హెచ్.వి.నంజుండయ్య
హెబ్బళలు వేల్పనూర్ నంజుండయ్య (1860 – 1920) మైసూర్ దీవాన్, మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడు, మొట్టమొదటి ఉపకులపతి, మైసూరు రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయాధిపతి, కన్నడ సాహిత్య సమ్మేళనం వ్యవస్థాపక అధ్యక్షుడు. [1] ఇతడు 1915 నుండి 1917 వరకు బెంగళూరు, మైసూరులలో జరిగిన కన్నడ సాహిత్య సమ్మేళనాలకు అధ్యక్షత వహించాడు. ఇతడు ప్రపంచంలోని మానవజాతి శాస్త్రవేత్తలలో మొదటి తరంవాడు.[2] ఇతడు మైసూరు జాతులు, కులాలపై 1906లో ఒక ప్రభావశీలమైన గ్రంథాన్ని రచించాడు.[3]మరికొన్ని న్యాయసంబంధ గ్రంథాలను కూడా వ్రాశాడు.
హెచ్.వి.నంజుండయ్య | |
---|---|
జననం | హెబ్బళలు వేల్పనూర్ నంజుండయ్య 1860అక్టోబర్ 13 మైసూరు |
మరణం | 1920, మే 7 |
వృత్తి | ఉపకులపతి, మైసూరు విశ్వవిద్యాలయం, దివాన్, మైసూరు సంస్థానం |
ప్రసిద్ధి | పరిపాలనాదక్షుడు, రచయిత, కన్నడ సాహిత్య పరిషత్ వ్యవస్థాపకుడు |
పదవి పేరు | రాజమంత్ర ప్రవీణ, కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ |
మతం | హిందూ |
తండ్రి | సుబ్బయ్య |
తల్లి | అన్నపూర్ణమ్మ |
ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., ఎం.ఎల్. చదివాడు. ఇతడు 1920లో మరణించే నాటికి మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నాడు. అంతకు ముందు ఇతడు మైసూరు రాష్ట్రం హైకోర్టులో సీనియర్ జడ్జిగా, తరువాత మైసూరు రాజ్యానికి దీవాన్‌గా పనిచేశాడు.
ఇతడు బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో తొట్టతొలి నివాసి. ఇతడు తన భవనాన్ని బాలికల ఉన్నత పాఠశాల కోసం ప్రభుత్వానికి దానం చేశాడు. ఇప్పటికి కూడా మల్లేశ్వరం 4వ మెయిన్, 13వ క్రాస్‌లోని ఆ భవనంలో బాలికల హైస్కూలు నడుపబడుతూ ఉంది. ఇతని కుటుంబీకులు ప్రస్తుతం ఈ భవనం సమీపంలో నివసిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రానికి ఇతడు చేసిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా మల్లేశ్వరం 6వ మెయిన్ రోడ్డుకు ఇతని పేరును పెట్టారు.
ఇతడు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్‌లో కూడా మమేకమైనాడు. 1915లో మానవజాతి శాస్త్రపు ఉపాధ్యక్షుడిగా సేవలనందించాడు.[4]
ఇతడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ను మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి మైసూరు విశ్వవిద్యాలయానికి పిలిపించాడు. నంజుండయ్య, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇరువురూ అత్యంత సన్నిహితులుగా ఉన్నారు.[5]
జీవిత విశేషాలు
మార్చుఇతడు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగాడు. ఇతడు 1860 అక్టోబర్ 13వ తేదీన మైసూరులో సుబ్బయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఒక బీద కుటుంబంలో జన్మించాడు[3]. మైసూరు మహారాజు నుండి విద్యార్థి వేతనం పొంది మైసూరులోని వెస్లియన్ హైస్కూలు, మద్రాసులోని మద్రాసు క్రిస్టియన్ కళాశాలలలో చదివి 1880లో బి.ఎ., తరువాత బి.ఎల్.,1893లో ఎం.ఎల్.పట్టాలు పుచ్చుకున్నాడు. ఇతడు 1885లో నంజనగూడులో మున్సిఫ్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు. అటు పిమ్మట హసన్‌లో అసిస్టెంట్ కమీషనర్, బెంగుళూరులో సబ్ జడ్జి, శివమొగ్గ జిల్లా కలెక్టర్, మైసూరు రాజ్య ముఖ్యకార్యదర్శి, ఛీఫ్ జస్టీస్ వంటి వివిధ పదవులను చేపట్టాడు. 1916లో మైసూరు విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పుడు దానికి మొదటి ఉపకులపతిగా నియమించబడి 1920లో మరణించేవరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతడు యుక్తవయసులో ఉన్నప్పుడే ఇద్దరు భార్యలను, ఒక కుమారుని కోల్పోయాడు. తన కుమారుని స్మృత్యర్థం విక్టర్ హ్యూగో వ్రాసిన ఫ్రెంచి కవితలను "టియర్స్ ఇన్ ద డార్క్" అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించాడు.
సంఘసేవ
మార్చుఇతడు తన అక్కకు సంభవించిన వైధవ్యం చూసి చలించి విధవల ఉన్నతి కోసం "విడోస్ హోమ్" ను స్థాపించాడు. హరిజనోద్ధరణ కొరకు సెంట్రల్ బోర్డింగ్ స్కూలు, హాస్టలు, కుటీర పరిశ్రమ స్థాపించాడు. స్త్రీ విద్య గురించి ప్రచారం చేశాడు. పల్లెపల్లెలో తిరిగి విద్యావసతులలోని కొఱతను గుర్తించి జాతీయ విద్యావిధానానికి పిలుపునిచ్చాడు. అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు[3].
భాషాసేవ
మార్చునంజుండయ్య మాతృభాష తెలుగు అయినా కన్నడ భాష పట్ల ఇతనికి ఎంతో మక్కువ వుంది. ఇతడు కన్నడ సాహిత్య పరిషత్తును స్థాపించి దాని ద్వారా కన్నడ పుస్తకాల ప్రచురణ, సాహిత్య సదస్సుల నిర్వహణ, పరిశోధనలకు ప్రోత్సాహము, కన్నడ సాహిత్య సమ్మేళనాల నిర్వహణ తదితర కార్యక్రమాలు చేపయ్యాడు.[ఆధారం చూపాలి]
కన్నడ సాహిత్య సమ్మేళనాలకు మొదటి మూడు సంవత్సరాలకు ఇతడిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.[6]
రచనలు
మార్చుఇతడు బహుభాషావేత్త. ఇతడు అనేక గ్రంథాలను రచించాడు. కన్నడ భాషలో వ్యవహార దీపికె, వ్యవహార ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, లేఖ్యబోధిని, రాత్రియల్లి కంబని, ఆంగ్లభాషలో మైసూర్ ట్రైబ్స్ అండ్ కాస్ట్స్, టియర్స్ ఇన్ ద నైట్ (విక్టర్ హ్యూగో ఫ్రెంచి రచనకు ఆంగ్లానువాదం)[3] మొదలైనవి ముఖ్యమైన రచనలు.
సత్కారాలు
మార్చుమైసూరు మహారాజు ఇతనికి "రాజమంత్ర ప్రవీణ" అనే బిరుదును ప్రదానం చేశారు. ఇతడు మైసూరు మహారాజుకు రాజకీయ,పరిపాలనా సలహాదారు. ఇతడు క్లిష్ట సమయంలో మైసూరు దివాన్‌గా కూడా పనిచేశాడు. 1911లో ఢిల్లీలో చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవానికి అతిథిగా ఆహ్వానించబడ్డాడు. 1915లో బ్రిటిష్ ప్రభువు 5వ కింగ్ జార్జ్ ఇతడిని "కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్" బిరుదుతో సత్కరించాడు. [7]
మరణం
మార్చుమూలాలు
మార్చు- ↑ "Honouring Malleswaram's eminent residents". The Hindu. Retrieved 14 December 2015.
- ↑ "Anthropology was Not All White Males: Early Ethnographies by Women and Persons of Color « Krazy Kioti – the Gene Anderson website". Krazykioti.com. 2012-01-09. Retrieved 2013-10-24.
- ↑ 3.0 3.1 3.2 3.3 వెబ్ మాస్టర్. "ಎಚ್.ವಿ. ನಂಜುಂಡಯ್ಯ". కణజ. కణజ. Retrieved 19 November 2017.[permanent dead link]
- ↑ Journal & Proceedings of the Asiatic Society of Bengal - Google Books. Books.google.co.in. Retrieved 2013-10-24.
- ↑ "Tribute to the greatest teacher - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-03-29. Retrieved 2013-10-24.
- ↑ "The truth that is Kannada". The Hindu. 2011-01-28. Retrieved 2013-10-24.
- ↑ "Dr VKRV Rao Digital Library" (PDF). 203.200.22.249:8080. Retrieved 2013-10-24.[permanent dead link]