బి.ఎస్.రాములు నవలాకారుడు, కథకుడు. వర్ధమాన కథకుల కోసం ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించాడు. ఆధునిక సమాజంలో సాహిత్యాన్ని, సమాజాన్ని రెంటినీ అంతే సీరియస్‌గా అధ్యయనం చేయడం రాములు ప్రత్యేకత. రాములును 2016 అక్టోబరు 22న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తొలి చైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు.[1][2]

బి.ఎస్.రాములు
సినివారంలో బి.ఎస్.రాములు
జననంబి.ఎస్.రాములు
ఆగస్టు 23, 1949
జగిత్యాల, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
ఇతర పేర్లుబి.ఎస్.రాములు
తండ్రిలక్ష్మిరాజు
తల్లినారాయణ

జీవిత విశేషాలు

మార్చు

బి.ఎస్‌.రాములు కరీంనగర్ జిల్లా, జగిత్యాలలో 1949, ఆగస్టు 23 న జన్మించారు. అయన తల్లిదండ్రులు నారాయణ, లక్ష్మిరాజు . తండ్రి బొంబాయి బట్టలమిల్లు కార్మికునిగా పనిచేసేవారు. తన బాల్యంలోనే తండ్రి మరణించటంతో ఆయన తల్లి బీడీలు చుడుతూ వచ్చే అణా పైసలతో కుటుంబ పోషణం చేస్తుంటే తన లేతహృదయం తీవ్రంగా స్పందించేది. రజాకార్ల గురించి చదివిన రాములు, మతపరమైన విశ్వాసాలతో చెలరేగిన ఆందోళనలను ప్రత్యక్షంగా చూశారు. జగిత్యాల మార్కజీ పాఠశాల విద్య పూర్తిచేశారు. చందమామ, బాలమిత్ర వంటి పత్రికల్లో రచనలు విస్తృతంగా చదివారు. బాలసాహిత్యం నుంచి ప్రేరణ పొందిన రాములు 1963-64 ప్రాంతాల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నపుడే చిన్న చిన్న రచనలు వ్రాసేవారు. పాఠశాల ప్రత్యేక సంచిక 'స్రవంతి'లో అవి అచ్చయినవి. అయితే 1968లో 'బాలమిత్ర' జనవరి సంచికలో 'జగిత్యాల కథ' పేరుతో ఆయన తొలి రచన అచ్చయినది. ఆ రచన ఆయనను బయటి ప్రపంచానికి రచయితగా పరిచయం చేసింది.


ఆయన సాంస్కృతిక అతివాద భావజాల ఆకర్షణకు లోనై సంస్కృతీకరణను విశ్వసించారు. అందువలన ఆయన 1967 నుంచి 1972 వరకు ఆర్.ఎస్.ఎస్. ముఖ్య శిక్షక్ గా పనిచేశారు. ఆయన ఎదిగేకొద్దీ జీవితంలో లోతు పాతుల్ని, వివిధ వాదాల్ని అవగతం చేసుకొన్నారు. విప్లవవాదం, దళిత వాదం, స్త్రీ వాదం వంటి ఏ ఒక్కవాదమో కాక అన్ని వాదాల్ని అవగతం చేసుకొని అవి ప్రవచించే మానవాభ్యుదయ లక్ష్యాన్ని పట్టుకొన్నారు. ఆయన సాహిత్య సమావేశాలు, సభలు, సదస్సులు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషిచేశారు. నిరుపేద ప్రజల ఉద్ధరణకు పనికొచ్చే పనిచేయాలని సంకల్పించిన రాములు జిల్లాస్థాయిలో పౌరహక్కుల సంఘం, అంబేద్కర్‌ సంఘాలు, విప్లవ సంఘాలలో సభ్యత్వం పొంది ఆ దిశగా కృషి ప్రారంభించారు. 1980లో 'విరసం' లో సభ్యత్వం పొందారు. 1983లో పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అయ్యారు. 1984-88ల మధ్య రాడికల్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు.అయితే ఆ కాలంలోనే ఆయన గద్దర్, వరవరరావు, సంజీవ్‌ తదితరులతో కలసి అఖిలభారత పర్యటనకు వెళ్లడమేకాక అజ్ఞాతవాసంలోకి వెళ్లవలసి వచ్చింది. ఆయన 1980 దశకమంతా ముమ్మరమైన ప్రజాజీవిత ఆచరణలో చాలా సన్నిహితుడయ్యాడు. 1985-89 నిర్బంధకాలంలో, ఆ నిర్బంధాన్ని ప్రచారం చేయడానికి దేశవ్యాప్తంగా తిరిగిన బృందం సభ్యుడిగా, అజ్ఞాత కార్యకర్తగా పనిచేశాడు. 1990లో తిరిగి బహిరంగ జీవితంలోకి వచ్చారు. 1992లో ఆంధ్రప్రదేశ్‌ దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. దానికి వ్యవస్థాపక అధ్యక్షులయ్యారు.[3]

కథకుడిగా

మార్చు

కథకుడిగా ఆయన తెలంగాణా ప్రజల దీనస్థితిని అక్షరీకరించారు. కాలువ మల్లయ్య రాములు కథల్ని మూడు భాగాలుగా వర్గీకరించారు.

  • విప్లవ సాహిత్య అవగాహనలో భాగంగా 1990 దాకా రాసిన కథలు
  • తాత్విక సైద్ధాంతిక గ్రంథాలు రాసిన గాఢతతో రాసిన దళిత, బహుజన స్త్రీవాద కథలు.
  • సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, మానవ సంబంధాల కథలు.

రాములు 175 కి పైగా కథలు రాశారు. ఆరు నవలలు, నూటయాభై సిద్ధాంత వ్యాసాలు, అన్నీ సాహిత్య వ్యాసాలు, పది తాత్విక గ్రంథాలు రాశారు. పాలు, చదువు, స్మృతి, మమతలూ- మానవ సంబంధాలు, వేపచెట్టు వంటి కథల సంపుటాలు, బతుకు పోరు వంటి నవలలు ఆయనకి బాగా పేరుతెచ్చాయి. జ్ఞానం పుట్టుక, బీసీలు ఏంచేయాలి, నెనెవరు గతి తర్క తత్వ దర్శన భూమిక, బహుజన తత్వం, ప్రేమంటే ఏమిటి?, భౌతిక వాద ప్రాపంచిక దృక్పథం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువజనులారా వంటి తాత్విక గ్రంథాలు, సమగ్ర సామాజిక కథ, కథలబడి - కథా సాహిత్య అలంకార శాస్త్రం వంటి రచనలు చేశారు. ఇంకా ఉద్యమకథలు, తెలంగాణా వ్యాసాలు, కన్యాశుల్కాన్ని ఎలాచూడాలి, సాహిత్య చరిత్రను కొత్తచూపుతో ఎలా తిరగరాయాలి? సాహిత్య చరిత్రను కొత్త చూపుతో ఎలా తిరగరాయాలి? పాట పుట్టుక, దళిత సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలి, సాహిత్యంలో సమాజ అన్వేషణ వంటి గ్రంథాలెన్నో రాశారు.

సాహితీ పురస్కారాలు

మార్చు

విశాల సాహితీ పురస్కారాలను ఇప్పటివరకు ఓ ముప్ఫై మంది కథల సంపుటాలకు ప్రదానం చేయడం విశేషం. వీరికథలు పాలు, బడి, సహజాతాలును ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎం.ఎ తెలుగులో పాఠ్యాంశాలుగా నిర్ణయించింది. పాలు కథ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ విద్యార్థులకి పాఠ్యాంశంగా ఉంది. 'సదువు'కథ గ్రూప్‌-1 సర్వీసెస్‌ వారికి తెలుగు పరీక్షల్లో పాఠ్యాంశమైంది. బి.ఎస్‌.రాములు, కథకుడిగా హేతువాదిగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు అందుకొన్నారు. దాశరథి రంగాచార్య పురస్కారం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్‌ పురస్కారం, పాల్కురికి సోమన పురస్కారం వంటి వెన్నో పొందారు.

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ (22 October 2016). "బీసీ కమీషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు". Archived from the original on 23 October 2016. Retrieved 22 October 2016.
  2. Sakshi (27 May 2017). "బీసీ వర్గీకరణలో మార్పులుంటాయి!". Sakshi. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  3. Sakshi (28 November 2014). "నూరేళ్లకూ మసకబారని చూపు..." Sakshi. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.