అన్వేషణ

1985 సినిమా

అన్వేషణ వంశీ దర్శకత్వంలో కార్తీక్, భానుప్రియ, శరత్ బాబు ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు మిస్టరీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని కామినేని ప్రసాద్ రామ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమాకు కథ, చిత్రానువాదం, మాటలు కూడా దర్శకుడు వంశీనే సమకూర్చాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఎం. వి. రఘు కెమెరా బాధ్యతలు నిర్వహించగా అనిల్ మల్నాడ్ కూర్పు బాధ్యతలు చూసుకున్నాడు.

అన్వేషణ
దర్శకత్వంవంశీ
రచనవంశీ (కథ, మాటలు, చిత్రానువాదం)
నిర్మాతకామినేని ప్రసాద్
కె. చిన్ని (సమర్పణ)
తారాగణంకార్తిక్,
భానుప్రియ,
శరత్ బాబు
ఛాయాగ్రహణంఎం. వి. రఘు
కూర్పుఅనిల్ మల్నాడ్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
మే 22, 1985 (1985-05-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

మద్రాసు సంగీత కళాశాలలో చదువుకున్న హేమ ఫారెస్ట్ కంట్రాక్టర్ రావుగారి ఆహ్వానం మేరకు ఆయన ఉంటున్న అటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీత ప్రియుడైన రావుకు పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని, వివిధ రాగాలకు రకరకాల పక్షుల కూతలకు దగ్గర సంబంధం ఉందని నిరూపించే పరిశోధనని పుస్తకంగా వేయాలని ఆశయం. స్వయంగా ఆ విషయాన్ని పరిశోధన చేయాలని ప్రయత్నించినా వయసు మీదపడడంతో వచ్చిన మతిమరుపు ఆ పనిచేయనివ్వదు. రావుగారి జీపు డ్రైవర్, అతని భార్య ఆ ఇంట్లోనే వంటమనిషి. రావు గారికి స్నేహితుడైన ఫారెస్ట్ రేంజర్ జేమ్స్, ఊరి సర్పంచి పులిరాజు, ఆయన భార్య నాగలక్ష్మి, వాళ్ళ కొడుకు చంటోడు, నాగలక్ష్మి తమ్ముడు వంటివాళ్ళందరి విచిత్రమైన ప్రవర్తన హేమకు అర్థంకాకుండా ఆశ్చర్యం కలిగిస్తూంటుంది. ఆమె కన్నా ముందే ఈ పరిశోధనకు రావుగారు రప్పించిన సుమతి పులివాత పడి మరణించినా హేమ చాలా ధైర్యంగా అడవిలో తిరుగుతూ పక్షికూతలు రికార్డు చేసుకుని విశ్లేషించుకుంటూ కొనసాగుతుంది. ముగ్గురు మనుషులు ఆమెను వెంటపడడం, వాళ్ళని మరో ముసుగుమనిషి వెంబడించడం హేమ గమనిస్తుంది. రావుగారి సహాయకుడు గోఖలే పులిబారిన పడి మరణించడంతో ఊళ్ళో పులిభయం మళ్ళీ తలెత్తుతుంది.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

సినిమా స్క్రిప్ట్ రాసేందుకు అరకు లోయలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తీసుకుని దర్శకుడు, నిర్మాతలు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. వంశీ అక్కడ ఆ వాతావరణంలో స్క్రిప్ట్ మొత్తం రెండు వారాల్లో పూర్తిచేశాడు.[1] సస్పెన్స్ అంటే వంశీకి పసలపూడిలో డిటెక్టివ్ నవలలు చదివే రోజుల్నుంచీ చాలా ఇష్టం.[2]

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ సినిమాకు అభిమాని. ఈ సినిమాను చాలా సార్లు చూశానని చెప్పే వర్మ స్వయంగా నిర్మాతగా మారి వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా రూపొందించాడు. సితార సినిమా తర్వాత వంశీని కలిసిన నిర్మాత కామినేని ప్రసాద్ వంశీతో ఏదో తన కిష్టం వచ్చిన సినిమా తీయమనీ కథ నాలుగు లైన్లలో చెబితే చాలని అన్నాడు. వంశీ తనకిష్టమైన సస్పెన్స్ సినిమా చేద్దామనుకున్నాడు. రెండు రోజుల తర్వాత అంతకు ముందెప్పుడో చూసిన కన్నడం సినిమా అపరిచితులు గుర్తుకొచ్చింది. దాంట్లో మొత్తం కథ అడివిలో జరుగుతుంది. వంశీ కూడా అడవి బ్యాక్ డ్రాప్ లో కథ చేద్దామని ఆలోచించడం మొదలుపెట్టాడు. తెలుగులో సస్పెన్స్ తరహా స్క్రిప్ట్లు రాసే రచయితలు లేరు, దర్శకులే రాసుకోవాలి. అప్పటికీ కొందరు రచయితలను ప్రయత్నించారు. కొందరు రాశారు. కొందరు సగంలో వెళ్ళిపోయారు. ఈ విధంగా రాయడానికి ప్రయత్నించిన వారిలో యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఉన్నాడు. యండమూరికి నిర్మాత తరపున కృతజ్ఞతలు టైటిల్స్ లో కనిపిస్తాయి. ఎంతమంది ప్రయత్నించినా కథ వంశీ అనుకుంటున్నట్టు రాలేదు.

దాంతో వంశీనే కథ రాయడం మొదలెట్టాడు. నెలాఖర్నుంచి చిత్రీకరణ మొదలుపెడదామన్నారు. కథ రాయడం పూర్తి కాలేదు. కానీ కథగా నిర్మాతకు వినిపించడం వంశీకి అంతగా ఇష్టం లేదు. అంతలో ఇందిరాగాంధీ చనిపోవడం, భీభత్సమైన తుఫాను రావడం జరిగాయి. దాంతో కొన్నాళ్ళు షూటింగులన్నీ స్థoభించి పోయాయి. ఆ టైములో సిన్మాకథని నవలలాగ రాశాడు. చదివిన నిర్మాతా, ఆయన భాగస్వాములు బాగానే ఉందన్నారు.

ఆ నవలలో అధ్యాయాలే సీన్లుగా విడదీసి చిత్రీకరణ చేద్దామన్న నిర్ణయానికొచ్చాడు. తిరుపతి దగ్గర తలకోన ఫారెస్ట్ లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సెట్ వేశాడు. నెరబైలు అనే ఆ అడివిలో ఉన్న ఒక గ్రామంలో సిబ్బంది మకాం చేశారు.

కెమెరామాన్ ఎం. వి. రఘు సహాయకులు ముగ్గురూ ఎప్పుడూ వంశీతోనే ఉండేవాళ్ళు. లోకి అనే అసిస్టెంట్ కెమెరామేన్ రాత్రయితే అందరితోనూ గొడవలు పడి, సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయి, తెల్లవారు ఝామునే వెనక్కి వచ్చేసేవాడు.

అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సిటింగ్స్ మదురైలో జరిగాయి. అన్వేషణ స్క్రిప్ట్‌ని వంశీ అంతకుముందు కొన్ని రోజుల క్రితం అరకులో రాసుకున్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో రెండు వారాల పాటు రాసుకున్న స్క్రిప్ట్ కాగితాలను తీసుకుని మదురై చేరుకున్నారు. అక్కడ ఇళయరాజాతో సిటింగ్‌లో కూర్చున్నాకా స్క్రిప్ట్ ఉన్న ఫైల్ అరకు గెస్ట్ హౌసులో వదిలి అదేరంగులో ఉన్న గెస్ట్ హౌస్ వారి ప్రోగ్రాం ఫైల్ తీసుకువచ్చినట్టు వంశీ గుర్తించారు. ఇళయరాజా డేట్స్ చాలా విలువైనవి కావడంతో చేతిలో స్క్రిప్టు లేకుండా, టెన్షన్ వల్ల వచ్చిన గజిబిజితో ఉన్న స్థితిలోనే వెళ్ళి ఇళయరాజా ముందు కూర్చుని ఏదేదో చెప్పానని వంశీ గుర్తుచేసుకున్నాడు. అయినా ఇళయరాజా సినిమాకు చిరకాలం నిలిచిపోయే గొప్ప ట్యూన్లను అందించారు.[1]

ఈ సినిమాకి నేపథ్య సంగీతం సమకూర్చడానికి ఇళయరాజాకి ఏడు రోజులు పైన పట్టింది. మాటలు తక్కువ, నిశ్శబ్దం ఎక్కువ. అంతా అయ్యేక సినిమాకి పేరు పెట్టాడు అన్వేషణ అని.

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

సంగీతం

మార్చు

అన్వేషణ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పాటలను ఆలపించారు.

పాటల జాబితా

మార్చు
  • కీరవాణి, చిలకలా, పలకవా, పాడలేవా (పాడిన వారు - యస్.పి.బాలు, యస్.జానకి)
  • ఏకాంత వేళ, సందిట్లో, ఏకాంత సేవ (పాడిన వారు - యస్.పి.బాలు, యస్.జానకి)
  • ఇలలో నడిచే, ఈ అన్వేషణ (పాడిన వారు - యస్.పి.బాలు, యస్.జానకి)

విశేషాలు

మార్చు
  • ప్రేమ (1989 సినిమా)లో ఈ సినిమా చూస్తున్న రేవతి తన సోదరికి కథ ముందే చెప్పేసే హాస్య సన్నివేశం ఉన్నది
  • అభినందన (సినిమా)లో "ఇలలో నడిచే, ఈ అన్వేషణ" పాట బాణీలోనే "ఎదుటా నీవే, ఎదలోనా నీవే" పాట కూడా సాగుతుంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 వంశీ (1 March 2015). "వంశీ ఇళయరాజా". సాక్షి ఫన్‌డే. Archived from the original on 7 July 2015. Retrieved 4 March 2015.
  2. "'అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్". greatandhra.com. 15 July 2016. Archived from the original on 17 July 2016. Retrieved 15 July 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=అన్వేషణ&oldid=4207934" నుండి వెలికితీశారు