ఫాస్ట్ బౌలింగు

(Fast bowling నుండి దారిమార్పు చెందింది)

ఫాస్ట్ బౌలింగ్ క్రికెట్ క్రీడలో బౌలింగ్‌కు సంబంధించిన రెండు ప్రధాన విధానాలలో ఒకటి. దీన్ని పేస్ బౌలింగ్ అని కూడా అంటారు. మరొక బౌలింగు పద్ధతి, స్పిన్ బౌలింగు. పేస్ బౌలింగ్ వేసేవాళ్ళను ఫాస్ట్ బౌలర్లని, క్విక్‌లని, పేసర్లు అనీ పిలుస్తారు. వారిని సీమ్ బౌలరని, స్వింగ్ బౌలరనీ లేదా వారి డెలివరీల యొక్క ప్రధాన లక్షణాన్ని ప్రతిబింబించేలా స్వింగ్ చేయగల ఫాస్ట్ బౌలర్ అనీ కూడా అంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే, ఒక స్వచ్ఛమైన స్వింగ్ బౌలర్‌కు అధిక స్థాయిలో పేస్ ఉండాల్సిన అవసరం లేదు. అయితే, కేవలం మీడియం-పేస్ వేసే స్వింగ్ బౌలర్లు ఆధునిక కాలంలో టెస్ట్ స్థాయిలో అరుదుగా కనిపిస్తారు.

పేస్ బౌలింగ్ లక్ష్యం, బ్యాటర్ పొరపాటు చేసే విధంగా బంతిని వెయ్యడం. దీనిని సాధించడానికి, బంతిని బ్యాటరు ఊహించే సరళరేఖలో కాకుండా దానిని పక్కకు మళ్లిస్తాడు. పైగా బ్యాటరు దాన్ని ఎదుర్కోగలిగేంత సమయం ఇవ్వకుండా బంతిని చాలా వేగంగా వేస్తాడు. బంతి నేలను తాకాక, దానిపై ఉండే సీమ్ (కుట్టు) నేలకు తాకి బంతి విచలనం చెంది బ్యాటర్ నుండి దూరంగా గానీ, బ్యాటరు వైపుగా లోపలికి గానీ దూసుకు వెళ్తుంది. మరోవైపు స్వింగ్ బౌలర్లు కూడా బంతి సీమ్‌ను ఉపయోగిస్తారు, కానీ వేరే విధంగా. 'స్వింగ్ బౌలింగ్' అంటే, బంతిని వేసినపుడు నేలకు తగలకముందే గాలిలోనే బంతిని వంపులో వెళ్ళేలా చేయడం. స్వింగ్ బౌలర్లు బంతిని విడుదల చేసే సమయంలో సీమ్‌ను ఉంచే దిశ శరీరం ఉన్న స్థితి, బంతిని ఒకవైపునే పాలిష్ చెయ్యడం, బంతిపై ఏరోడైనమిక్ ప్రభావాన్ని చూపడానికి డెలివరీ వేగంలో మార్పులు చెయ్యడం వంటివి చేస్తారు. బంతిని పక్కకు మళ్ళించే బౌలరు సామర్థ్యాన్ని బట్టి బంతి గాల్లో ప్రయాణిస్తూ దాన్ని ఆడడం బ్యాటరుకు కష్టతరం అవుతుంది. ఈ సామర్థ్యానికి మించి ఫాస్ట్ బౌలరు, బంతిని బాగా వేగంగా వేసి బ్యాటరుకు సరిగా ఆడలేని, లేదా అసలే ఆడలేని పరిస్థితి కల్పిస్తారు.

స్పిన్ బౌలర్లు కూడా బ్యాటర్లను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వారు వేరే పద్ధతిలో చేస్తారు. స్పిన్ బౌలింగులో బంతి వేగం సాధారణంగా బాగా తక్కువగా ఉంటుంది. తక్కువ వేగంతో వచ్చే బంతిని ఆడడంలో బ్యాటరుకు వీలుగా ఉంటుంది. కానీ, సమర్థవంతమైన స్పిన్ బౌలర్లు ఫాస్ట్ బౌలింగులో కంటే మరింత తీవ్రంగా బంతిని పక్కకు మళ్లిస్తూ బంతి మెల్లగా రావడంలో బ్యాటరుకు ఉండే సౌకర్యాన్ని లేకుండా చేస్తారు,

పరిభాష

మార్చు

పేస్ బౌలర్లను పరిమాణాత్మక లేదా గుణాత్మక లక్షణాల ఆధారంగా వర్గీకరించవచ్చు.

వర్గీకరణ బంతి సగటు వేగంపై ఆధారపడి ఉంటుంది. అయితే, విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన నిర్వచనం అంటూ ఒకటి లేదు. వేగాన్ని బట్టి చేసే వర్గీకరణలో పోటీ స్థాయిని, [1] లింగాన్నీ పరిగణనలోకి తీసుకోవచ్చు. [2] "స్లో మీడియం", "మీడియం", "ఫాస్ట్ మీడియం", "ఫాస్ట్", "ఎక్స్‌ప్రెస్" వంటి వర్గీకరణలున్నాయి. [3] ప్రముఖ క్రికెట్ వార్తా వెబ్‌సైటైన ESPNcricinfo, "మీడియం", [4] "ఫాస్ట్"తో పాటు "మీడియం ఫాస్ట్", [5] "ఫాస్ట్ మీడియం" [6] అనే రెండు వర్గాలను కూడా ఉపయోగిస్తుంది. [7]

బౌలర్లు స్వింగ్ బౌలింగ్ లేదా సీమ్ బౌలింగ్ పద్ధతులను ఉపయోగించి వర్గీకరించబడవచ్చు, అయితే "సీమర్" అనే పదాన్ని సాధారణంగా పేస్ బౌలర్లను సూచించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. [8] [9]

 
ఫాస్ట్ బౌలింగ్ పట్టు

పట్టు

మార్చు

ముందుగా, ఫాస్ట్ బౌలర్ బంతిని సరిగ్గా పట్టుకోవాలి. గరిష్ట వేగాన్ని సాధించడానికి అవసరమైన ప్రాథమిక ఫాస్ట్ బౌలింగ్ గ్రిప్ ఏమిటంటే, బంతిని సీమ్‌ నిలువుగా ఉండేలా పెట్టి, చూపుడు వేలును, మధ్య వేలును బంతికి పైన సీమ్‌కు ఇరువైపులా దగ్గరగా ఉంచి, బొటనవేలును బంతికి దిగువన సీం పైన పట్టుకోవడం. ఎగువన ఉన్న చిత్రం సరైన పట్టును చూపుతుంది. మొదటి రెండు వేళ్లు, బొటనవేలు కలిసి బంతిని మిగిలిన చేతికంటే ముందుకి ఉంచాలి. మిగిలిన రెండు వేళ్లను అరచేతిలోకి మడిచి ఉంచాలి. బంతిని చాలా వదులుగా పట్టుకోవాలి. తద్వారా విసరినపుడు అది చేతిని సులభంగా వదిలివేస్తుంది. ఇతర రకాల గ్రిప్‌లు కూడా ఉన్నాయి. బౌలర్ రెండవచేతిని, బంతిని పట్టుకున్న చేతిపై కప్పి ఉంచుతాడు. బంతిని విసిరే లోపు ఎంతసేఫు అలా ఉంచగలిగితే అంత వరకూ అలాగే కప్పి ఉంచుతాడు. తద్వారా బౌలరు ఏ రకమైన బంతిని వేయబోతున్నాడో బ్యాటర్లు గ్రహించలేరు.

ఫాస్ట్ బౌలరు, బంతిని వేగంగా వేసేందుకు అవసరమైన ఊపు తెచ్చుకునేందుకు, ఒక లయను తెచ్చుకునేందుకూ వికెట్‌కు కొంచెం దూరం నుండి పరుగు తీయడం మొదలుపెడ్ఫతాడు. ఈ రనప్ స్పిన్నరు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లు తమ రనప్‌ను అంగలతో కొలిచి, వికెట్ నుండి ఎంత దూరంలో పరుగు మొదలుపెట్టాలో గుర్తు పెట్టుకుంటారు. రనప్ ఎంత ఉండాలో ఖచ్చితంగా గుర్తించడం బౌలరుకు చాలా ముఖ్యం - ఎందుకంటే అది బంతిని వదిలే క్రీజు వద్ద ఉండే రేఖ వెనుకనే ముగియాలి. ఆ రేఖ దాటితే అది నోబాల్‌ అవుతుంది. నోబాల్‌లో బ్యాటరు ఔటైనా ఔటుగా పరిగణించరు, బ్యాటింగ్ జట్టుకు ఒక పరుగు ఇస్తారు, ఆ ఓవరులో ఒక బంతి అదనంగా వెయ్యవలసి ఉంటుంది.

యాక్షను

మార్చు

రన్-అప్ ముగింపులో బౌలర్ మోకాలిని వీలైనంత నిటారుగా ఉంచి పిచ్‌పై తన ముందు కాలిని కిందకు తీసుకువస్తాడు. ఇది వేగాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది గానీ, ఇది మోకాలి కీలుపై కలగజేసే ఒత్తిడి ప్రమాదకరంగా ఉంటుంది. అంచేతనే ఫాస్ట్ బౌలర్లలో మోకాలి గాయాలు సాధారణంగా ఉంటూంటాయి. ఉదాహరణకు, ఇంగ్లాండ్‌ పేస్ బౌలర్ డేవిడ్ లారెన్స్ మోకాలి చిప్ప రెండుగా చీలడంతో చాలా నెలలు పక్కన కూచోవలసి వచ్చింది. ముందు కాలిపై ఒత్తిడి ఎంత ఉంటుందంటే, కొంతమంది ఫాస్ట్ బౌలర్లు తమ కాలి వేళ్ళ మీద వత్తిడినుండి కాపాడుకునేందుకు వాళ్ళ బూట్ల ముందు భాగాన్ని కత్తిరించి తీసేస్తారు. ఆ తర్వాత బౌలరు తన బౌలింగ్ చేతిని వెనక నుండి తిప్పుతూ తలపైగా తీసుకువెళ్ళి బంతిని ఎక్కడ వెయ్యాలనుకుంటున్నాడో ఆ దూరానికి తగినంత ఎత్తున చెయ్యి ఉన్నపుడు బంతిని వదుల్తాడు. ఈ సమయంలో చెయ్యి నిటారుగా ఉండాలి, మోచేతి వద్ద వంచకూడదు. ఇది క్రికెట్ చట్టాల్లోని నిబంధన. మోచేయిని వంచి, బంతిని విసిరితే ("చకింగ్" చేయడం) బంతిని బ్యాటరు వికెట్‌పై ఖచ్చితంగా గురిపెట్టి వారిని అవుట్ చేయడం చాలా సులభం అవుతుంది.

 
మిచెల్ జాన్సన్ బౌలింగ్ చేస్తున్నాడు. "స్లింగ్ షాట్" చర్యను గమనించండి.

ఫాస్ట్ బౌలర్లు తన రనప్ ముగింపులో శరీరాన్ని రెండు విధాలుగా ఉంచవచ్చు. ఛాతీని, తుంటినీ సరిగ్గా బ్యాటరుకు ఎదురుగా ఉంచడం ఒక పద్ధతి కాగా, ఛాతీని తుంటిని బ్యాటరుకు అడ్దంగా 90 డిగ్రీల కోణంలో ఉంచడం రెండవ పద్ధతి. మొదటిదాన్ని చెస్ట్‌ఆన్ అని రెండవదాన్ని సైడ్‌ఆన్ అనీ అంటారు. వెస్టిండీస్ బౌలర్ మాల్కం మార్షల్ చెస్ట్-ఆన్ బౌలర్‌కి ఒక ఉదాహరణ కాగా, ఆస్ట్రేలియా పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీ సైడ్-ఆన్ టెక్నిక్‌ని గొప్పగా ఉపయోగించాడు.

బౌలరు యాక్షను వారి బౌలింగ్ వేగాన్ని ప్రభావితం చేయనప్పటికీ, అది వారు బౌలింగ్ చేయగల బంతుల శైలికి పరిమితులు విధిస్తుంది. శిలాశాసనం లాంటి నియమమేమీ కాదుగానీ, సైడ్-ఆన్ బౌలర్లు సాధారణంగా అవుట్‌స్వింగర్‌లను, చెస్ట్-ఆన్ బౌలర్లు సాధారణంగా ఇన్‌స్వింగర్‌లనూ వేస్తారు.

ఫాస్ట్ బౌలర్ యాక్షనులో ఒక శైలి, స్లింగ్ (స్లింగ్‌షాట్ అనీ జావెలిన్ అనీ పిలుస్తారు). ఈ పద్ధతిలో బౌలరు, చేతిని బాగా వెనుకకు చాచి బంతిని వేస్తారు. ఈ స్లింగింగ్ యాక్షను వల్ల అదనపు వేగం ఉత్పత్తి అవుతుంది. కానీ బంతిపై నియంత్రణ తగ్గుతుంది. స్లింగింగ్ యాక్షన్‌ చేసే అత్యంత ప్రసిద్ధ బౌలరు జెఫ్ థామ్సన్. అతను కొద్ది రనప్‌ తోనే అసాధారణ వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఇతర అంతర్జాతీయ బౌలర్లు ఫిడేల్ ఎడ్వర్డ్స్, షాన్ టైట్, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్, షోయబ్ అక్తర్.

ఫాలో త్రూ

మార్చు
 
మాథ్యూ హోగార్డ్ శిక్షణలో తన ఫాలో-త్రూను ప్రారంభించాడు.

బంతి వేసిన తర్వాత, బౌలరు తన యాక్షను ముగింపులో "ఫాలో త్రూ" చేస్తాడు. పిచ్‌పై నడవకుండా పక్కకు వెళ్ళడం, వేగాన్ని తగ్గించడానికి మరికొన్ని అంగలౌ వెయ్యడం ఇందులో ఉంటుంది. డెలివరీ చివరిలో పిచ్ లోని రక్షిత ప్రాంతంపైకి దూసుకెళ్లడం వల్ల ఉపరితలం దెబ్బతింటుంది. దానివలన స్పిన్ బౌలర్లకు అదనపు టర్ను లభిస్తుంది. ఆట చట్టాల ప్రకారం అలా చేయడం చట్టవిరుద్ధం. పిచ్‌పై అలా పరుగెత్తే బౌలర్లను హెచ్చరిస్తారు, ఒక ఇన్నింగ్సులో మూడు హెచ్చరికలు చేసిన తరువాత బౌలరును ఆ ఇన్నింగ్సులో మళ్లీ బౌలింగ్ చేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారు.

లైనూ లెంగ్తూ

మార్చు

సమర్థవంతమైన ఫాస్ట్ బౌలరుకు స్థిరమైన లైన్, లెంగ్త్‌లు కలిగి ఉండడం తప్పనిసరి. అంటే బౌలింగులో ఖచ్చితత్వం ఉండాలి. ఈ సందర్భంలో, లైన్ అంటే ఆఫ్ సైడు లెగ్ సైడుల మధ్య ఉన్న ప్రదేశంలో బంతి వెళ్ళే మార్గం. లెంగ్త్ అంటే నేలను తాకే ముందు బంతి బ్యాటర్ వైపుగా ప్రయాణించే దూరాన్ని చెబుతుంది. ఈ రెండింటి లోనూ లెంగ్త్ ఫాస్ట్ బౌలర్‌కు ముఖ్యమైనదుగా పరిగణిస్తారు. బౌలరు ఎంత ఎక్కువ వేగంగా వేస్తే, లైన్, లెంగ్త్‌లను సాధించడం అంత ఎక్కువ కష్టమవుతుంది. అయితే విపరీతమైన వేగం ఆ లోటును పూరిస్తుంది. ఖచ్చితత్వాన్ని నిలుపుకోగలిగే ఫాస్ట్ బౌలర్లు, బ్యాటర్ల పాలిట వినాశకర సామర్థ్యం కలిగి ఉంటారు. ఉదాహరణకు ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్, దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ షాన్ పొల్లాక్ అటువంటివారే.

ఆధునిక క్రికెట్‌లో, సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు లక్ష్యంగా పెట్టుకున్న రెండు రేఖల మధ్య ఉండే ప్రాంతాన్ని అనిశ్చితి కారిడార్ అని పిలుస్తారు. ఇది బ్యాటర్ ఆఫ్ స్టంప్ వెలుపల గానీ వాస్తవానికి స్టంప్‌ల మీదుగా గానీ ఉంటుంది. ఆ ప్రాంతంలో వచ్చే బంతి వికెట్‌ను కొట్టే అవకాశం ఉందా లేదా అని చెప్పడం బ్యాటర్‌కు కష్టంగా ఉంటుంది. ఆ బంతిని షాట్‌ కొట్టాలా, డిఫెండ్ చేసుకోవాలా, వదిలేయాలా అనేది తెలుసుకోవడం బ్యాటరుకు బహు కష్టం. ఈ సాంకేతికతను చారిత్రికంగా ఆఫ్ థియరీ అని పిలుస్తారు. అయితే ఇది ఇప్పుడు చాలా రొటీన్‌గా ఉంది. దీనికి ప్రత్యేకంగా పేరేమీ వాడరు. లేదా దాన్ని పూర్తిగా మర్చిపోయారు. లైన్‌లో వైవిధ్యం కూడా ముఖ్యమైనదే. లెగ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని వేసే బంతులకు ప్రయోజనం కూడా ఉంది.

ఒక నిర్దిష్ట షాట్‌ను కొట్టే బలహీనత బ్యాటర్‌కు ఉందని బౌలరుకు తెలిసినప్పుడు బంతిని వేసే లైన్‌పై ఖచ్చితమైన నైపుణ్యం, బాగా ఉపయోగపడుతుంది. వ్చక్కటి లైన్‌తో వేసే బౌలరు బంతిని బ్యాటరు బలహీన ప్రదేశంలో వేయగలడు. ఒక నిర్దిష్ట లైన్‌లో బంతులు కొట్టడంలో ఉండే అసమర్థతను అధిగమించడంలో బ్యాటరు విఫలమైతే, ఆ సంగతిని నైపుణ్యం కలిగిన లైన్ బౌలర్లు వాడుకుంటే కొంతమంది బ్యాటర్ల కెరీర్‌ ముగిసిపోవడానికి అది సరిపోతుంది.

లెంగ్తు

మార్చు
 
పేరు & బౌన్స్ ఎత్తును చూపే బంతుల పొడవు (బ్యాటర్ వద్దకు చేరుకోవడం). కోణాలు అతిశయోక్తి.

గుడ్ లెంగ్త్ బాల్ వేసినపుడు బ్యాటరుకు దాన్ని ముందుకు వెళ్ళి ఆడాలా లేదా వెనక్కి వెళ్ళి బ్యాక్‌ఫుట్‌ మీద ఆడాలా అనే సందేహం కలుగుతుంది. మంచి లెంగ్త్‌కు నిర్ణీత దూరం లేదా క్రికెట్‌లో ఏదైనా ఇతర లెంగ్త్ బంతి ఉండదు, ఎందుకంటే అవసరమైన దూరం బంతి వేగం, పిచ్ స్థితి, బౌలరు బ్యాటర్ల ఎత్తులను బట్టి మారుతుంది. ఫలానా కోణంలో వేసినదే "మంచి లెంగ్త్" అవుతుందని చెప్పడం సరికాదు -కొన్ని పరిస్థితుల్లో, కొన్ని పిచ్‌లపై, కొందరు బ్యాటర్‌లకు వివిధ లెంగ్తులు మరింత ప్రభావవంతంగా ఉంటాయి.

గుడ్ లెంగ్త్ కంటే కొంచెం ముందే బౌన్స్ అయ్యి, బ్యాటర్ పొత్తికడుపు వరకు పైకి లేచే బంతిని షార్ట్ పిచ్ అని లేదా లాంగ్ హాప్ అని అనవచ్చు. కిందపడి పైకి లేచాక బంతిని చూడటానికి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి, బ్యాటరుకు దీన్ని కొట్టడం కొంత సులభం. బ్యాటరు, షార్ట్-పిచ్ బంతిపై దాడిచేసి పుల్ షాట్ ఆడేందుకు వీలైన ఎత్తులో ఉంటుంది. మంచి లెంగ్తు కంటే బాగా ముందే నేలను తాకి పైకి లేచి, భుజం లేదా తల ఎత్తుకు చేరుకునే బంతిని బౌన్సర్ అంటారు. బ్యాటర్ తల కంటే ఎత్తుకు లేచే బంతిని సాధారణంగా అంపైర్లు వైడ్ అంటారు. షార్ట్ పిచ్ లేదా వైడ్ బంతుల్లో బౌలింగ్ చేయడం అంత మంచి ఆలోచన కాదు. ఎందుకంటే బ్యాటరు దాన్నుండి తప్పించుకోవడం, దాడి చేయడం సులభంగా ఉంటుంది.

మరోవైపు, గుడ్ లెంగ్త్ కంటే ఎక్కువ దూరంలో, బ్యాటరుకి కొంచెం దగ్గరగా పడిలేచే బంతులను ఫుల్ పిచ్ లేదా ఓవర్‌పిచ్డ్ లేదా హాఫ్ వాలీ అంటారు. మంచి పొడవు కంటే ఇవి తరచుగా ఆడటానికి సులభంగా ఉంటాయి, ఎందుకంటే సీమ్ నుండి బౌన్స్ అయిన తర్వాత పెద్దగా పక్కకు మళ్ళడానికి వాటికి సమయం ఉండదు. బ్యాటరు వద్దకు వచ్చేసరికి, తక్కువ ఎత్తులో ఉండి, డ్రైవ్ స్ట్రోక్‌లకు అనువుగా ఉంటాయి. అయితే, స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో ఫుల్ పిచ్‌ బంతి, నేలను తాకడానికి ముందు గాలిలో పక్కకు కదలడానికి ఎక్కువ సమయం ఉంటుంది. అది గాలిలో ఎలా, ఎంత స్వింగు అవుతుందో తెలీని అనిశ్చితి కారణంగా డ్రైవ్‌ షాటు ఆడితే బ్యాటరుకు ఔటయ్యే ప్రమాదం ఉంటుంది. బంతి బ్యాటరు పాదాలకు బాగా దగ్గరగా పిచ్ అయితే దాన్ని యార్కర్ అంటారు. ఇది బ్యాటరును క్రీజ్‌లోపలే ఉండేలా కట్టడి చేస్తుంది. పైగా, అది బ్యాటర్ల పాదాల వద్ద బౌన్స్ అవుతుంది కాబట్టి, సాంప్రదాయిక క్రికెట్ షాట్ కొట్టడం కష్టం. బంతి బ్యాటరును చేరే ముందు అసలు నేలను తాకనే తాకకుండా వస్తే దాన్ని ఫుల్ టాస్ అంటారు. బంతి పిచ్‌పై పడి పైకి లేస్తూ పక్కకు మళ్ళదు కాబట్టి ఈ బంతిని ఆడడం బ్యాటరుకు సులభం.

స్ట్రైక్ బౌలింగ్

మార్చు

బౌన్సరు

మార్చు

బౌన్సర్ (లేదా బంపర్) అనేది పిచ్ యొక్క మొదటి భాగంలో పిచ్ చేసి, అది బ్యాటరును చేరుకునే సమయానికి ఛాతీ లేదా తల ఎత్తున వెళ్ళే బంతి. ఇది బ్యాటరుకు రెండు సమస్యలను కలిగిస్తుంది. వారు దానిని ఆడటానికి ప్రయత్నిస్తే, వారి బ్యాట్ కంటి ఎత్తులో ఉంటుంది, దాంతో షాట్‌కి సరైన సమయానికి షాటు కొట్తడం కష్గ్టమౌతుంది. బంతిని వదిలివేసినట్లయితే అది వారి తలపై గానీ, ఛాతీపై గానీ బలంగా తగులుతుంది. బ్యాటరు గాయపడనూవచ్చు. ఈ కారణంగానే, ఎక్కువ బౌన్సర్లు వేసే బౌలింగును భయపెట్టే బౌలింగు అంటారు.

బౌన్సరుకు సాధారణంగా ఉండే ప్రతిస్పందన ఏమిటంటే, కిందికి వంగుని గానీ, కూచుని గానీ దాన్ని వదిలెయ్యడం. అయితే, ఇలా చెయ్యడానికి బ్యాటరు చాలా వేఘంగా ప్రతిస్పందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అలా తప్పించుకునే ప్రయత్నం చేసినా బంతి తగలవచ్చు. అసంకల్పితంగా చూపే స్పందన ఏంటంటే, బ్యాటును అడ్డంగా పెట్టి రక్షించుకోవడం. అయితే దీని ఫలితంగా బంతి బ్యాట్‌పై నుండి అనియంత్రిత కోణంలో ఎగిరి తేలికగా క్యాచ్‌కి వెళ్తుంది. అంచేత దీన్ని వీలైనంతగా నివారించాలి. చాలా మంది బ్యాటర్‌లు వరుసగా బౌన్సర్‌లంహు ఎదుర్కొని భయాందోళనకు గురై, ఈ పద్ధతిలో స్పందించి, వికెట్లు కోల్పోయారు.

శారీరకంగా బలవంతులైన బ్యాటర్లు తరచుగా బంతిని పైకి లేస్తున్నపుడే కొట్టడానికి ప్రయత్నిస్తారు - దీనివలన వాళ్ళకు బంతి సరిగా కనబడనప్పటికీ. బంతి వస్తున్న వేగానికి, బ్యాటరు చేసే ఈ ముతక కొట్టుడు కలిసి బంతి బౌండరీని దాటటం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. ఇదొకటి కాగా, ఎత్తుగా వచ్చే బంతిని వికెట్ కీపరు పట్టుకోలేకపోతే ఎక్స్‌ట్రా పరుగులు వచ్చే అవకాశం ఉంది. వీటి కారణంగా పరుగుల పరంగా చూస్తే బౌన్సర్లు ఖరీదైనవి అని అనుకోవచ్చు.

మందకొడి బంతి

మార్చు
 
మందకొడి బంతి పట్టు

మందకొడి బంతిని వేసేటపుడు డెలివరీ యాక్షన్, రనప్ వగైరాలు మామూలు గానే, వేగంగా వేసే డెలివరీకి ఉన్నట్లుగానే ఉంటాయి. కానీ బంతిని పట్టుకునే విధానంలో కొద్దిగా తేడా ఉండి, బంతిని కాస్త నెమ్మదించేలా చేస్తుంది. ఇది బ్యాటర్‌ను మోసం చేస్తుంది, బంతి మామూలు వేగంతోనే వస్తోందని భావించి ఆ పద్ధతి లోనే ఆడేందుకు ప్రయత్నిస్తాడు. తద్వారా షాట్‌ను తప్పుగా టైమింగు చేస్తాడు. ఫలితంగా షాటు కొట్టినపుడు బంతి బ్యాటుకు మధ్యలో కాకుండా క్రింది భాగంలో తాకడం వల్ల బంతికి సరైన దెబ్బ తగలదు. దాంతో వెళ్ళాల్సిన వేగం కంటే తక్కువ వేగంతో వెళ్ళి ఫీల్డరుకు క్యాచ్‌ చిక్కే అవకాశం ఉంటుంది. (బ్యాట్‌కు మధ్యభాగంలో తగిలే బంతికి బదిలీ అయ్యే శక్తి గరిష్టంగా ఉంటుంది)

అలాగే, బ్యాటు బంతిని తాకే సమయానికి బంతి మామూలు కంటే ఎక్కువ ఎత్తుకు లేచి ఉంటుంది కాబట్టి బంతి బ్యాటును వీడి వెళ్ళే సమయం మామూలు కంటే ఆలస్యంగా ఉంటుంది. పైగా చాపాకారంలో ఉండే బంతి పథంలో, బ్యాటు దాన్ని తాకేసరికి బంతి మామూలు కంటే ఎత్తున ఉంటుంది కాబట్టి అది వెళ్ళే కోణం కూడా మామూలు కంటే ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రభావం వలన, బంతి నెమ్మదిగా, చాపాకారంలో వెళ్తూ క్యాచ్‌ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, బ్యాటరు ఈ మందకొడి బంతిని ఆడబోయి, పూర్తిగా మిస్సై, బంతి వికెట్లకు తగిలి క్లీన్-బౌల్డ్ కూడా అవుతాడు.

బంతిని పట్టుకునే విధానంలో చూపుడు వేలు మధ్య వేలు కొంచెం దూరంగా ఉంటాయి.

 
ఇంగ్లండ్‌కు చెందిన ఆండ్రూ ఫ్లింటాఫ్ నెట్స్‌లో బౌలింగ్ చేయగా, కెవిన్ షైన్ వీక్షించాడు. నిటారుగా ఉండే సీమ్‌ను గమనించండి

కట్టర్లు

మార్చు

కట్టర్ అనేది వేగంగా, సీమ్‌ని నిటారుగా ఉంచడానికి బదులుగా సీమ్‌కి వ్యతిరేక అక్షం చుట్టూ తిరిగే డెలివరీ. ఈ భ్రమణ వేగం స్పిన్ బౌలర్ తిప్పే వేగానికి దరిదాపుల్లో కూడా ఉండనప్పటికీ, బ్యాటర్‌ని అసౌకర్యానికి గురిచేయడానికి సరిపడా ఉంటుంది. ముందే, ఫాస్టు బౌలరు వేసే బంతి వేగం చాలా ఎక్కువగా ఉంతుంది కాబట్టి కొద్దిపాటి స్పిన్ ఒక సీమ్ బౌలర్‌కు పిచ్ నుండి పెద్దగా సహాయం అందకపోతే బంతిని మళ్ళించడానికి కట్టర్లు ప్రభావవంతమైన మార్గం.

 
లెగ్-కట్టర్ గ్రిప్
 
ఆఫ్-కట్టర్ పట్టు

ముందుగా, ఫాస్ట్ బౌలర్ బంతిని సరిగ్గా పట్టుకోవాలి. గరిష్ట వేగాన్ని సాధించడానికి అవసరమైన ప్రాథమిక ఫాస్ట్ బౌలింగ్ గ్రిప్ ఏమిటంటే, బంతిని సీమ్‌ నిలువుగా ఉండేలా పెట్టి, చూపుడు వేలును, మధ్య వేలును బంతికి పైన సీమ్‌కు ఇరువైపులా దగ్గరగా ఉంచి, బొటనవేలును బంతికి దిగువన సీం పైన పట్టుకోవడం. ఎగువన ఉన్న చిత్రం సరైన పట్టును చూపుతుంది. మొదటి రెండు వేళ్లు, బొటనవేలు కలిసి బంతిని మిగిలిన చేతికంటే ముందుకి ఉంచాలి. మిగిలిన రెండు వేళ్లను అరచేతిలోకి మడిచి ఉంచాలి. బంతిని వదులుగా పట్టుకోవాలి. తద్వారా విసరినపుడు అది చేతిని సులభంగా వదిలివేస్తుంది. ఇతర రకాల గ్రిప్‌లు కూడా ఉన్నాయి. బౌలర్ రెండవచేతిని, బంతిని పట్టుకున్న చేతిపై కప్పి ఉంచుతాడు. బంతిని విసిరే లోపు ఎంతసేఫు అలా ఉంచగలిగితే అంత వరకూ అలాగే కప్పి ఉంచుతాడు. తద్వారా బౌలరు ఏ రకమైన బంతిని వేయబోతున్నాడో బ్యాటర్లు గ్రహించలేరు.

స్వింగ్ బౌలింగు

మార్చు

స్వింగ్ బౌలర్లు బంతిని సీమ్ బౌలర్ల వలె బంతి పిచ్‌పై పడి లేచాక కాకుండా, దానికి ముందే బంతి గాల్లో ఉండగానే అడ్డంగా మళ్ళేలా చేస్తారు. బంతిపై ఉండే సీమ్ (కుట్టు) పైకి లేచి ఉంటే సాంప్రదాయిక స్వింగుకు ఉపకరిస్తుంది. [10] కొత్త బంతి బాగా స్వింగవుతుంది. బంతి పాతదయ్యే కొద్దీ, అరిగిపోయి స్వింగు సాధించడం కష్టమౌతుంది. అయితే ఫీల్డింగ్ జట్టు క్రమపద్ధతిలో బంతికి ఒక వైపు మెరుగుపెట్టి, రెండో వైపు గరుకుగానే ఉంచితే దీనిని అధిగమించవచ్చు. బంతిని ఒక వైపు కంటే రెండోవైపు ఎక్కువగా పాలిష్ చేసి, దాన్ని చాలా వేగంగా బౌలింగు చేసినపుడు ఇది రివర్స్ స్వింగ్‌ను ఉత్పత్తి చేస్తుంది అంటే బంతి సంప్రదాయ స్వింగ్‌లో వలె వ్యతిరేక దిశలో స్వింగ్ అవుతుంది. జనాదరణ పొందిన అభిప్రాయానికి విరుద్ధంగా, కఠినమైన వైపుతో పోలిస్తే మృదువైన లేదా "మెరిసే" వైపు గాలి వేగంగా ప్రవహించడం ద్వారా ఈ స్వింగ్ ఉత్పత్తి అవదు.

రివర్స్ స్వింగ్

మార్చు

రివర్స్ స్వింగ్ అంటే, బంతి మెరిసే, గరుకుగా ఉండే వైపులను ఓరియంటేషన్ ద్వారా సాధారణంగా ఉత్పత్తయ్యే దానికి వ్యతిరేక దిశలో స్వింగయ్యేలా చేయడం.[10] రివర్స్ స్వింగులో బంతి, మెరిసే వైపుకు స్వింగవుతుంది. రివర్స్ స్వింగ్ బంతులు చాలా ఆలస్యంగా కదులుతాయి. సాంప్రదాయకంగా స్వింగ్ చేసే వాటి కంటే చాలా ఎక్కువగా స్వింగౌతాయి. ఈ రెంటి వలన బంతిని ఆడడంలో బ్యాటరు ఇబ్బంది పెరుగుతుంది. 144 కి.మీ/గం కంటే ఎక్కువ వేగంతో వెళ్ళే బంతి ఎల్లప్పుడూ రివర్స్ స్వింగ్‌ను ప్రదర్శిస్తుంది. కానీ ముందు వైపు గరుకుదనం పెరిగేకొద్దీ, రివర్స్ స్వింగ్ సంభవించే వేగం తగ్గుతుంది. [10] దీనర్థం, పాత బాల్‌ను రివర్స్ స్వింగ్‌తో డెలివరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దాని ఉపరితలం ఉపయోగం ద్వారా కరుకుగా ఉంటుంది.

గాయాల ముప్పు

మార్చు

సాధారణంగా క్రికెట్‌లోని ఇతర ఆటగాళ్ళ కంటే ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా గాయపడుతూంటారు.[1] దిగువ వెన్నెముకపై బాగా భారం పడడం వలన అయ్యే గాయాలు ఎక్కువగా ఉంటాయి. స్పాండిలోలిస్థెసిస్ (దిగువ వెనుక భాగంలో ఒత్తిడి పగుళ్లు), పాదంలో నావిక్యులర్ ఒత్తిడి పగుళ్లు, SLAP తెగడం, లేదా గాయాలు, సైడ్ స్ట్రెయిన్‌లు లేదా ఇంటర్‌కోస్టల్ స్ట్రెయిన్‌లు పిక్క కండరాలు పట్టెయ్యడం, హామ్ స్ట్రింగ్స్ లేదా స్పైనల్ ఎరెక్టర్స్ వంటివి ఇతర సాధారణ గాయాలు. అయితే, 2019 నాటికి, గాయపడే రేట్లు గత దశాబ్దాలుగా అయిన గాయాల సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నాయి. శారీరిక సాధన, స్పోర్ట్ సైన్స్పు వంటివాటిలో వచ్చిన పురోగతికి దీనికి ప్రధాన కారణాలు.

ఐదుగురు అగ్ర ఫాస్ట్ బౌలర్లు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. . "Centre of mass kinematics of fast bowling in cricket".
  2. On average, female fast bowlers produce slower ball release speeds than male fast bowlers: . "Comparison of biomechanical characteristics between male and female elite fast bowlers".
  3. . "Quantification and characterization of cricket bowling technique for the development of the parameters required for a novel training system for cricket".
  4. See, for example, "Jason Holder". ESPNcricinfo. Retrieved 26 January 2021.
  5. See, for example, "Steve Waugh". ESPNcricinfo. Retrieved 26 January 2021.
  6. See, for example, "Steven Finn". ESPNcricinfo. Retrieved 26 January 2021.
  7. See, for example, "Shoaib Akhtar". ESPNcricinfo. Retrieved 26 January 2021.
  8. Atherton, Michael (25 January 2021). "James Anderson 'the complete bowler', says Michael Atherton, after bowling masterclass for England". Sky Sports. Retrieved 26 January 2021.
  9. Stern, John (May 2004). "Fast work". Wisden Cricket Monthly. ESPNcricinfo. Retrieved 26 January 2021.
  10. 10.0 10.1 10.2 "The science of swing bowling". Retrieved 16 July 2015.
  11. "Records – Test Matches – Bowling records – Most wickets in career – ESPN Cricinfo". Retrieved 15 November 2022.
  12. "Records – One Day Internationals – Bowling records – Most wickets in career – ESPN Cricinfo". Retrieved 26 July 2020.
  13. "Records – Twenty20 Internationals – Bowling records – Most wickets in career – ESPN Cricinfo". Retrieved 15 November 2022.
  14. "Top 10 Fastest Bowlers in Cricket History". Retrieved 7 August 2013.[permanent dead link]