2022 ఫిఫా ప్రపంచ కప్,అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడా సమాఖ్య (FIFA) లోని సభ్య దేశాల పురుషుల జాతీయ జట్లు పోటీ చేసే అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో 2022 లో ఖతార్‌లో జరిగిన టోర్నమెంటు. 1930 నుండి నాలుగేళ్ళ కొకసారి జరిగుతూ వస్తున్న ఈ పోటీల్లో ఈ టోర్నమెంటు 22 వది. ఈ టోర్నమెంటు 2022 నవంబరు 20 నుండి డిసెంబరు 18 వరకు ఖతార్‌లో జరిగింది ఇది అరబ్ ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి ఫుట్‌బాల్ ప్రపంచ కప్. దక్షిణ కొరియా, జపాన్ లలో 2002 లో జరిగిన టోర్నమెంటు తర్వాత పూర్తిగా ఆసియా లోనే జరిగిన ప్రపంచ కప్ ఇదే. [A] 2018 లో రష్యాలో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ లో క్రొయేషియాను 4-2 తో ఓడించిన ఫ్రాన్స్, ఈ ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా పోటీలో దిగింది.
2022 ఫిఫా ప్రపంచ కప్
كأس العالم لكرة القدم 2022 Kaʾs al-ʿālam li-kurat al-qadam 2022
الآن هو كل شيء (Now Is Everything) (సమస్తం ఇప్పుడే)
2026 లో అమెరికా, కెనడా, మెక్సికోల్లో ఉమ్మడిగా జరిగే 23 వ ప్రపంచ కప్పులో పాల్గొనే జట్ల సంఖ్య 48 జట్లకు పెరుగుతుంది. కాబట్టి, 32 జట్లు పాల్గొనే టోర్నమెంటులలో ఇది చివరిది. పోటీలో జరిగే మ్యాచ్‌లు ఐదు నగరాల్లోని ఎనిమిది వేదికల్లో జరుగుతాయి. ఖతార్ లో వేసవిలో తీవ్రమైన వేడి, తేమ ఉంటుంది కాబట్టి [1] ఈ ప్రపంచ కప్‌ను నవంబరు, డిసెంబరులలో జరుపుతున్నారు. [B][2] ఇది 29 రోజుల పాటు జరుగుతుంది. అల్ ఖోర్‌లోని అల్ బైత్ స్టేడియంలో ఖతార్, ఈక్వెడార్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. మొట్టమొదటి సారి ప్రపంచ కప్పులో ఆడుతున్న ఖతార్, ఈ మ్యాచ్‌లో 2-0 తో ఓడిపోయింది. తొలి గేమ్‌లో ఓడిపోయిన మొట్టమొదటి ఆతిథ్య దేశం అది. [3]
2022 డిసెంబరు 18 న జరిగిన ఫైనల్ పోటీలో అర్జెంటీనా జట్టు ఫ్రాన్సును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అదనపు సమయం ముగిసేసరికి అర్జెంటీనా, ఫ్రాన్సులు 3-3 తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. అందులో అర్జెంటీనా 4-2 తో గెలిచి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.[4] ఫ్రెంచి ఆటగాడు కైలియన్ ఎంబాపె హ్యాట్రిక్ చేయడమే కాకుండా, టోర్నమెంటులో మొత్తం 8 గోల్‌లు చేసి అత్యధిక గోల్‌లు చేసిన ఆటగాడిగా బంగారు బూట్‌ను గెలుచుకున్నాడు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా నిలిచి బంగారు బంతిని గెలుచుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎమిలియానో మార్టినెజ్ అత్యుత్తమ గోల్‌కీపరుగా బంగారు గ్లౌజును అందుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎంజో ఫెర్నాండెజ్ అత్యుత్తమ యువ ఆటగాడిగా ఎంపికయ్యాడు.
ప్రపంచ కప్‌కు ఖతార్ ఆతిథ్యమివ్వాలనే నిర్ణయం పాశ్చాత్య ప్రపంచంలో విమర్శలకు దారితీసింది. [5] ఖతార్‌లో మానవ హక్కుల పరిస్థితిపై విమర్శలు వచ్చాయి. ఖతార్‌పై వలస కార్మికులు మహిళలు, LGBT హక్కులపై వారి వైఖరితో సహా స్పోర్ట్స్ వాషింగ్ ఆరోపణలు వచ్చాయి. [5][6][7] ఖతార్ తీవ్రమైన వేడి వాతావరణం ఉండే దేశమైనప్పటికీ, బలమైన ఫుట్‌బాల్ సంస్కృతి లేకపోయినప్పటికీ నిర్వహణ అవకాశం పొందడాన్ని బట్టి ఈ హక్కులు పొందేందుకు లంచం ఇచ్చారనడానికి ఆధారమని కొందరు అన్నారు. ఫిఫా లో ఉన్న అవినీతికి ఇది నిదర్శనమని అన్నారు. [6][7] ఈ పోటీలను బహిష్కరించాలని అనేక దేశాలు, క్లబ్‌లు, కొందరు ఆటగాళ్లూ ఆలోచించారు. ఖతార్‌కు ఆతిథ్య హక్కును ఇవ్వడం "తప్పు" అని ఫిఫా మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ రెండుసార్లు చెప్పాడు. [8][9] ప్రస్తుత ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో, ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. [10] ఈ వివాదాన్ని, ఇస్లామిక్ నైతికతకు లౌకిక పాశ్చాత్య ఉదారవాద ప్రజాస్వామ్య సిద్ధాంతాలకూ మధ్య జరుగుతున్న సాంస్కృతిక ఘర్షణగా అతడు అభివర్ణించాడు. మరికొందరు, ఇది ఫుట్‌బాల్ అసోసియేషను జియోపాలిటిక్స్‌లో పాశ్చాత్య దేశాల ప్రభావం క్షీణిస్తుందనడానికి సూచిక అని చెప్పారు. [5][11]
ఫిఫా వరల్డ్ కప్ అనేది జాతీయ ఫుట్‌బాల్ జట్ల మధ్య జరిగే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ టోర్నమెంటు. [12]ఫిఫా దీన్ని నిర్వహిస్తుంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ టోర్నమెంటు మొదటిసారిగా 1930లో ఉరుగ్వేలో జరిగింది. [13] 1998 నుండి ఈ పోటీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి. [13] ఈ టోర్నమెంటు ఎనిమిది రౌండ్-రాబిన్ గ్రూపులతో జరుగుతుంది. ఆ తర్వాత 16 జట్లతో నాకౌట్ రౌండ్ జరుగుతుంది. [14] 2018 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో క్రొయేషియాను 4–2తో ఓడించిన ఫ్రాన్స్, ఛాంపియన్‌గా నిలిచింది. [15][16] ప్రస్తుత పోటీ మామూలుగా జరిగే వ్యవధి కంటే తక్కువ రోజుల్లో, [17] నవంబరు 20 నుండి డిసెంబరు 18 వరకు జరుగుతోంది. [18] ఇది అరబ్ ప్రపంచంలో జరుగుతున్న మొదటి ప్రపంచ కప్ టోర్నమెంటు. [19] ప్రేక్షకులు సామాజిక దూరం, మూతిముసుగులు ధరించడం, ప్రతికూల పరీక్షలు వంటి COVID-19 పాండమిక్ పరిమితులను అనుసరించాల్సిన అవసరం లేదు. [20]
టోర్నమెంటు మొదలవడానికి ఒక నెల ముందు, 2022 అక్టోబరు 21 నాటికి, ప్రతీ జట్టు 35 - 55 మంది ఆటగాళ్లతో కూడిన తాత్కాలిక జాబితాను ఫిఫాకి సమర్పించాయి. ఈ జాబితాలను ఫిఫా బహిరంగ పరచలేదు. ఈ తొలి జట్టు సభ్యుల నుండి, టోర్నమెంటు ప్రారంభ మ్యాచ్‌కి ఆరు రోజుల ముందు అంటే నవంబరు 14 న, 19:00 AST ( UTC+3) లోపు జాతీయ జట్లన్నీ తమ తుది జాబితాలను ఫిఫాకి సమర్పించాయి. తుది జట్టులో గరిష్ఠంగా 26 మంది, కనీసం 23 మంది ఆటగాళ్ళు ఉంటారు. [21]
ప్రాంతం వారీగా అర్హత సాధించిన జట్ల జాబితాను కింద చూడవచ్చు. బ్రాకెట్లలో ఉన్నది, ఈ టోర్నమెంటుకు ముందు ఆయా జట్ల ప్రపంచ ర్యాంకు [22]
సాధారణంగా ఫిఫా ప్రపంచ కప్‌లు జూన్, జూలైల్లో జరిగేవి. కానీ ఖతార్‌లో ఉండే తీవ్రమైన వేసవి వేడి కారణంగా 2022 ప్రపంచ కప్ పోటీలను నవంబరు, డిసెంబరులలో జరుపుతున్నారు. [6] ఓవైపున దేశీయ ఫుట్‌బాల్ లీగ్‌ల పోటీలు జరుగుతూండగా మరోవైపు ప్రపంచ కప్పు జరుగుయ్తూ ఉండేది. దేశవాళీ లీగు పోటీలు ప్రధాన యూరోపియన్ లీగ్‌లతో సహా అన్నీ, జూలై చివరలో లేదా ఆగస్టులో ప్రారంభమవుతాయి. ప్రపంచ కప్పు పోటీల కారణంగా అవి, తమ షెడ్యూల్‌లలో మధ్యన ప్రపంచ కప్పు జరిగే సమయంలో విరామం ఇచ్చేవి. ప్రధాన యూరోపియన్ లీగు పోటీలు తమ పోటీల గ్రూపు మ్యాచ్‌లను, తర్వాతి సంవత్సరం గ్రూపు మ్యాచ్‌లు ఆడకుండా ఉండేలాగా, ప్రపంచ కప్‌కు ముందే ఆడాలని షెడ్యూల్ చేసుకున్నాయి. [23]
మ్యాచ్ షెడ్యూల్‌ను 2020 జూలైలో [24] ఫిఫా ధ్రువీకరించింది. పోటీ నవంబరు 21న ప్రారంభమయ్యేట్లుగా నిర్ణయించింది. అయితే, ఫిఫా లో ఖతార్ చేసిన లాబీయింగ్ తర్వాత, ఖతార్ - ఈక్వెడార్ ల మధ్య జరిగే పోటీతో నవంబరు 20 నే టోర్నమెంటును ప్రారంభించాలని షెడ్యూలు మార్చారు. [25][26] ఫైనల్ పోటీ 2022 డిసెంబరు 18 న ఖతార్ జాతీయ దినోత్సవం నాడు లుసైల్ ఐకానిక్ స్టేడియంలో జరుగుతుంది. [27][24]
వివిధ గ్రూపులకు సంబంధించిన మ్యాచ్‌లు క్రింది స్టేడియాలకు కేటాయించారు: [27]
గ్రూప్‌లు A, B, E, F: అల్ బైట్ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ తుమామా స్టేడియం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం
సమూహాలు C, D, G, H: లుసైల్ ఐకానిక్ స్టేడియం, స్టేడియం 974, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, అల్ జనోబ్ స్టేడియం
2022 ఏప్రిల్ లో ఫిఫా, బహుమతులను ప్రకటించింది. పాల్గొనే ప్రతి జట్టుకూ ప్రైజ్ మనీలో కనీసం $90 లక్షలు ఇవ్వడంతో పాటు పోటీలకు తయారయ్యేందుకు గాను, పోటీకి ముందే $15 లక్షలు ఇచ్చారు. ఈ పోటీల్లో అందించే మొత్తం బహుమతులు $44 కోట్లు, మునుపటి టోర్నమెంటు బహుమతుల కంటే ఇది $4 కోట్లు ఎక్కువ. [28]
ప్రపంచ కప్ కోసం ప్రతిపాదించిన మొదటి ఐదు వేదికలను 2010 మార్చి ప్రారంభంలో ఆవిష్కరించారు. స్టేడియాలు దేశ చరిత్రను, సంస్కృతినీ ప్రతిబింబించాలని ఖతార్ భావించింది. వారసత్వం, సౌకర్యం, అందుబాటు, దీర్ఘ కాల వినియోగాలను దృష్టిలో ఉంచుకుని వాటి డిజైన్లు రూపొందించారు. [29] స్టేడియంలో ఉష్ణోగ్రతలను 20 °C (36 °F) వరకు తగ్గించే లక్ష్యంతో వీటికి శీతలీకరణ వ్యవస్థలను ఏర్పాటు చేసారు. అయితే ఇలాంటి వ్యవస్థ బహిరంగ (ఓపెన్-ఎయిర్) స్టేడియంలలో పనిచేస్తుందో లేదో చూడాల్సి ఉంది. [30]
ఖతార్ చేస్తున్న మార్కెటింగులో స్టేడియాలను జీరో వేస్ట్‌గా అభివర్ణించే ప్రకటనలు ఉన్నాయి. ప్రపంచ కప్ తర్వాత స్టేడియాల పై అంతస్తులను ఊడదీసి క్రీడా మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని దేశాలకు విరాళంగా ఇస్తారు. [30] ప్రపంచ కప్ స్టేడియాలన్నీ గ్లోబల్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ సిస్టమ్ (GSAS) కు అనుగుణంగా ఉండాలని, వారి సర్టిఫికేట్ పొందాలనీ ఖతార్ భావించింది. ప్రారంభించిన ఐదు స్టేడియం ప్రాజెక్టులన్నీ జర్మన్ ఆర్కిటెక్ట్ ఆల్బర్ట్ స్పీర్ పార్ట్‌నర్సే రూపొందించింది. [31] ఈ ఎనిమిది స్టేడియంల లోనూ అల్ బైట్ స్టేడియం ఒక్కటే ఇండోర్ స్టేడియం. [32]
ప్రారంభ వేడుక 2022 నవంబరు 20 ఆదివారం నాడు అల్ ఖోర్‌లోని అల్ బైత్ స్టేడియంలో జరిగింది. [49] ఇందులో మోర్గాన్ ఫ్రీమాన్, ఘనిమ్ అల్-ముఫ్తాహ్ ప్రదర్శనలు, దక్షిణ కొరియా గాయకుడు, BTS సభ్యుడూ అయిన జంగ్‌కూక్ ప్రదర్శనలు జరిగాయి. [50][51] ప్రపంచ కప్పు ప్రారంభోత్సవంలో ఖురాన్ పఠించడం ఇదే తొలిసారి. [52]
టోర్నమెంటులో మొదటి మ్యాచ్ గ్రూపు A లోని ఖతార్, ఈక్వెడార్ జట్ల మధ్య జరిగింది. ఆట మొదట్లోనే ఈక్వెడార్ గోలు కొట్టినప్పటికీ దాన్ని రిఫరీ తిరస్కరించాడు. చివరికి 2-0 తో ఈక్వడార్ గెలిచింది. [53] ప్రపంచ కప్‌లో తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోయిన మొదటి ఆతిథ్య దేశంగా ఖతార్ నిలిచింది. [54][55] మ్యాచ్ ముగియక ముందే పెద్దయెత్తున ఖతారీ ప్త్రేక్షకులు వెళ్ళిపోవడం కనబడింది. రెండు వంతుల మంది ప్రేక్షకులు వెళ్ళిపోయారని ESPN తెలిపింది.[56][57] గ్రూప్ Aలోని మరొక ప్రారంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-0తో సెనెగల్‌పై గెలిచింది. ఈ ఆటలో 84వ నిమిషంలో ఒకటి, ముగింపుకు సమయానికి మరొకటీ గోల్‌లు చేసి నెదర్లాండ్స్ 2-0తో గెలిచింది. [58] నవంబరు 25 న జరిగిన మ్యాచ్‌లలో సెనెగల్ ఖతార్‌పై 3-1 తో నెగ్గింది. ఖతార్ ప్రపంచ కప్పు పోటీలో తన మొట్టమొదటి గోల్ సాధించింది.[59] ఈ గ్రూపులో జరిగిన మరో మ్యాచ్‌ను నెదర్లాండ్స్, ఈక్వడార్‌లు 1-1 డ్రాగా ముగించాయి. [60] నవంబరు 29 న ఈ గ్రూపులో చివరి మ్యాచ్‌లు జరిగాయి. నెదర్లాండ్స్ 2–0 తో ఖతార్‌ను ఓడించి, 7 పాయింట్లతో ఈ గ్రూపులో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూపు విజేతగా నాకట్ దశ లోకి ప్రవేశించింది. గ్రూపు దశలో అన్ని మ్యాచ్^లనూ ఓడిపోయిన తొలి ఆతిథ్య దేశంగా ఖతార్ నిలిచింది.[61] ఈ గ్రూపులో రన్నరప్‌గా నిలిచే జట్టును నిర్ణయించే మ్యాచ్ సెనెగల్, ఈక్వడార్ ల మధ్య జరిగింది. తొలి అర్ధ భాగం చివర్లో ఇస్మాయిల్ సార్, పెనాల్టీ కిక్ ద్వారా గోలు చేసి సెనెగల్‌ను ఆధిక్యం లోకి తీసుకెళ్ళాడు. ఆట 67 వ నిమిషంలో మోయిసెస్ కైసెడో గోలు చేసి స్కోరును సమం చేసాడు. ఆ వెంటనే కాలిడూ కౌలిబాలి మరో గోలు చేయడంతో సెనెగల్ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో సెనెగల్ గ్రూపు ఎలో రన్నరప్‌గా నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. [62]
గ్రూపు Bలో, ఇరాన్‌పై ఇంగ్లండ్ 6-2తో విజయం సాధించింది. [63] ఇరాన్ కీపర్ అలీరెజా బీరన్వాండ్ తలకు దెబ్బ తగలడాన మైదానం నుండి బయటికి తీసుకువెళ్ళారు. సెకండాఫ్‌లో మెహ్దీ తరేమీ ఇరాన్‌కు గోల్ చేశాడు, ఆ తర్వాత ఇంగ్లండ్ డిఫెండర్ హ్యారీ మాగ్వైర్‌కు కూడా తలకు దెబ్బ తగలడాన అతన్ని బయటికి తీసుకెళ్ళారు. అమెరికా, వేల్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. అమెరికాకు చెందిన టిమ్ వీహ్ వేల్స్‌పై మొదటి అర్ధభాగంలో గోల్ చేశాడు, అయితే, వేల్స్‌కు చెందిన గారెత్ బేల్ పెనాల్టీ కిక్ ద్వారా గోల్ చేయడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. [64] నవంబరు 25 న జరిగిన మ్యాచ్‌లలో మొదటిదానిలో ఇరాన్ వేల్స్‌ను 2–0 తో ఓడించింది.[65] ఇంగ్లాండు, అమెరికాల మధ్య జరిగిన రెండవ మ్యాచ్‌లో గోల్‌లేమీ లేకుండా డ్రాగా ముగిసింది.[66] నవంబరు 29 న జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లలో ఇంగ్లాండు వేల్స్‌ను ఓడించి గ్రూపు విజేతగా నిలవగా, అమెరికాతో ఇరాన్‌ను ఓడించి, గ్రూపులో రన్నరప్‌గా నిలిచింది. ఇంగ్లాండు, అమెరికాలు నాకట్ దశకు అర్హత సాధించగా, ఇరాన్, వేల్స్‌ల కథ ముగిసింది. [67][68]
గ్రూపు సిలో అర్జెంటీనా, సౌదీ అరేబియాల ఆట మొదలైన పది నిమిషాల తర్వాత లియోనెల్ మెస్సీ పెనాల్టీ కిక్‌ను గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం సాధించింది. అయితే, సెకండ్ హాఫ్‌లో సౌదీ అరేబియా తరఫున సలేహ్ అల్-షెహ్రీ, సేలం అల్-దవ్సారి చెరొక గోల్ చేయడంతో సైదీ అరేబియా 2-1తో విజయం సాధించింది. [69] మెక్సికో, పోలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 0-0 స్కోరుతో డ్రాగా ముగిసింది. నవంబరు 26 న జరిగిన మొదటి మ్యాచ్‌లో పోలాండ్ సౌదీ అరేబియాను 2-0 తో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సౌదీకి లభించిన్పెనాల్టీ కిక్‌ను పోలండు గోల్‌కీపరు గోలు కాకుండా అడ్డుకున్నాడు. ఈ టోర్నమెంటులో ఇది పదవ పెనాల్టీ కాగా, విజయవంతంగా అడ్డుకున్నవాటిలో ఇది మూడవది. రెండవ మ్యాచ్‌లో అర్జెంటైనా మెక్సికోను 2-0 తో ఓడించింది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన అర్జెంటైనా, ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ ఆశలను నిలబెట్టుకుంది. ఈ ప్రపంచ కప్పు పోటీల్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన (88,966) ఆట ఇదే. గత 28 ఏళ్ళలో జరిగిన ప్రపంచ కప్పు మ్యాచ్‌లకు కూడా ఇది రికార్డే. [70] నవంబరు 30 న జరిగిన మ్యాచ్‌లలో ఒకదానిలో అర్జెంటీనా పోలండును 2-1 తో ఓడించి గ్రూపులో అగ్రస్థానంలో నిలవగా, రెండవ మ్యాచ్‌లో మెక్సికో సౌదీ అరేబియాను 2-1 తో ఓడించింది. అయితే మెరుగైన గోల్‌ల తేడా కారణంగా పోలండ్ ఈ గ్రూపులో రెండవ స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకుంది.
గ్రూపు D లో, డెన్మార్క్, ట్యునీషియాల మధ్య జరిగిన మ్యాచ్ 0-0 డ్రాగా ముగిసింది. [71] యూరో కప్పు పోటీల్లో గుండె పోటు వచ్చిన డెన్మార్కు మిడ్‌ఫీల్డరు క్రిస్టియన్ ఎరిక్‌సెన్, ఈ పోటీలో తిరిగి ఆట లోకి రంగప్రవేశం చేసాడు.[71] ఫ్రాన్సు, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో, క్రేగ్ గుడ్‌విన్ చేసిన గోలుతో ఆస్ట్రేలియా ఫ్రాన్సుపై కొంతసేపు ఆధిక్యత సాధించినప్పటికీ, ఫ్రాన్సు ఆ తరువాత 4 గోల్‌లు సాధించి 4-1 తో మ్యాచ్ గెలిచింది.[72] ఈ మ్యాచ్‌లో గిరో చేసిన 2 గోల్‌లతో అతను ఫ్రాన్సు తరపున అత్యధిక గోల్‌లు చేసిన ఆటగాడైన థియరీ హెన్రీతో సముడయ్యాడు. [72] నవంబరు 26 న జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ట్యునీసియాను 1-0 తో ఓడించింది. 2010 తరువాత ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి గెలుపు.[73][74]రెండవ మ్యాచ్‌లో ఫ్రాన్స్ డెన్మార్క్‌ను 2-1 తో ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. 2006 లో బ్రెజిల్ తరువాత, డిఫెండింగ్ చాపియన్లు నాకౌట్ దశకు చేరడం ఇదే మొదటి సారి. [75][73] నవంబరు 30 న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1-0 తో డెన్మార్కును ఓడించి గ్రూపులో రెండవ స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకుంది.[76] రెండవ మ్యాచ్‌లో ట్యునీసియా 1-0 తో ఫ్రాన్సును ఓడించింది. వాహ్బీ ఖాజ్రీ 58 వ నిమిషంలో త్యునీసియాకు గోల్ సాధించాడు. ఫ్రాన్సు ఆటగాడు ఆంటోనీ నీజ్‌మాన్ స్టాపేజి సమయంలో గోలు చేసినప్పటికీ ఆఫ్‌సైడు కారణంగా అది చెల్లలేదు. ఈ మ్యాచ్ తరువాత కూడా ఫ్రాన్స్ గ్రూపులో అగ్రస్థానంలో నిలవగా, ట్యునీసియా మూడవ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా డెన్మార్కుల మ్యాచి డ్రా అయి ఉంటే ట్యునీసియా రెండవ స్థానంలో ఉండేది. [77]
గ్రూపు ఇలో జపాన్, జర్మనీల మ్యాచ్‌లో జర్మనీ, ఇల్కే గుండోగన్ చేసిన తొలి గోలుతో ఆధిక్యం లోకి వెళ్ళినప్పటికీ, జపాన రెండవ సగంలో జపాన్ ఆటగాడు రిట్సు దోన్ రెండు గోలులు చేయడంతో జపాన్ 2-1 తో మ్యాచ్ గెలిచింది. [78] రెండవ మ్యాచ్‌లో స్పెయిన్ కోస్టారికాను 7–0 తో ఓడించింది. మొదటి సగంలో డాని ఓల్మో, మార్కో ఎసెన్సియో, ఫెర్రన్ టోర్రెస్ లు తలా ఒక గోలు చేయగా, రెండవ సగంలో గావి, కార్లోస్ సోలర్, ఆల్వారో మొరాటా లతో పాటు టోర్రెస్ మరో గోలు కొట్టాడు. [79][80] 2010 లో ఉత్తర కొరియాపై పోర్చుగల్ 7-0 తో గెలిచాక, ఇంత పెద్ద గెలుపు ఇదే.[81] నవంబరు 27 న జరిగిన మ్యాచ్‌లలో కోస్టారికా జపాన్‌పై 1-0 తో గెలుపొందగా, స్పెయిన్, జర్మనీల మధ్య మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రా అయింది. డిసెంబరు 1 న జరిగిన మ్యాచ్‌లలో జపాన్ స్పెయిన్‌ను 2-1 తో ఓడించగా, జర్మనీ కోస్టారికాను 4-2 తో ఓడించింది. జపాన్, స్పెయిన్‌లు ఈ గ్రూపులో అగ్రస్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి. [82]
గ్రూపు ఎఫ్ మ్యాచ్ లలో మొరాకో, క్రొయేషియాల మ్యాచ్ డ్రాగా ముగిసింది. బెల్జియం-కెనడాల మ్యాచ్‌లో మిచీ బట్షువాయి చేసిన గోలుతో బెల్జియం కెనడాపై 1-0 తో గెలిచింది. కెనడాకు లభించిన ఒక పెనాల్టీ కిక్‌ను బెల్జియం గోల్‌కీపరు అడ్డుకున్నాడు. నవంబరు 27 న జరిగిన మ్యాచ్‌లో బెల్జియం మొరాకో చేతిలో 2-0 తో ఓటమి పాలైంది. దీనిపై బెల్జియంలో అల్లర్లు చెలరేగాయి. [83] ప్రపంచ కప్ పోటీల్లో మొరాకోకు 1998 తరువాత ఇదే తొలి గెలుపు. [84][85] అదే రోజున జరిగిన మరో మ్యాచ్‌లో క్రొయెషియా కెనడాను 4-1 తో ఓడించింది. ప్రపంచ కప్‌లో కెనడాకు ఇదే తొలి గోలు. [86] డిసెంబరు 1 న జరిగిన మ్యాచ్‌లో మొరాకో కెనడాని 2-1 తో ఓడించి, గ్రూపులో మొదటి స్థానంలో నిలిచింది. [87] అదే రోజు జరిగిన రెండవ మ్యాచ్‌లో క్రొయేషియా, బెల్జియంల మ్యాచ్ 0-0 తో డ్రాగా ముగిసింది. క్రొయేషియా గ్రూపులో రెండ స్థానంలో నిలిచి నాకౌట్ దశకు వెళ్ళగా ప్రపంచ నంబర్-2 అయిన బెల్జియం గ్రూపు దశ లోనే పోటీల్లోంచి బయటకు పోయింది. [88]
గ్రూపు జి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ కామెరూన్‌ను 1-0 తో ఓడించింది. ఈ గోల్‌ను బ్రీల్ ఎంబోలో చేసాడు. ఈ గ్రూపు లోని రెండవ మ్యాచ్‌లో బ్రెజిల్ సెర్బియాను 2–0 తో ఓడించింది. గాయం కారణంగా బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్, ఈ పోటీలో దిగలేదు. ఈ రెండు గోల్‌లను రిచార్ల్‌సన్ చేసాడు. నవంబరు 28 న జరిగిన మ్యాచ్‌లలో మొదటిదాన్ని కామెరూన్ సెర్బియాలు 3-3 తో డ్రా చేసుకున్నాయి. కామెరూన్ ముందుగా ఒక గోలు చేసి ఆధిక్యం లోకి వెళ్ళగా, సెర్బియా వరసగా 3 గోల్‌లు చేసి ముందుకు వెళ్ళింది. ఆ తరువాత కామెరూన్ మరో రెండు గోలులు చేసి స్కోరును సమం చేసింది.[89]బ్రెజిల్ స్విట్జర్లాండ్‌ల మ్యాచిలో కాసెమీరో ఒక గోలు చేసి బ్రెజిల్‌ను 1-0 తో గెలిపించాడు. [90] నవంబరు 2 న జరిగిన మ్యాచ్‌లో కామెరూన్ బ్రెజిల్‌ను 1-0 తో ఓడించింది. ఆ గోల్ చేసిన విన్సెంట్ అబూబకర్ ఆ సంతోషంలో చొక్కా విప్పడంతో అతన్ని ఆట నుండి బయటికి పంపేసారు. [91] రెండవ మ్యాచ్‌లో స్విట్జర్లండ్ సెర్బియాను 3-2 తో ఓడించడంతో, మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన బ్రెజిల్, స్విట్జర్లండ్‌లు గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు వెళ్ళాయి. [92]
గ్రూపు హెచ్ మ్యాచ్ లలో మొదటిదాన్ని ఉరుగ్వే దక్షిణ కొరియాల డ్రాతో ముగించగా, రెండవ మ్యాచ్‌లో పోర్చుగల్ ఘనాపై 3-2 తో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ తరపున గోలు కొట్టిన క్రిస్టియానో రోనాల్డో 5 ఫిఫా ప్రపంచ కప్పుల్లో గోలు కొట్టిన మొట్టమొదటి ఆటగాడయ్యాడు. నవంబరు 28 న జరిగిన మ్యాచ్‌లో ఘనా దక్షిణ కొరియాను 3-2 తో ఓడించింది. ఘనా తరపున మొహమ్మద్ సలీసు 1 గోలు, మొహమ్మద్ కుదూస్ 2 గోల్‌లు చెయ్యగా, దక్షిణ కొరియా తరపున చో గ్యూ సంగ్ 2 గోల్‌లు చేసాడు.[93] లుసైల్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-0 తో ఉరుగ్వేను ఓడించి, నాకౌట్ దశకు అర్హత సాధించింది.[94] నవంబరు 2 న జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా, పోర్చుగల్‌ను 2-1 తో ఓడించింది. [95]అ దే రోజు జరిగిన రెండో మ్యాచ్‌లో ఉరుగ్వే, ఘనాను 2-0 తో ఓడించింది. [96] అయితే ఉరుగ్వే మరొక గోల్ చేసి ఉంటే నాకౌట్‌కు చేరి ఉండేది. [97] ఈ ఆట ముగిసాక, ఉరుగ్వే ఆటగాళ్ళు రిఫరీని చుట్టుముట్టారు. దానిపై పలు విమర్శలు వచ్చాయి. [98][99][100] ఈ గ్రూపులో పోర్చుగల్, దక్షిణ కొరియాలు నాకౌట్‌కు అర్హత సాధించాయి.
రౌండ్ 16 పోటీలు డిసెంబరు 3-7 ల మధ్య జరిగాయి. [27] డిసెంబరు 3 న జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్, అమెరికాను 3-1 తో ఓడించి, క్వార్టర్ ఫైనల్స్‌కు వెళ్ళింది. [101] అర్జెంటీనా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో లియోనెల్ మెస్సి, జూలియన్ ఆల్వారెజ్‌లు చెరొక గోల్ చేయగా, ఎంజో ఫెర్నాండెజ్ ఒక స్వీయ గోల్ చేసుకున్నాడు. దాంతో అర్జెంటీనా ఆస్ట్రేలియాను 2-1 తో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది.[102] డిసెంబరు 4 న జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-1 తో పోలండ్‌ను ఓడించింది. ఇందులో 2 గోల్‌లు చేసిన కైలియన్ ఎంబాపె మొత్తం 5 గోల్‌లతో అత్యధిక గోల్‌లు చేసిన ఆటగాళ్ళలో అగ్రస్థానాన నిలిచాడు. మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్, సెనెగల్‌ను 3-0 తో ఓడించింది. జపాన్ క్రొయేషియాల మధ్య జరిగిన మ్యాచ్, అదనపు సమయంలో కూడా 1-1 తో డ్రాగా ముగియగా, పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో క్రొయేషియా 3-1 తో నెగ్గింది.[103] మరో మ్యాచ్‌లో బ్రెజిల్ దక్షిణ కొరియాను 4-1 తో ఓడించింది.[104] మొరాకో స్పెయిన్‌ల మ్యాచ్ కూడా 0-0 తో డ్రాగా ముగియగా, పెనాల్టీ షూటౌట్‌లో మొరాకో 3–0 తో గెలిచింది.[105] మరో మ్యాచ్‌లో పోర్చుగల్ స్విట్జర్లండ్‌ను 6-1 తో ఓడించింది. గొంకాలో రామోస్ హ్యాట్రిక్ సాధించాడు. 1990 తరువాత నాకౌట్ దశలో హ్యాట్రిక్ సాధించడం ఇదే మొదలు. [106] ఆ నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, క్రొయేషియా, బ్రెజిల్, మొరాకో, పోర్చుగల్ లు క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాయి.
డిసెంబరు 9, 10 తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్ జరిగాయి. [27] 9 న అజరిగన్ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ క్రొయేషియాలు అదనపు సమయం తరువాత 1-1 తో సమంగా నిలబడడంతో పెనాల్టీ షూటౌట్ ఆడారు. క్రొయేషియా 4-2 తో పెనాల్టీ షూటౌట్ గెలుచుకుని సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది..[107][108] రెండవ మ్యాచ్‌లో అర్జెంటీనా, నెదర్లాండ్స్‌లు 2-2 తో డ్రాగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ జరిగింది. అందులో అర్జెంటీనా 4-3 తో గెలిచి సెమీస్ లోకి వెళ్ళింది.[109]
మోరాకో పోర్చుగల్‌ను 1–0 తో ఓడించింది. ప్రపంచ కప్ పోటీల్లో సెమీఫైనల్స్‌కు చేరిన తొలి ఆఫ్రికా దేశం, తొలి అరబ్బు దేశం -మొరాకో.[110] మరో పోటీలో ఫ్రాన్స్, ఇంగ్లాండును 2-1 తో ఓడించి వరసగా రెండోసారి ప్రపంచ కప్ సెమీఫైనల్సుకు చేరింది.[111][112]
క్వార్టర్ ఫైనల్స్ తరువాతి దశలో జరిగిన పోటీల ఫలితాలను సంబంధిత విభాగాల్లో (సెమీ ఫైనల్స్, మూడో స్థానం, ఫైనల్) చూడవచ్చు.
పోటీలో ఉన్న దేశాలను ఎనిమిది గ్రూపులుగా (గ్రూపులు ఎ నుండి హెచ్ వరకు) ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉండేలా విభజించారు. ప్రతి గ్రూప్‌లోని జట్లు రౌండ్-రాబిన్ పద్ధతిలో ఒకదానితో ఒకటి ఆడతాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.
గ్రూపు దశలో జరిగే పోటీల్లో స్కోరు సమంగా ఉన్నపుడు టై బ్రేకు ఉండదు. మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తాయి. అయితే గ్రూపు లోని మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాక, వాటికి ర్యాంకులు ఇవ్వడానికి కింది పద్ధతిని పాటిస్తారు. ఈ పద్ధతిలో గ్రూపులో రెండు కంటే ఎక్కువ జట్లకు పాయింట్లు ఒకే రకంగా వస్తే, వాటి మధ్య టై బ్రేకు చెయ్యడానికి వీలౌతుంది.
గ్రూపు దశ పోటీలో టై-బ్రేకు విధానం
గ్రూప్ దశలో జట్ల ర్యాంకింగ్ ఈ క్రింది విధంగా నిర్ణయిస్తారు: [113]
గ్రూప్ మ్యాచ్‌లన్నిటిలో పొందిన పాయింట్లు:
గెలుపు: 3 పాయింట్లు;
డ్రా: 1 పాయింటు;
ఓటమి: 0 పాయింట్లు;
(పాయింట్లు సమంగా ఉంటే) గ్రూప్ మ్యాచ్‌లన్నిటిలో ఉన్న గోల్ తేడా;
(గోల్‌ల తేడా ఒకటే ఉంటే) గ్రూప్ మ్యాచ్‌లన్నిటిలో సాధించిన గోల్‌ల సంఖ్య;
(సాధించిన గోల్‌ల సంఖ్య ఒకటే అయితే) ఆయా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో పొందిన పాయింట్లు;
(పైవన్నీ ఒకటే ఉన్న రెండూ జట్లకూ జరిగిన పోటీలో) ఆయా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో గోల్‌ల తేడా;
ఆయా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో సాధించిన గోల్‌ల సంఖ్య;
గ్రూప్ మ్యాచ్‌లన్నిటిలో సాధించిన ఫెయిర్ ప్లే పాయింట్లు (ఒక మ్యాచ్‌లో ఒక ఆటగానికి ఒక తగ్గింపు మాత్రమే వర్తిస్తుంది):
పసుపు కార్డు: −1 పాయింటు;
పరోక్ష ఎరుపు కార్డు (రెండవ పసుపు కార్డు): −3 పాయింట్లు;
డైరెక్ట్ రెడ్ కార్డ్: −4 పాయింట్లు;
ఎల్లో కార్డ్, డైరెక్ట్ రెడ్ కార్డ్ రెండూ: −5 పాయింట్లు;
(పై పద్ధతులలో టై బ్రేకు చెయ్యలేని పక్షంలో) డ్రా తీయడం ద్వారా
నాకౌట్ దశలో, సాధారణ ఆట సమయం ముగిసే సమయానికి స్కోర్లు సమానంగా ఉంటే, అదనపు సమయాన్ని 15 నిమిషాల చొప్పున రెండు పీరియడ్‌లు ఆడతారు. దీని తరువాత, అవసరమైతే, విజేతలను నిర్ణయించడానికి పెనాల్టీ షూట్-అవుట్ ద్వారా జరుగుతుంది. [114]
ఈ ప్రపంచ కప్ ముందు వరకు అర్జెంటీనా క్రొయేషియాతో 5 సార్లు పోటీ పడగా, 2 సార్లు గెలిచి, 2 సార్లు ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. వీటిలో రెండు మ్యాచ్‌లు ప్రపంచ కప్‌లో జరిగాయి. 1998 లో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తో గెలవగా, 2018 లో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 3-0 తో గెలిచింది.[115]
తొలి 30 నిమిషాల్లో ఇరు జట్లూ జాగ్రత్తగా ఆడాయి. 34 వ నిమిషంలో జూలియన్ ఆల్వారెజ్‌ను క్రొయేషియా డిఫెండరు లివకోవిచ్ డీకొట్టడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. లియోనెల్ మెస్సీ దాన్ని గోలుగా మలచాడు. 39 వ నిమిషంలో ఆల్వారెజ్ అర్జెంటీనాకు రెండో గోలు సాధించాడు. ఆట రెండో సగంలో క్రొయేషియా కోచ్ అనేక ఆటగాళ్ళను మార్చాడు. 69 వ నిమిషంలో మెస్సి అందించిన పాస్‌ను ఆల్వారెజ్ గోలుగా మలచాడు. దాంతో అర్జెంటీనా 3-0 తో నెగ్గింది.[116] మెస్సీ చేసిన గోలుతో అతను మాజీ అర్జెంటీనా ఆటగాడు బటిస్టుటా ప్రపంచ కప్‌లో అర్జెంటీనా తరపున చేసిన అత్యధిక 10 గోల్‌ల రికార్డును ఛేదించాడు. ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా జర్మను ఆటగాడు లోథార్ మాథౌస్‌తో సముడయ్యాడు. ఫైనల్ పోటీలో ఆడితే, మెస్సి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడౌతాడు.[117]
ఈ ప్రపంచ కప్ ముందు వరకు ఫ్రాన్సు మొరాకోతో 7 సార్లు పోటీ పడగా, ఐదింట్లో గెలిచి, రెండింటిని డ్రా చేసుకుంది. ప్రపంచ కప్‌లో మాత్రం ఇదే వాటి తొలి పోటీ.[118]
ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో ఒక ఆఫ్రికా దేశం పోటీ పడడం ఇదే తొలిసారి, ఒక అరబ్బు దేశానికి కూడా ఇదే తొలిసారి. ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలు కాకుండా వేరే ఖండానికి చెందిన దేశం సెమీఫనల్సులో ఆడడం ఇది మూడోసారి. గతంలో అమెరికా 1930 లోను, దక్షిణ కొరియా 2002 లోనూ సెమీస్‌లో ఆడాయి.
థియో హెర్నాండెన్ 4 నిమిషాల 39 సెకండ్లకు తొలి గోలు చేసి ఫ్రాన్సుకు ఆధిక్యత సంపాదించి పెట్టాడు. ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో ఇంత త్వరగా గోలు చెయ్యడం 1958 తరువాత ఇదే తొలిసారి. [119]79 వ నిమిషంలో సబ్‌స్టిట్యూటుగా వచ్చిన రాండ్ల్ కోలో మువాని వచ్చిన మొదటి నిమిషం లోనే గోలు చేసి ఫ్రాన్స్ ఆధిక్యతను మరింత పెంచాడూ, చివరికి ఫ్రాన్స్ 2-0 తో మొరాకోను ఓడించి వరసగా రెండో సారి ప్రపంచ కప్ ఫైనల్సుకు చేరింది. కప్పు గెలిస్తే, వరసగా రెండో సారి కప్పు గెలవడం 1962 తరువాత (1958, 1962 లలో బ్రెజిల్ కప్పు గెలుచుకుంది) ఇదే తొలిసారి అవుతుంది. [120]
గతంలో ఈ రెండు జట్లు రెండుసార్లు (ఈ ప్రపంచ కప్ గ్రూపు దశలో ఒక పోటీతో కలిపి) పోటీపడ్డాయి.[121]
ఈ మ్యాచ్ ఏడో నిమిషంలో గోలు చేసి క్రొయేషియా ఆధిక్యం లోకి వెళ్ళినప్పటికీ, మళ్ళీ 9 వ నిమిషం లోనే మొరాకో గోలు చేసి స్కోరును సమం చేసింది.[122] మ్యాచ్ 42 వ నిమిషంలో మరొక గోలు సాధించి క్రొయేషియా, 2-1 తో మూడవ స్థానాన్ని గెలుచుకుంది. 1998 తరువాత క్రొయేషియా 3 వ స్థానంలో నిలవడం ఇదే తొలి సారి.[123]
2022 డిసెంబరు 18 న జరిగిన ఫైనల్ పోటీలో పాల్గొన్న రెండు జట్లూ గతంలో ప్రపంచ కప్‌ను చెరి రెండు సార్లు గెలుచుకున్నాయి. [124] ఈ మ్యాచ్‌లో 36 నిమిషాలకే అర్జెంటీనా రెండు గోల్‌లు చేసి 2-0 ఆధిక్యం లోకి వెళ్ళింది.[124][4] ఫ్రాన్స్ మొదటి సగంలో గోలు చెయ్యలేకపోయింది. రెండవ సగంలో 80 వ నిమిషంలో పెనాల్టీ కిక్ ద్వారా ఎంబాపె ఫ్రాన్సుకు తొలి గోలు అందించాడు. ఆ తరువాత రెండు నిమిషాలకే మరో గోలు చేసి స్క్జోరును సమం చేసాడు. ఆట అదనపు సమయం లోకి వెళ్ళింది. 108 వ నొఇమిషంలో మెస్సి మరొక గోలు చేసి 3-2 ఆధిక్యత సాధించాడూ., మళ్ళీ ఎంబాపె పెనాల్టీ కిక్ ద్వారా ఫ్రాన్సుకు మూడవ గోలు చేసి స్కోరును సమం చేసాడు. [4] ఈ విధంగా అదనపు సమయం ముగిసేసరికి అర్జెంటీనా, ఫ్రాన్సులు 3-3 తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. అందులో అర్జెంటీనా 4-2 తో గెలిచి ప్రపంచ కప్‌ను మూడవసారి గెలుచుకుంది. [4] ఫ్రెంచి ఆటగాడు కైలియన్ ఎంబాపె ఫైనల్లో హ్యాట్రిక్ చేయడమే కాకుండా, టోర్నమెంటులో మొత్తం 8 గోల్‌లు చేసి అత్యధిక గోల్‌లు చేసిన ఆటగాడిగా బంగారు బూట్‌ను గెలుచుకున్నాడు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా నిలిచి బంగారు బంతిని గెలుచుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎమిలియానో మార్టినెజ్ అత్యుత్తమ గోల్‌కీపరుగా బంగారు గ్లౌజును అందుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎంజో ఫెర్నాండెజ్, టోర్నమెంటులో అత్యుత్తమ యువ ఆటగాడిగా ఎంపికయ్యాడు.