సృజన సాహిత్య పత్రికను సాహితీమిత్రులు హనుమకొండ నుండి నడిపారు. ఈ పత్రిక తెలుగుసీమలో సమాజ సాహిత్య సంబంధాలకు, ప్రజాపక్షపాతానికి, విప్లవ దృక్పథానికి, ప్రామాణిక సృజనాత్మక రచనకు, విశ్లేషణకు అత్యంత ప్రభావశీల నిదర్శనంగా నిలిచింది[1].

ఆశయం మార్చు

ఆధునిక కవిత్వ పత్రికగా నాలుగైదు సంచికలైనా నడచి నిలిచిపోయిన నవత లేని లోటును తీర్చడమే కాకుండా సాహిత్య కార్యరంగాన్ని విస్తృతపరచి సాహిత్య విమర్శ, కథ, సమీక్షలకు సముచితమైన స్థానం కల్పించాలన్నది ఈ పత్రిక ఆశయంగా పేర్కొనబడింది. “ఇది ఒక సాహస ప్రయోగం. ఇది పత్రికా? కాదు ‘మారుతున్న కాలాన్ని, విస్తృతమౌతున్న జాగృతిని ప్రతిబింబించే, అనువదించే ఒక వేదిక’. దీనికి సంపాదకుడు లేదు, సాధకులే తప్ప. ప్రయోగశీలత్వం, సృజనాత్మక శక్తి, ఆధునిక దృక్పథం- ఈ వేదిక పునాదులు” అని మొదటి సంచిక సంపాదకీయం ‘ప్రయోగం’ రాసింది.

రచనలు మార్చు

ఈ పత్రికలో వెయ్యికి పైగా కవితలు, పాటలు, మూడు వందల కథలు, వందలాది వ్యాసాలు, పుస్తక సమీక్షలు, అనువాద రచనలు, రెండు వందల సంపాదకీయాలు ప్రకటితమయ్యాయి. ఇవన్నీ సమకాలీన సమాజానికి, ప్రజాపోరాటాలకు, సాహిత్య అభివ్యక్తికి ఎప్పటికప్పుడు అద్దం పట్టాయి, ప్రతిఫలించాయి. అంపశయ్య, కొలిమంటుకున్నది, చైనా అనువాద నవలలు నా కుటుంబం, ఉప్పెన ఈ పత్రికలోనే వెలుగు చూశాయి.

రచయితలు మార్చు

 
అల్లం రాజయ్య

అల్లం రాజయ్య, ఎన్.ఎస్.ప్రకాశరావు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, అట్టాడ అప్పల్నాయుడు, కె.రాంమోహన్‌రాజు, బి.ఎస్.రాములు, త్రిపురనేని మధుసూదనరావు, కె.బాలగోపాల్, జె.సి., సి.వి.సుబ్బారావు, ఆర్.ఎస్.రావు మొదలైన ఎందరో రచయితలు ఈ పత్రికలో రచనలు చేశారు.

చరిత్ర మార్చు

తొలి సంచిక 1966, నవంబరులో వెలువడింది. మొదట త్రైమాస పత్రికగా ప్రారంభమై 1971లో మాసపత్రికగా మారింది. కాళోజీ ప్రచురణకర్తగా సంపాదకత్వంలో ఈ పత్రిక ప్రారంభమైంది. వే.నరసింహారెడ్డి, నవీన్, రామన్న, వరవరరావు ఈ పత్రిక వ్యవస్థాపకులు. రెండో సంచిక నుంచి 1973 అక్టోబరు సంచిక వరకూ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్‌గా వరవరరావు పేరు అచ్చయింది. వరవరరావును 1973 అక్టోబరులో ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టు చేయడంతో నవంబరు సంచిక నుంచి సంపాదకురాలు, ప్రచురణకర్త, ముద్రాపకులుగా పి.హేమలత బాధ్యత వహించింది. 1992లో ఈ పత్రిక అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ 26 ఏళ్ల కాలంలో సుమారు 200 సంచికలు వెలువడ్డాయి. 1970వ దశకంలో ఝంఝా ప్రభంజనంగా వీస్తున్న విప్లవ రచయితల సంఘానికి అధికార పత్రిక ఏర్పడకపోవడంతో సృజన విప్లవ సాహిత్యోద్యమ అనధికార వేదికగా నిలిచింది. సృజన వందలాది మంది సాహిత్యకారులను సృష్టించి, వారి సాహిత్యానికి మెరుగులు దిద్దింది. అప్పటికే సాహిత్య లోకంలో లబ్ధప్రతిష్ఠులైనవారి నుంచి అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటూ రచయితలైనవారి వరకు, మేధావుల నుంచి నిరక్షరాస్య సృజనకర్తల వరకు ఎందరికో వేదిక కల్పించడంలో, ఆరుగాలం శ్రమలో తీరిక దొరకని కష్టజీవులను రచయితలుగా మలచడంలో, తీర్చిదిద్దడంలో ఈ పత్రిక చేసిన కృషి, నెలకొల్పిన ప్రమాణాలు అసాధారణం. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం, కరీంనగర్ రైతాంగ పోరాటం, ఆదిలాబాద్ రైతాంగ పోరాటం, దండకారణ్య ఉద్యమం మొదలైన ప్రజావిముక్తి పోరాటాలన్నింటికీ వేదికగా ఈ పత్రిక నిలిచింది. ప్రజాసాహిత్య రంగంలో విస్తారమైన కృషివల్ల ఈ పత్రిక పాలకవర్గాల నుంచి తీవ్రమైన ఆగ్రహాన్నీ నిర్బంధాలనూ నిషేధాలనూ ఎదుర్కొన్నది. దాదాపు పది సంచికలు నిషేధానికి గురయ్యాయి. ఒక సంచిక నిషేధం కేసులో సంపాదకురాలు పి.హేమలతకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వరవరరావును 1973లో నిర్బంధించినప్పుడు, సికిందరాబాదు కుట్రకేసులో నిందితునిగా చూపినప్పుడు సృజన సంచికల రచనలే నేరారోపణలు. నిర్బంధం వల్లనే ఎమర్జెన్సీలో రెండేళ్లు, ఆటాపాటామాటా బంద్ కాలంలో నాలుగేళ్లు ఈ పత్రిక వెలువడలేకపోయింది.

మూలాలు మార్చు

  1. సాహితీ మిత్రులు. "పోరాటాల వేదిక 'సృజన". సరసభారతి ఉయ్యూరు. Archived from the original on 6 జూన్ 2015. Retrieved 21 March 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=సృజన&oldid=3273841" నుండి వెలికితీశారు