ఎం. వి. రఘు

ప్రముఖ ఛాయాగ్రాహకుడు

మాడపాక వెంకట రఘు [1] తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. ఇతను వివిధ భాషలలో యాభైకి [2] పైగా సినిమాలకు,10 డాక్యుమెంటరీలకు ఛాయగ్రాహణం నిర్వర్తించాడు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఛాయగ్రాహకునిగా, దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి యాభైకి పైగా అవార్డులు పొందిన లబ్ధప్రతిష్ఠుడు.[3]

ఎం.వి.రఘు
జననంమాడపాక వెంకట రఘు
(1954-10-05) 1954 అక్టోబరు 5 (వయసు 70)
India భీమవరం,ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాద్,తెలంగాణ
ఇతర పేర్లుఎం.వి.రఘు
వృత్తిఛాయాగ్రాహకుడు(సినీమాటోగ్రాఫర్)
,
సినిమా దర్శకుడు
మతంహిందూ
భార్య / భర్తలక్ష్మి
పిల్లలుదిలీప్,దీరజ్
తండ్రిఎం.ఎస్.చిన్నయ్య
తల్లిఎం.నాగేశ్వరమ్మ

బాల్యం

మార్చు

అతను1954 అక్టోబరు 5న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఎం. ఎస్. చిన్నయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. అతని రైల్వే ఉద్యోగి, తల్లి గృహిణి. చిన్నయ్యకు ఫోటోగ్రఫిలో చాలా ఆసక్తి ఉండేది. తన 620 కొడాక్ బాక్స్ కెమెరాతో తరచూ ఫోటోలు తీసి స్వంతంగా డెవలప్ చేసేవాడు. వాళ్ళ ఇంట్లోనే ఒక డార్క్ రూమ్ ఉండేది. రఘుకు బాల్యం నుండే ఫోటో రీళ్ళను కడగటం వంటి పనులు బాగా అలవడ్డాయి. చిన్నయ్యకు సినిమారంగంలో అడుగుపెట్టాలని ఆశ ఉన్నా, అప్పటి పరిస్థితులు అనుకూలించక ఆ కల సాకారం కాలేదు. ఫోటోగ్రఫిలో తండ్రి అనేక అవార్డులను గెలుచుకోవటం, తనయుడైన రఘుకు పెద్దయిన తర్వాత కెమెరామెన్ కావలనే స్ఫూర్తిని కలుగజేసింది. దానికి ఆయన కుటుంబము మంచి ప్రోత్సాహాన్నిచ్చింది.

తొమ్మిదేళ్ల వయసులో తండ్రికి గుంటూరు బదిలీ అవడంతో కుటుంబముతో సహా గుంటూరు వచ్చాడు. అక్కడున్న ఆ తర్వాత పదేళ్ళు రఘు, తండ్రితో పాటు గుంటూరులోని లీలామహల్ థియేటర్లో విడుదలైన ఇంగ్లీషు సినిమాలన్నీ చూసేవాడు. ఒక్కో సినిమా 32 సార్లు చూసేవాడినని, లాంగెస్ట్ డే సినిమాని 42సార్లు చూసానని చెప్పుకున్నాడు.[4] అతనికి అత్యంత ప్రభావితం చేసిన సినిమా 1968లో విడుదలైన 2001- ఏ స్పేస్ ఒడిస్సీ. రఘుకు అప్పటినుండే సినిమా టెక్నిక్కులు, స్పెషల్ ఎఫెక్టులు, లైటింగ్ స్కీములు, ఇతర చిన్న చిన్న విషయాల గురించి నోట్సు వ్రాసుకునే అలావాటు ఉండేది.

చదువు

మార్చు

రఘు గుంటూరులో బీఎస్సీ పూర్తిచేసి, 1972 నుండి 74వరకు హైదరాబాదులోని ప్రభుత్వ సైన్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ కళాశాల (ప్రస్తుత జే.ఎన్.టి.యూ) లో కమర్షియల్ ఫోటోగ్రఫిలో డిప్లొమా కోర్సులో చేరి 98 శాతం మార్కులతో పాసై బంగారు పతకము సాధించాడు.

సినీరంగ ప్రవేశం

మార్చు

రఘు తండ్రి చిన్నయ్య, నేపథ్యగాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు మంచి స్నేహితులు. చిన్నయ్య కొడుకు గురించి నాగేశ్వరరావుకు సిఫారుసు చేయగా, ఆయన తన ఇంట్లో అద్దెకుంటున్న కెమెరామెన్ వి.ఎస్.ఆర్.స్వామితో రఘ విషయమై ప్రస్తావించాడు. ఇలా 1976లో వి.ఎస్.ఆర్.స్వామి సహాయంతో రఘు విజయవాహినీ స్టూడియో సహాయకునిగా చేరాడు. కెమెరా విభాగంలో సహాయకునిగా రఘు తొలి చిత్రము, శివాజీ గణేషన్ కథానాయకునిగా దర్శకుడు యోగానంద్ నిర్మించిన గృహప్రవేశం. ఈ సినిమాను స్టూడియోలోని నాలుగవ అంతస్తులో చిత్రీకరించారు.

సహాయ ఛాయగ్రాహకుడుగా

మార్చు

అతను మద్రాస్ (ఇప్పుడు చెన్నై) కి వచ్చిన కొత్తలో చలన చిత్ర చాయగ్రాకుడు వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర సహాయకుడిగా చేరి అప్పటికే తనకు జే.ఎన్.టి యూనివర్సిటి వారి ఫోటోగ్రఫి శిక్షణ ద్వారా వున్న పరిజ్ఞానానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ చలన చిత్ర చాయగ్రహణములో మంచి పరిణితి సాధించాడు. దీనికంటే ముందు వి.ఎస్.ఆర్.స్వామి సూచన మేరకు ప్రముఖ ఫిల్మ్ స్టూడియో విజయ వాహినిలో కేమెరా విభాగములో చేరి ఒక సంవత్సరం పాటు పనిచేసి 200 మంది సినిమాటోగ్రాఫెర్ల పనితీరును, సినిమాల చిత్రీకరణ విధానాన్ని పరిశీలించి తిరిగి వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర సహాయకుడిగా దర్శకుడు, చిత్రకారుడు బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప సినిమా ద్వారా తన సినిమాటోగ్రాఫి శిక్షణని ప్రారంభించి 25 సినిమాలకి పనిచేసాడు.[5] అప్పటికే వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర ఆపరేటివ్ కెమేరామన్ గా వున్న ఎస్.గోపాలరెడ్డి తను స్వంతగా జంధ్యాల దర్శకత్వంలో ముద్దమందారం తెలుగు చలన చిత్రానికి చాయాగ్రహకత్వం వహించే అవకాశం రావటంతో ఎం.వి.రఘును ఆపరేటివ్ కెమెరామన్ గా[6] తీసుకున్నారు.ఈయన దగ్గర 20 సినిమాలకి ఆపరేటివ్ కేమెరామన్ గాపనిచేసాడు.

ఛాయగ్రాహకుడుగా

మార్చు
 
ప్రముఖ నటుడు చిరంజీవి-హరిప్రసాద్, సుధాకర్ లతో కలసి ఎం.వి.రఘు

అతను విజయబాపినీడు దర్శకత్వంలోని మగమహారాజు సినిమాకు మొట్ట మొదటి చాయగ్రాహక దర్శకత్వంవహించాడు. చిరంజీవి కూడా ఈ సినిమా ద్వారానే కథానాయకుడుగా పరిచయం చేయబడ్డాడు. ఈ సినిమా ఘన విజయం సాధించటముతో చిరంజీవి, ఎం.వి.రఘు లకి తమ తమ రంగాలలో ముందుకు వెళ్ళేదానికి దోహదపడింది అని చెప్పవచ్చు.

సితార సినిమాకి

మార్చు

1984 సంవత్సరములో విడుదల అయిన సితార సినిమా అప్పటివరకు వస్తూవున్న మూస చిత్రాలని తోసిరాజని ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ఎం.వి.రఘు అద్భుత చాయగ్రహణంతో ఈ సినిమా వంశీ దర్శకత్వం వహిస్తే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. 35ఎం.ఎం ఫిల్మ్ ఫార్మాట్లో నిర్మించిన ఈ రంగుల సినిమాకి భారత ప్రభుత్వంవారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారం లభించింది. దక్షిణ భారత దేశ సినిమా చరిత్రలో మొదటిసారిగా రౌండ్ ట్రాలి (గుండ్రటి పట్టాలఫై ట్రాలి మీద కెమేరా వుంచి చిత్రీకరణ జరిపే విధానం) వాడి చిత్రీకరణ జరిపిన చాయగ్రాహకుడిగా[7] రఘు ప్రసిద్ధి చెందాడు. ఈ రౌండ్ ట్రాలీ మీద కెమెరా వుంచి చిత్రీకరించే విధానాన్ని సితార సినిమాలో కూడా ఒక సన్నివేశంలో గమనించవచ్చు.
తెలుగు చలన చిత్రాలలో సినేమాటోగ్రఫీకి గుర్తింపు,విలువ రావటం ఈ సినిమాతోనే మొదలయ్యిందనటం అతిశయోక్తికాదు.

 
సితార సినిమాకి రౌండ్ ట్రాలి వాడి చిత్రీకరిస్తున్నప్పటి ఫోటో కెమెరా పట్టుకున్న వ్యక్తి ఎం.వి.రఘు
కూర్చున్నవ్యక్తి డైరెక్టర్ వంశీ

సితార సినిమాలో రఘు ఛాయగ్రాహణ పనితనాన్ని ముఖ్యంగా డే ఫర్ నైట్ చిత్రీకరణ విధానాన్ని చూసి ముగ్దుడయిన ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ తన స్వంత సినిమాకి చాయగ్రాహకుడిగా నియమించుకున్నాడు. [8] కాని అనివార్య కారణాలవలన ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.

అన్వేషణ సినిమాకి

మార్చు

వంశీ దర్శకత్వంలోనే వచ్చిన అన్వేషణ సినిమాకి రఘు అందించిన చాయగ్రహణం అద్భుతంగా ఉంటుంది. చాల మంది ఔత్సాహిక ఫోటోగ్రాఫేర్లకి ఈ సినిమా ప్రేరణగా నిలిచిందని అంటుంటారు. తిరుపతికి దగ్గరలోని తలకోన అడవులలో చిత్రీకరించిన ఈ సినిమా చాల భాగం రాత్రులు, డే ఫర్ నైట్ పద్ధతిలో పగలు చిత్రీకరించి రాత్రిలాగా చూపించటం, చేతితోనే కెమెరా పట్టుకుని పరిగెడుతూ (స్టేడికాం కెమేరాతో చిత్రీకరించినట్టుగా) చిత్రీకరించిన విధం, ముఖ్యంగా సినిమా సస్పెన్స్ కథనానికి, పాటల చిత్రీకరణానికి రఘుకు చాల పేరు, అవార్డులు పెట్టడమే కాకుండా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేసాయి.
ఈ సినిమాకి, చిత్ర విజయానికి వచ్చిన మంచి ప్రశంస "ఇది సాంకేతిక నిపుణుల సినిమా" అని పత్రికలూ,విమర్శకులు ప్రశంసించటం.

స్వాతిముత్యం సినిమాకి

మార్చు

సిరివెన్నెల సినిమాకి

మార్చు

మాస్క్ పనితనం (ఒకే నటుడు ఇద్దరు లేక ముగ్గురుగా ఒకే ఫ్రేములో కనిపించేట్టుగా నల్లటి అట్ట ముక్కని ఉపయోగించి ఒకే ఫిల్మ్ మీద చిత్రీకరించే విధానం), డే ఫర్ నైట్ (రాత్రి చిత్రీకరణని పగలు చిత్రీకరించటం),అత్యంత వేగంగా చిత్రీకరణలో ఈయన నిష్ణాతుడు.

డాక్యుమెంటరీలకి

మార్చు
 
డిస్కవరీ టీవి ఛానల్ కార్యక్రమం హిడ్డెన్ ట్రెజర్స్ డాక్యుమెంటరీ దర్శకుడు, రామోజీరావుతో కలసి ఎం.వి.రఘు'

ప్రపంచ ప్రఖ్యాత టీవి ఛానల్ డిస్కవరీ తమ కార్యక్రమం దాగివున్న సంపదలు (హిడ్డెన్ ట్రెజర్స్) శీర్షిక క్రింద రామోజీ ఫిల్మ్ సిటీని చిత్రీకరించేందుకు ఛాయగ్రాహకునిగా ఎం.వి.రఘుని ఎన్నుకున్నారు. ఎందరో ఛాయాగ్రాహకులను పరిశీలించి అంతర్జాతీయ ప్రమాణాలతో చిత్రీకరించేందుకు సరైన సినిమాటోగ్రాఫర్‌గా రఘును ఎన్నుకోవటం ఆయన ప్రతిభకి ఒక గుర్తింపు.

దర్శకుడుగా

మార్చు

రఘు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన కళ్ళు సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక అత్యుత్తమమయిన కథతో తీసిన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారముతో పాటు రెండు డజన్లకు పైగా ఇతర సాంస్కృతిక సంస్థల పురస్కారాలు లభించాయి. గొల్లపూడి మారుతీరావు రచించిన కళ్ళు నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు.[3][9] అంతేకాదు ఈ సినిమాను ఆస్కారు అవార్డుల నామినేషన్లలో భారతీయ సినిమాలకు ప్రాతినిధ్యం చేయడానికి కూడా ఎంపికచేయబడింది.[3][10] ఈ సినిమాలో నటుడు చిరంజీవి తన కనిపించని పాత్రకు మాటలు అందించాడు. ఈ సినిమాలో తెల్లారింది లెగండోయ్... మంచాలింక దిగండోయ్... అనే పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి తానే రాసి స్వయంగా పాడాడు. శివాజీ రాజా, రాజేశ్వరి, సుధారాణి, చిదంబరం ఈ సినిమా ద్వారానే మొట్టమొదటిసారిగా నటులుగా పరిచయం చేయబడ్డారు. కళ్ళు చిదంబరం పేరుకు ముందు ఉన్న కళ్ళు ఈ సినిమా నుండే వచ్చాయి.

రఘు దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఆర్తనాదం. రాజశేఖర్, సీత, చంద్రమోహన్ మొదలగు వాళ్ళు నటించారు. చిత్రంలో ఉన్న వైవిధ్యం ఎంటి అంటే సినిమా మొత్తం ఒక చిత్రం షూటింగ్‌కి వెళ్ళిన యూనిట్ మధ్య జరుగుతుంది. కథానాయకిని హత్య చెయ్యడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎవరు చేసారు? దేనికి? అన్నది అర్ధం కాదు. మధ్యలో వచ్చిన బైట వ్యక్తి మీద అనుమానం, కొన్ని ఆనవాళ్ళు కనపడతాయి. చివరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సినిమా ఆద్యంతమూ సాగుతుంది. చిత్రం మొత్తం ఊటిలోని బృందావన్ అతిథి గృహంలో తీసిన ఈ సినిమా షూటింగును మొత్తం 30 రోజుల్లో పూర్తి చేసారు. ఈ చిత్రానికి సంగీతం హంసలేఖ. అప్పట్లో సెన్సార్ అధికారిగా పనిచేస్తున్న సరళ ఈ చిత్రానికి అబ్బ నీ సొకు మాడా అనే ఒక పాట పాడటం మరో విశేషం.[11]

రఘు ఈ రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన తరువాత ఛాయగ్రాహకునిగా అనేక సినిమాలకి చాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించినా తిరిగి దర్శకత్వం మాత్రం చేపట్టక పోవటం ఆశ్చర్యకర విషయం.

పురస్కారాలు

మార్చు
పురస్కారం పేరు బహుకరించింది సంవత్సరం ఇతర వివరాలు
నంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
 
1986 సిరివెన్నెల సినిమా చాయాగ్రహణ ప్రతిభకి న్యాయ నిర్ణేతల ప్రత్యేక పురస్కారం నంది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు అధికారిక అవార్డు) అప్పటి ముఖ్యమంత్రి,ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు నుండి అందుకుంటున్న ఎం.వి.రఘు[3]
నంది 1988వ సంవత్సరానికికళ్ళు (సినిమా) సినిమాకి ఉత్తమ నూతన దర్శకుడిగా నంది పురస్కారం
ఫిలింఫేర్ పురస్కారం
ఉత్తమ దర్శకుడు
1988 1988వ సంవత్సరానికికళ్ళు (సినిమా) సినిమాకి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ పురస్కారం.[3]

చిత్ర సంకలనము

మార్చు
చిత్రము నటీ నటులు విడుదల సంవత్సరము భాష బాధ్యతలు
మగమహారాజు చిరంజీవి,సుహాసిని 1983 తెలుగు ఛాయాగ్రాహకత్వం
సితార భానుప్రియ, సుమన్ 1983 తెలుగు ఛాయాగ్రాహకత్వం [12]
స్వాతిముత్యం కమలహాసన్, రాధిక 1985 తెలుగు ఛాయాగ్రాహకత్వం [12]
అన్వేషణ కార్తీక్, భానుప్రియ 1985 తెలుగు ఛాయాగ్రాహకత్వం [12]
సంసార్[13] రేఖ,రాజ్ బబ్బర్,అనుపమ్ ఖేర్ 1985 హిందీ ఛాయాగ్రాహకత్వం [12]
మేరా పతీ సిర్ఫ్ మేరా హై[14] జితేంద్ర, రేఖ, రాధిక 1990 హిందీ ఛాయాగ్రాహకత్వం [12]
ఏప్రిల్ 1 విడుదల రాజేంద్రప్రసాద్,శోభన 1991 తెలుగు ఛాయాగ్రాహకత్వం [12]
చిట్టెమ్మ మొగుడు మోహన్ బాబు, దివ్యభారతి 1992 తెలుగు ఛాయాగ్రాహకత్వం
డిటెక్టివ్ నారద మోహన్ బాబు,మోహిని,నిరోషా 1993 తెలుగు ఛాయాగ్రాహకత్వం [12]
వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ వినీత్,ఆవని,ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,జె.డి.చక్రవర్తి 1998 తెలుగు ఛాయాగ్రాహకత్వం [12]

మూలాలు

మార్చు
  1. Reporter, Staff (2012-05-11). "Workshop for budding film-makers". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-10-02.
  2. "Return of the thespian". TheHindu.com. 2008-05-29. Retrieved మే 29, 2008.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 3.3 3.4 ద హిందూ దిన పత్రికలో ఎం.వి.రఘు Archived 2008-02-15 at the Wayback Machine పై వ్యాసం. మే 26, 2007న సేకరించబడినది. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "hindu" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. http://ilovehyderabad.com/interviews/interviews-i-write-with-the-light.html
  5. "The saga of a lensman:M.V.Raghu". TheHindu.com. 2008-05-31. Archived from the original on 2008-02-15. Retrieved మే 31, 2008.
  6. "as Operative cameraman: M.V. Raghu". telugucinema.com. 2008-05-30. Retrieved మే 30, 2008.[permanent dead link]
  7. "Sitara (1984)". cinegoer.com. 2008-06-03. Archived from the original on 2009-10-05. Retrieved జూన్ 3, 2008.
  8. "The saga of a lensman". hinduonnet.com. 2008-06-03. Archived from the original on 2008-02-15. Retrieved జూన్ 3, 2008.
  9. విజయక్రాంతి, సినిమాలు (10 August 2018). "30 ఏళ్లుగా మరవలేని 'కళ్లు'". Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.
  10. తెలుగు సినిమా.కాంలో ఎం.వి.రఘు పరిచయం Archived 2006-11-19 at the Wayback Machine. మే 26, 2007న సేకరించబడినది.
  11. ఆర్తనాదం సినిమా Archived 2008-06-12 at the Wayback Machine పై telugucinema.comలోని వ్యాసం. మే 30, 2008న సేకరించబడినది.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 12.6 12.7 "Raghu M.V." IMDb.com. 2008-05-28. Retrieved మే 29, 2008.
  13. "Sansar". IMDb.com. 2008-05-28. Retrieved మే 29, 2008.
  14. "Mera pati sirf mera hy". IMDb.com. 2008-05-28. Retrieved మే 29, 2008.

ఇవి కూడా చూడండి

మార్చు

సినిమాటోగ్రఫీ
ఫోటోగ్రఫి
మూవీ కెమెరా
చలనచిత్రీకరణ

"https://te.wikipedia.org/w/index.php?title=ఎం._వి._రఘు&oldid=3904097" నుండి వెలికితీశారు