వింజమూరి అనసూయ

భారతీయ గాయని
(అవసరాల అనసూయ నుండి దారిమార్పు చెందింది)

అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 - 23 మార్చి 2019) ఒక ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె పాట రికార్డ్ అయింది. ఆమె ఒక బాలమేధావి.

వింజమూరి అనసూయా దేవి
జననం(1920-05-12)1920 మే 12
మరణం2019 మార్చి 23(2019-03-23) (వయసు 98)
వాషింగ్టన్ డిసి, అమెరికా
ఇతర పేర్లుఅవసరాల అనసూయా దేవి
వృత్తిగాయని
క్రియాశీల సంవత్సరాలు1929-2019
తల్లిదండ్రులు
  • వింజమూరి వెంకటలక్ష్మీనరసింహారావు (తండ్రి)
  • వింజమూరి వెంకటరత్నమ్మ (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

ఈమె 1920 మే 12 న ఒక సంగీత కళాకారుల, సాహిత్యకారుల కుటుంబంలో జన్మించింది. ఆమె కాకినాడ లో జన్మించింది అక్కడే పెరిగింది . కర్ణాటక సంగీతం మునుగంటి వెంకట్రావు దగ్గర నేర్చుకున్నది. ఆమె తండ్రి వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు ఒక కవి. తల్లి వింజమూరి వెంకటరత్నమ్మ 1914లో అనసూయ అనే పత్రికకు సంపాదకత్వం వహించేది. ఆమె పెద్ద కుమార్తె రత్న పాప కూచిపూడి కళాకారిణి రెండవ కుమార్తె సీతా రత్నాకర్ చెన్నై దూరదర్శన్ లో ప్రొడ్యూసర్ గా ఉండేది . వింజమూరి అనసూయ అమెరికా లో హౌస్టన్ లో కుమార్తె రత్నపాప దగ్గర ఉండి , తన 99వ ఏట మరణించింది .[1][2]

సంగీత విశేషాలు

మార్చు

అనసూయ సాంప్రదాయ సంగీతం సొంటి లచ్చయ్యతో ప్రారంభమైంది- అయన త్యాగరాజు గురువైన సొంటి వెంకటరమణయ్య వారసులు, మునుగంటి వెంకటరావుతో కొనసాగించింది. శ్రీపాద పినాకపాణి ఇంకా వోలేటి వెంకటేశ్వర్లు దగ్గర కూడా సంగీతం నేర్చుకుంది .[3]

స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాక్రిష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకుంది. ఈమె మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన ప్రముఖ దేశభక్తి గీతం "జయజయజయ ప్రియ భారత" పాటకు బాణీ కట్టింది వింజమూరి అనసూయనే.[4]

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనగోడలుగా, 1930 -50 దశకాలలో గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, నండూరి మొదలైన మహా కవుల గేయాలకు బాణీలు కట్టి చెల్లెలు సీతతో పాడి భావ గీతాలు. లలిత గీతాల ప్రక్రియకు, చెల్లెలు సీత తో కలిసి “సీతా -అనసూయ” లుగా ప్రాచుర్యం కలిగించిన తొలి గాయని. విజమూరి అనసూయ , వింజమూరి సీత ద్వయంను వింజమూరి సోదరీమణులు (వింజమూరి సిస్టర్స్ ) అని పిలిచేవారు [5]. దేవులపల్లి కృష్ణశాస్త్రి బ్రహ్మసమాజంపై మక్కువ పెంచుకోవడంతో, ఆమె సామాజిక పునరుజ్జీవనానికి కృషి చేసిన ఆ సంస్థ కోసం పాటలు రాసి, అనేక బహిరంగ సభల్లో ఆ పాటలు పాడారు.[2]

ఆమెకు హార్మోనియం సంగీత వాయిద్యం అంటే చాల ఇష్టం. ఆమె పని చేసే ఆకాశవాణి కేంద్రం లో హార్మోనియం ను నిరోధించారని ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు అని ఆమె కుమార్తె సీత ఈ విశేషాన్ని పంచుకున్నారు. [1] .

  • “జయ జయ ప్రియ భారత లాంటి అనేక దేశభక్తి గీతాలు, మొక్కజొన్న తోటలో & నోమీన మల్లాల లాంటి జానపద బాణీల స్వర కర్త.
  • మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదగేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నత స్థానాన్ని కలిగించిన తొలి గాయని.
  • భారత దేశంలో జానపద గేయాలకు కర్నాటక బాణీ లో స్వర రచన చేసిన తొలి స్వర కర్త.
  • విశ్వవిద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని.
  • దక్షిణ భారత దేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు.
  • ప్రపంచవ్యాప్తంగా 11 జీవన సాఫల్య పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ వారి “కళా ప్రపూర్ణ” మొదలైన శతాధిక గుర్తింపులు.
  • అనేక దేశాలలో వేలాది కచేరీలు.
  • 11 గ్రంధాల రచన.

“అనసూయా దేవి ధైర్యవంతురాలైన మహిళ, సంకెళ్లన్నింటినీ తెంచుకుని ఆ రోజుల్లో పురుషులతో సమానంగా స్వేచ్ఛగా ఉన్నారు. ఆమె స్వతంత్ర స్వభావం ఆమెను కుటుంబంలో ప్రత్యేకం చేసింది. కృష్ణశాస్త్రి రాసిన అనేక గేయాలకు ఆమె స్వరం సౌందర్యాన్ని చేకూర్చింది అని - ”ఆమె కుటుంబ సన్నిహిత బంధువు, రాజమహేంద్రవరానికి చెందిన రచయిత, పర్యావరణవేత్త తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి పేర్కొన్నారు.[2]

రచనలు

మార్చు

ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12 లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. వీటితో బాటు ఆమె జానపద సంగీతం మీద ఏడు పుస్తకాలను విడుదల చేశారు. ఇవి కాకుండా నేనూ - నా రచనలు (జనవరి 2003) లో, గతానికి స్వాగతం (జనవరి 2007) అను పుస్తకం ప్రచురింపబడ్డాయి. అనసూయ తన 95వ ఏట 2015లో "అసమాన అనసూయ (నా గురించి నేనే)" అను పుస్తకాన్ని విడుదల చేసారు . అది ఆమె ఆత్మకథ.[1]

రచనల జాబితా[6]

మార్చు
  • 85 ఉగాదుల సారాంశం
  • I am a Lioness
  • My Heart is a Musical Trustee
  • My Lecture Demonstration on the interaction between Folk Music and Classical Music
  • The Eternal Folk Music - Why the Folk Songs and their music are evergreen and eternal
  • అమెరికాకి వచ్చిన అమ్మలు
  • ఆనాటి బ్రహ్మసమాజం - నేను
  • ఆల్ ఇండియా రేడియోతో నా అనుబంధం
  • ఇంటూరి వెంకటేశ్వరరావుగారి షష్టిపూర్తి
  • ఊర్వశి శారద
  • ఊసుపోని కబుర్లు
  • ఎగ్జిబిషన్ సంఘటన
  • ఐదు తరాలు
  • కనకరాజుగారి ప్రహసనం
  • కళానిలయం మా కళాశాల
  • కవలల కలవరం
  • కాంతం ఒక అయస్కాంతం
  • కోటగుమ్మం దగ్గర కొండయ్యలింగం
  • చలనచిత్ర సంగీత సామ్రాజ్ఞి జానకి
  • చిన్ననాటి స్నేహితురాలు టంగుటూరి సూర్యకుమారి
  • జబర్జంగ్ కథ
  • జాతీయ గీతాలు
  • జానపద గేయ కళాతపస్వి క్రాఫర్ట్
  • జానపద గేయాలలో హాస్యరసం
  • జానపద సాహిత్యం
  • జానపద సంగీతం - శాస్త్రీయ సంగీతం
  • డా॥ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  • తియ్యటి సంగీత యాత్ర
  • తెలుగు వారి జానపద సంగీతం
  • తెలుగు వారి లలిత సంగీతం - పుట్టు పూర్వోత్తరాలు
  • తెలుగు వారి సంగీతం - క్రొత్త పోకడలు
  • దంత సంగీతం
  • నా చిన్నతనం - హార్మోనియం వాయిద్యం
  • నాన్నగారి ప్రియ శిష్యుడు
  • నా మేనమామ
  • నేను సింహాన్నే!
  • నేనెరిగిన 75 సంవత్సరాల కూచిపూడి
  • నేనెరిగిన గాయనీ గాయకులు
  • పాపం! ప్రకాశం!!
  • ప్రమీల పెళ్ళి
  • ఫన్ డాక్టర్ చంద్రశేఖరం గారు
  • బాబోయ్! బాబోయ్!
  • బుర్రకథ నాజర్ గారు
  • భయం
  • భావగీతాల స్వర్ణోత్సవం
  • మరణానికి మెట్లు
  • మరపురాని సంఘటనలు
  • మా గురుదేవులు శ్రీ మునుగంటి వెంకట్రావు పంతులుగారు
  • మామయ్యతో మరపురాని సంఘటనలు
  • మామయ్య మాట - నా నోట పాట
  • మామ్మగారి మరణం
  • మీకు తెలియని అనసూయ
  • మీకు తెలియని అనసూయ వడ్డీ వ్యాపారం
  • ముసలమ్మల ముచ్చట్లు
  • రెండవ ప్రపంచ మహాయుద్దం
  • వింత దంపతులు
  • వృద్ధాప్యం
  • వేద(న) పండితులు
  • శషసమ్మ
  • సా...!...!...!...!...!...!దో...!...!...!మలు...!!

పురస్కారాలు

మార్చు

1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. ఇంకా అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకుంది. ప్యారిస్ లోనూ ఈమెకు క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రధానం చేశారు.

అసమాన అనసూయ

మార్చు

వింజమూరి అనసూయ రెండవ కుమార్తె సీతా రత్నాకర్ 90 నిమిషాల డాక్యుమెంటరీ, 'అసమాన అనసూయ', ను రూపొందించింది. తెలుగు జానపద పాటలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఆమె తల్లి చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని ఈ డాక్యుమెంటరీ చిత్రం వివరిస్తుంది. ఆమె కుమార్తె సీత పెద్ద వయస్సులో అనసూయ చెప్పిన జ్ఞాపకాలను రికార్డు చేసి ఈ డాకుమెంటరీ లో పొందుపరిచింది . [1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Vijaya Mary, S. B. (2024-01-17). "'Asamana Anasuya' is a tribute to Vinjamuri Anasuya Devi by her daughter Seetha Ratnakar". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2024-08-20. Retrieved 2024-08-20.
  2. 2.0 2.1 2.2 Murali Sankar, K N (2019-03-25). "'Anasuya Devi used music as a tool to spread social equality'". Hindu. Hindu Publication. Retrieved 2024-08-21.
  3. Ramnarayan, Gowri (May 2017). "VINJAMURI ANASUYA DEVI Many firsts to her credit" (PDF). Dhvani: India Performing Arts, Society of Central Ohio. Retrieved 2024-08-20.
  4. జయజయజయ ప్రియభారత ట్యూన్ నాదే - సాక్షి, ఆగష్టు 7,2011
  5. Somasekar, M (2019-03-26). "The Vinjamuri sisters — end of an era in folk music". The Hindu Business Line. Retrieved 2024-08-20.
  6. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక. pp. 5, 6.

బయటి లింకులు

మార్చు
  1. http://www.hindu.com/fr/2008/04/11/stories/2008041150360200.htm Archived 2009-05-30 at the Wayback Machine
  2. http://www.hindu.com/fr/2008/04/11/stories/2008041151150300.htm Archived 2008-06-01 at the Wayback Machine
  3. http://www.hindu.com/fr/2008/02/01/stories/2008020151380600.htm Archived 2008-11-05 at the Wayback Machine
  4. జానపద సంగీత సామ్రాజ్ఞి - వింజమూరి అనసూయ
  5. అసమాన అనసూయ. డాక్యుమెంటరీ ట్రైలర్ https://www.youtube.com/watch?v=K2LRTFyVDRU
  6. .Asamana Anasuya Documentary – A Daughter’s Tribute to Her Mother’s Musical Journey - https://www.youtube.com/watch?v=tmFyxa7OTC0