నాడు. కిల్లిచ్ నాయకుడి కూతురు వైపునుండి వారసుడైన రాజా వెంకప్ప నాయకుడు దేవదుర్గం దాడిచేశాడు. రంగప్ప ఆత్మహత్య చేసుకోవడంతో దేవదుర్గం వెంకప్పనాయకుడు హస్తగతమైంది. ఈ వారసత్వపు హక్కును పీష్వాలు కూడా ఆమోదం తెలపడంతో, దేవదుర్గంను సురపురం సంస్థానంలో కలుపుకున్నాడు వెంకప్పనాయకుడు.[3]
1853లో రాజా వెంకటప్ప జమీందారుగా వచ్చాడు. 1857లో తన సేనలో ఈస్టిండియా కంపెనీ అధికారుల మందలింపులు లెక్కచేయకుండా అరబ్బులను, రోహిల్లాలను చేర్చుకున్నాడు. 1858లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో నానాసాహేబు వంటివారితో కుమ్మక్కై వ్యవహరించాడనే అనుమానంతో, ఈస్టిండియా కంపెనీ రాజా వెంకటప్పను సంస్థానాధీశునిగా తొలగించి, మరణశిక్ష విధించింది. కానీ గవర్నరు జనరల్ క్షమాభిక్ష పెట్టి, దీనిని నాలుగేండ్లు కారగారశిక్షగా మార్చి, నాలుగేళ్ళ తర్వాత సంస్థానాన్ని తిరిగి వెంకటప్పకు అప్పగించేటట్లు ఉత్తర్వు జారీచేశాడు. ఈ మేరకు ఆయన్ను చెంగల్పట్టు కారాగారానికి తరలిస్తుండగా, దారిలో చేతి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విధంగా సంస్థానం బ్రిటీషు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది. సిపాయిల తిరుగుబాటులో నిజాం చేసిన తోడ్పాటుకు ఫలితంగా సురవరం సంస్థానాన్ని 1861, మార్చి 4న నిజాంకు ఇవ్వబడింది. రాజా వెంకటప్ప వితంతువైన రాణీ రంగమ్మకు బ్రిటీషు ప్రభుత్వం జీవితాంతము, సాలీనా 26,800 రూపాయల భరణమిచ్చింది.
సంస్థానాధీశులు
మార్చు- వీరబొమ్మి నాయకుడు - వంశ మూలపురుషుడు
- సింగప్ప (నరసింహ నాయక)
- వడియార నాయక (వడియారస)
- కల్లప్ప
- చిన్న హన్మినాయక
- హావినాయక
- పెద్దసోమనాయక
- యెర సింగనాయక
- మదిరినాయక
- వీరతంపి నాయక
- బాలే సోమనాయక
- పెదపామి నాయక (గద్దాడ పామి)
- దేశాయి జక్కప్ప
- గద్దె లింగినాయక
- గద్దె పిద్ది (1666 - 1678)
- నాలుగవ పామి నాయకుడు (1678 - 1688) - శాహపురం రాజధానిగా పాలించాడు. వైష్ణవమును స్వీకరించాడు
- చొక్కప్ప (1688 - 1695)
- పీతాంబర బహిరి పెదనాయకుడు - నిజాంకు కప్పం కట్టడం ప్రారంభించారు
- పామినాయకుడు (1713? - 1740) - సురపురంను నిర్మించి, రాజధానిగా చేసుకున్నాడు
- పెదనాయకుడు (1740 - 1745) నిస్సంతుగా మరణించాడు.
- ముండిగె వెంకటప్ప (1745 - 1951) పెదనాయకుని తమ్ముడు. పుదుచ్చేరిలో నాసర్‌జంగ్ సేవలో పనిచేశాడు. నిస్సంతుగా మరణించాడు.
- బహిరి పామినాయకుడు (రాఘవ) (1752 - 1773) వైష్ణవమును స్వీకరించాడు
- వెంకటప్ప (22వ జమీందారు) (1773 - 1802/1803) - 1786లో మేనమామలదైన దేవగిరి సంస్థానాన్ని కలుపుకొని విస్తరించాడు. నిజాం అలీఖాన్ నుండి బలవంత్ బహిరీ, రోహ్‌బజంగ్, ముజఫరుద్దౌలా, బబరం ముల్క్ బహదూర్ వంటి బిరుదులు పొందాడు.
- కాటవ్వ (1802-1802)
- పెదనాయకుడు
- వెంకటప్ప - సురవరం కైఫియత్తు ఈయన కాలంలో రచించబడింది. పట్టాభిషేక సమయాన నిజాం దీవాన్ రాజా చందూలాల్‌కు ఏడు లక్షల రూపాయల నజరానా సమర్పించాడు.
- కృష్ణప్పనాయకుడు
- రాజా వెంకటప్ప నాయకుడు (1853 - 1861) - చివరి జమీందారు. మెడోస్ టైలర్ పర్యవేక్షణలో పెరిగి, ఆయన రచనలలో ప్రసిద్ధుడయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 దోణప్ప, తూమాటి (1969). ఆంధ్రసంస్థానములు:సాహిత్యపోషణ. ఆంధ్రవిశ్వకళా పరిషత్తు. pp. 512–519. Retrieved 27 August 2024.
- ↑ 2.0 2.1 V., Raghavan (1942). "THE SURAPURAM CHIEFS AND SOME SANSKRIT WRITERS PATRONISED BY THEM". Journal Of The Andhra Historical Research Society (13): 11–33. Retrieved 28 August 2024.
- ↑ Imratwale, Abdul Gani Abdul Khadar. History Of Bijapur Subah (1686-1885). Kolhapur: Shivaji University. p. 367. Retrieved 1 September 2024.