అబ్దుల్ మజీద్ ఖ్వాజా

భారతీయ రాజకీయవేత్త

 

అబ్దుల్ మజీద్ ఖ్వాజా
జననం1885
మరణం1962 డిసెంబరు 2
విద్యడిగ్రీ
విద్యాసంస్థకేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
వృత్తిలాయరు, విద్యావేత్త, సంఘసంస్కర్త
జీవిత భాగస్వామిబేగం ఖుర్షీద్ ఖ్వాజా[1]
తల్లిదండ్రులు
  • ఖ్వాజా ముహమ్మద్ యూసుఫ్ (తండ్రి)

అబ్దుల్ మజీద్ ఖ్వాజా (1885 - 1962) భారతీయ న్యాయవాది, విద్యావేత్త, సామాజిక సంస్కర్త. అలీఘర్కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. 1920 లో, అతను ఇతరులతో కలిసి జామియా మిలియా ఇస్లామియాను స్థాపించాడు. తరువాత దాని వైస్ ఛాన్సలరుగా, ఛాన్సలరుగా పనిచేశాడు.[2]

అతడొక ఉదారవాద ముస్లిం. అతను అహింసాత్మక ప్రతిఘటన యొక్క మహాత్మా గాంధీ ప్రవచించిన అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. 1947 లో జరిగిన భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన జీవితమంతా హిందూ-ముస్లిం సామరస్యం కోసం అంకితం చేసాడు.

అతను ఆధునిక యుగంలో భారతీయ ముస్లింల విద్య కోసం శాశ్వత సహకారం అందించాడు.

అతను 1962 డిసెంబరు 2 న మరణించాడు. అలీఘర్ శివార్లలోని సూఫీ సెయింట్ షా జమాల్ మందిరం ప్రక్కనే ఉన్న కుటుంబ శ్మశానంలో అతన్ని ఖననం చేసారు.

కుటుంబ నేపధ్యం మార్చు

ప్రముఖ న్యాయవాదీ, అలీఘర్ భూస్వామీ అయిన ఖ్వాజా ముహమ్మద్ యూసఫ్ ఇద్దరు కుమారులలో చిన్నవాడు, అబ్దుల్ మజీద్. తండ్రి భారతీయ ముస్లింల సామాజిక ఆర్థికాభివృద్ధికి పాశ్చాత్య తరహా శాస్త్రీయ విద్య కీలకమైనదని దృఢంగా విశ్వసించేవాడు.

ఖ్వాజా ముహమ్మద్ యూసుఫ్ అలీగఢ్ ఉద్యమానికి తొలి మద్దతుదారులలో ఒకడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వంలో ముహమ్మడన్ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల స్థాపకుడు, ఆ తర్వాత అదేఅలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ఖ్వాజా యూసుఫ్ ముహమ్మద్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్ ఫండ్ కమిటీకి పెద్ద మొత్తాలను విరాళంగా ఇచ్చాడు. జహూర్ హుస్సేన్, జైనుల్ అబ్దీన్ లతో పాటు దేశంలో పర్యటించాడు. ఈ బృందంతో పాటు, సర్ సయ్యద్ కుమారుడైన సయ్యద్ మహమూద్, మౌల్వీ సమీ ఉల్లా ఖాన్ కుమారుడైన హమీద్ ఉల్లా ఖాన్ (తరువాతి కాలంలో అతని అల్లుడు) లు కూడా ఉన్నారు. వీరు ప్రతిపాదిత ముహమ్మద్ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాలకు నిధులను సేకరించారు.

ఖ్వాజా ముహమ్మద్ యూసుఫ్ పాశ్చాత్య రచనలను ఉర్దూలోకి అనువదించడానికి 1864 లో సర్ సయ్యద్ స్థాపించిన సైంటిఫిక్ సొసైటీ వ్యవహారాలలో కూడా చాలా చురుకుగా పాల్గొన్నాడు.

చదువు మార్చు

అబ్దుల్ మజీద్ ప్రారంభంలో సంప్రదాయ పద్ధతిలో ఇంట్లోనే చదువుకున్నాడు. ఖురాన్, అరబిక్, ఉర్దూ, ఫార్సీ సాంఘిక మర్యాదలు మొదలైనవి నేర్చుకున్నాడు.

అతను లాహోర్ లోని ప్రభుత్వ MAO కళాశాలలో కూడా చదువుకున్నాడు.[3]

అయితే అతని తండ్రి ఖ్వాజా ముహమ్మద్ యూసుఫ్, తన కుమారుడికి ఉత్తమ ఆధునిక పాశ్చాత్య శైలి విద్యను కూడా అందేలా జాగ్రత్త తీసుకున్నాడు. 1906 లో అబ్దుల్ మజీద్ కేంబ్రిడ్జ్ క్రీస్తు కళాశాల తరపున ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుల కోసం చేరాడు. అక్కడ అతను చరిత్రలో పట్టభద్రుడయ్యాడు. 1910 లో బార్‌కు వెళ్ళాడు. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ప్రముఖ న్యాయవాది సర్ షా సులేమాన్, ప్రముఖ తత్వవేత్త, కవి మహమ్మద్ ఇక్బాల్లు కేంబ్రిడ్జిలో అతనికి సమకాలికులు. కేంబ్రిడ్జిలో ఉండగా అతను దక్షిణాఫ్రికా వాడిగా ఖ్యాతి గాంచి, ఆ తరువాత, బ్రిటిషు ఉదారవాదానికి ఆరాధకుడిగా మారిన బారిస్టర్ మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీని అక్కడే మొదటగా చూశాడు, అతని గురించి విన్నాడు.

పెళ్ళి మార్చు

అబ్దుల్ మజీద్ ఖ్వాజాకు ముగ్గురు కుమారులు: జమాల్ ఖ్వాజా, రషీద్ ఖ్వాజా, అజ్మల్ ఖ్వాజా. వీరితో పాటు ఆరుగురు కుమార్తెలు కూడా ఉన్నారు.

అతని భార్య, బేగం ఖుర్షీద్ ఖ్వాజా [మ. 1981], హమీద్ ఉల్లా కుమార్తె. అతడే ఆ తరువాత నవాబ్ సర్బులంద్ జంగ్ అయ్యాడు. అతడు మౌల్వీ సమీయుల్లా, బేగం అక్తర్ సర్బులంద్ జంగ్ ల కుమారుడు.

ఈజిప్టులో బ్రిటిష్ సామ్రాజ్యానికి అందించిన దౌత్య సేవలకు గాను మౌల్వీ సమీయుల్లాను ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ (CMG) కంపానియన్‌గా నియమితుడయ్యాడు. ఈ పురస్కారం బ్రిటిష్ గౌరవ వ్యవస్థలో ఆరవ స్థానంలో ఉంటుంది.

ఆమె తల్లిదండ్రులకు మొదటి సంతానం. మొఘల్ కాలం నాటి ప్రముఖ కవి మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ ఆమె పూర్వీకుడు. అలీఘర్‌లో పరదా వ్యవస్థ నుండి బయటకు వచ్చిన మొట్టమొదటి ముస్లిం మహిళలలో ఆమె ఒకరు. ఆమె సామాజిక రాజకీయ కార్యకర్త. మహిళా విద్య, బ్రిటిషు వలస పాలన నుండి స్వేచ్ఛ కోసం చురుగ్గా పనిచేసింది. ఆమె నెహ్రూ కుటుంబంతో సన్నిహతంగా ఉండేది. ముఖ్యంగా సరోజిని నాయుడు కుమార్తె, హైదరాబాద్‌లో తన సహాధ్యాయి అయిన పద్మజా నాయుడు, జవహర్‌లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్‌తో సన్నిహితంగా ఉండేది.

అలహాబాద్‌లోని ప్రసిద్ధి చెందిన సెయింట్ మేరీస్ కాన్వెంట్ ఇంటర్ కాలేజీలో తన కుమార్తెలను హాస్టల్లో చేర్చిన అలహాబాద్ ముస్లింలలో ఆమె మొదటిది. ఇందిరాగాంధీ కూడా ఈ కాన్వెంట్‌లో స్వల్పకాలం పాటు విద్యార్థిగా చదువుకుంది.

1930 ల ప్రారంభంలో బేగమ్ ఖుర్షీద్ ఖ్వాజా అలహాబాద్ నగరంలో హమీదియా బాలికల పాఠశాలను స్థాపించి, తానే నడిపి, ముస్లిం మహిళల్లో బలహీన వర్గాలలో విద్యను ప్రోత్సహించింది. ఈ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు అలహాబాద్ యూనివర్సిటీకి అనుబంధంగా హమీదియా బాలికల డిగ్రీ కళాశాలగా వృద్ధి చెందింది.

సహాయ నిరాకర్ణోద్యమం రోజుల్లో ఆమె, బ్రిటిషు పాలనకు మద్దతునిచ్చిన పాశ్చాత్య ఉదారవాద కులీనుడైన తండ్రికీ, మహాత్మా గాంధీ స్ఫూర్తితో, ఖరీదైన, పాశ్చాత్య నాగరిక చిహ్నాలైన దుస్తులను మంటల్లో కాల్ఛేసి ఖద్దరు ధరించిన భర్తకూ మధ్య నలిగిపోయింది.

వాస్తవానికి ఖుర్షీద్ ఖ్వాజా తన ఫ్యాషన్ దుస్తులన్నింటినీ తగలబెట్టింది. స్వాతంత్ర్య ఉద్యమానికి తన ఆభరణాలను దానం చేసింది. భర్తను అరెస్టు చేసేందుకు డజన్ల కొద్దీ పోలీసులు ఇంటిని చుట్టుముట్టినప్పుడు కూడా ఆమె చలించలేదు. జిల్లా జైలులో సుదీర్ఘకాలం పాటు గడిపేందుకు ఆమె భర్త ప్రశాంతంగా పోలీసులతో పాటు వెళ్ళిపోయాడు.

ఆమె 87 సంవత్సరాల వయస్సులో 1981 జూలై 7 న మరణించింది. అలీఘర్ శివార్లలోని సూఫీ సన్యాసి షా జమాల్ గుడి ప్రక్కనే ఉన్న కుటుంబ శ్మశానంలో ఆమెను ఖననం చేసారు.

కెరీర్ మార్చు

1910 లో ఇంగ్లాండ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన అబ్దుల్ మజీద్ ఖ్వాజా మొదట అలీగఢ్ జిల్లా కోర్టులోను, ఆ తరువాత పాట్నా హైకోర్టులోనూ న్యాయవాద వృత్తి నెరపాడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు అతను 1919 లో తన వృత్తిని విడిచిపెట్టాడు, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో, ఖిలాఫత్ ఉద్యమంలో కూడా చేరాడు. ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు. తర్వాతి ఆరు సంవత్సరాలు (1919-1925) కొత్తగా స్థాపించిన జామియా మిలియా ఇస్లామియా అభివృద్ధికే కృషిచేసాడు.

అబ్దుల్ మజీద్, 1926 లో అలహాబాద్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని తిరిగి మొదలుపెట్టాడు. జామియాకు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకీ తన మద్దతును కొనసాగించినప్పటికీ, ఇంటి సమస్యల వలన, ఆరోగ్య సమస్యల వలనా 1943 చివరి వరకూ అతను క్రియాశీల రాజకీయాల నుండి దూరంగా ఉన్నాడు.

1943 నుండి 1948 వరకు ఖ్వాజాకు చాలా ఒత్తిడితో కూడుకున్న కాలం. రెండు దేశాల సిద్ధాంతం ఆధారంగా పాకిస్తాన్ను సృష్టించాలనే కోరిక అతనికి తీవ్ర వేదన కలిగించింది. 1942 లో అతనికి గుండెపోటు వచ్చింది. ఏమైనప్పటికీ, అతను తిరిగి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. భారతదేశ సమైక్యతను కాపాడటానికి తన యావచ్ఛక్తినీ ధారపోసాడు.

1936 లో జాకీర్ హుస్సేన్ పట్టుబట్టడంతో ఖ్వాజా జామియా మిలియా ఇస్లామియాకు ఛాన్సలరు పదవిని స్వీకరించాడు. తదనంతర కాలంలో జాకీర్ హుసేన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. చివరికి 1967 లో భారతదేశ మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు.

ఖ్వాజా 1962 డిసెంబరు 2 న మరణించే వరకు జామియా మిలియా ఇస్లామియా ఛాన్సలరుగా కొనసాగాడు.

రాజకీయ కృషి మార్చు

అబ్దుల్ మజీద్ ఖ్వాజా ఇస్లామిక్ ఉదారవాదం, లౌకిక జాతీయవాదం పట్లగల నిబద్ధత విషయంలో రాజీపడలేదు. కుల మతాల ఆధారంగా భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడాన్నీ, పాకిస్తాన్ సృష్టినీ అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. స్ఫూర్తి, మార్గదర్శకత్వం కోసం అతను ఎదురు చూసిన ఏకైక భారతీయ నాయకుడు, గాంధీజీ. అతను చిత్తరంజన్ దాస్, మౌలానా ఆజాద్, డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ, టిఎకె షేర్వానీ, సర్ తేజ్ బహదూర్ సప్రూలతో కూడా సన్నిహితంగా పనిచేసాడు.

మహాత్మా గాంధీ స్ఫూర్తితో అతను 1919 లో పాట్నాలో ఉచ్ఛస్థితిలో ఉన్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. శాసనోల్లంఘన ఉద్యమం లోను, ఖిలాఫత్ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు.

ముహమ్మద్ అలీ జిన్నా తదితరులు పాకిస్తాన్ కోసం డిమాండు చెయ్యడంతో, మతపరంగా భారతదేశాన్ని విభజించడం పట్ల అతడిలో తీవ్రమైన వ్యతిరేకత పెంచింది. రెండు దేశాల సిద్ధాంతం ఆధారంగా విభజించడాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లింలందరి కృషిని సమన్వయం చేయడానికి అతను, కొంతమంది సన్నిహితులతో కలిసి ఆల్ ఇండియా ముస్లిం మజ్లిస్‌ను స్థాపించాడు. అబ్దుల్ మజీద్ ఖ్వాజా దానికి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ హోదాలో అతను 1946 లో వచ్చిన భారతదేశానికి క్యాబినెట్ మిషన్‌ను ఢిల్లీలో కలుసుకున్నాడు. భారతదేశ సమైక్యతను కాపాడటానికి అనుకూలంగా ముస్లిం ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి దేశంలో విస్తృతంగా పర్యటించాడు.

అతను, అతని సహచరులు తమ లక్ష్యంపై విశ్వాసం కోల్పోకుండా వేర్పాటువాద శక్తుల ఆగ్రహాన్ని సహనంతో భరించారు. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, అతను మౌలానా ఆజాద్, మౌలానా హిఫ్జుర్ రహమాన్ సియోహర్వి, NA షేర్వానీ తదితరులతో కలిసి జాతీయతా స్ఫూర్తిని రక్షించడానికి పనిచేస్తూనే ఉన్నాడు.

1948 జనవరి 30 న మహాత్మా గాంధీని హత్య చెయ్యడం అతడిని ఎప్పటికీ కోలుకోలేనంతటి దిగ్భ్రాంతి కలిగించింది. ఆ సంఘటన తర్వాత స్వతంత్ర భారతదేశ క్రియాశీల ఎన్నికల రాజకీయాల నుండి ఖ్వాజా దాదాపుగా తప్పుకున్నాడు.

మహాత్మా గాంధీ అంత్యక్రియల కార్యక్రమంలో ఖురాన్ పఠించినది అబ్దుల్ మజీద్ ఖ్వాజాయే.

విద్యా విషయక కృషి మార్చు

1920 అక్టోబరు 29 న అలీగఢ్‌లో జామియా మిలియా ఇస్లామియా స్థాపించాడు. బ్రిటిషు వారి మద్దతు గాని, నియంత్రణ గానీ లేకుండా పూర్తిగా భారతీయుల చేతనే నిర్వహించబడే పాశ్చాత్య శైలి ఉన్నత విద్యా సంస్థ అది.

జామియా మిలియా ఇస్లామియా మౌలానా ముహమ్మద్ అలీ, డాక్టర్ ముక్తార్ అహ్మద్ అన్సారీ, హకీమ్ అజ్మల్ ఖాన్ ల ఆలోచనల నుండి పుట్టింది.

ముహమ్మద్ అలీ ఆ కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్. కానీ అతని తీవ్రమైన రాజకీయ కార్యాచరణ కారణంగా, అతను తన సన్నిహితుడు, సహచరుడూ అయిన అబ్దుల్ మజీద్ ఖ్వాజాకు ఆ పదవినిచ్చి రాజీనామా చేసాడు.

ముహమ్మద్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీలో డైనమిక్ యువకుడు జాకీర్ హుస్సేన్ అత్యంత ప్రముఖ విద్యార్థి నాయకుడు. జామియా ఏర్పాటైన మొదట్లోనే దానిలో చేరినవారిలో అతనొకడు. అతని ఉత్సాహం, నిబద్ధత కారణంగా అతను అక్కడ గౌరవ బోధకుడిగా చేరేందుకు తోడ్పడ్డాయి.

క్లిష్ట కాలంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ శిష్యుడైన GD బిర్లా ఔదార్యం కారణంగా గొప్ప నైతిక, భౌతిక మద్దతు లభించింది. అలాగే, హకీం అజ్మల్ ఖాన్, డా. ముఖ్తార్ అహ్మద్ అన్సారీ ల నుండి కూడా గట్టి మద్దతు లభించింది. జామియాలో, మౌలానా అస్లాం జైరాజ్‌పురి, షఫీఖుర్ రహమాన్ కిద్వాయ్, కలత్ సాహాబ్, అఖిల్ సాహాబ్ వంటి అనేక మంది అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు కూడా ఉండేవారు.

1925 లో, గాంధీ హకీమ్ అజ్మల్ ఖాన్ ల సమ్మతి, ఆశీర్వాదాలతో, అబ్దుల్ మజీద్ ఖ్వాజా, జామియాను అలీగఢ్ నుండి ఢిల్లీలోని కరోల్ బాగ్‌కు మార్చాడు. జర్మనీలో ఎకనామిక్స్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసి వచ్చిన డాక్టర్ జకీర్ హుస్సేన్‌కు బాధ్యతలు అప్పగించాడు.

1936 లో డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ మరణించిన తరువాత జామియా ఛాన్సలరు పదవీ బాధ్యతలు అబ్దుల్ మజీద్ ఖ్వాజా భుజాలపై పడ్డాయి. అతను 1962 లో మరణించే వరకు ఆ బాధ్యతను నిర్వర్తించాడు. తన కుటుంబ సంప్రదాయానికి అనుగుణంగా అబ్దుల్ మజీద్ ఖ్వాజా, తాను చదువుకున్న అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వ్యవహారాలలో చాలా ఆసక్తిని కనబరిచాడు. ఆ యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలిలో చాలా సంవత్సరాలు సేవలందించాడు.

మూలాలు మార్చు

  1. "History – Hamidia Girls Degree College". Hamidia Girls Degree College. 2015-12-15. Retrieved 2021-05-03.
  2. "Profile - History - Founders - Abdul Majeed Khwaja". Jamia. 2021-05-03. Retrieved 2021-05-03.
  3. Pioneer, The. "Mahatma Gandhi's visit to AMU during freedom struggle". The Pioneer. Retrieved 2021-05-03.